శిశుపాలుడు | shishupala story | Sakshi
Sakshi News home page

శిశుపాలుడు

Published Sun, Dec 6 2015 2:50 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

శిశుపాలుడు

శిశుపాలుడు

ఐదోవేదం: మహాభారత పాత్రలు - 27
శిశుపాలుడు, వసుదేవుడి చెల్లెలు శ్రుత శ్రవాదేవికీ చేదిదేశ రాజు దమఘోషుడికీ పుట్టాడు. అయితే ఇతను మూడు కళ్లతో, నాలుగు చేతులతో వికారంగా ఉండటం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లారు. పుడు తూనే గాడిదలాగ అరవడం చూసి గాభరా పడి ఎక్కడైనా వదిలేద్దామనుకున్నారు. ఇంతలో ఆకాశం నుంచి ఒక

మాట విని పించింది: ‘ఇతన్ని మీరు వదలవలసిన పనిలేదు. ఏ ఆయుధంతో ఇతని మృత్యువు సంభవిస్తుందో ఎవరి చేతిలో చచ్చిపోతాడో ఎప్పుడో విహితమై ఉంది. ఎవరు ఈ పిల్లవాణ్ని ఒళ్లోకి తీసుకుంటే, ఇతని అదనపు కన్ను నుదురులో అణిగి పోతుందో, ఇతని అదనపు చేతులు రాలి పోతాయో అతనే ఇతన్ని చంపుతాడు’ అని.

ఈ విలక్షణమైన పిల్లవాణ్ని చూడ డానికి, ఇంటికి ఎవరెవరు వచ్చినా వాళ్ల చేతుల్లో ఆ తల్లి ఇతన్ని పెట్టేది. బలరామ కృష్ణులు వచ్చినప్పుడు కూడా వాళ్ల మేనత్త అదే పని చేసింది. కృష్ణుడు ఎత్తుకోగానే వాడి అదనపు కన్నూ చేతులూ పోయాయి. అది చూసి మేనత్త కంగారుపడింది. ‘మా అబ్బాయి చేసే నేరాల్నీ, అప రాధాల్నీ నువ్వు సహిం చాలి మేనల్లుడూ’ అంటూ కృష్ణుణ్ని ఆవిడ ప్రార్థించింది. ‘నేను మీ అబ్బాయి శతాప రాధాల్ని నీకోసం క్షమిస్తాను. ఆ మీదనే శిక్షిస్తాను’ అని కృష్ణుడు మాటిచ్చాడు.
 
విష్ణుద్వారపాలకులైన జయవిజ యులు ద్వాపరయుగంలో మూడోసారి జన్మించారు. హిరణ్యకశిపు హిరణ్యాక్షుల గానూ రావణ కుంభకర్ణులగానూ పుట్టిన తరవాత ఇప్పుడు శిశుపాలదంత వక్త్రులుగా పుట్టారు. ఈ మూడు జన్మ ల్లోనూ సంరంభయోగాన్ని పాటించి, కృష్ణుడి చేతిలో వాళ్లు చచ్చిపోయారు. సంరంభమంటే, కామమూ క్రోధమూ లోభమూ ఉగ్రస్థాయిలో ఉండడం. ఈ మూడూ నరకద్వారాలని పెద్దలు చెబుతారు.

‘శిశుపాలుడ’నే మాటలో శిశువంటే ఎప్పుడూ నిద్రలో మునిగి ఉండేవాడని అర్థం. అటువంటి శిశు వులకు, అంటే అజ్ఞానమనే నిద్రలో మునిగిపోయినవాళ్లకూ, అజాగ్రత్తగా ప్రవ ర్తించేవాళ్లకూ, శిశువులు తల్లిదండ్రుల్ని వాళ్ల అల్లరితో అరగదీసినట్టు, ఇతరుల్ని బాధపెడుతూ కృశింపజేసేవాళ్లకూ పాలకుడు ఈ శిశుపాలుడు.
 రుక్మిణిని, ఆమె అన్న రుక్మి తన స్నేహితుడైన శిశు పాలుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. స్వయంవరం వట్టి లాంఛనమే అనుకున్నాడు శిశుపాలుడు.

ఆమె తన భార్యేనని అతని ఊహ. కానీ రుక్మిణి కృష్ణుణ్ని ప్రేమించింది. పెళ్లికి ముందు గౌరీపూజకు తాను ఆలయానికి వచ్చినప్పుడు కృష్ణుణ్ని రమ్మనమనీ, తనను ఎత్తుకొని పొమ్మనమనీ రుక్మిణి కబురంపింది. కృష్ణుడు వచ్చి ఆమెను తీసుకొని వెళ్లాడు. శిశుపాలుడు రుక్మిణిని తన భార్యే అనుకున్నాడు. కానీ ఆమెను కృష్ణుడు పెళ్లి చేసుకొనేసరికి ఉక్రోషం పుట్టుకొచ్చింది. తిట్ల పురాణం మొదలు పెట్టాడు. అతనికి కృష్ణుణ్ని చూస్తే తాను తక్కువ అనే భావం పుట్టుకొచ్చేది గానీ, దాన్ని తాను అధికుడన్నట్టుగా వెళ్లగక్క డమే తిట్లదండకంగా వెలువడింది.
 
శిశుపాలుడు తన అక్కసును వెళ్లగక్క డానికి ధర్మరాజు చేసిన రాజసూయ యాగాన్ని వేదికగా చేసుకున్నాడు. రాజ సూయ యాగంలో ఒక మహా పూజనీయు డికి ముందు పూజ జరగాలి. అతనెవరు అని యుధిష్ఠిరుడి మీమాంస. నారదుడూ భీష్ముడూ ఆ పూజకు అర్హుడు శ్రీకృష్ణుడని తేల్చారు. అది వినగానే శిశుపాలుడికి అరికాలిమంట నెత్తికెక్కింది.

‘ఇది తగని పని. ఆచార్యుడూ ఋత్విక్కూ సంబంధ మున్నవాడూ స్నాతకుడూ ప్రియ మిత్రుడూ రాజూ అనే ఆరుగుర్నీ అర్ఘ్యార్హు లుగా పెద్దలు చెబుతారు. వీళ్లల్లో ఏ కోవకీ కృష్ణుడు చెందడు. పాండవుల్లారా! మీరు స్వార్థానికి వశులై కృష్ణుణ్ని పూజిస్తున్నారు. ఈ భీష్ముడు బాగా ముసలివాడై పోయాడు. అంచేతనే అతనికి జ్ఞాపకశక్తి తగ్గిపోయింది.

అతని లోచూపు సన్నగిల్లిపోయింది. ఇంతమంది రాజులుండగా రాజ్యార్హతే లేనివాణ్ని మీరె లాగ పూజిస్తారు? యయాతి కున్న ఐదుగురు కొడుకుల్లోనూ యదువుకీ తుర్వ సుడికీ ద్రుహ్యుడికీ అనువుకీ సాక్షాత్తూ వాళ్ల తండ్రే రాజ్యార్హత లేకుండా చేశాడు. పూరుడు తన యౌవనాన్నిచ్చి యయాతి ముసలితనాన్ని తీసుకున్నాడు గనక పూరుడికే రాజ్యాధి కారాన్నిచ్చాడు యయాతి.

అందుకనే యాదవులందరికీ రాజ్యార్హత లేదు. పోనీ కృష్ణుడు వయస్సుమీరిన పెద్దవాడం దామా? అదీ కాదు. అతని తండ్రి వసు దేవుడుండగా కృష్ణుడు పెద్దవాడెలాగ వుతాడు? పోనీ, ఇష్టుడని పూజిస్తామం టారా? మీ మామగారు ద్రుపదుడు అతని కన్నా ఇష్టుడూ సంబంధమున్నవాడూను. గురువు అని అంటారా? ద్రోణుడు మీకం దరికీ గురువు కదా! అతన్ని కాదని కృష్ణుడికి ఏవిధంగా అగ్రపూజనందిస్తారు? కృష్ణుణ్ని ఋత్విక్కని అందామంటే, వృద్ధుడైన కృష్ణద్వైపాయనుడుండగా అదీ వీలు పడదు.

స్వచ్ఛంద మృత్యువున్న భీష్మ పితామహుడి కన్నా కృష్ణుడు ఏవిధంగా పురుషోత్తముడవుతాడు? దుర్యోధనుడూ కృపాచార్యుడూ భీష్మకుడూ రుక్మీ శ్రేష్ఠ ధనుర్ధరుడైన ఏకలవ్యుడూ శల్యుడూ పరశు రామ శిష్యుడైన కర్ణుడూ ఉండగా కృష్ణుణ్ని పూజిద్దామన్న ఆలోచన మీకెలాగ వచ్చిందో అసలు అంతు పట్టదు’ అంటూ ధ్వజమెత్తాడు శిశుపాలుడు.
 
యుధిష్ఠిరుడు పిన్నికొడుకైన శిశు పాలుడికి నచ్చచెబుదామని ప్రయత్నిం చాడు. భీష్ముడు అది దండగ అని చెబుతూ శ్రీకృష్ణుడు ఎలాగ పూజార్హుడో వివరిం చాడు: ‘శ్రీకృష్ణుడు గుణాల్లో దొడ్డవాడు కనకనే వయోవృద్ధుల్ని కాదని అతన్ని పూజనీయుడిగా చెబుతున్నాం. బ్రాహ్మణు లందరిలోకల్లా జ్ఞానంలో మిన్న గనకనే అతన్ని అర్చనీయుడని చెబుతున్నాం. క్షత్రి యులందరిలోకల్లా బలాధికుడు గనకనే అతన్ని అర్ఘ్యార్హుడిగా చెబుతున్నాం.

వైశ్యుల్లో ఎక్కువ ధనధాన్యాదులు కలవాడే గొప్పవాడు; శూద్రుల్లో జన్మకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పూజనీయతను నిరూ పిస్తారు. ధనధాన్యాలు అధికంగా ఉండడంలోనూ, జన్మకాలాన్ని బట్టీనూ శ్రీకృష్ణుడు పూజనీయుడే. వేదవేదాంగ జ్ఞానంలోనూ అతన్ని మించినవాడు మరొకడు లేడు.

దానమూ దక్షతా శాస్త్ర జ్ఞానమూ శౌర్యమూ వినయమూ కీర్తీ బుద్ధీ సిరీ ధైర్యమూ తుష్టీ పుష్టీ మొదలైన సద్గుణాలన్నీ నిండుగా ఉన్నాయి. ఇంతటి వాడు గనకనే శ్రీకృష్ణుణ్ని అర్చనీయుడిగా ఎన్నుకున్నాం. అన్ని లోకాల్లోనూ పైనా కిందా పక్కల్లోనూ అన్నివైపులా విస్తరించి ఉన్న విశ్వానికి ముఖంలాంటివాడు శ్రీకృష్ణుడు. అతని చైతన్యం అంతటా వ్యాపించి ఉంది.

అతను అణువణువునా ఉన్న చైతన్యం కనకనే అర్చనీయుడిగా చెబుతున్నాం. ఈ శిశుపాలుడు బాలుడు, బాలిశుడు; కృష్ణుణ్ని ద్వేషిస్తూ ఇలాగే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. శిశుపాలా! ఇది తగని పూజ అని నువ్వు అనుకుంటే, ఈ విషయంలో ఏం చెయ్యా లనుకుంటున్నావో అది చేసుకో!’ అని తెగేసి చెప్పాడు. అప్పుడు సహదేవుడు, శ్రీకృష్ణుడు పూజ్యమానుడనే మాటను సహించని రాజులుంటే వాళ్లందరి తలల మీదా నా పాదాన్ని ఉంచుతాను అని విసురుగా అన్నాడు.

ఎవ్వరూ పెదవి మెదపలేదు. నారదుడు సహదేవుడి మాటల్ని బలపరుస్తూ ‘కృష్ణుణ్ని అర్చిం చని మనుషులు జీవించి ఉన్నా చచ్చిన వాళ్లకిందే జమ’ అని చెప్పాడు. ఆ మీద శ్రీకృష్ణుడికి అగ్రపూజ జరిగింది. అది సహించలేని శిశుపాలుడు తనను తానే సేనాపతిగా చేసుకొని, రాజులనందర్నీ కలుపుకొని పాండవులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. కృష్ణుడికి అగ్రపూజ చేయమని సలహానిచ్చిన భీష్ముణ్ని తెగడడం మొదలుపెట్టాడు.
 
భూలింగశకుని అనే పక్షి హిమాల యంలోని ఒక భాగంలో ఉంటుంది. అది అందరితోనూ ఎప్పుడూ ‘సాహసం చేయ కండి’ అని చెబుతూండేది గానీ స్వయంగా అది, సింహం కోరల మధ్యనున్న మాంస మ్ముక్కల్ని తన ముక్కుతో తీసుకునే మూర్ఖసాహసం చేస్తూండేది. ఆ సింహమే తలుచుకుంటే ఆ పక్షిని కొరికేసేది. సింహం ఇచ్ఛ వలనే అది బతికిపోయింది. అలాగే భీష్ముడు కూడా అధర్మిష్ఠుడై ఏవో కబుర్లు చెబుతూ ఉంటాడు. భీష్ముడనే ఈ భూలింగ శకుని సింహమనే రాజులందరి ఇచ్ఛ వల్లనే బతికి ఉన్నాడు.

వాళ్లే తలుచు కుంటే భీష్ముడికెప్పుడో నూకలు చెల్లిపోయి ఉండేవి. ఈవిధంగా దెప్పుతూన్న శిశు పాలుడితో ‘ఈ రాజుల ఇచ్ఛకొద్దీ నేను బతికి ఉన్నానని నువ్వు చెబుతున్నావు గానీ నేను వీళ్లను గడ్డిపరకతో కూడా సమానమనుకోను’ అని భీష్ముడన్నాడు. దానితో శిశుపాలుడి తరఫు రాజులందరికీ పుస్సు పుట్టుకొచ్చింది. భీష్ముడితో యుద్ధం చేద్దామని లేచారు. అప్పుడు భీష్ముడు ‘మీరు సాహసం చేయదలుచుకుంటే రండి. నన్ను దహించండి.

కానీ నేను మాత్రం మీ నెత్తిమీద నా కాలు నుంచి అవమానపరుస్తాను. శ్రీకృష్ణుడు మా పూజ లందుకొని ఇక్కడ నిలుచుని ఉన్నాడు. ఎవరు చావదలుచుకున్నారో వాళ్లు అతన్ని యుద్ధానికి పిలవండి’ అంటూ అధిక్షేపిం చాడు. ఆ మాటను విని శిశుపాలుడు కృష్ణుడితో ‘ఈ రోజున పాండవులందరి తోనూ కలిపి నిన్ను చంపి, నా కోపాన్ని చల్లార్చుకుంటాను.

ఈ పాండవులు ఇక్కడున్న రాజులనందర్నీ అవమానిస్తూ, రాజువు కాని నీకు అగ్రపూజ చేశారు. అందుకోసమనే వాళ్లు వధార్హులు’ అని బీరాలు పలికాడు. ‘నీ తప్పుల్నీ ఆగడాల్నీ మా అత్తయ్యకిచ్చిన మాటకోసం ఇంత దాకా సహించాను. ఇక నీ ఆట సాగదు’ అంటూ శిశుపాలుడి తలను నరికేశాడు కృష్ణుడు. అతను ఇంతకుముందు విష్ణు ద్వార పాలకుడే. అతని తేజస్సు పైకి లేచి నమస్కరిస్తూ కృష్ణుడిలో ప్రవేశించింది.
 
మనలో ఉన్న న్యూనతా భావాన్ని, అధికులమనే భావాన్ని కూడా పోగొట్టు కొని, ఆత్మభావంతో అందరమూ సమాన మనే భావాన్ని పొందడమే ఈశ్వరత్వాన్ని అందుకోడమంటే. భగవంతుడికీ అతని ప్రతినిధులైన మహాత్ములకూ ఒకడంటే ఇష్టమూ మరొకడంటే ద్వేషమూ ఉండదు. పొగడ్త, తెగడ్త, సత్కారం, తిరస్కారం... అన్నీ శరీరానికే. శరీరాన్ని దొడ్డదనుకునే వాడు ‘నాదీ నేనూ’ అనే వేరు భావంతో ఉంటాడు.

మహాత్ముడికి ఈ వేరుభావమూ శరీరం తానే అనుకునే దురభిమానమూ ఉండదు. ఈ శిశుపాలుడి లాంటి బాల బుద్ధులకు ఉన్నతమైన భావం కలగాలనే దృష్టితోనే మహాత్ములు దండిస్తారు, ద్వేషంతో కాదు. శత్రుత్వంతో గానీ మిత్రత్వంతో గానీ భయంతో గానీ స్నేహంతో గానీ కామంతో గానీ ఎలాగో అలాగ భగవంతుడి మీద మనస్సును లగ్నం చేయడమే కావాలి.

శత్రుత్వాలూ మిత్రత్వాలూ మొదలైనవి మనకు వేరువేరు అనిపిస్తాయి గానీ అణువణు వునా చైతన్యంగా వ్యాపించినవాడికి ఈ భావాల్లో తేడాను చూడడు. అతనికన్నీ ఒకటే. ఏదోవిధంగా మనస్సును నిశ్చలంగా నిలపడమే ముఖ్యం. శిశుపాలుడు అత్యంతమైన ద్వేషంతో కూటస్థ చైతన్య రూపుడైన శ్రీకృష్ణుడి మీద మనస్సును లగ్నం చేశాడు గనకనే పరమగతిని పొందాడు.
 - డా॥ముంజులూరి నరసింహారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement