Mahabharata characters
-
ఇన్ఫోసిస్ మూర్తిపై మహాభారత పాత్ర ప్రభావం.. అప్పట్లో కరుడుకట్టిన వామపక్షవాది!
ప్రముఖ వ్యాపారవేత్త, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. దేశంలో సాఫ్ట్వేర్ పరిశ్రమ అభివృద్ధికి బాటలు వేసింది ఆయనే. ఆయన తరచూ పలు వేదికలపైన పారిశ్రామిక రంగంలో ప్రస్తుత పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. పలు అంశాల్లో యువతకు మార్గదర్శనం చేస్తుంటారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నారాయణమూర్తి అద్భుత కావ్యం మహాభారతంలో తనను అమితంగా ప్రభావితం చేసిన పాత్ర గురించి వివరించారు. అందులోని కర్ణుడి పాత్ర ప్రభావం తనపై ఎక్కువగా ఉందని చెప్పారు. కర్ణుడి దాన గుణం సాటి లేనిదని, ఆ ప్రభావంతోనే తాను పెరిగినట్లు తెలిపారు. అదే కార్యక్రమంలో మూర్తి మాట్లాడుతూ విద్యార్థి దశలో కరుడుకట్టిన వామపక్షవాదిగా తాను తర్వత వ్యాపారవేత్తగా ఎలా మారాడో.. ఆ సైద్ధాంతిక పరివర్తన గురించి వెల్లడించారు. విఫలమైన తన మొదటి వ్యాపార ప్రయత్నం గురించి తెలిపారు. ఆ సమయంలో కంప్యూటర్లకు మార్కెట్ లేదని, అప్పట్లో భారతదేశంలో చాలా తక్కువ కంప్యూటర్లు ఉండేవని వివరించారు. ఆ తర్వాత ఇన్ఫోసిస్‌ను స్థాపించినప్పుడు మార్కెట్ ఎక్కువగా ఉన్న దేశాలకు ఎగుమతులపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రపంచంలో అతి పెద్ద నివాసం భారత్‌లోనే.. యజమాని ఒకప్పటి క్రికెటర్, రాజకీయ నాయకుడు -
ఉత్తర కుమారుడు
ఐదోవేదం మహాభారత పాత్రలు - 30 ఉత్తరుడు విరాటరాజు రెండో కొడుకు. ఇతని మరో పేరు భూమింజయుడు. దక్షిణ దిక్కునున్న గోధనాన్ని అపహ రించడానికి దండెత్తిన త్రిగర్తులతో పోరాడడానికి విరాటరాజు రాజ్యంలోని యోద్ధలు, సైనికులందర్నీ తీసుకుని పోయాడు. వాళ్లతోబాటు కంకుభట్టునీ వలలుణ్నీ దామగ్రంథినీ తంతిపాలుణ్నీ కూడా తీసుకొని వెళ్లిపోవడంతో రాజ నగరంలో ఉత్తరుడు తప్ప మరో యోద్ధ మిగల్లేదు. సరిగ్గా అదే సమయంలో దుర్యోధనుడు కౌరవుల్లోని జగజ్జెట్టీలతో సహా వచ్చి, మత్స్యదేశానికి ఉత్తరం వైపునున్న గోధనాన్ని తరలించుకోవడానికి దండెత్తాడు. గోపాధ్యక్షుడు భయంతో బిక్కచచ్చిపోయి, నగరానికి వచ్చి ఉత్తరుడి వద్ద మొరపెట్టుకున్నాడు: ‘కౌరవులు మన అరవై వేల గోవుల్నీ తోలుకొని వెళ్లి పోతున్నారు. అడ్డుపడిన మమ్మల్ని చావ గొట్టారు, వాళ్లను జయించి గోసంపదను కాపాడడానికి మీరే మాకు దిక్కు. మీ నాన్నగారు రాజ్యసభలో మీ గురించి శూరుడూ, నాకు సరిజోడూ అని పొగడడాన్ని నేను విన్నాను. రాజుగారన్న మాటను సత్యం చేసి, కౌరవ సైన్యాన్ని భస్మం చేసి గోవుల్ని తిరిగి తీసుకొని రావాలి మీరు. పాండు పుత్రుల్లో అర్జునుడే విధంగా జయిష్ణువో అలాగే మీరు మత్స్యుల్లో జిష్ణువులు’ అని. ఈ మాటలన్నీ స్త్రీల మధ్యలో ఉన్న ఉత్తరుడితో అనేసరికి అతను, తన గొప్పతనాన్నీ ప్రజ్ఞల్నీ చెప్పుకోవడం మొదలు పెట్టాడు: ‘నేను నా దృఢమైన ధనుస్సుతో ఇప్పుడే బయలుదేరి ఆవుల్ని తిప్పించుకొని రాగలనుగానీ అనువైన సారథి లేడు. ఎవణై్ననా మంచి సారథినొకణ్ని చూసి పెడితే ఇప్పుడే కౌరవుల్ని తరిమిగొట్టి గోవుల్ని తరలిస్తాను. దుర్యోధనుణ్నీ భీష్ముణ్నీ కర్ణుణ్నీ ద్రోణుణ్నీ అశ్వత్థామనీ ఇతర మహా కోదండధారుల్నీ నాశనం చేసి పశువుల్ని తిరిగి తెచ్చేస్తాను. నేను అక్కడ లేనప్పుడు వాళ్లు గోధనాన్ని తరలించారు. నేనేగనక అక్కడుంటే వాళ్లకిది శక్య మయ్యేది గాదు’. ఈ విధంగా ఆడవాళ్ల మధ్య తన ప్రజ్ఞ గురించి పెద్దగానే సొంత బాకా ఊదుకున్నాడు. ఉత్తరుడు ప్రగల్భంగా పలికిన ఈ వాక్యాల్ని బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు విని లోలోపలే నవ్వుకున్నాడు. అప్పటికి అజ్ఞాతవాస కాలం గడువు తీరిపోయింది. అంచేత అతను సైరంధ్రిని చాటుగా పిలిచి, ‘బృహన్నల మహా యుద్ధ సమయాల్లో అర్జునుడికి ఇష్టమైన సారథిగా ఉండేవాడు. అతను నీకు ఈ సంకట కాలంలో సారథి కాగలుగుతాడు’ అని చెప్పమన్నాడు. ద్రౌపది ఉత్తరుడి దగ్గరికి వెళ్లి బృహన్నల చెప్పమన్నదానికి కొంత కలిపి అందించింది. ‘అతను యువకుడైనా నపుంసకుడు గదా! అంచేత స్వయంగా నేను అడగ లేను’ అని ఉత్తరుడు నీళ్లు నములు తూంటే, ‘మీ చెల్లెలు ఉత్తర అడిగితే అతను కాదనడు. అతను సారథిగా వస్తే నిశ్చయంగా మీరు ఆవుల్ని మళ్లించి విజయపూర్వకంగా రాగలుగుతారు’ అంటూ ద్రౌపది ఉత్తరను పంపించి బృహన్నలను ఒడంబరచడానికి రంగాన్ని సిద్ధం చేసింది. ‘మీ పశు సంపదను కౌరవులు అపహరించుకొనిపోతున్నారట! వాళ్లను జయించి, ఆవుల్ని మళ్లించడానికి మా అన్నయ్య యుద్ధానికి సన్నద్ధుడవు తున్నాడు. కానీ అతని సారథి ఇంతకు ముందు జరిగిన ఒక యుద్ధంలో చని పోయాడట. సైరంధ్రి మీ అశ్వవిద్యా కౌశలం గురించి చెప్పింది. మా అన్నకు మీరు సారథిగా వెళ్లి సాయం చేయాలి’ అంటూన్న ఉత్తరతోబాటు బృహన్నల కూడా ఉత్తరుడి దగ్గరికి వచ్చాడు. ‘రణభూమిలో సారథిగా పనిచేయ గలిగే శక్తి నాదగ్గరెక్కడుంది? పాటలు పాడమన్నా నాట్యాన్ని నేర్పమన్నా చేయ గలను గానీ సారథ్యం నాకెక్కడ చేతనవు తుంది?’ అని తన పైపై రూపాన్ని అడ్డుగా చేసుకొని సరదా కోసమే అడ్డు చెబుతూన్న బృహన్నలను ‘తిరిగి వచ్చి ఆ పనుల్లోకి వెళ్దువుగాని, ఇప్పటికి నాకు సారథిగా రా’ అని ఒడంబరిచాడు ఉత్తరుడు. కొంత హాస్యాన్ని పుట్టించడానిగ్గానూ కవచాన్ని ఎలా వేసుకోవాలో తెలియనట్టు నటిస్తూ, అర్జునుడు చొక్కా వేసుకున్నట్టు పైనుంచి వేసుకుంటూ ఉంటే చూసి అక్కడున్న రాజ కుమారీ, చెలికత్తెలూ గొల్లున నవ్వారు. అప్పుడతనికి ఉత్తరుడే కవచాన్ని ధరింప జేసి, తానూ కవచాన్ని ధరించి రథం ఎక్కాడు. వెళ్లేముందు ఉత్తర బృహన్నలతో బొమ్మపొత్తిళ్ల కోసం భీష్మద్రోణకర్ణాదుల రంగురంగుల పై బట్టల చెరగుల్ని తీసుకు రావడం మరిచిపోకంటూ హెచ్చరించింది. ‘ఉత్తరుడు వాళ్లను జయిస్తే అదెంత పని? ఆ దివ్యమైన సుందరతర వస్త్రాల అంచుల్ని తప్పకుండా తీసుకొని వస్తాను’ అని నవ్వుతూ రణభూమి వైపు రథాన్ని తోలాడు బృహన్నల. అల్లంత దూరంలో సముద్రమంత విశాలమైన ఆ కౌరవ సైన్యాన్ని చూశాడు ఉత్తరుడు. ఆకాశంలో లెక్కలేనన్ని చెట్లతో ఒక పెద్ద అడవి నడుస్తోందా అన్నట్టు అవుపించింది. భీష్మద్రోణకర్ణ దుర్యోధనా దులతో ఉన్న ఆ మహా సైన్యాన్ని చూసే సరికి భయంతో రోమాలు నిక్కబొడి చాయి. ‘ఇంతమంది కౌరవులతో యుద్ధం చేసే సాహసం నాకు లేదు. చాలా భయం వేస్తోంది. నోరు పిడచకట్టుకు పోతోంది. వీళ్లను జయించడం దేవతలక్కూడా కష్టం. మా నాన్న త్రిగర్తుల్ని జయించడానికి మా మొత్తం సేనలనన్నిటినీ తీసుకుపోయాడు. నాకు ఒక్క సైనికుడు గూడా లేడు. బృహన్నలా! రథాన్ని వెనక్కి తిప్పు. వీళ్ల బాణాగ్నిలో ఆహుతి కాదలచుకోలేదు’ అని ఉత్తరుడంటూ ఉంటే నవ్వొచ్చింది అర్జునుడికి (అప్పణ్నించే ముందు ప్రగల్భాలు పలికి తరవాత నీరుగారిపోయే వాళ్ల మాటల్ని ఉత్తరకుమార ప్రజ్ఞలని చెప్పడం మొదలయింది). ‘నువ్వు భయంతో శత్రువులకు హర్షాన్నిస్తున్నావు. ఇంకా శత్రువులు ఏ రకమైన పరాక్రమాన్నీ చూపించలేదు. అప్పుడే నువ్వు ఇలా డీలా పడిపోతే ఎలాగ? నువ్వే అన్నావుగదా - కౌరవుల దగ్గరికి తీసుకొని వెళ్లమని. అంచేత నేను నీ ఆజ్ఞను పరిపాలిస్తూ నిన్ను అక్కడికి తీసుకొని వెళ్తాను. అక్కడ స్త్రీల కొలువులో గోధనాన్ని తరలించుకొని వస్తానని ప్రతిజ్ఞ చేసి వచ్చి, ఇప్పుడు యుద్ధమే చెయ్య నంటే ఎలా? నువ్వు కౌరవుల్ని జయించ కుండా వెళ్తే ఇతర వీరులేగాదు ఆ ఆడ వాళ్లందరూ నిన్ను ఆటపట్టిస్తారు. సైరంధ్రి నా గురించి గొప్ప సారథినని చెప్పింది. ఇప్పుడు గోవుల్ని తరలించకుండా నేను మాత్రం పిరికిపందలాగ వెనక్కి రాలేను. సైరంధ్రీ నువ్వూ నా గురించి పెద్ద పెద్ద మాటల్ని చెప్పి పొగిడారు. వాటిని నిజం చేయడానికి నేనే వాళ్లతో ఎందుకు యుద్ధం చేయకూడదనిపిస్తోంది. నువ్వు దృఢంగా ఉండు’ అని అర్జునుడు ఉత్తరుడికి తన బాధ్యతను గుర్తుచేస్తూనే ధైర్యాన్ని నూరిపోశాడు. ‘కౌరవులు మత్స్యదేశ ధనాన్ని ఎంత కావాలంటే అంత పట్టుకు పోనీ! మగ వాళ్లూ ఆడవాళ్లూ కట్టకట్టుకొని నవ్వితే నవ్వనీ! పోయిందేమీ లేదు. గోవులు వెళ్లిపోయినా సరే, ఈ యుద్ధం చేయడం నా తరం గాదు. నన్ను మా నాన్న ఆ నగర రక్షణను చూడమని పురమాయించి వెళ్లాడు. నాన్న మాట నిలబెట్టవలసిన బాధ్యత నాకుంది’ అంటూ మానమూ రాజదర్పమూ అన్నీ గాలికి వదిలేసి, విల్లూ బాణాలూ అక్కడే పారేసి, రథం మీంచి ఉరికి పలాయనం చిత్తగించడం మొదలుపెట్టాడు భూమింజయుడు. ‘వీరుడికి యుద్ధంలో మరణమే శ్రేయస్సు తప్ప పలాయనం కాదు’ అంటూ బృహన్నల రథం నుంచి కిందికి ఉరికి ఉత్తరుడి వెంట పరిగెడుతూండడం చూసి, అతనెవరో గుర్తుపట్టని కౌరవ సైనికులు నవ్వడం మొదలు పెట్టారు. అర్జునుడు వంద అడుగుల్లోనే ఉత్తరుడి జుట్టు ఒడిసి పట్టుకుని ఆపాడు. ‘బృహన్నలా! నా మాట విను! రథాన్ని త్వరగా వెనక్కి తిప్పు! మనిషి బతికి ఉంటే ఎన్ని భద్రాలనైనా దర్శించ గలుగుతాడు. నీకు వంద బంగారు నిష్కాల్ని ఇస్తాను. సువర్ణ ఖచితమైన వైఢూర్యాల్ని ఎనిమిదింటిని బహుమతిగా ఇస్తాను. సదశ్వాలు కట్టిన బంగారు మయమైన రథాన్నీ పది మదపుటేనుగుల్నీ కానుకగా ఇస్తాను. నన్ను వదిలిపెట్టు’ అంటూ ఉత్తరుడు బతిమాలుకున్నాడు. ఉత్తరుడి పిరికిమాటల్ని విని అర్జునుడు ‘నువ్వు నా సారథివిగా! నేను కౌరవులతో పోరాడి గోవుల్ని తరలిస్తాను’ అంటూ రాజకుమారుణ్ని రథం మీద సారథిగా బలవంతంగా కూర్చోబెట్టి, తమ ఆయుధాల్ని దాచిపెట్టిన శమీవృక్షం వైపు వెళ్లమని ఉత్తరుణ్ని నిర్దేశించాడు. అక్కడ శవ రూపంలో చుట్టబెట్టి ఉన్న ఆయుధాల్ని ఉత్తరుడి చేత దింపించి, తామంతా ఎవరో చెప్పి, ఆయుధాల నన్నిటినీ చూపించి, తన గాండీవాన్ని తీసుకొని యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు అర్జునుడు. సాక్షాత్తూ అర్జునుడే యుద్ధానికి దిగితే ఇక తనకేమి భయమన్న దిలాసా వచ్చింది ఉత్తరుడికి. ఉత్సాహంగా రథాన్ని నడుపుతూ కౌరవుల వైపు మళ్లించాడు. అప్పటికి భీష్మద్రోణాదులు అతన్ని అర్జునుడిగా గుర్తుపట్టేశారు. అతడు కౌరవులనందర్నీ చెండాడటం కళ్లారా చూసి తాను ధన్యుణ్నయ్యాననుకున్నాడు ఉత్తరుడు. సమ్మోహనాస్త్రంతో భీష్ముడితో సహా కౌరవులనందర్నీ మూర్ఛపోయేలా చేశాడు అర్జునుడు. ‘ఉత్తర అడిగింది గదా! వెళ్లి, భీష్ముడిది తప్పించి తతిమ్మా వాళ్లందరి ఉత్తరీయాల ముక్కలూ తల పాగాల కుచ్చులూ తీసుకొనిరా! భీష్ముడి దగ్గరికి మాత్రం వెళ్లకు! ఆయనకు మెలకువ ఉంటుంది జాగ్రత్త!’ అని పంపించాడు ఉత్తరుణ్ని. విజయంతో తిరిగి వచ్చిన తనను విరటుడు మెచ్చుకోబోతూండగా, ఇదంతా ఒక దివ్య పురుషుడి చలవని చెప్పి, బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడిని తండ్రికి చూపించాడు ఉత్తర కుమారుడు. కంకు భట్టు ధర్మరాజనీ వలలుడు భీమసేనుడనీ దామగ్రంథి నకులుడనీ తంతిపాలుడు సహదేవుడనీ సైరంధ్రి ద్రౌపది అనీ పాండవులనందర్నీ తండ్రికి పరిచయం చేశాడు. ఉత్తరుణ్ని తక్కువ చేసి బృహన్నలనే పొగుడుతున్నాడని కంకు భట్టును పాచికలతో కొట్టి చాలా పాపం చేశానని విరటుడు బాగా నొచ్చుకున్నాడు. తనను సుశర్మ నుంచి విడిపించిన పుణ్యమూ వాళ్లదేనన్న కృతజ్ఞత, ఇప్పుడు అర్జునుడు చేసిన మహోపకారంతో ఇబ్బడి ముబ్బడైపోయింది. వీటన్నిటికీ బదులుగా అర్జునుడికి ఉత్తరనిచ్చి పెళ్లి చేద్దామను కున్నాడు విరటుడు. కానీ అర్జునుడు తన శిష్యురాలిని కోడలిగా చేసుకుంటానని చెప్పి, ఉత్తరాభిమన్యుల వివాహం చేయించి విరాటరాజుతో బాంధవ్యాన్ని దిట్టపరిచాడు. డా॥ముంజులూరి నరసింహారావు -
శిశుపాలుడు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 27 శిశుపాలుడు, వసుదేవుడి చెల్లెలు శ్రుత శ్రవాదేవికీ చేదిదేశ రాజు దమఘోషుడికీ పుట్టాడు. అయితే ఇతను మూడు కళ్లతో, నాలుగు చేతులతో వికారంగా ఉండటం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లారు. పుడు తూనే గాడిదలాగ అరవడం చూసి గాభరా పడి ఎక్కడైనా వదిలేద్దామనుకున్నారు. ఇంతలో ఆకాశం నుంచి ఒక మాట విని పించింది: ‘ఇతన్ని మీరు వదలవలసిన పనిలేదు. ఏ ఆయుధంతో ఇతని మృత్యువు సంభవిస్తుందో ఎవరి చేతిలో చచ్చిపోతాడో ఎప్పుడో విహితమై ఉంది. ఎవరు ఈ పిల్లవాణ్ని ఒళ్లోకి తీసుకుంటే, ఇతని అదనపు కన్ను నుదురులో అణిగి పోతుందో, ఇతని అదనపు చేతులు రాలి పోతాయో అతనే ఇతన్ని చంపుతాడు’ అని. ఈ విలక్షణమైన పిల్లవాణ్ని చూడ డానికి, ఇంటికి ఎవరెవరు వచ్చినా వాళ్ల చేతుల్లో ఆ తల్లి ఇతన్ని పెట్టేది. బలరామ కృష్ణులు వచ్చినప్పుడు కూడా వాళ్ల మేనత్త అదే పని చేసింది. కృష్ణుడు ఎత్తుకోగానే వాడి అదనపు కన్నూ చేతులూ పోయాయి. అది చూసి మేనత్త కంగారుపడింది. ‘మా అబ్బాయి చేసే నేరాల్నీ, అప రాధాల్నీ నువ్వు సహిం చాలి మేనల్లుడూ’ అంటూ కృష్ణుణ్ని ఆవిడ ప్రార్థించింది. ‘నేను మీ అబ్బాయి శతాప రాధాల్ని నీకోసం క్షమిస్తాను. ఆ మీదనే శిక్షిస్తాను’ అని కృష్ణుడు మాటిచ్చాడు. విష్ణుద్వారపాలకులైన జయవిజ యులు ద్వాపరయుగంలో మూడోసారి జన్మించారు. హిరణ్యకశిపు హిరణ్యాక్షుల గానూ రావణ కుంభకర్ణులగానూ పుట్టిన తరవాత ఇప్పుడు శిశుపాలదంత వక్త్రులుగా పుట్టారు. ఈ మూడు జన్మ ల్లోనూ సంరంభయోగాన్ని పాటించి, కృష్ణుడి చేతిలో వాళ్లు చచ్చిపోయారు. సంరంభమంటే, కామమూ క్రోధమూ లోభమూ ఉగ్రస్థాయిలో ఉండడం. ఈ మూడూ నరకద్వారాలని పెద్దలు చెబుతారు. ‘శిశుపాలుడ’నే మాటలో శిశువంటే ఎప్పుడూ నిద్రలో మునిగి ఉండేవాడని అర్థం. అటువంటి శిశు వులకు, అంటే అజ్ఞానమనే నిద్రలో మునిగిపోయినవాళ్లకూ, అజాగ్రత్తగా ప్రవ ర్తించేవాళ్లకూ, శిశువులు తల్లిదండ్రుల్ని వాళ్ల అల్లరితో అరగదీసినట్టు, ఇతరుల్ని బాధపెడుతూ కృశింపజేసేవాళ్లకూ పాలకుడు ఈ శిశుపాలుడు. రుక్మిణిని, ఆమె అన్న రుక్మి తన స్నేహితుడైన శిశు పాలుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. స్వయంవరం వట్టి లాంఛనమే అనుకున్నాడు శిశుపాలుడు. ఆమె తన భార్యేనని అతని ఊహ. కానీ రుక్మిణి కృష్ణుణ్ని ప్రేమించింది. పెళ్లికి ముందు గౌరీపూజకు తాను ఆలయానికి వచ్చినప్పుడు కృష్ణుణ్ని రమ్మనమనీ, తనను ఎత్తుకొని పొమ్మనమనీ రుక్మిణి కబురంపింది. కృష్ణుడు వచ్చి ఆమెను తీసుకొని వెళ్లాడు. శిశుపాలుడు రుక్మిణిని తన భార్యే అనుకున్నాడు. కానీ ఆమెను కృష్ణుడు పెళ్లి చేసుకొనేసరికి ఉక్రోషం పుట్టుకొచ్చింది. తిట్ల పురాణం మొదలు పెట్టాడు. అతనికి కృష్ణుణ్ని చూస్తే తాను తక్కువ అనే భావం పుట్టుకొచ్చేది గానీ, దాన్ని తాను అధికుడన్నట్టుగా వెళ్లగక్క డమే తిట్లదండకంగా వెలువడింది. శిశుపాలుడు తన అక్కసును వెళ్లగక్క డానికి ధర్మరాజు చేసిన రాజసూయ యాగాన్ని వేదికగా చేసుకున్నాడు. రాజ సూయ యాగంలో ఒక మహా పూజనీయు డికి ముందు పూజ జరగాలి. అతనెవరు అని యుధిష్ఠిరుడి మీమాంస. నారదుడూ భీష్ముడూ ఆ పూజకు అర్హుడు శ్రీకృష్ణుడని తేల్చారు. అది వినగానే శిశుపాలుడికి అరికాలిమంట నెత్తికెక్కింది. ‘ఇది తగని పని. ఆచార్యుడూ ఋత్విక్కూ సంబంధ మున్నవాడూ స్నాతకుడూ ప్రియ మిత్రుడూ రాజూ అనే ఆరుగుర్నీ అర్ఘ్యార్హు లుగా పెద్దలు చెబుతారు. వీళ్లల్లో ఏ కోవకీ కృష్ణుడు చెందడు. పాండవుల్లారా! మీరు స్వార్థానికి వశులై కృష్ణుణ్ని పూజిస్తున్నారు. ఈ భీష్ముడు బాగా ముసలివాడై పోయాడు. అంచేతనే అతనికి జ్ఞాపకశక్తి తగ్గిపోయింది. అతని లోచూపు సన్నగిల్లిపోయింది. ఇంతమంది రాజులుండగా రాజ్యార్హతే లేనివాణ్ని మీరె లాగ పూజిస్తారు? యయాతి కున్న ఐదుగురు కొడుకుల్లోనూ యదువుకీ తుర్వ సుడికీ ద్రుహ్యుడికీ అనువుకీ సాక్షాత్తూ వాళ్ల తండ్రే రాజ్యార్హత లేకుండా చేశాడు. పూరుడు తన యౌవనాన్నిచ్చి యయాతి ముసలితనాన్ని తీసుకున్నాడు గనక పూరుడికే రాజ్యాధి కారాన్నిచ్చాడు యయాతి. అందుకనే యాదవులందరికీ రాజ్యార్హత లేదు. పోనీ కృష్ణుడు వయస్సుమీరిన పెద్దవాడం దామా? అదీ కాదు. అతని తండ్రి వసు దేవుడుండగా కృష్ణుడు పెద్దవాడెలాగ వుతాడు? పోనీ, ఇష్టుడని పూజిస్తామం టారా? మీ మామగారు ద్రుపదుడు అతని కన్నా ఇష్టుడూ సంబంధమున్నవాడూను. గురువు అని అంటారా? ద్రోణుడు మీకం దరికీ గురువు కదా! అతన్ని కాదని కృష్ణుడికి ఏవిధంగా అగ్రపూజనందిస్తారు? కృష్ణుణ్ని ఋత్విక్కని అందామంటే, వృద్ధుడైన కృష్ణద్వైపాయనుడుండగా అదీ వీలు పడదు. స్వచ్ఛంద మృత్యువున్న భీష్మ పితామహుడి కన్నా కృష్ణుడు ఏవిధంగా పురుషోత్తముడవుతాడు? దుర్యోధనుడూ కృపాచార్యుడూ భీష్మకుడూ రుక్మీ శ్రేష్ఠ ధనుర్ధరుడైన ఏకలవ్యుడూ శల్యుడూ పరశు రామ శిష్యుడైన కర్ణుడూ ఉండగా కృష్ణుణ్ని పూజిద్దామన్న ఆలోచన మీకెలాగ వచ్చిందో అసలు అంతు పట్టదు’ అంటూ ధ్వజమెత్తాడు శిశుపాలుడు. యుధిష్ఠిరుడు పిన్నికొడుకైన శిశు పాలుడికి నచ్చచెబుదామని ప్రయత్నిం చాడు. భీష్ముడు అది దండగ అని చెబుతూ శ్రీకృష్ణుడు ఎలాగ పూజార్హుడో వివరిం చాడు: ‘శ్రీకృష్ణుడు గుణాల్లో దొడ్డవాడు కనకనే వయోవృద్ధుల్ని కాదని అతన్ని పూజనీయుడిగా చెబుతున్నాం. బ్రాహ్మణు లందరిలోకల్లా జ్ఞానంలో మిన్న గనకనే అతన్ని అర్చనీయుడని చెబుతున్నాం. క్షత్రి యులందరిలోకల్లా బలాధికుడు గనకనే అతన్ని అర్ఘ్యార్హుడిగా చెబుతున్నాం. వైశ్యుల్లో ఎక్కువ ధనధాన్యాదులు కలవాడే గొప్పవాడు; శూద్రుల్లో జన్మకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పూజనీయతను నిరూ పిస్తారు. ధనధాన్యాలు అధికంగా ఉండడంలోనూ, జన్మకాలాన్ని బట్టీనూ శ్రీకృష్ణుడు పూజనీయుడే. వేదవేదాంగ జ్ఞానంలోనూ అతన్ని మించినవాడు మరొకడు లేడు. దానమూ దక్షతా శాస్త్ర జ్ఞానమూ శౌర్యమూ వినయమూ కీర్తీ బుద్ధీ సిరీ ధైర్యమూ తుష్టీ పుష్టీ మొదలైన సద్గుణాలన్నీ నిండుగా ఉన్నాయి. ఇంతటి వాడు గనకనే శ్రీకృష్ణుణ్ని అర్చనీయుడిగా ఎన్నుకున్నాం. అన్ని లోకాల్లోనూ పైనా కిందా పక్కల్లోనూ అన్నివైపులా విస్తరించి ఉన్న విశ్వానికి ముఖంలాంటివాడు శ్రీకృష్ణుడు. అతని చైతన్యం అంతటా వ్యాపించి ఉంది. అతను అణువణువునా ఉన్న చైతన్యం కనకనే అర్చనీయుడిగా చెబుతున్నాం. ఈ శిశుపాలుడు బాలుడు, బాలిశుడు; కృష్ణుణ్ని ద్వేషిస్తూ ఇలాగే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. శిశుపాలా! ఇది తగని పూజ అని నువ్వు అనుకుంటే, ఈ విషయంలో ఏం చెయ్యా లనుకుంటున్నావో అది చేసుకో!’ అని తెగేసి చెప్పాడు. అప్పుడు సహదేవుడు, శ్రీకృష్ణుడు పూజ్యమానుడనే మాటను సహించని రాజులుంటే వాళ్లందరి తలల మీదా నా పాదాన్ని ఉంచుతాను అని విసురుగా అన్నాడు. ఎవ్వరూ పెదవి మెదపలేదు. నారదుడు సహదేవుడి మాటల్ని బలపరుస్తూ ‘కృష్ణుణ్ని అర్చిం చని మనుషులు జీవించి ఉన్నా చచ్చిన వాళ్లకిందే జమ’ అని చెప్పాడు. ఆ మీద శ్రీకృష్ణుడికి అగ్రపూజ జరిగింది. అది సహించలేని శిశుపాలుడు తనను తానే సేనాపతిగా చేసుకొని, రాజులనందర్నీ కలుపుకొని పాండవులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. కృష్ణుడికి అగ్రపూజ చేయమని సలహానిచ్చిన భీష్ముణ్ని తెగడడం మొదలుపెట్టాడు. భూలింగశకుని అనే పక్షి హిమాల యంలోని ఒక భాగంలో ఉంటుంది. అది అందరితోనూ ఎప్పుడూ ‘సాహసం చేయ కండి’ అని చెబుతూండేది గానీ స్వయంగా అది, సింహం కోరల మధ్యనున్న మాంస మ్ముక్కల్ని తన ముక్కుతో తీసుకునే మూర్ఖసాహసం చేస్తూండేది. ఆ సింహమే తలుచుకుంటే ఆ పక్షిని కొరికేసేది. సింహం ఇచ్ఛ వలనే అది బతికిపోయింది. అలాగే భీష్ముడు కూడా అధర్మిష్ఠుడై ఏవో కబుర్లు చెబుతూ ఉంటాడు. భీష్ముడనే ఈ భూలింగ శకుని సింహమనే రాజులందరి ఇచ్ఛ వల్లనే బతికి ఉన్నాడు. వాళ్లే తలుచు కుంటే భీష్ముడికెప్పుడో నూకలు చెల్లిపోయి ఉండేవి. ఈవిధంగా దెప్పుతూన్న శిశు పాలుడితో ‘ఈ రాజుల ఇచ్ఛకొద్దీ నేను బతికి ఉన్నానని నువ్వు చెబుతున్నావు గానీ నేను వీళ్లను గడ్డిపరకతో కూడా సమానమనుకోను’ అని భీష్ముడన్నాడు. దానితో శిశుపాలుడి తరఫు రాజులందరికీ పుస్సు పుట్టుకొచ్చింది. భీష్ముడితో యుద్ధం చేద్దామని లేచారు. అప్పుడు భీష్ముడు ‘మీరు సాహసం చేయదలుచుకుంటే రండి. నన్ను దహించండి. కానీ నేను మాత్రం మీ నెత్తిమీద నా కాలు నుంచి అవమానపరుస్తాను. శ్రీకృష్ణుడు మా పూజ లందుకొని ఇక్కడ నిలుచుని ఉన్నాడు. ఎవరు చావదలుచుకున్నారో వాళ్లు అతన్ని యుద్ధానికి పిలవండి’ అంటూ అధిక్షేపిం చాడు. ఆ మాటను విని శిశుపాలుడు కృష్ణుడితో ‘ఈ రోజున పాండవులందరి తోనూ కలిపి నిన్ను చంపి, నా కోపాన్ని చల్లార్చుకుంటాను. ఈ పాండవులు ఇక్కడున్న రాజులనందర్నీ అవమానిస్తూ, రాజువు కాని నీకు అగ్రపూజ చేశారు. అందుకోసమనే వాళ్లు వధార్హులు’ అని బీరాలు పలికాడు. ‘నీ తప్పుల్నీ ఆగడాల్నీ మా అత్తయ్యకిచ్చిన మాటకోసం ఇంత దాకా సహించాను. ఇక నీ ఆట సాగదు’ అంటూ శిశుపాలుడి తలను నరికేశాడు కృష్ణుడు. అతను ఇంతకుముందు విష్ణు ద్వార పాలకుడే. అతని తేజస్సు పైకి లేచి నమస్కరిస్తూ కృష్ణుడిలో ప్రవేశించింది. మనలో ఉన్న న్యూనతా భావాన్ని, అధికులమనే భావాన్ని కూడా పోగొట్టు కొని, ఆత్మభావంతో అందరమూ సమాన మనే భావాన్ని పొందడమే ఈశ్వరత్వాన్ని అందుకోడమంటే. భగవంతుడికీ అతని ప్రతినిధులైన మహాత్ములకూ ఒకడంటే ఇష్టమూ మరొకడంటే ద్వేషమూ ఉండదు. పొగడ్త, తెగడ్త, సత్కారం, తిరస్కారం... అన్నీ శరీరానికే. శరీరాన్ని దొడ్డదనుకునే వాడు ‘నాదీ నేనూ’ అనే వేరు భావంతో ఉంటాడు. మహాత్ముడికి ఈ వేరుభావమూ శరీరం తానే అనుకునే దురభిమానమూ ఉండదు. ఈ శిశుపాలుడి లాంటి బాల బుద్ధులకు ఉన్నతమైన భావం కలగాలనే దృష్టితోనే మహాత్ములు దండిస్తారు, ద్వేషంతో కాదు. శత్రుత్వంతో గానీ మిత్రత్వంతో గానీ భయంతో గానీ స్నేహంతో గానీ కామంతో గానీ ఎలాగో అలాగ భగవంతుడి మీద మనస్సును లగ్నం చేయడమే కావాలి. శత్రుత్వాలూ మిత్రత్వాలూ మొదలైనవి మనకు వేరువేరు అనిపిస్తాయి గానీ అణువణు వునా చైతన్యంగా వ్యాపించినవాడికి ఈ భావాల్లో తేడాను చూడడు. అతనికన్నీ ఒకటే. ఏదోవిధంగా మనస్సును నిశ్చలంగా నిలపడమే ముఖ్యం. శిశుపాలుడు అత్యంతమైన ద్వేషంతో కూటస్థ చైతన్య రూపుడైన శ్రీకృష్ణుడి మీద మనస్సును లగ్నం చేశాడు గనకనే పరమగతిని పొందాడు. - డా॥ముంజులూరి నరసింహారావు -
వేదవ్యాసుడు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 2 మహాభారతం రాసింది వేదవ్యాసుడే అయినా, వ్యాసుడు అందులో ఒక పాత్ర కూడా. ఋషుల పుట్టుక గురించీ నదుల పుట్టుక గురించీ అడగకూడదంటారు. ఎంత పెద్ద నది అయినా దాని మూలంలో అది చాలా చిన్నదిగానే ఉంటుంది; చుక్కలు చుక్కలుగానే పడుతూ ఉంటుంది. ‘ఆ నదేనా ఇక్కడ పుట్టింది?’ అన్నంత ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది. ఋషుల పుట్టుక గూడా అలాగే ఉంటుంది కానీ, వారి విషయంలో దాన్ని వేరుగా అర్థం చేసుకోవాలి. ఒక బెస్తలదొర పేరు దాశరాజు. అతని దగ్గర చాలామంది చేపలు పట్టేవాళ్లే ఉన్నారు. ఓసారి వాళ్లు సముద్రంలోకి వేటకోసం వెళ్లారు. వాళ్లకు ఆ రోజున కడుపుతో ఉన్న పెద్ద చేప ఒకటి చిక్కింది. దాన్ని తెచ్చి దొర చేతికిచ్చారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ చేప కడుపును చీల్చినప్పుడు, దానిలోనుంచి ఒక పిల్లాడూ, ఒక పిల్లా బయటపడ్డారు! దాశరాజు వాళ్లనిద్దర్నీ తీసుకొనిపోయి వాళ్ల రాజుగారికి చూపించాడు. ఆ రాజుగారు ఎంతో ఆనందంతో దాశరాజుకి అమ్మాయినిచ్చి, తానేమో పిల్లవాణ్ని తీసుకొన్నాడు. దాశరాజు ఆమెకు ‘సత్యవతి’ అని పేరుపెట్టుకొని, అల్లారు ముద్దుగా పెంచుకొన్నాడు. చేపల వాసనతో ఉన్న ఆ పిల్లను ‘మత్స్యగంధి’ అని అందరూ పిలుస్తూ ఉండేవాళ్లు. తండ్రికి సాయం చేయడానికి ఆ అమ్మాయి యమునానది మీద నావ నడుపుతూ ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకూ, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకూ యాత్రికుల్ని చేరవేస్తూ ఉండేది. ఓసారి, తీర్థయాత్రలు చేస్తూ వస్తున్న పరాశర మహర్షి ఆ నావ ఎక్కేడు. ఆ అమ్మాయి రూపానికి ముగ్ధుడైన పరాశరుడు ఆమెను దగ్గరికి పిలిచాడు. ఆమె సిగ్గుతో, భయంతో ‘ఆవలి ఒడ్డునా ఈవల ఒడ్డునా చాలామందే చూస్తూ ఉన్నారు. అదీగాక, తండ్రి చాటు బిడ్డను నేను. నా కన్యాత్వం పోతే, తిరిగి నాన్నగారికి నా ముఖం ఎలా చూపించగలను?’ అని వాపోయింది. పరాశరుడు గొప్ప యోగి. తక్షణమే మంచుతెరనొకదాన్ని సృష్టించి అంతా చీకటిగా మార్చేశాడు. ‘నీ కన్యాత్వం ఎక్కడికీ పోదులే’ అని పలుకుతూ, ‘ఏదైనా నీకు ఇష్టమొచ్చిన వరం కోరుకో’మని అన్నాడు. అందరూ ఆమె ఒంటి నుంచి వచ్చే చేపల వాసనను వెక్కిరిస్తూ ఉండేవాళ్లు. అదీగాక, యౌవనంలో ఉన్న ఆమె దగ్గరికి ఎవరు రావాలన్నా కొంత సంకోచిస్తూనే ఉండేవాళ్లు. అందుకనే ఆమె, తన శరీరానికున్న చేపల గబ్బును పోగొట్టి పద్మపుష్పాల సుగంధం వచ్చేలా చేయమని అడిగింది. ఆవిడ కోరిక తీరింది. ఆమె అప్పణ్నించీ ‘గంధవతి’గా మారింది. ఆమె ఒంటి నుంచి వచ్చే ఆ సువాసన యోజనం దాకా, అంటే, పన్నెండు పదమూడు కిలోమీటర్ల దాకా విస్తరించడాన్ని చూసి, ఆమెను‘యోజనగంధి’ అని కూడా పిలవడం మొదలుపెట్టారు. యోజనం అంటే కలపడం అని కూడా అర్థం ఉంది. ఆ సుగంధమే ఆవిణ్ని శాంతన మహారాజుగారితో కలిపింది తరువాత. అప్పటికప్పుడు శోభనం గదిని తయారుచేసినట్టుగా మంచుతెరను సృష్టించినవాడు మామూలు మనుషుల్లా సంగమించవలసిన పనిలేదు. అటువంటివాళ్లు వట్టి మానస భావంతోనే పిల్లల్ని సృష్టించగలరు. సంగమించి కన్నా, సంగమించకుండా కన్నా పరాశరుడి లాంటి మహాయోగులకు తేడా ఏమీ ఉండదు. నేలమీది జనుల్ని ఉద్ధరించడానికి ఒక మహానుభావుణ్ని తీసుకురావలసిన సమయం దగ్గరపడ్డప్పుడు, ఇటువంటి కథల్ని చెబుతూ ఉంటాయి పురాణాలు. పురాణాల పద్ధతి అది. ఇలా చెప్పినది ఠకీమని ఎక్కుతుంది. పైన చెప్పినట్టుగా మానసిక భావంతో కన్నాడన్నమాట నమ్మబుద్ధి కాదు. మనకన్నా వాళ్లు వేరుగా ఎలా ఉంటారని అనిపిస్తుంది. ఆ సందేహాన్ని పుట్టించకుండా ఉండటానికే పురాణాలు ఈ పద్ధతిని ఉపయోగిస్తాయి. దీనివల్ల ఆ మహాయోగులకు వచ్చిన నష్టమేమీ ఉండదు. పరాశర మహర్షి వల్ల ఆమెకు అప్పటికప్పుడే ఆ యమునానదీ ద్వీపంలోనే ఒక పదహారేళ్ల పడుచువాడు పుట్టుకొని వచ్చాడు. అతను పుడుతూనే తపస్సుకు వెళ్లిపోతూ, ‘అమ్మా! నీకు అవసరమైనప్పుడు నేను వస్తాను’ అని చెప్పి వెళ్లిపోయాడు.ఆ పడుచువాడే వేదవ్యాసుడు. ద్వీపంలో పుట్టాడు గనక అతన్ని ద్వైపాయనుడని కూడా అంటారు. మంచుతెర అనే చీకట్లో నల్లటి రూపంలో పుట్టాడు గనక అతను కృష్ణుడు కూడాను. రెండు పేర్లనూ కలిపి వెరసి అతన్ని కృష్ణ ద్వైపాయనుడని పిలుస్తూ ఉంటారు. యుగయుగంలోనూ ధర్మం తాలూకు పాదాలు కుంచించుకొని పోతూ ఉంటాయి. మనిషికి రెండు పాదాలూ సజావుగా ఉంటే నిటారుగానూ హుందాగానూ నడవగలుగుతాడు. అలాగే ధర్మానికున్న తపస్సూ, శుచిత్వమూ, దయా, సత్యమూ అనే నాలుగు పాదాలూ సమానమైన పొడుగులో ఉంటే, ధర్మం ఏ కుంటూ లేకుండా సాగుతుంది. కానీ తపస్సు చేస్తున్నామన్నది గర్వాన్ని తెస్తుంది; ఆ గర్వంతో అది తన ‘పొడుగు’ను పోగొట్టుకుంటుంది. నలుగురితోనూ విచ్చలవిడిగా చేతులు కలపడంతోనూ తిరగడంతోనూ శుచిత్వం సమసిపోతుంది. ‘నేను చాలా దయావంతుణ్ని’ అనే భావం తలకెక్కుతుంది. క్రమంగా అది అహంగా మారిపోతుంది. ఇలా కాలం గడుస్తూన్నకొద్దీ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అదీగాక, మనుషుల ఆయుష్షూ శక్తీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్ని చూసే కృష్ణద్వైపాయనుడు ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు భాగాలుగా విడదీశాడు. అందుకనే అతను వేదవ్యాసుడయ్యాడు. ఏ విషయం గురించైనా విరివిగా రాయడాన్నే వ్యాసమని అంటారు. ఇతను కూడా వేదంలోని విషయాలను విపులంగా వివరిస్తూ 18 పురాణాలను రాశాడు. ఇంటి పనుల్లో మునిగి ఉండే ఇల్లాళ్లకూ పొలం పనుల్లో తలమునకలై ఉండే పాలేర్లకూ రోజువారీ జీవితానికి అవసరమైన వస్తువుల్ని చేరవేస్తూ వ్యవహారాలు చేసే వర్తకులకూ కూడా వేదార్థాన్ని చేరవేద్దామన్న తపనతోనూ జాలితోనూ పంచమ వేద రూపంలో మహాభారతాన్ని కూడా రాశాడితను. అందుకనే వేదవ్యాసుణ్ని అందరికీ గురువుగా ఆరాధిస్తారు. ఆషాఢ పూర్ణిమకు గురుపూర్ణిమ అని పేరుపెట్టి ఈ మహాగురువుకి పూజను చేస్తూ ఉంటారు. మహాభారతాన్ని రాయడమే గాక దాంట్లో ఒక పాత్రగా కూడా ఉన్నాడీయన. తల్లి సత్యవతి తలుచుకోగానే వచ్చి, రాజసంతానం లేక విధవలుగా ఉన్న అంబికా అంబాలికా అనే రాజపత్నులకు సంతానాన్ని ప్రసాదించాడితను. అంబిక, ఇతని గెడ్డాలూ మీసాలూ చూసి కళ్లు మూసుకోబట్టి గుడ్డి ధృతరాష్ట్రుడు పుట్టాడు; అంబాలిక ఇతన్ని చూసి భయపడి పాలిపోబట్టి పాలిపోయిన శరీరంతో పాండురాజు పుట్టాడు. ఈ సంతానం ఇటువంటిదని ఎరిగిన సత్యవతి, మళ్లీ కొడుకుని వేడుకోగా, వచ్చిన వ్యాసుడి దగ్గరికి అంబాలిక, ధైర్యంగా ఉన్న దాసిని పంపించడంతో మహావివేకి అయిన విదురుడు పుట్టాడు. పిల్లల వైనాన్నిబట్టి చూస్తే ఇదంతా మానసిక సంతానమే అని అర్థమవుతోంది. పాండురాజు భార్యకు అప్పుడే పిల్లవాడు పుట్టేశాడనే దుగ్ధతో ధృతరాష్ట్రుడి భార్య గాంధారి, గర్భంతో ఉన్న తన పొట్టను రాయితో చీల్చుకోవడంతో ఒక మాంస పిండం బయటపడింది. అప్పుడు వ్యాసుడే వచ్చి, ఆ మాంసపు ముద్దను వంద ముక్కలుగా చేస్తూ ఆవునేతి కుండల్లో పెట్టి, సాకేలాగ చేశాడు. ఆ పనిలో ఉండగా, గాంధారి, ‘ఒక కూతురు కూడా ఉంటే బాగుంటుంది’ అంటే, వ్యాసుడు మరోముక్కను విడదీశాడు. అలాగ దుర్యోధనాదులతో పాటు దుశ్శల అనే కూతురు కూడా పుట్టింది. ఆవునేతి కుండల్ని టెస్టుట్యూబులుగా ఉపయోగించిన పద్ధతిని కొంత మనం పరిశోధిస్తే ఆ పద్ధతేమిటో అర్థమవుతుంది. ఈ విధంగా కౌరవులకూ పాండవులకూ ఇతను తాతగారవుతాడు; భీష్ముడిగా ప్రసిద్ధికెక్కిన గంగాదత్తుడైన దేవపుత్రుడికి సోదరుడవుతాడు. మహాభారతంలో అవసరమైనప్పుడల్లా వచ్చి సలహాలనిచ్చి వెళ్తూ ఉంటాడు. ఒక స్త్రీ (ద్రౌపది) ఐదుగురికి ఆలిగా కావలసివచ్చినప్పుడు, అందులోని ధర్మసూక్ష్మాలను వివరిస్తూ రెండు పక్షాలవాళ్లనూ ఒడంబరిచినవాడు ఈయన. పాండవులకు ఎప్పటికప్పుడు ఏవిధంగా ముందుకు నడవాలో దిగ్దర్శనం చేసినవాడూ ఈయనే. యుద్ధంలో అభిమన్యుడు చిన్నవయస్సులోనే చనిపోయినప్పుడు ధర్మరాజూ అర్జునుడూ బెంబేలు పడి ఏడుస్తూ ఉంటే, వచ్చి ఓదార్చినవాడూ ఈయనే. వ్యాసుడికి పాండవులూ కౌరవులూ మనవళ్లే అయినా ఎవరిమీదా ఆయన వల్లమాలిన ప్రేమనూ చూపించడు, ద్వేషమూ కనబరచడు. రెండువైపుల వాళ్లకూ సలహాలనిస్తూ మంచిని చెబుతూ, చెడును తెగుడుతూ తన సర్వగురుత్వాన్ని నిలుపుకొన్నవాడు ఇతను. ఇతన్ని గురువనడానికి ఒక పెద్దకారణముంది. ఈ జగత్తులో ఉన్నదంతా ఎప్పుడూ ఒకేలా ఉండదు, క్షణక్షణమూ మారిపోతూ ఉంటుంది. అయితే, ఈ మార్పులన్నింటి వెనకా ఎప్పటికీ మారని తత్త్వం ఒకటి ఉంది. గాలుల వల్ల నీళ్లల్లో కెరటాలు పుడుతూ ఉంటాయి. కానీ ఆ కెరటాల రూపంలో ఉన్నవీ, వాటికి ఆధారంగా ఉన్నవీ అన్నీ ఒకే నీళ్లు. కెరటాలనూ కెరటాల వెనక ఉన్న నీళ్లనూ ఒకేసారి చూసి, ఇతరులకు చూపిస్తూ, కెరటాలు వేరూ, కిందనున్న నీళ్లు వేరూ అనే మోసంలో పడకుండా కాపాడే వాడే గురువు. వేడీ చలవా హాయీ బాధా మొదలైన జమిలి భావాలనూ, వేరువేరుగా అనిపించే వస్తువుల వెనకనున్న సత్యాన్ని సూక్ష్మదృష్టితో చూడగలిగిన వివేకాన్నీ ఆ మహాచైతన్యం ఏ భావంలో పొదిగిందో ఆ భావస్వరూపమే వ్యాసత్వమూ గురుత్వమూను. పరాశరత్వమంటే, గొప్పగా ఛిన్నాభిన్నం చేసే సామర్థ్యం. సత్యమనిపించే ఈ జగత్తులోని మార్పుల మాయనీ మోసాన్నీ వివేకంతో ఛిన్నాభిన్నంచేసి నిరూపించే తత్త్వమే ఈ వ్యాసగురుత్వం. సత్యవత్తుగా, అంటే, నిజం లాగే అనిపించే జడప్రకృతే సత్యవతి. గంగాదేవిని జ్ఞానప్రవాహ స్వరూపమైన ప్రకృతిగా ఇంతకుముందు చెప్పుకొన్నాం: స్వచ్ఛమైన ఆ ప్రకృతిని పరాప్రకృతి అని అంటారు. ఆ పరాప్రకృతే ఎదురుగుండా అవుపించని తన సంతానంతో ఈ సృష్టినంతనీ ధరించే జగద్ధాత్రి. తన రూపవిలాసాలతో మహర్షులక్కూడా రిమ్మతెగులు పుట్టించే మలిన ప్రకృతి అయిన సత్యవతే అపరాప్రకృతి. శాంతనుచైతన్యం ఈ సత్యవతీ ప్రకృతితో కలసి మంచీచెడుల జగన్నాటకాన్ని నడిపించడానికి నాందీ ప్రస్తావనలను చేసింది. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు Mb.No: 9000765972 -
గంగాశాంతనులు
ఐదోవేదం: మహాభారత పాత్రలు మహాభారతమనే కథ, కౌరవ పాండవులకు మూడు తరాల కింద నుంచి మొదలవుతుంది. నిజానికి, కౌరవులనే మాట అందరికీ సమానమైనదే. అందరూ కురురాజ వంశం వాళ్లే. మరి కౌరవశబ్దం పాండవులకు ఎందుకని వాడరు? ఎందుకంటే ‘కురు’ అనే మాటను ‘పనిచెయ్యడం’ అనే అర్థంలో వాడతారు. పనులు జరిగే చోటేమో శరీరం. శరీరానికి అంకితమైనవాళ్లు కౌరవులు. పండా అంటే బుద్ధీ జ్ఞానమూ గనక, పాండవులు, వంశరీత్యా కురువంశంవాళ్లే అయినప్పటికీ, బుద్ధికీ జ్ఞానానికీ ప్రతీకలు. ధర్మానికి అంకితమైనవాళ్లు గనక, పాండవుల్ని కౌరవ శబ్దాన్నుంచి వేరు చేశారు. సరే, ఇప్పుడు ఆ ముందుతరాల వైపు తిరిగి దృష్టి సారిద్దాం. ప్రతీపుడనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకు వయసు మీరినా పిల్లలు కలగకపోవడంతో భార్యతో కలసి పిల్లలకోసం తపస్సు చేశాడు. ఆ దంపతుల తపఃఫలంగా ఒక పిల్లవాడు కలిగాడు. వయసు బాగా పైబడిన తరువాత కామం బాగా శాంతించిన తరువాత పుట్టాడు గనక, ఆ పిల్లాడికి ‘శాంతనుడ’ని పేరుపెట్టారు. అంతకుముందు ఒకసారి ప్రతీపుడొక్కడే గంగ ఒడ్డున కూర్చొని ఉండగా, గంగానదే, ఒక అందమైన అమ్మాయి రూపాన్ని దాల్చి, అతని కుడి తొడమీద కూర్చుని ‘నన్ను పెళ్లి చేసుకో’మని కోరింది. శాస్త్రం ప్రకారం కుడి తొడ మీద కూర్చునేవాళ్లు కొడుకులూ కూతుళ్లూ కోడళ్లూ అవుతారు; ఎడమ తొడమీద కూర్చునేవాళ్లే భార్యలుగా కావడానికి తగినవాళ్లు. ప్రతీపుడు ఈ మాటనే చెప్పి, మా పిల్లాడికి నువ్వు పెళ్లానివి అవుదుగానిలే అని ఆవిడను ఒప్పించాడు. ప్రతీపుడికి పుట్టిన శాంతనుడు అంతకుముందు జన్మలో మహాభిషుడనే రాజు. అతను ఒకసారి బ్రహ్మసభకు వెళ్లినప్పుడు, అక్కడకు వచ్చిన గంగాదేవిని చూసి మోహంలో పడ్డాడు. బ్రహ్మ ఎదురుగుండానే అతను కామమోహితుడిగా కనిపించడం వల్ల, ‘నువ్వు మనుషుల్లో పుట్టి తిరిగి బ్రహ్మలోకానికి రాగలుగుతావు’ అని శపించాడు బ్రహ్మ. ‘గంగ అంటే మహామోహంలో పడ్డావు గనక, నువ్వు మనుషుల లోకంలో పుట్టినప్పుడు, ఆవిడే నీకు ప్రతికూలంగానూ, అప్రియంగానూ ప్రవర్తిస్తుంది’ అని శాపాంతమూ చెప్పాడు. బ్రహ్మ లోకం నుంచి తిరిగి వెళ్తూన్నప్పుడు గంగాదేవికి దిగాలు ముఖాలతో కాళ్లీడ్చుకుంటూ వెళ్తూన్న అష్టవసువులు అగుపడ్డారు. ఆ ఎనిమిది మంది వసువుల్లో ద్యుమంతుడనేవాడు (ఇతన్ని ప్రభాసుడని కూడా చెబుతూ ఉంటారు) భార్య మెప్పు కోసం వశిష్ఠ మహర్షి హోమధేనువును ఇతర వసువుల సాయంతో దొంగిలించుకొని వచ్చాడు. ఇంతట్లో వశిష్ఠుడు ఫలాలూ సమిధలూ తీసుకొని రానేవచ్చాడు. తన నందినీ ధేనువూ, దాని దూడా అక్కడ కనిపించలేదు. దివ్యదృష్టితో వసువుల నిర్వాకాన్ని కనిపెట్టి, వాళ్లందర్నీ మనుషులుగా పుట్టమని శపించాడాయన. మనుషుల్లో పుట్టడమంటే పనులు చేయడమూ వాటివల్ల వచ్చిపడే బంధనాల్లో చిక్కుకోవడమూ అనే వరస నిరంతరమూ జరుగుతూ ఉంటుంది. ఆ చిక్కుల నుంచి బయటపడాలంటే చాలా కష్టాలే పడాలి. శాపం గురించి విని, వాళ్లందరూ వచ్చి వశిష్ఠుణ్ని ప్రసన్నం చేసుకొందామని ఆయన్ను బతిమాలుకొన్నారు. ‘మీరందరూ ప్రతి సంవత్సరమూ ఒక్కొక్కళ్ల చొప్పున శాపమోక్షాన్ని పొందుతారు గానీ, ఈ ద్యుమంతుడు అసలైన నేరస్థుడు గనుక, ఇతను మాత్రం, తన కర్మ కారణంగా, చాలాకాలం పాటు మానుష లోకంలో ఉండవలసి వస్తుంది. ఇతనికి పిల్లలు కలగరు; తండ్రికి ప్రియాన్ని చేయడం కోసం స్త్రీ భోగాల్ని పూర్తిగా విడిచిపెడతాడు కూడాను. అయితే, ఇతను సర్వశాస్త్రాల్లోనూ విశారదుడవుతాడులే’ అని వశిష్ఠుడు వాళ్లకు చెప్పి పంపించాడు.దిగాలుపడి వస్తూన్న వసువులు గంగతో తమ శాప వృత్తాంతం చెప్పుకొని ‘ప్రతీపుడి కొడుకును మేము తండ్రిగా ఎన్నుకొంటాం. మమ్మల్ని నువ్వే మనుషుల లోకం నుంచి త్వరగా వెనక్కి తీసుకొని రావాలి’ అంటూ గంగను బతిమాలుకొన్నారు. ‘అయితే శాంతనుడితో నా సంగమం వమ్ము కాకుండా ఒక కొడుకైనా ఉండేలాగ ఏదో ఒక మార్గం చూడండి’ అని గంగ అడిగింది. ‘ఇదుగో ఈ ద్యుమంతుడు అతని దగ్గర ఉంటాడు. కానీ అపుత్రుడిగానే ఉంటాడు’ అని వసువులు గంగతో ఒప్పందం చేసుకొని ‘అమ్మయ్య’అని ఊపిరి పీల్చుకున్నారు. బ్రహ్మసభలో శాపాన్ని పొందిన మహాభిషుడే శాంతనుడిగా ప్రతీపుడికి పుట్టాడు. ప్రతీపుడు శాంతనుడికి పట్టంగట్టి అడవికి తపస్సు చేయడానికి వెళ్లాడు. పిల్లలకు ఏళ్లొచ్చి తమ పొల్లు తాము పోసుకొంటూ ఉన్నప్పుడు, పెద్దలు ఆస్తులన్నీ పంచిపెట్టి, మన అందరికీ మూలమైన మహాచైతన్యాన్ని వెదుక్కోవడానికి ఈ మాయాలోకం నుంచి దూరంగా వెళ్లి ప్రయత్నించాలి. అందుచేతనే బ్రహ్మచర్యమూ గృహస్థుగా ఉండటమూ ఆమీదట ఈ వానప్రస్థమూ, అంటే, ప్రతీపుడి మాదిరిగా వనానికి వెళ్లి తపస్సు చేయడమూ చివరికి సన్యాసమూ ఏర్పడ్డాయి. శాంతనుడు రాజయ్యాడు. వినోదం కోసం వేటకు వెళ్లడం రాజులకు ఒక అలవాటు. క్రూరమృగాల్ని చంపడమూ తిండికి పనికివచ్చే జంతువుల్ని మితంగా చంపడమూ ఈ వేటలో జరుగుతూ ఉంటుంది. దుప్పుల్నీ దున్నల్నీ చంపుతూ శాంతనుడు అక్కడున్న గంగానది ఒడ్డుకు సేదదీరడానికి వచ్చాడు. ఆ ఒడ్డుమీదకే గంగాదేవి ఊరకనే, ఏ ఉద్దేశమూ లేకుండానే, ఒక స్త్రీ రూపంలో వచ్చింది. ఇద్దరి కళ్లూ కలిశాయి; ప్రేమ పొటమరించింది. అయితే, గంగాదేవి పెళ్లికి ఒక షరతు పెట్టింది: ‘నేనేం చేసినా, అది శుభమైనది గానీ అశుభమైనదిగానీ నువ్వు అడ్డు చెప్పకూడదు. నాకు వ్యతిరేకంగా కానీ, అప్రియంగా గానీ నువ్వేమీ మాటలాడకూడదు. అడ్డు పడినా, అప్రియంగా మాట్లాడినా నేను నిన్ను విడిచివెళ్లిపోతాను. దీనికి తిరుగుండదు’ అని. ఆమె ఎవరో తెలియకపోయినా, ఆవిడగారి రూపవిమోహంలో పడ్డ శాంతనుడు ఏం జరగబోతోందో పిసరంతైనా ఆలోచించకుండా అన్నిటికీ ఒప్పేసుకొన్నాడు. అంతేమరి, మోహంలో పడ్డవాడికెవడికైనా ఇంగిత జ్ఞానం చక్కాపోతుంది. ప్రతి ఏడాదీ కన్న ప్రతి కొడుకునీ ‘ఇదుగో, నీకు చెప్పినట్టుగా నిన్ను శాపం నుంచి విముక్తుణ్ని చేస్తూ నిన్ను ప్రసన్నుణ్నిగా చేస్తున్నాను’ అంటూ గంగ నీళ్లల్లో ముంచుతూ ఉండేది. ఇలాగ ఏడుగురు కొడుకుల్ని పొట్టనబెట్టుకొన్నా, ఆవిడ ఎక్కడ విడిచివెళ్లిపోతుందోనన్న భయంతో శాంతనుడు పల్లెత్తు మాట కూడా అనలేదు. కానీ ఎనిమిదోవాణ్ని కూడా అలాగే కసాయిదానిలాగ తీసుకొనిపోతూ ఉంటే, శాంతనుడు ఉండబట్టలేక ‘వీణ్ని చంపకు. ముక్కుపచ్చలారని పిల్లల్ని ఇంత నిర్దయగా చంపే అసలు నువ్వెవత్తివి? ఎవరి పిల్లవి? నీ పిల్లల్ని నువ్వే నిర్దాక్షిణ్యంగా, కంట తడి కూడా పెట్టకుండా చంపుతున్నావేమిటి? పసిపిల్లల్ని చంపినందుకు నువ్వు చెప్పలేనన్ని ఏళ్లు నరకంలో ఉండవలసి వస్తుంది’ అని అంటూ ఆవిణ్ని అడ్డగించాడు. ‘నీకూ నాకు చెల్లిపోయింది గనకనే ఇలాగ అడ్డుపడ్డావు. ఈ పిల్లవాణ్ని చంపనులే. నేను మహర్షులందరూ శ్రద్ధగా సేవించే గంగానదిని. ఒక దేవకార్యాన్ని సిద్ధింపజేయడానికి నేను నీతో పాటు ఇన్నాళ్లున్నాను. ఈ గంగాదత్తుణ్ని నువ్వు ఉంచుకో’ అని చెబుతూ ఆవిడ నదీరూపంతో ఒకటైపోయింది. గంగ ఇచ్చిన ఆ గంగాదత్తుడే భీష్ముడు. ‘ఇతగాడికి పిల్లలుండరు; ఇతను పెళ్లిచేసుకోడు’అని చెప్పడానికి కారణంగానే వసువులు చేసిన దొంగతనం కథను చెప్పడం జరిగింది. శాంతనుడు పుట్టడానికి మూలకారణంగా బ్రహ్మసభలో జరిగిన కథను చెప్పారు. గంగాదేవి ఆవిడకుగా ఆవిడే, ఎవరి ప్రమేయమూ లేకుండానే బ్రహ్మసభకు వచ్చింది; ప్రతీపుడి కుడి తొడమీద కూర్చొంది; వేటాడి ఒడ్డున సేదదీరుతూన్న శాంతనుడి దగ్గరికీ వచ్చింది. ప్రతిదానికీ, మనకు తెలిసినా తెలియకపోయినా, మనం చేసిన ఏదో ఒక పనే కారణమవుతూ ఉంటుందని చెప్పడానికే ఈ రకంగా కథలో కథల్ని అల్లుతూ ఉంటాడు వ్యాసుడు. నిజానికి ఈ కథల వెనక ‘దేవకార్యం’ (సృష్టి) ఒకటి సిద్ధించడానికి పథకం అల్లడం జరిగింది. మహాభిషమంటే అన్నీ దేనిలో చివరికి విశ్రాంతిని పొందుతాయో ఆ పరమస్థానం. ‘బ్రహ్మ’ అనే పదానికి పెంపొందడమని అర్థం. అన్నిటికీ అంతమైన దివ్యవస్తువులో, సృష్టిని చేసి పెంపొందించాలన్న కోరిక పుట్టుకొని వచ్చింది. అక్కడికి ఒక కారణమంటూ ఏమీ లేకుండానే ఊరకనేగంగానది ఒక రూపాన్ని దాల్చి వచ్చింది. ‘గం’ అన్నా, ‘గా’ అన్నా వెళ్తూ ఉండటమని అర్థం. అంటే, ఎప్పుడూ ఆపుదల లేకుండా జరిగే సృష్టి ప్రవాహాన్ని నడిపే స్వచ్ఛమైన ప్రకృతి. అన్నిటికీ చివరి మజిలీ అయిన దివ్యుడికి సృష్టిగా, అంటే, చాలామందిగా పెంపొందాలనే కోరిక పుట్టడంతోనే, దానంతట అదే, అతనిలోంచే, అతని సొంత భావమనే ఆపరాని ప్రవాహం ఒకటి ఆకర్షించే ఒక గొప్ప రూపాన్ని ధరించి ‘ప్రకృతి’గా ఎదురు అవుపించింది. ‘ప్ర’ అంటే గొప్పది; ‘కృతి’ అంటే, తయారైన ఒక ఆకారం. అన్నిటికీ చివరి స్థానమైన దివ్యత్వం, లేక, చైతన్యం ఒకటిగా ఉండక ‘అనేకం’గా అవుదామని అనుకోవడమే ‘ప్రతీపత్వం’, వ్యతిరేకత్వం, తనకు తాను విరుద్ధంగా ప్రవర్తించడం. ఏకత్వానికి వ్యతిరేక భావమే అనేకత్వం. మహాచైతన్యానికి ఏ కొరతా ఉండదు. దానికి అనేకంగా కావాలని కోరిక పుట్టడమే అన్ని వికారాలూ శాంతించిన ‘శాంతన’ చైతన్యానికి ఎదురుగా గంగానది అనే ప్రకృతి రూపుగట్టడమూ, ఆ చైతన్యానికి జత కడదామని అనిపించడమూను. ఆ మహాచైతన్యం కొన్ని దివ్యశక్తుల ద్వారా ఈ అనేకత్వమనే సృష్టి నాటకాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ శక్తుల్లోవే వసువులు, సృష్టిని నివసింపజేసేవాళ్లు. ఈ ఎనిమిదింటిలో ఏడు ఎదురుగుండా అవుపించకుండానే పనిచేస్తూ ఉంటాయి. అవి కనిపించకుండానే పనిచేస్తూ ఉంటాయని చెప్పడానికే, గంగ తన ఏడుగురు కొడుకుల్నీ తన ప్రవాహంలో ముంచిందని చెప్పారు. పుట్టినదేదైనా నిలిచి ఉండాలంటే, దాంట్లో ‘నేనున్నాన’నే భావం ఉండాలి. ఆ భావమే ప్రకృతి మనకు ఇచ్చిన, మనలో మిగిల్చిన, అంటే, ‘గంగాదత్తమైన’ అహంభావం, ‘నేనున్నాన’నే భావం. ఈ ‘నేను’ అనే భావానికి మగా ఆడా అనే తేడా లేదు; అదే రెండూను. ఈ రెండూ సమంగా ఉంటే, పెళ్లి అవసరమే ఉండదు; అంచేత దానికింక పిల్లలు కలగరు. అహంకారం దానంతట అదే చావాలి; ఎవ్వరూ చంపలేరు. దాన్నే ‘స్వచ్ఛంద మరణమ’ని అంటారు. అదే భీష్ముడు తన తండ్రి నుంచి స్వచ్ఛంద మరణం పొందడమనే వరం వెనుక ఉన్న మర్మం. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు -
ఐదోవేదం మహాభారతం...
కొత్త శీర్షిక ప్రారంభం : మహాభారతం పాత్రలు వేరువేరుగా ఉన్న చెట్లన్నీ కలసి ‘వనం’ అనే సమష్టి రూపం తీసుకున్నట్టు వేరువేరుగా ఉన్న ప్రజలందరి మనసు సమష్టి రూపం తీసుకుని ‘దేశ మనస్సు’ అవుతుంది. ‘మహాభారతం’ భారతదేశపు మనసు.దీనికి అక్షరరూపం ఇచ్చి చిరాయువును పోసినవాడు వ్యాసుడు. భారతదేశం తన వికసించిన నాగరికతను వాఙ్మయంలో పొందుపరిచి భద్రం చేసింది. ‘వేదం’ భారతదేశపు అతి పురాతన వాఙ్మయం. అది ఒక్కటే అయినా రాబోయే రోజులలో ధారణకు సులువుగా ఉండాలని వ్యాసుడు దానిని నాలుగుగా విభజించి వేదవ్యాసుడయ్యాడు. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణవేదం అంటూ విభజించినా వేదంలోని పరమార్థం అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో ‘ఐదో వేదం’గా ప్రసిద్ధికెక్కిన మహాభారతాన్ని రాశాడు. మహాభారతాన్ని ‘ఇతిహాసం’అని అంటారు. ‘ఇతి’ అంటే ‘ఇలాగ’, ‘హ’ అంటే ‘ప్రసిద్ధంగా’, ‘ఆస’ అంటే ‘ఉంది’ అని అర్థం. అంటే ఈ మాటకు ‘ఇలా జరిగిందట’ అని అర్థం. భారతీయులు తమ చరిత్రను రాసుకోలేదన్న అపప్రథ ఒకటి ఉంది. అది నిజం కాదు. అసలు చరిత్ర అంటే మునపటివాళ్ల నడతతో కాపుదలనీ సంరక్షణనీ పొందడమని అర్థం. అదే ఇంగ్లిష్‌లో హిస్టరీ- హిజ్ స్టోరీ, అతగాడి కథ అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే, గ్రీకు భాషలో హిస్టోరియా అంటే అడగడం, ప్రశ్నించడం, విచారణ చేయడం అని అర్థాలు చెబుతారు. ఏ చరిత్రనైనా, చదివేవాడికి పనికొచ్చే విధంగా రాయాలి. అందుకే తమ చరిత్రను భారతీయులు పురాణాలుగా, ఇతిహాసాలుగా రాసుకున్నారు. మహాభారతం అలాంటి చారిత్రకమైన కథ. అయితే దాన్ని ఐదో వేదమని ఎందుకంటారు? వేదమంటే ‘జ్ఞానం’ అని అర్థం. ‘మహాభారతం’ మన సత్తా గురించిన జ్ఞానం. మనం ఉన్నా లేకపోయినా మన సత్తా, మన ఉనికీ ఎప్పటికీ ఉంటాయి. తరాలు ఎన్ని గడిచినా ఎప్పటికీ చెక్కుచెదరని మన అస్తిత్వం గురించిన జ్ఞానం మనకు ఆనందం కలిగిస్తుంది. మహాభారత చరిత్ర మన ఉనికి గురించి, అస్తిత్వం గురించి ఎరుక కలిగించి మనకు హాయినిస్తుంది. ‘ఉనికీ’ ‘ఎరుకా’ ‘హాయీ ’అనేవే వరసగా ‘సత్’, ‘చిత్’, ‘ఆనందాలు’. వేదార్థమంటే సచ్చిదానందాల కూడికే గనుక మహాభారత చరిత్ర కూడా ఆ సచ్చిదానందాన్నిచ్చేదై ఉండాలి. కథ కథగా సచ్చిదానందాన్ని ఎలాగ ఇస్తుంది? అంచేత ఆ కథలో ఏదో విలక్షణత ఉండి ఉండాలి. అప్పుడుగానీ మహాభారతం వేదంగా చెలామణీ కాలేదు. పాండవులకు బలమూ నేర్పూ ఎక్కువ. ఎక్కువ మందే ఐనా ధృతరాష్ట్రులకు శక్తీ నేర్పూ తక్కువ. అందుకోసం మోసం చేయాలనే కుట్ర జరిగింది. విషం పెట్టి మట్టుపెడదామని చూశారు. వీలుగాలేదు. ధృతరాష్ట్రుడనే రాజుకి వందమంది కొడుకులు. అతని తమ్ముడు పాండురాజుకి ఐదుగురు కొడుకులు. ఈ అన్నదమ్ముల కొడుకులందరూ జ్ఞాతులు. జ్ఞాతులంటే శత్రువులే. ఒకచోట ఇంతమందీ ఉండటం పడలేదు. తక్కువమందే అయినా పాండవులకు బలమూ నేర్పూ ఎక్కువ. ఎక్కువ మందే ఐనా ధృతరాష్ట్రులకు శక్తీ నేర్పూ తక్కువ. అందుకోసం మోసం చేయాలనే కుట్ర జరిగింది. విషం పెట్టి మట్టుపెడదామని చూశారు. వీలుగాలేదు. లక్క ఇంట్లో పెట్టి కాల్చేద్దామని చూశారు. అదీ అడ్డం తిరిగింది. ఇన్నీ విఫలం కావడంతో మోసపు జూదానికి దిగారు. జూదంలో శకుని మాయతో ఓడించి పన్నెండేళ్లు అరణ్యవాసానికి, ఆ పైన ఒక ఏడాది పాటు అజ్ఞాతవాసానికీ పంపించారు. పందెం ప్రకారం పదమూడేళ్లు కాగానే సజావుగా తిరిగి వచ్చినప్పటికీ రాజ్యాన్ని అప్పగించటానికి వాళ్లకు మనసొప్పలేదు. దానితో ఇక యుద్ధమే శరణ్యమైంది. అటూ ఇటూ చాలామందే చచ్చిపోయారు. ఈ కథను ఇలాగ ‘కట్టె, కొట్టె, తెచ్చె’ అనే తీరుగా చెబితే మనకేం లాభం వస్తుంది? అందుకనే వ్యాసమహర్షి కథను అలాగ పేలవంగా చెప్పలేదు. మధ్యలో మరెన్ని విషయాల్నో చెబుతూ ‘దీని ఉద్దేశాన్ని పట్టుకోండి, ఆకళించుకోండి’ అని పదేపదే చెప్పకుండానే చెప్పాడు. ఉద్దేశాన్ని ఆకళించుకోవాలంటే రచనలో వాడుతున్న ప్రతిమాటా ప్రతిపేరూ మనకు అర్థం కావాలి. ఇది దృష్టిలో పెట్టుకొనే వ్యాసుడు మహాభారతంలోని ప్రతిమాటనీ ప్రతిపేరునీ విడబరిచి నిర్వచిస్తూ ఉంటాడు. ఆ వరసలో ‘మహాభారతం’ అనే మాటను కూడా నిర్వచించకుండా వదిలిపెట్టలేదు. మహత్త్వమూ మహాభారమూ ఉన్నది గనక ఇది మహాభారతమైంది అని చెబుతాడాయన. భారం- అంటే సవాలక్ష శ్లోకాల వల్ల వచ్చిన గ్రంథభారం కాదు. ఆ సమయంలో మనుషుల భావాల్లో ఉండే క్రూరత్వమూ వాళ్ల చెడుప్రవర్తనా కూడా భారాలై, యుద్ధాల కిందా రోగాల కిందా దారిద్య్రం కిందా పూర్తిగా వినాశనం చేసే భూకంపాల కిందా అటువంటి ఘోరవిపత్తుల కిందా ఫలిస్తాయి. చరిత్రపరంగా మరోలాగ చెబుతారు. భరత పుత్రుల మహాజన్మమే మహాభారతం అని. ఇంతే అయితే వేదార్థం ఎక్కణ్నించి ఊడిపడుతుంది? వ్యాసుడు చెప్పిన నిర్వచన పద్ధతిని కొనసాగిస్తూ మనమూ దాన్ని నిర్వచించుకోడానికి ప్రయత్నం చేయాలి. ‘భా’ అంటే ప్రకాశమూ దీప్తీ కాంతీ అని అర్థం. ఆ మహాప్రకాశంలో రమింపజేసేదే ఈ మహాభారతం. కథను కథలాగే చదివినా విన్నా ప్రకాశంలో మునిగి దాని అసలు ఉద్దేశమేమిటో అర్థం కాదు. కథను రాసే పద్ధతిని పరిశీలిస్తూ ఉంటే ఎంతో కొంత వెలుగు అవుపిస్తుంది. ఈ మహాభారతాన్ని రాయడానికి వేదవ్యాసుడికి దాదాపుగా మూడు సంవత్సరాలు పట్టిందని చెబుతారు. చరిత్రే అయితే అది వట్టి కథే అయితే మూడేళ్లు పట్టవలసిన పనిలేదు. అదీగాక భారతాన్ని వ్యాసుడు గణపతి చేత రాయించాడని ప్రతీతి ఒకటి ఉంది. ఒప్పందం ప్రకారం వ్యాసుడు గణపతి చేతిగంటం ఆగకుండా ఉండేలాగ గడగడా చెబుతూ ఉండాలి. గణపతి కూడా రాసేదాన్ని అర్థం చేసుకోకుండా రాయకూడదు. అందుకోసం గణపతి అంతటి మహానుభావుడిక్కూడా ఠకీమని అర్థంకాని భోగట్టాలు ‘వ్యాసఘట్టాల’నే పేరన కొన్ని మహాభారతంలో ఉన్నాయి. ఈ కారణంగానే మహాభారత రచనకు మూడేళ్లు పట్టిందని చెప్పడం సబబే. ఆ మూడేళ్లూ వ్యాసుడు సర్వదా దాని గురించే ఆలోచిస్తూ ఆ కథలోనే మునిగి ఉంటూ ‘సతతోత్థితుడై’, అంటే ఎప్పుడూ ఆ కథా ఆలోచనలోనే మెలకువగా ఉంటూ దాన్ని పూర్తిచేశాడు. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ భరతర్షభ! యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్!! (మహాభారతం, ఆదిపర్వం 62-53) ధర్మమూ అర్థమూ కామమూ మోక్షమూ అనేవి నాలుగు పురుషార్థాలు. ధర్మమంటే సృష్టిని మొత్తమూ ధరించి ఉంచేది. ఆ ధర్మం కోసమే మనం సంపాదించే డబ్బంతా పనికి రావాలి. ఆ ధర్మం కోసమే మనం ఎప్పుడూ కోరుకోవాలి. ఆ ధర్మాన్ని అందుకొందామనే ఇక్కడున్న మాయ నుంచీ మోసం నుంచీ బయటపడాలని ఉబలాటపడుతూ ఉండాలి. ఆ విధంగా నాలుగు సూత్రాలుగా ఉన్నా ఇవన్నీ ఒకే- ధర్మం మాత్రమే. పరమాత్మకు రూపమంటూ ఒకటి ఉంటే అది ధర్మరూపమే. ఈ పురుషార్థాల విషయంలో మహాభారతంలో లేనిది మరెక్కడా అవుపించదు. అంటే, ఇక్కడ ధర్మం విశ్వరూపంలో అవుపిస్తుందన్నమాట. ఇంతదాకా మనకు చెప్పిన కథలూ మనకు చూపించిన సినిమాలూ మహాభారతాన్ని ఒక కథలాగే ఒక చరిత్రలాగే చెబుతూ ఉన్నాయి, చూపిస్తూ ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవడంలో ఏదో ఒక వెలితి ఉందన్నమాట. ఆదిపర్వం మొదటి అధ్యాయంలోనే దుర్యోధనుణ్నీ ధర్మరాజునీ వేరువేరు వృక్షాలుగా వర్ణించారు (ఆదిపర్వం 1-110, 111): దుర్యోధనుడు క్రోధమయమైన పెద్ద చెట్టయితే దాని కాండమే కర్ణుడు; దాని కొమ్మలే శకుని; దాన్నిండా ఉన్న పువ్వులూ పండ్లూ దుశ్శాసనుడు; బుద్ధిలేని గుడ్డి ధృతరాష్ట్రుడే దాని మూలం. ధర్మరాజేమో ధర్మమయమైన పెద్దచెట్టు; దాని కాండమే అర్జునుడు; దాని కొమ్మలే భీముడు; దాన్నిండా ఉన్న పువ్వులూ పండ్లూ నకుల సహదేవులు; కృష్ణుడూ వేదమూ బ్రహ్మాన్నెరిగిన బ్రాహ్మణులూ దాని మూలం. కథలోని పాత్రల్ని చెట్టులోని విడివిడి భాగాలుగా చూస్తూ పోతే కథ పూర్తి అర్థాన్ని పట్టుకోలేము. మరైతే,ఈ ఇతిహాసాన్ని ఎలాగ చదవాలి? ఎలాగ చదివి అర్థం చేసుకొంటే ఇది వేదార్థాన్ని మనముందు గుమ్మరిస్తుంది? వ్యాసుడి పద్ధతిలోనే మనం కథలోని పాత్రల్నీ కథలోని వేరువేరు ఘట్టాల్నీ విశ్లేషించి అర్థం చేసుకోవాలి. ఆ ప్రయత్నమే ఈ వ్యాసాల ముఖ్యోద్దేశం. దీనికోసం మహాభారతంలోని ప్రముఖమైన పాత్రల్ని విడబరుచుకొని అర్థం చేసుకొందాం.