అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. సర్వాంగ సుందరంగా, నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగింది. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో మహా గంభీరంగా ప్రాణప్రతిష్ట క్రతువు నిర్వహించారు. రామ్ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట కర్తగా వ్యవహరించారు.
ప్రాణప్రతిష్ట చేసిన బాల రాముడి విగ్రహం జీవకళ ఉట్టిపడుతోంది. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ సుందరంగా చెక్కిన విషయం తెలిసిందే. సోమవారం అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న అరుణ్ యోగిరాజ్ మీడియాతో మాట్లాడారు. ‘నేను ఈ భూమి మీద ఉన్న అదృష్టమైన వ్యక్తిగా భావిస్తున్నాను. భగవాన్ శ్రీ రామ్ లల్లా, మా పూర్వికులు, కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు ఎల్లప్పడూ నాతో ఉంటాయి. ఇప్పటికీ నాకు ఊహాలోకంలో ఉన్నట్లు అనిపిస్తోంది’ అని యోగిరాజ్ పేర్కొన్నారు.
అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించే రాముని విగ్రహాన్ని ఎంపిక చేయడానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సమావేశంలో ఓటింగ్ నిర్వహించి విషయం తెలిసిందే. ప్రత్యేక శిల్పులు రూపొందించిన మూడు నమూనాల్లో ఒక విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఇందులో యోగి రాజు చెక్కిన బాలరాముని శ్యామవర్ణ విగ్రహం ఎక్కువ ఓట్లు పొందిన అత్యుత్తమ విగ్రహంగా నిలిచింది.
రామ్ లల్లా విగ్రహ విశేషాలు..
► అయోధ్య రామాలయంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు.
► నల్లరాతిపై చెక్కిన బాల రాముడి ప్రతిమ. నీలమేఘ శ్యాముడంటూ రామాయణంలోని వర్ణనకు అనుగుణంగా ఈ రాతిని ఎంచుకున్నారు.
► రామ్‌లల్లాను చెక్కిన శిల బరువు దాదాపు 200 కిలోలు.
► ఐదేళ్ల బాలుడి రూపంలో రామ్‌లల్లా విగ్రహాన్ని రూపొందించారు.
► ఓ చేతిలో బాణం పట్టుకుని, మరో చేతితో ఆశీర్వాదం ఇస్తున్న రూపంలో విగ్రహాన్ని మలిచారు.
► స్వచ్ఛమైన బంగారంతో విల్లంబులు తయారుచేసి బాల రాముడి చేతిలో అలంకరించారు.
► శ్రీరామ నవమి రోజున గర్భగుడిలో సూర్య కిరణాలు పడేలా ఏర్పాట్లు
► శ్రీరాముడికి సూర్య తిలకంలో కిరణాలు పడేలా ఏర్పాట్లు
చదవండి: Ayodhya Ram Mandir: భావోద్వేగానికి లోనైన దిగ్గజ నేతలు
Comments
Please login to add a commentAdd a comment