మైసూర్: అయోధ్య రామమందిరంలో ప్రతిష్టించబోయే రామ్‌లల్లా విగ్రహాన్ని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఖరారు చేసింది. కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన ప్రతిమకు ఆ మహద్భాగ్యం దక్కనుంది. ఈ నెల 22న గర్భాలయంలో విగ్రహం ప్రాణపత్రిష్ట జరుపుకోనుంది. అయోధ్య ఆలయంలో ప్రతిష్టించడానికి మూడు విగ్రహాలను చెక్కించారు. వీటిలో అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పాన్ని ఎంపిక చేశారు.
ఈ విగ్రహం ఐదేళ్ల బాలరాముడి రూపంలో ఉందని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ తెలిపారు. నిల్చున్న రూపంలోనే విగ్రహాన్ని తయారు చేయించామని చెప్పారు. రామ్‌లల్లా విగ్రహాన్ని ఈ నెల 18వ తేదీన గర్భాలయంలోని ఆసనంపైకి చేరుస్తామని వెల్లడించారు. బాలరాముడి విగ్రహాన్ని తయారు చేయడానికి ఎంతగానో శ్రమించారని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అరుణ్ యోగిరాజ్ కుటుంబ సభ్యులు మంగళవారం చెప్పారు. రామ్‌లల్లా విగ్రహాన్ని చెక్కుతుండగా గాయం వల్ల ఆయనకు కంటి నొప్పి వచి్చందని అన్నారు.
యోగిరాజ్ రూపొందించిన శిల్పాన్ని తీర్థ క్షేత్ర ట్రస్టు ఎంపిక చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ మహాకార్యం కోసం దేవుడు తన భర్తను ఎన్నుకొని ఉండొచ్చని యోగిరాజ్ భార్య విజేత అన్నారు. ఇది తమకు మర్చిపోలేని రోజు అని యోగిరాజ్ సోదరుడు సూర్యప్రకాశ్ పేర్కొన్నారు. వార్త తెలిసిన తర్వాత తమకు చెప్పలేనంత ఆనందంగా ఉందని ఆయన తల్లి సరస్వతి అన్నారు. అరుణ్ యోగిరాజ్ గొప్ప శిల్పిగా ప్రఖ్యాతిగాంచారు. కేదార్‌నాథ్‌లో ప్రతిష్టించిన ఆది శంకరాచార్య, ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద నెలకొల్పిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను ఆయనే రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment