ఉత్తర కుమారుడు | Northern Son | Sakshi
Sakshi News home page

ఉత్తర కుమారుడు

Published Sat, Jan 16 2016 11:27 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM

ఉత్తర కుమారుడు

ఉత్తర కుమారుడు

 ఐదోవేదం
 మహాభారత పాత్రలు - 30
 ఉత్తరుడు విరాటరాజు రెండో కొడుకు. ఇతని మరో పేరు భూమింజయుడు. దక్షిణ దిక్కునున్న గోధనాన్ని అపహ రించడానికి దండెత్తిన త్రిగర్తులతో పోరాడడానికి విరాటరాజు రాజ్యంలోని యోద్ధలు, సైనికులందర్నీ తీసుకుని పోయాడు. వాళ్లతోబాటు కంకుభట్టునీ వలలుణ్నీ దామగ్రంథినీ తంతిపాలుణ్నీ కూడా తీసుకొని వెళ్లిపోవడంతో రాజ నగరంలో ఉత్తరుడు తప్ప మరో యోద్ధ మిగల్లేదు. సరిగ్గా అదే సమయంలో దుర్యోధనుడు కౌరవుల్లోని జగజ్జెట్టీలతో సహా వచ్చి, మత్స్యదేశానికి ఉత్తరం వైపునున్న గోధనాన్ని తరలించుకోవడానికి దండెత్తాడు. గోపాధ్యక్షుడు భయంతో బిక్కచచ్చిపోయి, నగరానికి వచ్చి ఉత్తరుడి వద్ద మొరపెట్టుకున్నాడు: ‘కౌరవులు మన అరవై వేల గోవుల్నీ తోలుకొని వెళ్లి పోతున్నారు. అడ్డుపడిన మమ్మల్ని చావ గొట్టారు, వాళ్లను జయించి గోసంపదను కాపాడడానికి మీరే మాకు దిక్కు.

 మీ నాన్నగారు రాజ్యసభలో మీ గురించి శూరుడూ, నాకు సరిజోడూ అని పొగడడాన్ని నేను విన్నాను. రాజుగారన్న మాటను సత్యం చేసి, కౌరవ సైన్యాన్ని భస్మం చేసి గోవుల్ని తిరిగి తీసుకొని రావాలి మీరు. పాండు పుత్రుల్లో అర్జునుడే విధంగా జయిష్ణువో అలాగే మీరు మత్స్యుల్లో జిష్ణువులు’ అని. ఈ మాటలన్నీ స్త్రీల మధ్యలో ఉన్న ఉత్తరుడితో అనేసరికి అతను, తన గొప్పతనాన్నీ ప్రజ్ఞల్నీ చెప్పుకోవడం మొదలు పెట్టాడు: ‘నేను నా దృఢమైన ధనుస్సుతో ఇప్పుడే బయలుదేరి ఆవుల్ని తిప్పించుకొని రాగలనుగానీ అనువైన సారథి లేడు. ఎవణై్ననా మంచి సారథినొకణ్ని చూసి పెడితే ఇప్పుడే కౌరవుల్ని తరిమిగొట్టి గోవుల్ని తరలిస్తాను.

దుర్యోధనుణ్నీ భీష్ముణ్నీ కర్ణుణ్నీ ద్రోణుణ్నీ అశ్వత్థామనీ ఇతర మహా కోదండధారుల్నీ నాశనం చేసి పశువుల్ని తిరిగి తెచ్చేస్తాను. నేను అక్కడ లేనప్పుడు వాళ్లు గోధనాన్ని తరలించారు. నేనేగనక అక్కడుంటే వాళ్లకిది శక్య మయ్యేది గాదు’. ఈ విధంగా ఆడవాళ్ల మధ్య తన ప్రజ్ఞ గురించి పెద్దగానే సొంత బాకా ఊదుకున్నాడు.  ఉత్తరుడు ప్రగల్భంగా పలికిన ఈ వాక్యాల్ని బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు విని లోలోపలే నవ్వుకున్నాడు. అప్పటికి అజ్ఞాతవాస కాలం గడువు తీరిపోయింది. అంచేత అతను సైరంధ్రిని చాటుగా పిలిచి, ‘బృహన్నల మహా యుద్ధ సమయాల్లో అర్జునుడికి ఇష్టమైన సారథిగా ఉండేవాడు. అతను నీకు ఈ సంకట కాలంలో సారథి కాగలుగుతాడు’ అని చెప్పమన్నాడు. ద్రౌపది ఉత్తరుడి దగ్గరికి వెళ్లి బృహన్నల చెప్పమన్నదానికి కొంత కలిపి అందించింది.

 ‘అతను యువకుడైనా నపుంసకుడు గదా! అంచేత స్వయంగా నేను అడగ లేను’ అని ఉత్తరుడు నీళ్లు నములు తూంటే, ‘మీ చెల్లెలు ఉత్తర అడిగితే అతను కాదనడు. అతను సారథిగా వస్తే నిశ్చయంగా మీరు ఆవుల్ని మళ్లించి విజయపూర్వకంగా రాగలుగుతారు’ అంటూ ద్రౌపది ఉత్తరను పంపించి బృహన్నలను ఒడంబరచడానికి రంగాన్ని సిద్ధం చేసింది. ‘మీ పశు సంపదను కౌరవులు అపహరించుకొనిపోతున్నారట! వాళ్లను జయించి, ఆవుల్ని మళ్లించడానికి మా అన్నయ్య యుద్ధానికి సన్నద్ధుడవు తున్నాడు. కానీ అతని సారథి ఇంతకు ముందు జరిగిన ఒక యుద్ధంలో చని పోయాడట. సైరంధ్రి మీ అశ్వవిద్యా కౌశలం గురించి చెప్పింది. మా అన్నకు మీరు సారథిగా వెళ్లి సాయం చేయాలి’ అంటూన్న ఉత్తరతోబాటు బృహన్నల కూడా ఉత్తరుడి దగ్గరికి వచ్చాడు.

 ‘రణభూమిలో సారథిగా పనిచేయ గలిగే శక్తి నాదగ్గరెక్కడుంది? పాటలు పాడమన్నా నాట్యాన్ని నేర్పమన్నా చేయ గలను గానీ సారథ్యం నాకెక్కడ చేతనవు తుంది?’ అని తన పైపై రూపాన్ని అడ్డుగా చేసుకొని సరదా కోసమే అడ్డు చెబుతూన్న బృహన్నలను ‘తిరిగి వచ్చి ఆ పనుల్లోకి వెళ్దువుగాని, ఇప్పటికి నాకు సారథిగా రా’ అని ఒడంబరిచాడు ఉత్తరుడు. కొంత హాస్యాన్ని పుట్టించడానిగ్గానూ కవచాన్ని ఎలా వేసుకోవాలో తెలియనట్టు నటిస్తూ, అర్జునుడు చొక్కా వేసుకున్నట్టు పైనుంచి వేసుకుంటూ ఉంటే చూసి అక్కడున్న రాజ కుమారీ, చెలికత్తెలూ గొల్లున నవ్వారు. అప్పుడతనికి ఉత్తరుడే కవచాన్ని ధరింప జేసి, తానూ కవచాన్ని ధరించి రథం ఎక్కాడు.

వెళ్లేముందు ఉత్తర బృహన్నలతో బొమ్మపొత్తిళ్ల కోసం భీష్మద్రోణకర్ణాదుల రంగురంగుల పై బట్టల చెరగుల్ని తీసుకు రావడం మరిచిపోకంటూ హెచ్చరించింది. ‘ఉత్తరుడు వాళ్లను జయిస్తే అదెంత పని?  ఆ దివ్యమైన సుందరతర వస్త్రాల అంచుల్ని తప్పకుండా తీసుకొని వస్తాను’ అని నవ్వుతూ రణభూమి వైపు రథాన్ని తోలాడు బృహన్నల. అల్లంత దూరంలో సముద్రమంత విశాలమైన ఆ కౌరవ సైన్యాన్ని చూశాడు ఉత్తరుడు. ఆకాశంలో లెక్కలేనన్ని చెట్లతో ఒక పెద్ద అడవి నడుస్తోందా అన్నట్టు అవుపించింది. భీష్మద్రోణకర్ణ దుర్యోధనా దులతో ఉన్న ఆ మహా సైన్యాన్ని చూసే సరికి భయంతో రోమాలు నిక్కబొడి చాయి. ‘ఇంతమంది కౌరవులతో యుద్ధం చేసే సాహసం నాకు లేదు.

చాలా భయం వేస్తోంది. నోరు పిడచకట్టుకు పోతోంది. వీళ్లను జయించడం దేవతలక్కూడా కష్టం. మా నాన్న త్రిగర్తుల్ని జయించడానికి మా మొత్తం సేనలనన్నిటినీ తీసుకుపోయాడు. నాకు ఒక్క సైనికుడు గూడా లేడు. బృహన్నలా! రథాన్ని వెనక్కి తిప్పు. వీళ్ల బాణాగ్నిలో ఆహుతి కాదలచుకోలేదు’ అని ఉత్తరుడంటూ ఉంటే నవ్వొచ్చింది అర్జునుడికి (అప్పణ్నించే ముందు ప్రగల్భాలు పలికి తరవాత నీరుగారిపోయే వాళ్ల మాటల్ని ఉత్తరకుమార ప్రజ్ఞలని చెప్పడం మొదలయింది).

 ‘నువ్వు భయంతో శత్రువులకు హర్షాన్నిస్తున్నావు. ఇంకా శత్రువులు ఏ రకమైన పరాక్రమాన్నీ చూపించలేదు. అప్పుడే నువ్వు ఇలా డీలా పడిపోతే ఎలాగ? నువ్వే అన్నావుగదా - కౌరవుల దగ్గరికి తీసుకొని వెళ్లమని. అంచేత నేను నీ ఆజ్ఞను పరిపాలిస్తూ నిన్ను అక్కడికి తీసుకొని వెళ్తాను. అక్కడ స్త్రీల కొలువులో గోధనాన్ని తరలించుకొని వస్తానని ప్రతిజ్ఞ చేసి వచ్చి, ఇప్పుడు యుద్ధమే చెయ్య నంటే ఎలా? నువ్వు కౌరవుల్ని జయించ కుండా వెళ్తే ఇతర వీరులేగాదు ఆ ఆడ వాళ్లందరూ నిన్ను ఆటపట్టిస్తారు. సైరంధ్రి నా గురించి గొప్ప సారథినని చెప్పింది. ఇప్పుడు గోవుల్ని తరలించకుండా నేను మాత్రం పిరికిపందలాగ వెనక్కి రాలేను. సైరంధ్రీ నువ్వూ నా గురించి పెద్ద పెద్ద మాటల్ని చెప్పి పొగిడారు. వాటిని నిజం చేయడానికి నేనే వాళ్లతో ఎందుకు యుద్ధం చేయకూడదనిపిస్తోంది. నువ్వు దృఢంగా ఉండు’ అని అర్జునుడు ఉత్తరుడికి తన బాధ్యతను గుర్తుచేస్తూనే ధైర్యాన్ని నూరిపోశాడు.

 ‘కౌరవులు మత్స్యదేశ ధనాన్ని ఎంత కావాలంటే అంత పట్టుకు పోనీ! మగ వాళ్లూ ఆడవాళ్లూ కట్టకట్టుకొని నవ్వితే నవ్వనీ! పోయిందేమీ లేదు. గోవులు వెళ్లిపోయినా సరే, ఈ యుద్ధం చేయడం నా తరం గాదు. నన్ను మా నాన్న ఆ నగర రక్షణను చూడమని పురమాయించి వెళ్లాడు. నాన్న మాట నిలబెట్టవలసిన బాధ్యత నాకుంది’ అంటూ మానమూ రాజదర్పమూ అన్నీ గాలికి వదిలేసి, విల్లూ బాణాలూ అక్కడే పారేసి, రథం మీంచి ఉరికి పలాయనం చిత్తగించడం మొదలుపెట్టాడు భూమింజయుడు. ‘వీరుడికి యుద్ధంలో మరణమే శ్రేయస్సు తప్ప పలాయనం కాదు’ అంటూ బృహన్నల రథం నుంచి కిందికి ఉరికి ఉత్తరుడి వెంట పరిగెడుతూండడం చూసి, అతనెవరో గుర్తుపట్టని కౌరవ సైనికులు నవ్వడం మొదలు పెట్టారు. అర్జునుడు వంద అడుగుల్లోనే ఉత్తరుడి జుట్టు ఒడిసి పట్టుకుని ఆపాడు.

‘బృహన్నలా! నా మాట విను! రథాన్ని త్వరగా వెనక్కి తిప్పు! మనిషి బతికి ఉంటే ఎన్ని భద్రాలనైనా దర్శించ గలుగుతాడు. నీకు వంద బంగారు నిష్కాల్ని ఇస్తాను. సువర్ణ ఖచితమైన వైఢూర్యాల్ని ఎనిమిదింటిని బహుమతిగా ఇస్తాను. సదశ్వాలు కట్టిన బంగారు మయమైన రథాన్నీ పది మదపుటేనుగుల్నీ కానుకగా ఇస్తాను. నన్ను వదిలిపెట్టు’ అంటూ ఉత్తరుడు బతిమాలుకున్నాడు. ఉత్తరుడి పిరికిమాటల్ని విని అర్జునుడు ‘నువ్వు నా సారథివిగా! నేను కౌరవులతో పోరాడి గోవుల్ని తరలిస్తాను’ అంటూ రాజకుమారుణ్ని రథం మీద సారథిగా బలవంతంగా కూర్చోబెట్టి, తమ ఆయుధాల్ని దాచిపెట్టిన శమీవృక్షం వైపు వెళ్లమని ఉత్తరుణ్ని నిర్దేశించాడు.

అక్కడ శవ రూపంలో చుట్టబెట్టి ఉన్న ఆయుధాల్ని ఉత్తరుడి చేత దింపించి, తామంతా ఎవరో చెప్పి, ఆయుధాల నన్నిటినీ చూపించి, తన గాండీవాన్ని తీసుకొని యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు అర్జునుడు. సాక్షాత్తూ అర్జునుడే యుద్ధానికి దిగితే ఇక తనకేమి భయమన్న దిలాసా వచ్చింది ఉత్తరుడికి. ఉత్సాహంగా రథాన్ని నడుపుతూ కౌరవుల వైపు మళ్లించాడు. అప్పటికి భీష్మద్రోణాదులు అతన్ని అర్జునుడిగా గుర్తుపట్టేశారు. అతడు కౌరవులనందర్నీ చెండాడటం కళ్లారా చూసి తాను ధన్యుణ్నయ్యాననుకున్నాడు ఉత్తరుడు. సమ్మోహనాస్త్రంతో భీష్ముడితో సహా కౌరవులనందర్నీ మూర్ఛపోయేలా చేశాడు అర్జునుడు. ‘ఉత్తర అడిగింది గదా! వెళ్లి, భీష్ముడిది తప్పించి తతిమ్మా వాళ్లందరి ఉత్తరీయాల ముక్కలూ తల పాగాల కుచ్చులూ తీసుకొనిరా! భీష్ముడి దగ్గరికి మాత్రం వెళ్లకు! ఆయనకు మెలకువ ఉంటుంది జాగ్రత్త!’ అని పంపించాడు ఉత్తరుణ్ని.

 విజయంతో తిరిగి వచ్చిన తనను విరటుడు మెచ్చుకోబోతూండగా, ఇదంతా ఒక దివ్య పురుషుడి చలవని చెప్పి, బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడిని తండ్రికి చూపించాడు ఉత్తర కుమారుడు. కంకు భట్టు ధర్మరాజనీ వలలుడు భీమసేనుడనీ దామగ్రంథి నకులుడనీ తంతిపాలుడు సహదేవుడనీ సైరంధ్రి ద్రౌపది అనీ పాండవులనందర్నీ తండ్రికి పరిచయం చేశాడు. ఉత్తరుణ్ని తక్కువ చేసి బృహన్నలనే పొగుడుతున్నాడని కంకు భట్టును పాచికలతో కొట్టి చాలా పాపం చేశానని విరటుడు బాగా నొచ్చుకున్నాడు. తనను సుశర్మ నుంచి విడిపించిన పుణ్యమూ వాళ్లదేనన్న కృతజ్ఞత, ఇప్పుడు అర్జునుడు చేసిన మహోపకారంతో ఇబ్బడి ముబ్బడైపోయింది. వీటన్నిటికీ బదులుగా అర్జునుడికి ఉత్తరనిచ్చి పెళ్లి చేద్దామను కున్నాడు విరటుడు. కానీ అర్జునుడు తన శిష్యురాలిని కోడలిగా చేసుకుంటానని చెప్పి, ఉత్తరాభిమన్యుల వివాహం చేయించి విరాటరాజుతో బాంధవ్యాన్ని దిట్టపరిచాడు.                              
 డా॥ముంజులూరి నరసింహారావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement