
భార్య కోసం వెళ్లి.. అత్త, మరదలు, కూతురి కాల్చివేత
ఆపై హంతకుడు ఆత్మహత్య
చిక్కమగళూరు జిల్లాలో మారణహోమం
కుటుంబ కలహాలే కారణం
యశవంతపుర: భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి రెండేళ్లవుతోంది. పాఠశాలలో కూతురిని మీ అమ్మ ఎక్కడని అడుగుతున్నారు. ఈ పరిణామాలతో శాడిస్టుగా మారిన ఓ వ్యక్తి.. తుపాకీతో మారణహోమం సృష్టించాడు. భార్యను అంతమొందించాలని వెళ్లాడు, ఆమె లేకపోవడంతో తల్లి, మరదలుతో పాటు కూతురిని కూడా తూటాలకు బలి చేశాడు. ఈ కర్కశ సంఘటన చిక్కమగళూరు జిల్లా ఖాండ్యా సమీపంలోని మాగలు గ్రామంలో చోటుచేసుకొంది. సమాజంలో క్షీణించినపోతున్న కుటుంబ బాంధవ్యాలకు మరోసారి అద్దం పట్టింది.
వివరాలు.. జిల్లాలోనే కడబగెరె సమీపంలో ఓ పాఠశాలలో డ్రైవర్‌గా పని చేస్తున్న రత్నాకర్ (35) ఈ రక్తపాతానికి పాల్పడ్డాడు.
అతనికి మాగలుకు చెందిన యువతిలో సుమారు పదేళ్ల కిందట పెళ్లయింది. స్కూలు బస్సు డ్రైవర్‌గా పనిచేవాడు. వీరికి కూతురు మౌల్య ఉంది. అయితే కుటుంబ కలహాలతో భార్య రెండేళ్ల కిందట భర్తను వదిలేసి వెళ్లిపోయింది. బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. పాఠశాలలో తన స్నేహితులు మీ అమ్మ ఎక్కడని అడుగుతున్నట్లు కుతూరు మౌల్య రోజు తండ్రి వద్ద చెప్పుకునేది. దీంతో ఆక్రోశానికి గురైన రత్నాకర్ భార్యతో తాడేపేడో తేల్చుకోవాలనుకున్నాడు. ఉగాది పండుగ సందర్భంగా మౌల్య అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. భార్య కూడా వచ్చి ఉంటుందని రత్నాకర్ భావించాడు.
విచ్చలవిడిగా కాల్పులు
ఆమెతో మాట్లాడాలని, కుదరకపోతే హత్య చేయాలని ప్లాన్ వేసుకొని మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో మాగలులో అత్తవారింటికి వెళ్లాడు. భార్య లేదని తెలిసి అగ్గిమీద గుగ్గిలమయ్యాడు, సింగల్ బ్యారెల్ తుపాకీ తీసి అత్త జ్యోతి (50), మరదలు సింధు (26), కూతూరు మౌల్య (7)ను కాల్చిచంపాడు. అడ్డుకోబోయిన సింధు భర్త మీద కాల్పులు జరపగా స్వల్ప గాయాలు తగిలి తప్పించుకున్నాడు. తరువాత మృతదేహాలను ఇంటి నుంచి కొంతదూరం లాక్కువెళ్లి అక్కడ తుపాకీతో కాల్చుకుని హంతకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
మోసం చేసింది.. అందుకేనంటూ..
చంపడాటానికి ముందు రత్నాకర్ సెల్ఫీ వీడియోలో బాధలను చెప్పుకున్నారు. భార్య వదిలి వెళ్లిన తరువాత బాధతో ఈ అమానుషమైన ఘటనకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. రెండేళ్ల క్రితం భార్య మోసం చేసి వెళ్లిపోయింది. కూతురి సంతోషం కోసం ఏమైనా చేస్తానన్నాడు. స్కూలులో స్నేహితులు మీ అమ్మ ఎక్కడ అని అడిగితే ఫోటోను చూపిస్తుంది అని వివరించాడు. ఘటనాస్థలిని చిక్కమగళూరు ఎస్పీ విక్రమ్ అమటె పరిశీలించారు. బాళెహొన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించారు.