వేదవ్యాసుడు | Veda Vyasa | Sakshi
Sakshi News home page

వేదవ్యాసుడు

Published Sun, May 31 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

వేదవ్యాసుడు

వేదవ్యాసుడు

ఐదోవేదం: మహాభారత పాత్రలు - 2
మహాభారతం రాసింది వేదవ్యాసుడే అయినా, వ్యాసుడు అందులో ఒక పాత్ర కూడా. ఋషుల పుట్టుక గురించీ నదుల పుట్టుక గురించీ అడగకూడదంటారు. ఎంత పెద్ద నది అయినా దాని మూలంలో అది చాలా చిన్నదిగానే ఉంటుంది; చుక్కలు చుక్కలుగానే పడుతూ ఉంటుంది. ‘ఆ నదేనా ఇక్కడ పుట్టింది?’ అన్నంత ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది. ఋషుల పుట్టుక గూడా అలాగే ఉంటుంది కానీ, వారి విషయంలో దాన్ని వేరుగా అర్థం చేసుకోవాలి.
 
ఒక బెస్తలదొర పేరు దాశరాజు. అతని దగ్గర చాలామంది చేపలు పట్టేవాళ్లే ఉన్నారు. ఓసారి వాళ్లు సముద్రంలోకి వేటకోసం వెళ్లారు. వాళ్లకు ఆ రోజున కడుపుతో ఉన్న పెద్ద చేప ఒకటి చిక్కింది. దాన్ని తెచ్చి దొర చేతికిచ్చారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ చేప కడుపును చీల్చినప్పుడు, దానిలోనుంచి ఒక పిల్లాడూ, ఒక పిల్లా బయటపడ్డారు! దాశరాజు వాళ్లనిద్దర్నీ తీసుకొనిపోయి వాళ్ల రాజుగారికి చూపించాడు. ఆ రాజుగారు ఎంతో ఆనందంతో దాశరాజుకి అమ్మాయినిచ్చి, తానేమో పిల్లవాణ్ని తీసుకొన్నాడు.
 
దాశరాజు ఆమెకు ‘సత్యవతి’ అని పేరుపెట్టుకొని, అల్లారు ముద్దుగా పెంచుకొన్నాడు. చేపల వాసనతో ఉన్న ఆ పిల్లను ‘మత్స్యగంధి’ అని అందరూ పిలుస్తూ ఉండేవాళ్లు. తండ్రికి సాయం చేయడానికి ఆ అమ్మాయి యమునానది మీద నావ నడుపుతూ ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకూ, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకూ యాత్రికుల్ని చేరవేస్తూ ఉండేది. ఓసారి, తీర్థయాత్రలు చేస్తూ వస్తున్న పరాశర మహర్షి ఆ నావ ఎక్కేడు. ఆ అమ్మాయి రూపానికి ముగ్ధుడైన పరాశరుడు ఆమెను దగ్గరికి పిలిచాడు. ఆమె సిగ్గుతో, భయంతో ‘ఆవలి ఒడ్డునా ఈవల ఒడ్డునా చాలామందే చూస్తూ ఉన్నారు. అదీగాక, తండ్రి చాటు బిడ్డను నేను. నా కన్యాత్వం  పోతే, తిరిగి నాన్నగారికి నా ముఖం ఎలా చూపించగలను?’ అని వాపోయింది.
 
పరాశరుడు గొప్ప యోగి. తక్షణమే మంచుతెరనొకదాన్ని సృష్టించి అంతా చీకటిగా మార్చేశాడు. ‘నీ కన్యాత్వం ఎక్కడికీ పోదులే’ అని  పలుకుతూ, ‘ఏదైనా నీకు ఇష్టమొచ్చిన వరం కోరుకో’మని అన్నాడు. అందరూ ఆమె ఒంటి నుంచి వచ్చే చేపల వాసనను వెక్కిరిస్తూ ఉండేవాళ్లు. అదీగాక, యౌవనంలో ఉన్న ఆమె దగ్గరికి ఎవరు రావాలన్నా కొంత సంకోచిస్తూనే ఉండేవాళ్లు. అందుకనే ఆమె, తన శరీరానికున్న చేపల గబ్బును పోగొట్టి పద్మపుష్పాల సుగంధం వచ్చేలా చేయమని అడిగింది. ఆవిడ కోరిక తీరింది. ఆమె అప్పణ్నించీ ‘గంధవతి’గా మారింది.

ఆమె ఒంటి నుంచి వచ్చే ఆ సువాసన యోజనం దాకా, అంటే, పన్నెండు పదమూడు కిలోమీటర్ల దాకా విస్తరించడాన్ని చూసి, ఆమెను‘యోజనగంధి’ అని కూడా పిలవడం మొదలుపెట్టారు. యోజనం అంటే కలపడం అని కూడా అర్థం ఉంది. ఆ సుగంధమే ఆవిణ్ని శాంతన మహారాజుగారితో కలిపింది తరువాత. అప్పటికప్పుడు శోభనం గదిని తయారుచేసినట్టుగా మంచుతెరను సృష్టించినవాడు మామూలు మనుషుల్లా సంగమించవలసిన పనిలేదు. అటువంటివాళ్లు వట్టి మానస భావంతోనే పిల్లల్ని సృష్టించగలరు.

సంగమించి కన్నా, సంగమించకుండా కన్నా పరాశరుడి లాంటి మహాయోగులకు తేడా ఏమీ ఉండదు. నేలమీది జనుల్ని ఉద్ధరించడానికి ఒక మహానుభావుణ్ని తీసుకురావలసిన సమయం దగ్గరపడ్డప్పుడు, ఇటువంటి కథల్ని చెబుతూ ఉంటాయి పురాణాలు. పురాణాల పద్ధతి అది. ఇలా చెప్పినది ఠకీమని ఎక్కుతుంది. పైన చెప్పినట్టుగా మానసిక భావంతో కన్నాడన్నమాట నమ్మబుద్ధి కాదు. మనకన్నా వాళ్లు వేరుగా ఎలా ఉంటారని అనిపిస్తుంది. ఆ సందేహాన్ని పుట్టించకుండా ఉండటానికే పురాణాలు ఈ పద్ధతిని ఉపయోగిస్తాయి. దీనివల్ల ఆ మహాయోగులకు వచ్చిన నష్టమేమీ ఉండదు.
 
పరాశర మహర్షి వల్ల ఆమెకు అప్పటికప్పుడే ఆ యమునానదీ ద్వీపంలోనే ఒక పదహారేళ్ల పడుచువాడు పుట్టుకొని వచ్చాడు. అతను పుడుతూనే తపస్సుకు వెళ్లిపోతూ, ‘అమ్మా! నీకు అవసరమైనప్పుడు నేను వస్తాను’ అని చెప్పి వెళ్లిపోయాడు.ఆ పడుచువాడే వేదవ్యాసుడు. ద్వీపంలో పుట్టాడు గనక అతన్ని ద్వైపాయనుడని కూడా అంటారు. మంచుతెర అనే చీకట్లో నల్లటి రూపంలో పుట్టాడు గనక అతను కృష్ణుడు కూడాను. రెండు పేర్లనూ కలిపి వెరసి అతన్ని కృష్ణ ద్వైపాయనుడని పిలుస్తూ ఉంటారు.

యుగయుగంలోనూ ధర్మం తాలూకు పాదాలు కుంచించుకొని పోతూ ఉంటాయి. మనిషికి రెండు పాదాలూ సజావుగా ఉంటే నిటారుగానూ హుందాగానూ నడవగలుగుతాడు. అలాగే ధర్మానికున్న తపస్సూ, శుచిత్వమూ, దయా, సత్యమూ అనే నాలుగు పాదాలూ సమానమైన పొడుగులో ఉంటే, ధర్మం ఏ కుంటూ లేకుండా సాగుతుంది. కానీ తపస్సు చేస్తున్నామన్నది గర్వాన్ని తెస్తుంది; ఆ గర్వంతో అది తన ‘పొడుగు’ను పోగొట్టుకుంటుంది. నలుగురితోనూ విచ్చలవిడిగా చేతులు కలపడంతోనూ తిరగడంతోనూ శుచిత్వం సమసిపోతుంది.

‘నేను చాలా దయావంతుణ్ని’ అనే భావం తలకెక్కుతుంది. క్రమంగా అది అహంగా మారిపోతుంది. ఇలా కాలం గడుస్తూన్నకొద్దీ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అదీగాక, మనుషుల ఆయుష్షూ శక్తీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్ని చూసే కృష్ణద్వైపాయనుడు ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు భాగాలుగా విడదీశాడు. అందుకనే అతను వేదవ్యాసుడయ్యాడు. ఏ విషయం గురించైనా విరివిగా రాయడాన్నే వ్యాసమని అంటారు. ఇతను కూడా వేదంలోని విషయాలను విపులంగా వివరిస్తూ 18 పురాణాలను రాశాడు.

ఇంటి పనుల్లో మునిగి ఉండే ఇల్లాళ్లకూ పొలం పనుల్లో తలమునకలై ఉండే పాలేర్లకూ రోజువారీ జీవితానికి అవసరమైన వస్తువుల్ని చేరవేస్తూ వ్యవహారాలు చేసే వర్తకులకూ కూడా వేదార్థాన్ని చేరవేద్దామన్న తపనతోనూ జాలితోనూ పంచమ వేద రూపంలో మహాభారతాన్ని కూడా రాశాడితను. అందుకనే వేదవ్యాసుణ్ని అందరికీ గురువుగా ఆరాధిస్తారు. ఆషాఢ పూర్ణిమకు గురుపూర్ణిమ అని పేరుపెట్టి ఈ మహాగురువుకి పూజను చేస్తూ ఉంటారు.
 
మహాభారతాన్ని రాయడమే గాక దాంట్లో ఒక పాత్రగా కూడా ఉన్నాడీయన. తల్లి సత్యవతి తలుచుకోగానే వచ్చి, రాజసంతానం లేక విధవలుగా ఉన్న అంబికా అంబాలికా అనే రాజపత్నులకు సంతానాన్ని ప్రసాదించాడితను. అంబిక, ఇతని గెడ్డాలూ మీసాలూ చూసి కళ్లు మూసుకోబట్టి గుడ్డి ధృతరాష్ట్రుడు పుట్టాడు; అంబాలిక ఇతన్ని చూసి భయపడి పాలిపోబట్టి పాలిపోయిన శరీరంతో పాండురాజు పుట్టాడు. ఈ సంతానం ఇటువంటిదని ఎరిగిన సత్యవతి, మళ్లీ కొడుకుని వేడుకోగా, వచ్చిన వ్యాసుడి దగ్గరికి అంబాలిక, ధైర్యంగా ఉన్న దాసిని పంపించడంతో మహావివేకి అయిన విదురుడు పుట్టాడు.

పిల్లల వైనాన్నిబట్టి చూస్తే ఇదంతా మానసిక సంతానమే అని అర్థమవుతోంది. పాండురాజు భార్యకు అప్పుడే పిల్లవాడు పుట్టేశాడనే దుగ్ధతో ధృతరాష్ట్రుడి భార్య గాంధారి, గర్భంతో ఉన్న తన పొట్టను రాయితో చీల్చుకోవడంతో ఒక మాంస పిండం బయటపడింది. అప్పుడు వ్యాసుడే వచ్చి, ఆ మాంసపు ముద్దను వంద ముక్కలుగా చేస్తూ ఆవునేతి కుండల్లో పెట్టి, సాకేలాగ చేశాడు. ఆ పనిలో ఉండగా, గాంధారి, ‘ఒక కూతురు కూడా ఉంటే బాగుంటుంది’ అంటే, వ్యాసుడు మరోముక్కను విడదీశాడు. అలాగ దుర్యోధనాదులతో పాటు దుశ్శల అనే కూతురు కూడా పుట్టింది.

ఆవునేతి కుండల్ని టెస్టుట్యూబులుగా ఉపయోగించిన పద్ధతిని కొంత మనం పరిశోధిస్తే ఆ పద్ధతేమిటో అర్థమవుతుంది. ఈ విధంగా కౌరవులకూ పాండవులకూ ఇతను తాతగారవుతాడు; భీష్ముడిగా ప్రసిద్ధికెక్కిన గంగాదత్తుడైన దేవపుత్రుడికి సోదరుడవుతాడు. మహాభారతంలో అవసరమైనప్పుడల్లా వచ్చి సలహాలనిచ్చి వెళ్తూ ఉంటాడు. ఒక స్త్రీ (ద్రౌపది) ఐదుగురికి ఆలిగా కావలసివచ్చినప్పుడు, అందులోని ధర్మసూక్ష్మాలను వివరిస్తూ రెండు పక్షాలవాళ్లనూ ఒడంబరిచినవాడు ఈయన.

పాండవులకు ఎప్పటికప్పుడు ఏవిధంగా ముందుకు నడవాలో దిగ్దర్శనం చేసినవాడూ ఈయనే. యుద్ధంలో అభిమన్యుడు చిన్నవయస్సులోనే చనిపోయినప్పుడు ధర్మరాజూ అర్జునుడూ బెంబేలు పడి ఏడుస్తూ ఉంటే, వచ్చి ఓదార్చినవాడూ ఈయనే. వ్యాసుడికి పాండవులూ కౌరవులూ మనవళ్లే అయినా ఎవరిమీదా ఆయన వల్లమాలిన ప్రేమనూ చూపించడు, ద్వేషమూ కనబరచడు. రెండువైపుల వాళ్లకూ సలహాలనిస్తూ మంచిని చెబుతూ, చెడును తెగుడుతూ తన సర్వగురుత్వాన్ని నిలుపుకొన్నవాడు ఇతను.
 
ఇతన్ని గురువనడానికి ఒక పెద్దకారణముంది. ఈ జగత్తులో ఉన్నదంతా ఎప్పుడూ ఒకేలా ఉండదు, క్షణక్షణమూ మారిపోతూ ఉంటుంది. అయితే, ఈ మార్పులన్నింటి వెనకా ఎప్పటికీ మారని తత్త్వం ఒకటి ఉంది. గాలుల వల్ల నీళ్లల్లో కెరటాలు పుడుతూ ఉంటాయి. కానీ ఆ కెరటాల రూపంలో ఉన్నవీ, వాటికి ఆధారంగా ఉన్నవీ అన్నీ ఒకే నీళ్లు. కెరటాలనూ కెరటాల వెనక ఉన్న నీళ్లనూ ఒకేసారి చూసి, ఇతరులకు చూపిస్తూ, కెరటాలు వేరూ, కిందనున్న నీళ్లు వేరూ అనే మోసంలో పడకుండా కాపాడే వాడే గురువు.

వేడీ చలవా హాయీ బాధా మొదలైన జమిలి భావాలనూ, వేరువేరుగా అనిపించే వస్తువుల వెనకనున్న సత్యాన్ని సూక్ష్మదృష్టితో చూడగలిగిన వివేకాన్నీ ఆ మహాచైతన్యం ఏ భావంలో పొదిగిందో ఆ భావస్వరూపమే వ్యాసత్వమూ గురుత్వమూను. పరాశరత్వమంటే, గొప్పగా ఛిన్నాభిన్నం చేసే సామర్థ్యం. సత్యమనిపించే ఈ జగత్తులోని మార్పుల మాయనీ మోసాన్నీ వివేకంతో ఛిన్నాభిన్నంచేసి నిరూపించే తత్త్వమే ఈ వ్యాసగురుత్వం.

సత్యవత్తుగా, అంటే, నిజం లాగే అనిపించే జడప్రకృతే సత్యవతి. గంగాదేవిని జ్ఞానప్రవాహ స్వరూపమైన ప్రకృతిగా ఇంతకుముందు చెప్పుకొన్నాం: స్వచ్ఛమైన ఆ ప్రకృతిని పరాప్రకృతి అని అంటారు. ఆ పరాప్రకృతే ఎదురుగుండా అవుపించని తన సంతానంతో ఈ సృష్టినంతనీ ధరించే జగద్ధాత్రి. తన రూపవిలాసాలతో మహర్షులక్కూడా రిమ్మతెగులు పుట్టించే మలిన ప్రకృతి అయిన సత్యవతే అపరాప్రకృతి. శాంతనుచైతన్యం ఈ సత్యవతీ ప్రకృతితో కలసి మంచీచెడుల జగన్నాటకాన్ని నడిపించడానికి నాందీ ప్రస్తావనలను చేసింది.
- డాక్టర్ ముంజులూరి నరసింహారావు
Mb.No: 9000765972
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement