అందరి బంధువయా రామయ్యా | Sri Ram Navami 2022: Sakshi Special Story About Lord Rama birthday and coronation | Sakshi
Sakshi News home page

అందరి బంధువయా రామయ్యా

Published Sun, Apr 10 2022 12:32 AM | Last Updated on Tue, Apr 12 2022 11:52 AM

Sri Ram Navami 2022: Sakshi Special Story About Lord Rama birthday and coronation

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్‌ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో విష్ణుమూర్తి ఏడవ అవతారంగా త్రేతాయుగంలో జన్మించాడు. యుగాలు గడిచినా ఆ మహనీయుని పుట్టినరోజును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పద్నాలుగేళ్లు అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందంటారు.

శ్రీ సీతారాముల కల్యాణం కూడా ఈ రోజునే జరిగింది. అందుకు గుర్తుగా ఈనాడు దేశమంతటా సీతారామ కల్యాణాన్ని తమ ఇంటిలో పెళ్లేనేమో అన్నంత శ్రద్ధాభక్తులతో సంబరంగా జరుపుకుంటారు. అయితే మానవుడిగా పుట్టిన రాముడు దేవుడిగా ఇన్ని కోట్ల గుండెల్లో కొలువై ఉండటానికి కారణం క్లిష్ట పరిస్థితులలోనూ ఆయన అనుసరించిన ధర్మమే. ఈ శ్రీరామ నవమి పర్వదినాన మనం రాముడి ధర్మనిరతిని గురించి తలచుకుందాం. రామ రసాంబుధిలో ఓలలాడదాం.

రాముడు మన నిత్యజీవితంలో మమేకమైన వాడు. తెల్లవారి లేస్తే రామ శబ్దం వినకుండా ఉండలేము.  శ్రీరామ అని లేకుండా శుభలేఖ లేదు. శ్రీరామ అని రాయకుండా ఇదివరకటి రోజుల్లో ఉత్తరం రాసేవాళ్లు కాదు. ఇద్దరి మధ్య సఖ్యత చెడితే, నీకు నాకు రామ్‌ – రామ్‌ అంటారు. నచ్చని విషయం చెబితే ‘రామ రామ’ అంటారు. రాముడు మంచి బాలుడు అంటారు. రామబంటు అంటారు, ఆకలి వేస్తే ఆత్మారాముడు అల్లరి చేస్తున్నాడంటారు. ఈ విధంగా అందరి జీవనంతో విడదీయరానిదిగా మారిపోయింది రామ శబ్దం.

రాముణ్ణి ఎందుకు తలచుకుంటున్నామంటే... ఆయన జీవితం చాలా వరకు సమస్యలతోనే కూడుకుంది. అయితే ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా, ఎన్ని విధాలైన కష్టాలు వచ్చినా ఒక్కసారి కూడా ధర్మాన్ని తప్పలేదు. శరణన్న శత్రువును కూడా క్షమించి వదిలిపెట్టిన ఉదార మనస్తత్వం ఆయనది. ఆయన ధర్మాన్ని అనుసరించడం కాదు... ఆయన అనుసరించిన మార్గమే ధర్మంగా మారింది. అదే మానవుడిగా పుట్టిన వాడిని మహనీయుణ్ణి చేసింది. చివరికి దేవుణ్ణి చేసింది. అందుకే ఆయన అనుసరించిన మార్గం రామాయణ మహాకావ్యంగా రూపు దిద్దుకుంది. తరతరాలుగా పఠనీయ కావ్యంగా.. పారాయణ గ్రంథంగా మారిపోయింది.

మూర్తీభవించిన ధర్మస్వరూపం
  శ్రీరాముడు ధర్మజ్ఞుడు. తల్లిదండ్రులు, గురువులు, సోదరులు, సహధర్మచారిణి, సేవకులు, స్నేహితులు, సన్నిహితులు, ప్రజలు, రుషులు, రాక్షసులు, పశుపక్ష్యాదులు... ఇలా ఎవరితో ఏ విధమైన ధర్మాన్ని అనుసరించాలో అన్ని ధర్మాలు తెలిసిన వాడు, ఆచరించినవాడు. అందుకే మారీచుడి వంటి రాక్షసుడు కూడా రావణునితో ‘రాముడంటే ఎవరనుకున్నావ్, సాక్షాత్తూ నడిచొచ్చే ధర్మస్వరూపమే’అని అన్నాడంటే ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. తార చెప్పింది రాముడు ధర్మజ్ఞుడని. రాముడు ఎన్నడూ ధర్మాన్ని అతిక్రమించలేదు. ధర్మాన్ని విడువ లేదు

అందాల రాముడు
పురుషులను కూడా మోహింప చేసేంతటి అందమైన రూపం శ్రీరాముడిది. మునులు రాముణ్ణి ఎంతగానో ఆరాధించారు. అభిమానించారు. ప్రేమించారు. రాముణ్ణి చూడకుండా హనుమ క్షణం కూడా ఉండలేకపోయేవాడట. ముక్కు, చెవులు కోయించుకున్న శూర్పణఖ, అన్నగారైన రావణుడి దగ్గరకి వెళ్లి శ్రీరాముని సౌందర్యాన్ని వర్ణిస్తుంది. అదేపనిగా పొగుడుతుంది.

సౌశీల్యవంతుడు
ఎదుటివారిని ముందుగా తానే చిరునవ్వుతో పలకరించే సౌశీల్యం రామునిది. పడవ నడిపే గుహుడు, రామునికి ప్రాణమిత్రుడు. కేవలం నిషాద రాజ్యానికి రాజు అయిన గుహుడు ఎక్కడ? చక్రవర్తి అయిన రాముడెక్కడ? అదేవిధంగా సుగ్రీవుణ్ణి ఆదరించాడు. విభీషణుడికి ఆశ్రయం ఇచ్చాడు.

రాజనీతిజ్ఞుడు
రాజనీతిలోనూ, వ్యూహ రచనలోనూ రామునికి మించిన వారులేరని పేరు. ప్రజలకు ఏమి కావాలో రాముడికి తెలిసినంతగా వేరెవరికీ తెలియదేమో అన్నంతగా ఆయన కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచింది. అందుకే ఇప్పటికీ రామరాజ్యాన్ని, రాముడి పాలననీ తలచుకుంటారు.

శ్రీరామ నవమి నాడు ఆచరించ వలసినవి...
రామనవమి పర్వదినాన ప్రతి ఒక్కరినీ కొన్ని పనులు చేయమంటుంది శాస్త్రం.
1 . సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తల స్నానం చేసి, ఇంట్లో సీతారాముల వారిని భక్తి, శ్రద్ధలతో పూజించాలి.
2. వడపప్పు, పానకం, పాయసంలాంటి పదార్థాలతో రాముడికి నివేదన చేసి అందరికీ పంచి పెట్టాలి.
3. రోజంతా శ్రీరామ నామం స్మరిస్తూ ఉండటం.
4. శక్తి కొలదీ దానధర్మాలు చేయాలి. ఎందుకంటే రామనవమి తిథి లాంటి మహా పర్వదినం నాడు చేసే ఏ పుణ్యకర్మయినా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.
5. రామనవమి నాడు పగలు ఉపవాసం, రాత్రికి జాగరణ చెయ్యమంటారు పెద్దలు. కాబట్టి ఆరోగ్యం సహకరించినంత వరకు పాలు, పండ్లు లాంటి సాత్వికమైన ఆహారం తీసుకుని రామనామాన్ని స్మరిస్తూ, వీలయితే రాత్రికి జాగరణ చెయ్యడం మంచిది.
6. దగ్గర్లోని రామాలయానికి వెళ్లి, భగవద్దర్శనం చేసుకోవాలి. అవకాశం ఉంటే సీతారాములవారి కల్యాణోత్సవాన్ని కన్నులారా వీక్షించడం.. లేదా టీవీలలో చూపించే ప్రత్యక్ష ప్రసారాలను అయినా భక్తి భావంతో చూడాలి.
7. వీలయితే రామాయణ పారాయణం లేదా శ్రవణం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.
అందరూ భక్తిశ్రద్ధలతో రామనవమి ఉత్సవాన్ని జరుపుకోవాలని, రామచంద్ర ప్రభువు చల్లని చూపులు మనందరి మీదా ప్రసరించాలని కోరుకుందాం.
శ్రీ రామ జయ రామ జయ జయ రామ!

విష్ణు సహస్ర నామంతో సమానం
కైలాసంలో ఒక రోజు పార్వతీదేవి పరమశివుడిని విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి ఈశ్వరుడు ‘ఓ పార్వతీ! నేను నిరంతరం ఆ ఫలితం కోసం జపించేది ఇదే సుమా!’ అని చెప్పి ఈ శ్లోకంతో మంత్రోపదేశం చేశాడు .

శ్లో : శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే !
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే !!


ఈ శ్లోకం మూడుసార్లు స్మరించినంత మాత్రానే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు. భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ‘రామ’ అంటే రమించడం అని అర్థం కాబట్టి మనం ఎప్పుడూ హృదయాలలో శ్రీరాముని స్మరిస్తూ ఉండాలి. ‘రా’ అనే అక్షరం పలకగానే నోరు తెరుచుకుని మనలోపల ఉన్న పాపాలు అన్నీ బయటకు వచ్చి రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. ‘మ’ అనే అక్షరం ఉచ్చరించినప్పుడు నోరు మూసుకుంటుంది కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మానవుల శరీరాలలోకి ప్రవేశించలేవు.

భద్రగిరి రామయ్య
భద్రోభద్రయా అంటూ వేదం ఉపదేశించిన సుభద్రకరమైన భద్రబీజాక్షరాలకు సాకారం– భద్రాచల రాముడు.
త్రేతాయుగంలో రాముడు తన అవతార లక్ష్యాన్ని జయప్రదంగా నిర్వహించాడు. ద్వాపరయుగం తరవాత, ఈ కలియుగాన భద్రుడనే భక్తుడి కోసం భద్రకరమూర్తిగా వైకుంఠం నుంచి తరలి వచ్చి భద్రాద్రి రాముడిగా భద్రగిరిపై కొలువయ్యాడు. భవబంధాల్ని సునాయాసంగా అధిగమించడానికి భద్రాచల రాముణ్ని సేవించాలని బ్రహ్మాండ పురాణోక్తి. శ్రీరాముడు నెలకొన్న భద్రగిరి– తెలుగువారి అయోధ్యాపురి. శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు తనను సేదతీర్చిన, శిలారూపంలో ఉన్న భద్రుణ్ని అనుగ్రహించాడంటారు.

వసంత నవరాత్రి ప్రయుక్తంగా భద్రాచల శ్రీసీతారామ చంద్రస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రానందకరంగా జరుగుతాయి. వసంత రుతుశోభకు నవ్యసౌకుమార్యాన్ని ఆపాదించే సీతారామ కల్యాణోత్సవం నవనవోన్మేషం... మధురాతి మధురం.

‘సీతమ్మ మా అమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి’ అనే ప్రేమాస్పద అనుభూతితో భక్తుల హృదయం ఉప్పొంగుతుంది. కంచర్ల గోపన్న భక్తరామదాసుగా శ్రీరామసేవా దీక్షను స్వీకరించాడు. ప్రతి సంవత్సరం శ్రీరామ జన్మదినోత్సవమైన శ్రీరామనవమి నాడు శ్రీసీతారాములకు తిరుకల్యాణ మహోత్సవాన్ని జరిపించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు.

సిరికల్యాణ తిలకంతో, మణిమయ బాసికాలతో ఆణిముత్యాలే తలంబ్రాలుగా జాలువారే ముగ్ధమోహనమైన, మనోరంజకమైన సీతారాముల పెళ్ళి వేడుక జగదానందకారకమై భాసిస్తుంది. శ్రీరామనవమి మరుసటి రోజు దశమినాడు శ్రీరామ పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ధర్మానికి నిలువెత్తు రూపమైన రాముడు చూపిన మార్గంలో పయనిస్తామని, ధర్మనిర్వహణలో సదా మమేకమవుతామని భక్తులు ప్రతినబూనడమే శ్రీరామ పట్టాభిషేక వేడుకలోని అంతరార్థం.

రామాయణంలో  ఏముంది?
రామాయణం ఓ విలువల ఆయనం.. విలువైన కావ్యం. వేదతుల్యమైన రామాయణం సామాజిక అభ్యున్నతికి ఉపకరించే సూత్రాల్ని నిర్దేశించింది. సత్యం, ధర్మం అనే రెండు చక్రాల జీవనరథంలో ఎలా ముందుకు పయనించాలో రామాయణం చాటిచెప్పింది. ఏడు కాండలు, ఐదువందల అధ్యాయాలు, ఇరవైనాలుగువేల పద్యాల మహాకావ్యం. అధ్యాయాన్ని ‘సర్గ’ అంటారు. పద్యాన్ని ‘శ్లోకం’ అంటారు.

పేరుకు మాత్రమే రామకథ కానీ.. అందులో రకరకాల పాత్రలు కనిపిస్తాయి. నదులూ, పర్వతాలూ, అడువులూ, వివిధ దేశాలూ, అనేకానేక లోకాలూ కథాక్రమంలో ప్రస్తావనకు వచ్చాయి. భిన్న జాతుల మనుషుల్నీ, వృక్షాల్నీ, పశుపక్ష్యాదుల్ని పరిచయం చేశాడు వాల్మీకి. ఎంతోమంది రాజులు తారసపడతారు. వారి వంశాలూ తెలుస్తాయి.

విజ్ఞాన సర్వస్వం
రామాయణంలో భూగోళం ఉంది, జీవ–జంతుశాస్త్రాలు ఉన్నాయి. ఇక మంచిచెడుల విషయానికొస్తే ఇది అచ్చమైన విలువల వాచకం. యుద్ధ వ్యూహాలూ, రణ తంత్రాలూ ఉన్నాయి. వాటిని నేటి రాజకీయాలకు అన్వయించుకుని రాజనీతి శాస్త్రానికో, ప్రజాపరిపాలన శాస్త్రానికో అనుబంధంగా చేర్చుకోవచ్చు. సీతాన్వేషణలో భాగంగా వాల్మీకి విశ్వాన్ని కూడా వర్ణించాడు కాబట్టి, అంతరిక్ష శాస్త్రంగానూ పరిగణించుకోవచ్చు. మొత్తంగా రామాయణం సమగ్ర విజ్ఞాన సర్వస్వం!

సకల శాస్త్రాల సారం
వాల్మీకి మహర్షి రామాయణాన్ని శ్రీరామపట్టాభిషేకానికో, రావణ సంహారానికో పరిమితం చేయలేదు. సకల వేదాల సారాన్నీ, ఉపనిషత్తుల రహస్యాల్నీ ఒడుపు గా ఇమిడ్చాడు. వ్యక్తిధర్మం, రాజధర్మం, పుత్రధర్మం... అన్నింటికీ మించి మానవ ధర్మం – రామకథలో అంతర్లీనం.

అద్భుతమైన భావ వ్యక్తీకరణలు!
రాముడు అరణ్యవాసానికి వెళ్లిపోగానే దశరథుడు దుఃఖంలో మునిగిపోతాడు. అనారోగ్యం కబళిస్తుంది. చూపు మందగిస్తుంది. ఆ విషాదకర సన్నివేశంలో కౌసల్యతో ఓ మాట అంటాడు ‘రాముడు నా కనుపాప. తనతోపాటు నా చూపూ వెళ్లిపోయింది’.

 హనుమంతుడు అశోక వృక్షం మీద వాలే సమయానికి సీతాదేవి ‘వక్కలైన విశ్వాసంలా ఉంది’ అంటాడు వాల్మీకి. ఎంత గొప్ప వ్యక్తీకరణ? ఆ వర్ణనలూ అంతే. రావణుడు అపహరించే సమయానికి పసుపు పచ్చని చీరలో ఉంది సీతాదేవి. ఆకాశంలో పుష్పక విమానం ఎగిరిపోతుంటే.. ఆ గాలికి చీర కొంగు రెపరెపలాడుతున్నది. పక్కనే నల్లగా అంతెత్తున రావణుడు. ఆ దృశ్యం ఏదో పర్వతం మీద మంటలు అంటుకున్నట్టుగా ఉందట. ఎంత గొప్ప వర్ణన!

తెలుగులో గొప్ప రచనలు చేయాలనుకునేవారు రామాయణం చదివితే చాలు... అద్భుతమైన వాక్యాలు... అంతకన్నా అద్భుతమైన వర్ణనలు దొరుకుతాయి. కలం ముందుకెళుతుంది.

– డి.వి.ఆర్‌. భాస్కర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement