Vyasa
-
కాశీని శపించబోయిన వ్యాసుడు,ఆ తర్వాత ఏం జరిగిందంటే..
విశాలాక్షీ సమేతుడైన విశ్వనాథుడు కొలువుదీరిన కాశీ నగరంలో కొంతకాలం గడుపుదామని భావించి, శిష్యగణాన్ని వెంటబెట్టుకుని అక్కడకు చేరుకున్నాడు. ఆయన వెంట వచ్చిన శిష్యులలో వైశంపాయనుడు, జైమిని, పైలుడు, సుమంతుడు సహా ఎందరెందరో మహామహులు ఉన్నారు. కాశీలో వ్యాసుడు ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. రోజూ వేకువ జామునే కాలకృత్యాలు తీర్చుకుని, గంగలో స్నానం చేసి, సంధ్యవార్చి, ఆశ్రమంలో అగ్నికార్యం, అనుష్ఠానం పూర్తయ్యాక మధ్యాహ్నం భిక్షాటన కోసం ఊళ్లో తలోదారిన బయలుదేరేవారు. కాశీలో వారికి భిక్షకు లోటు ఉండేది కాదు. రోజులు ఇలా గడిచిపోతుండగా, విశ్వేశ్వరుడికి వ్యాసుణ్ణి పరీక్షించాలనిపించింది. ‘వ్యాసుడి అంతరంగం ఎలాంటిదో తెలుసుకుందాం. అతడికీ, అతడి శిష్యులకూ ఎక్కడా భిక్ష పుట్టకుండా చేయి’ అని విశాలాక్షితో చెప్పాడు. ఆమె సరేనంది. మరునాడు వ్యాసుడు, అతడి శిష్యులు యథాప్రకారం భిక్షాటనకు బయలుదేరారు. విశాలాక్షి ప్రభావంతో ఏ ఇల్లాలికీ భిక్ష పెట్టే ఇచ్ఛ లేకుండాపోయింది. వ్యాసుడు ఇల్లిల్లూ తిరుగుతూ గుమ్మం ముందు నిలబడి ‘భిక్షాందేహి’ అని గొంతెత్తి పిలిచినా, కొందరు గృహస్థులు కనీసం తలుపులైనా తీశారు కాదు. వ్యాసుడికి ఎదురైన అనుభవమే అతడి శిష్యులకూ ఎదురైంది. కాలే కడుపులతో, ఖాళీ భిక్షపాత్రలతో ఒక్కొక్కరే ఆశ్రమానికి చేరుకున్నారు. ‘నాకు ఎక్కడా ఒక్క మెతుకైనా పుట్టలేదు. మీలో ఎవరికైనా భిక్ష దొరికిందా?’ శిష్యులను అడిగాడు వ్యాసుడు. ‘లేదు గురుదేవా! ఎవరూ మాకు భిక్ష వేయలేదు’ బదులిచ్చారు శిష్యులు. వ్యాసుడు, అతడి శిష్యులు కడుపులో కాళ్లు ముడుచుకుని పస్తు పడుకున్నారు. మర్నాడు వేకువనే నిద్రలేని స్నాన సం«ధ్యాది నిత్య నైమిత్తిక అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుని మళ్లీ భిక్షకు బయలుదేరారు. ఎక్కడా భిక్ష పుట్టలేదు. సాయంత్రం అయ్యే సరికి అందరూ నీరసంగా ఆశ్రమానికి చేరుకున్నారు. ఒక రోజు రెండు రోజులు కాదు, వరుసగా ఏడు రోజులు వ్యాసుడికి గాని, అతడి శిష్యులకు గాని కాశీ నగరంలో ఎక్కడా భిక్ష పుట్టలేదు. విశాలాక్షీ సమేతుడైన విశ్వేశ్వరుడు కొలువైన కాశీ నగరంలో ప్రతి ఇల్లాలూ ఒక అన్నపూర్ణ అని లోకం చెప్పుకుంటుంటే, తనకు తన శిష్యులకు ఇలా ఉపవాసాలు ఎదురవడం ఏమిటని వ్యాసుడు అమితంగా బాధపడ్డాడు. ఎనిమిదో రోజు వ్యాసుడు, అతడి శిష్యులు నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకుని, కాశీలో కొలువుదీరిన దేవతలందరికీ నమస్కారాలు పెట్టుకుని భిక్షకు బయలుదేరారు. వ్యాసుడికి ఒక్క ఇంటా భిక్ష దొరకలేదు. వరుస ఉపవాసాలతో వ్యాసుడు వ్యాకుల పడ్డాడు. తన శిష్యుల దురవస్థ తలచుకుని దుఃఖించాడు. అతడికి సహనం నశించింది. ఉక్రోషం ముంచుకొచ్చింది. నడివీథిలో తన భిక్షపాత్రను రాళ్లకేసి కొట్టి పగులగొట్టాడు. కాశీ వాసులకు మూడు తరాల వరకు విద్య, భక్తి, ధనమూ లేకుండా పోవాలని సంకల్పిస్తూ, కమండలం నుంచి శాపజలం అందుకోబోయాడు. వణుకుతున్న చెయ్యి ముందుకు రాకుండా నిలిచిపోయింది. అప్పుడే ఆ వీథిలోనున్న ఒక ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. సర్వాభరణ భూషితురాలైన ఒక నడివయసు స్త్రీ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది. ‘ఓ బ్రాహ్మడా! ఏమిటీ అఘాయిత్యం! కోపం మాని ఇలా రా’ అని పిలిచింది. ఆమె పిలుపుతో వ్యాసుడు తెప్పరిల్లాడు. ఆమె ఎవరో కనుక్కోకుండానే అప్రయత్నంగా నమస్కరించాడు. ‘భిక్ష దొరకనంత మాత్రాన కాశీ నగరాన్ని శపించేయడానికి సిద్ధపడ్డావే! ఇది నీకు విశ్వేశ్వరుడు పెట్టిన పరీక్ష. ఇదేనా నీ ధీరత్వం? ఏడురోజులు భిక్ష దొరకనంత మాత్రానికే నీ స్థైర్యం సడలిందేం?’ అని మందలిస్తూ, ‘మధ్యాహ్నానికి వస్తే, భిక్ష పెడతాను’ అంది. ‘తల్లీ! నన్నొక్కణ్ణేనా? నా శిష్యులను కూడానా? నాతో పాటే వాళ్లూ వారం రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు’ అన్నాడు వ్యాసుడు.‘గంగ వద్ద మధ్యాహ్న పూజలు ముగించుకుని అందరూ రండి. కడుపు నిండా భోజనం పెడతాను’ అందామె. మధ్యాహ్నం వెళ్లగానే విస్తర్లు వేసి, అందరూ ఆపోశనలు పట్టండని చెప్పింది. విస్తర్లు ఖాళీగా ఉన్నాయి. ఆపోశనలు పట్టగానే విస్తర్లలో ఎవరికి ఇష్టమైన పదార్థాలు వారికి ప్రత్యక్షమయ్యాయి. ఈమె సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అయి ఉంటుందనుకుని అందరూ తృప్తిగా భోజనం చేశారు. భోజనాలు పూర్తి చేసి విశ్రమిస్తుండగా, పార్వతీ సమేతంగా శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పార్వతీదేవి ప్రశాంతంగానే ఉన్నా, శివుడి ముఖం కోపంతో చిరచిరలాడుతూ ఉంది. శివుడు వ్యాసుణ్ణి కోపంగా చూస్తూ ‘ఓరీ దుర్మార్గుడా! నా భార్యలాంటి కాశీ నగరానికే శాపం ఇవ్వబోతావా? నువ్వు కాశీలో అడుగు పెట్టడమే ద్రోహం. నువ్వూ నీ శిష్యులూ కాశీ పొలిమేరలు దాటి వెళ్లండి’ అన్నాడు. చేసిన తప్పుకు బాధపడుతూ వ్యాసుడు శిష్యులతో సహా కాశీ నగరాన్ని విడిచిపెట్టాడు. -
మాతా... వందనం
95 ఏళ్ళు వచ్చాయి. ఒళ్ళు బాగా ముడతలు పడిపోయింది. బొమ్మలా చిన్నదిగా మంచంలో ముడుచుకుని పడుకుని ఉంది. రాత్రి 11 గంటలకు కొడుకు ఇంటికి వచ్చి భోజనానికి కూర్చుని రెండు నిమిషాల్లో లేచి పోయాడు. పక్కగదిలో పడుకుని ఉన్న అమ్మ కొడుకుని పిలిచి ‘‘నాన్నా, రెండుమూడు రోజుల్నించి ఇలాగే వస్తున్నావురా, రెండు మూడు నిమిషాల్లో భోజనం ముగించేస్తునావురా... ఇలా అయితే ఆరోగ్యం ఎక్కడ నిలబడుతుందిరా?’’ అంటుంది. వడ్డించక్కరలేదు. వాడు కంచం దగ్గరినుంచి లేచిపోయిన సమయాన్ని బట్టి తల్లి తల్లడిల్లిపోతుంది. దురదృష్టం అంటే... జీవితంలో అమ్మ పోయిననాడే. అమ్మ ఉన్నన్నాళ్ళూ ఓదార్పుకు లోటులేదు. 60 ఏళ్ళు దాటిన కొడుకయినా జ్వరం వచ్చిందని తెలిసి వాడిని దగ్గరికి పిలిచి బొటన వేలితో విభూతి పెట్టి ‘‘చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం’’ అంటూంటే అమ్మ దగ్గర లభించిన ఆ ఓదార్పు ప్రపంచంలో మరెక్కడయినా లభిస్తుందా? అమ్మ శరీరం పడిపోయిన తరువాత అమ్మ కట్టి విప్పిన చీరలను బొంతగా కుట్టుకుని పడుకున్నా సేదదీరుతుంది. అమ్మ కట్టివిప్పిన బట్టకు కూడా అంత ప్రేమ. అది కూడా అంత ఓదార్పునిస్తుంది. అమ్మవేసుకుని విప్పిన చెప్పులు, కళ్ళజోడు వాటిని చూసేటప్పటికి మనసు ఆర్ద్రతను పొందుతుంది. అమ్మలాంటి వ్యక్తి ఈ సృష్టిలో ఉండదు. అందుకే జగన్మాత అంతటిది కూడా తల్లిని తీసేయవలసి వస్తే బెంగపెట్టుకుంటుందట. వీడు ఇక అమ్మా అని పిలిస్తే నేనేమని జవాబు చెప్పాలి. అలాగని అమ్మచేతిలో బిడ్డ వెళ్ళిపోవడం మర్యాద కాదు. బిడ్డచేతిలో అమ్మే వెళ్ళిపోవాలి. ఒక్క అమ్మను నేను నీ నుండి తీసేయాల్సి వస్తే ముగ్గురు అమ్మలను చూపించి అప్పుడు తీసేసుకుంటానంటుందట. ‘ఒరేయ్, నేను నీకు భూమాతనిచ్చాను. ఈ తల్లి కూడా తల్లే. నువ్వు ఎక్కడున్నా ఈ అమ్మ ఒడిలోనే ఉంటావ్’ అని ఈ అమ్మనిచ్చింది. తరువాత దేశమాత. ఈ దేశానికంతటికీ అధిష్ఠానం ఉంది. అది దర్శించారు దేశభక్తులు. ఇది ఈ దేశ రుషి సంప్రదాయం. ఇది కేవలం మట్టి అని వాళ్ళు అనలేదు. ‘వందేమాతరం వందేమాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందేమాతరం’ అన్నాడు బంకించంద్ర ఛటర్జీ. ఒక వాల్మీకి, ఒక వ్యాసుడు ఎటువంటి వాడో నా దృష్టిలో బంకించంద్ర ఛటర్జీ కూడా అటువంటివాడే. అలా దేశాన్నంతటినీ కూడా ఒక తల్లిరూపంగా చూసి ఆరాధించాడు మహానుభావుడు. అలా భూమాతను, దేశమాతను, గోమాతను ఇచ్చాను. అంత వృద్ధాప్యంలో కూడా పుట్టినరోజునాడు వణికిపోతున్న చేతుల్తో తలమీద చెయ్యిపెట్టి అక్షింతలు వేసి లడ్డు చేతిలో పెట్టి తిను అనడం కాదు, ఏదీ నోరు తెరు అని నోటిలో పెట్టి నువ్వు తింటూ ఉంటే సంతోషపడే అమ్మ లేదని రేప్పొద్దున నన్ను నింద చేస్తావేమో, అందుకే నీకు గోమాతని ఇస్తున్నాను’’అంటుందట జగన్మాత. ‘‘పుట్టినరోజునాడు ఆవుపాలు తాగు. అవి తాగితే ఎప్పటికీ నీవు అమ్మ చేతి ముద్ద తిన్నవాడివే అవుతావు’’అని ఒక్క అమ్మను తీసుకోవలసి వస్తే ముగ్గురు అమ్మల్ని చూపించి... ఆ పైన...‘మీ అమ్మ ఎక్కడో లేదు.. నాలోనే చేరింది. నా దగ్గరకు వచ్చి నీవు చేసిన నమస్కారం మీ అమ్మకే అందిస్తా’ అంటుందట. అమ్మ అన్నమాట అంత గంభీరం. -
పుట్టుక లేని పకీరు
ఎవరిదైనా ఓ జీవిత చరిత్రని రాయాలంటే స్పష్టమైన ఆధారాలు లభించినప్పుడు మాత్రమే దాన్ని లోకానికి ప్రచారం చేయడం సరైన పని. అలా కాక ఆధారాల్లేకపోయినా ఏదో ఊహలతోనో, ఎవరెవరో చెప్పిన కట్టుకథలతోనో జీవిత చరిత్రలని గనుక రాస్తే నిజమైనదేదో, నమ్మాల్సిందేదోనన్న విషయం ఓ జీవితకాలంలో తెలియదు ఎవరికీ కూడా. రామకథకి వాల్మీకి రాసిన శ్రీమద్రామాయణమే ప్రమాణం అవుతుంటే, పూర్తిగా శ్రీమద్రామాయణాన్ని చదవని ఎందరో కొంత శ్రీమద్రామాయణంలోనిదీ, కొంత మరో రామాయణంలోనిదీ, మరికొంత అక్కడక్కడ హరికథల్లో విన్నదీ కలిపి చెప్పేస్తున్న కారణంగానే నేటికీ శ్రీమద్రామాయణం అసలు కథ ఏదో అది నూటికి తొంభైమందికి తెలియకుండా పోయింది, కేవలం ఇలాంటివారి వల్ల. అలాగే, వ్యాసుడు రాసిన భారత భాగవత కథలు కూడా పూర్తిగా చదవనివారి కారణంగానే కల్పిత కథలతో ప్రచారమవుతూ నిజమైన కథ ఏదో తెలియకుండా పోయింది. కేవలం ఇలాంటివారి వల్లే.. ‘ధర్మసందేహాలు’ వస్తూనే ఉంటాయి ఓ జన్మకాలమంతా. దానిక్కారణం దేన్నీ సరిగా లోకానికి రానీయక పోయినందువల్ల. ఇలా చెప్తున్నారేమిటి? అని ప్రశ్నించేవారూ, అలా చెప్పడం సరికాదని ఎదురు తిరిగే వారూ లేకపోయినందువల్లనే.హేమాడ్ పంత్ ఒక బాధ్యతాయుతమైన మేజిస్ట్రేట్ పదవిని నిర్వహించినవాడైన కారణంగా తగిన సాక్ష్యాధారాలు, వీటితో పాటు ఎవరినుండైనా విన్న కొన్ని సమాచారాలుంటే వాటిలో నిజానిజాలెంతో పరిశీలించగల శక్తి ఉన్న తన బుద్ధితో విచారించి ఆ ప్రమాణబద్ధమైన అంశాలు కలిపి సాయి పుట్టింది ఎప్పుడు? ఎక్కడ? ఎలా? అనే విశేషాలని తేల్చగలిగాడు. సాయి మొదటి దశ అది 1854వ సంవత్సరం. షిర్డీ గ్రామానికి వెలుపల, అంటే పొలిమేర అనుకోవచ్చు. అక్కడో పెద్ద వేపచెట్టుండేది. దాని కిందే సాయి ఉండేవాడు. అప్పటికి ఆయన 16 సంవత్సరాల వయసువానిగా కన్పించాడు అందరికీ. అంటే ఆయన పుట్టినది 1838వ సంవత్సరం అయ్యుండచ్చు.ఎప్పుడూ ఆ చెట్టు కిందే బస. ఓ రాత్రి లేదు, ఓ పగలు లేదు, ఓ ఎండ అనీ లేదు, ఓ వాన అనీ లేదు, ఓ చలి అనీ లేదు. అక్కడే అక్కడే అక్కడే. షిర్డీ గ్రామానికి వస్తూండేవారూ పోతుండేవారూ ఏవేవో వృత్తులు చేసుకుంటూండేవారూ గానీ, ఎందుకు ఈ బాలుడు ఇలా కూర్చున్నాడో ఎవరికీ కనీసం తెలుసుకుందామని కూడా అనిపించలేదు. అడిగిన వారు కూడా లేరు.కొన్నాళ్లిలా గడిచాక, ముస్లిం పద్ధతిలో కనిపిస్తున్న ఆ బాలుణ్ని గమనించాక, ఎప్పుడూ అల్లానామాన్నే జపిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమయ్యాక, ఎవరో ఒకామె తన పుత్రికని తీసుకొచ్చి, తన పాప కండ్ల కలకతో బాధపడుతోందని నమస్కరించి చూపించింది. సాయి టక్కున లేచి కొంతదూరంలో ఉన్న చెట్టువద్దకెళ్లి పసరు తీసి ఆమె కళ్లలో వేసాడు. మరురోజుకి తగ్గింది.అంతే! ఆ మరునాడు మరో ఇద్దరొచ్చారు. ఈ వ్యాధీ ఆ వ్యాధీ అంటూ ఎవ్వరొచ్చినా మాట్లాడే ధోరణే లేదు. వినడం, ఏ చెట్టు ఏ తీగ అనే దాన్ని చూసుకోవడం, టక్కున లేచి కొంత దూరం వెళ్లి తేవడం, ఆ పసరుని నోటిలోనో, గాయంపైనో వేసి ఆ వ్యాధి తగ్గేట్టుగా వైద్యం చేయడం, పంపించివేయడం ఇలా జరిగేది. దీంతో ఐదుగురు పది మందిగా, పదిమంది వందగా అయిపోయారు. ఇలా జనం పెరుగుతున్నా ఆయనకి విసుగు, విరామం లేకుండా వైద్యం చేస్తూనే ఉండేవారు. అప్పుడైనా ఏ ఒక్కరికీ ఇంతటి వైద్యం చేసిన ఆయన్ని ఏ ఇంటిలోకో, వసారాలోకో ఉండవలసిందిగా పిలుద్దామని, నిత్యం భోజనాన్ని సమకూరుద్దామని వాళ్లకీ అనిపించలేదు. ఈయనకు కూడా అడుగుదామనే ఆలోచన ఏమాత్రమూ లేదు. ఆయన వివరాలని ఎవరూ అడిగిందీ లేదు. ఈయన చెప్పిందీ లేదు. ఈయనది ఏ మతం? జనసంఖ్య పెరగడంతో మెల్లగా ఈయన గురించిన వివరాల్లోకి ఆలోచనలు సాగాయి.ఫకీరు రూపంలో ఉన్నాడు కాబట్టి, మసీదు గోడకి ఆనుకుని కూర్చున్నాడు కాబట్టి, మధ్యమధ్యలో పైకి ‘అల్లాహ్మాలిక్’ (అల్లాయే నా జీవిత యజమానీ దైవం కూడా) అంటూ ఉన్నాడు కాబట్టి... ఈయన ముస్లిం మాత్రమే అని కొందరు ఓ నిర్ణయానికొచ్చేశారు. పైగా మహమ్మదీయులకి ఇలాంటి పసరు వైద్యాలు, తాయెత్తులు, దిష్టి తొలగించే వైద్యాలు వంశ పరంపరగా వస్తూంటాయి కాబట్టి కూడా ఈయన ముస్లిమే అనే నిశ్చయం చేసుకున్నారు.అయితే మరికొందరు మాత్రం సాయి చెవులు రెంటికీ ఉన్న చిల్లుల్ని చూసి ఇవి హిందూధర్మం ప్రకారం ఉపనయనం (ఒడుగు) కార్యక్రమంలో చేయబడే సంస్కారాలు చెవులు కుట్టడం (కర్ణవేధ) అలాగే పుట్టువెండ్రుకల్ని తీసివేయడం (చౌలం) అనేవి స్పష్టంగా కనిపిస్తున్న కారణంగా హిందువేననే నిర్ణయానికొచ్చేశారు.కొద్దిగా పరిచయమయ్యాక మాటలు దొర్లుతాయిగా! బాబూ! నీ బస ఎక్కడ? ఇక్కడే కనిపిస్తూ ఉంటావని అడిగితే ఆ మసీదు చూపిస్తూ ‘అదుగో! ద్వారక నా నివాసమన్నట్లు చూపించాడు. చనువుతో మసీదులోపల తిరిగి చూస్తే మహమ్మదీయ విధానానికి విరుద్ధంగానూ, హైందవ ధర్మానికి అనుగుణంగానూ ‘తులసిమొక్క’ కనిపిస్తోంది. అదేదో తనంత తాను పెరిగింది కాదు. పెంచబడుతూన్న ధోరణి కనిపిస్తోంది. మరి కొద్దికాలమయ్యాక ‘నువ్వెవరివి?’ అని అడిగితే కొందరితో రాముడిననీ, మరికొందరితో కబీరుననీ, ఝాన్సీ లక్ష్మీబాయ్ కొలువులో సిపాయిననీ, బట్టలని నేస్తూ ఉండేవాడిననీ... ఇంకా విచిత్రంగా మహాలక్ష్మిననీ... ఇలా చెప్తుంటే ఆశ్చర్యపడేవారు అందరూ. అయినా మన రోగాలన్నీ నయమవుతూంటేనూ, ఈ కుర్రవాడు ఏ సొమ్మునీ తీసుకోకుండా చిటికెలో వైద్యం చేస్తుంటేనూ, వయసులో స్త్రీలందరినీ ఎంతో గౌరవ మర్యాదలతో సభ్యదృష్టితోనే చూస్తున్న కారణంగానూ మనకి ఇతర వివరాలెందుకనుకుంటూ వాళ్లంతా ఏనాడూ ఈయన గురించిన లో వివరాలకి పోలేదు. ఒకవేళ వివరాలని ఆయన చెప్పినా అవి అర్థమయ్యేవి కాదు. ఇలా అన్నింటినీ జోడించుకు చూసుకుంటే లౌకికంగా ఆయన ఓ పిచ్చివానిలా అనిపించేవాడు కూడా. అలా ఆయన్ని పిచ్చివాడుగా అనుకోవడానికి ఇష్టముండేది కాదు. మనసు అంగీకరించేది కాదు. ఇతరులకి ఈయన గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో తెలిసేదీ కాదు.ఇదిలా ఉండగా ఓసారి సాయిని ధులియా అనే ఊళ్లో మేజిస్ట్రేటు కోర్టులో ఎవరి వ్యాజ్యంలోనో సాక్షిగా విచారించవలసి వచ్చింది. అప్పుడు సాయిని గురించి ప్రశ్నా సమాధానాలు ఇలా ఉన్నాయి. ‘‘నీపేరు?’’‘‘బాబా.’’‘‘నీ తండ్రి పేరు?’’‘‘బాబా.’’తండ్రీకొడుకుల పేర్లు ఒకలానే ఎందుకుంటాయి? అని ఒక్కక్షణం మేజిస్ట్రేటు ఆశ్చర్యపడినా తన బాధ్యత చెప్పింది రాసుకోవడం మాత్రమే కాబట్టి, ఇంకా ఏదైనా అడిగితే అది న్యాయస్థాన నియమాలకి వ్యతిరేకం కాబట్టి అలాగే నమోదు చేశాడు.‘‘సరే! నీ మతం ఏమిటి?’’‘‘కబీరు మతం.’’‘‘ఏ కులం నీది?’’‘‘దేవుడి కులం’’‘‘ఇంకా ఏమైనా నీ వివరాలని చెప్తావా?’’‘‘నేను అనసూయాదేవిని, మహాలక్ష్మిని.’’మేజిస్ట్రేటు మారు మాట్లాడక ‘వెళ్లవచ్చు’నన్నట్టు చూశాడు. చిత్రమేమంటే మేజిస్ట్రేటు ఎక్కడా కూడా ‘నీ ఊరేది?’ అని అడగలేదు. సాయి చెప్పలేదు కూడా.షిర్డీకి వంద మైళ్ల దూరంలో పత్రి అనే గ్రామం ఉంది. ఆ ఊళ్లోనే సాయి పుట్టాడనే ఓ వదంతి ఉంది. ఆ దిశగా పరిశీలించారు కొందరు మేధావులు.జన్మస్థలం ‘పత్రి’కాదుసహజంగా ఎవరైనా ఎక్కడైనా పుడితే ఆ విషయం తెలియకుండా ఉండదు. పుట్టాడు అనగానే తల్లి, తండ్రి, మేనత్త, మేనమామ, ఇతర బంధువులు, ఆప్తులూ తిరిగిన ప్రదేశం చదువుకున్న బడీ, లేదా పనిచేసిన పొలం... ఇలా ఏవో కొన్ని వివరాలు తప్పక ఉంటాయి. ఒకరికి కాకపోతే మరొకరికైనా తెలిసి తీరుతాయి కదా! నిజంగా సాయే గనుక పత్రి గ్రామంలోనే పుట్టి ఉండి ఉంటే, ఆ గ్రామం షిర్డీకి కేవలం వంద మైళ్ల దూరంలోనే ఉంది కాబట్టి, ఆ ఊరి ప్రజలు ఇక్కడికీ, ఇక్కడివారు అక్కడికీ ఏవో వృత్తి వ్యాపారాల మీద తిరుగుతూనే ఉంటారు కాబట్టి ఈ నిజం తప్పక బయటపడి ఉండేదే తగిన సాక్ష్యాధారాలతో. ఒక వ్యక్తి జన్మించాడంటే పైన అనుకున్న తీరుగా ఏ కొందరో బంధువులు తప్పనిసరి కాబట్టి, నేరుగా షిర్డీలో మసీదు గోడనానుకుని కూర్చుని ఉన్న సాయి దగ్గరకే వచ్చి, ఈ పత్రి గ్రామం, జన్మస్థలం... వ్యవహారాన్ని చెప్పి ఉండకపోవచ్చును గానీ, ఏ ఒక్కరో అయినా ఆ నోట ఈ నోట ఫలానివారికి కలిగిన కుర్రవాడు, వాని లక్షణాలు ఇవీ, వృత్తి ఇదీ, ఇల్లు ఇదీ.. అంటూ చెప్పకుండా ఉండగలరా? పోనీ! ఎవరికైనా జన్మస్థలం జన్మనిచ్చిన తల్లి అతిముఖ్యులు కాబట్టి, తన తల్లిపేరునీ ఊరిపేరునీ సాయి ఎక్కడైనా చెప్పాడా? చెప్పుకున్నాడా? పదిమందిలో చూచాయిగానైనా అన్నాడా?.. అని పరిశీలిస్తే ఎక్కడా కూడా ఆ ప్రస్తావనే రాలేదు ఆయననుండి. పోనీ! ఏ ఊరు పేరూ గుర్తింపూలేని వ్యక్తుల విషయంలోనైతే సమాచారం తెలియకపోవచ్చుననుకోవచ్చు గానీ, ఇందరు రోగులకి రోగ బాధని నయం చేస్తూనూ, ఒంటరిగా ఉంటూ ఎవరి జోలికీ పోకుండా ఇంత చిన్నవయసులో ఇంత సభ్యతతో ఉంటూ కనిపిస్తూంటేనూ, ఏమీ ఆశించకుండానూ ఏం తింటున్నాడో ఎలా జీవనాన్ని గడుపుతున్నాడో ఎవరికీ తెలియని రీతిలో ఉంటూంటేనూ ఆయన గురించి సమాచారం వంద మైళ్ల దూరంలో ఉన్న ‘పత్రి’ గ్రామవాసులకి తెలిసి ఉండదా?ఇదంతా ఒకెత్తూ... సాయికి బాగా దగ్గరగా ఉండే వారైన నానాదీక్షిత్, అలాగే బూటీ... మరికొందరికీ సాయి చెప్పి ఉండడా? లేక వీరు అడిగి ఉండరా? తెలిసి ఉండదా? వాళ్లెవరూ సాయిది ‘పత్రి’ గ్రామమనకపోవడంతో పాటు అసలు ఆయన జన్మస్థలం గురించిన ప్రస్తావననే తేకపోవడం మరొకెత్తూను.సాయి ఇంకా ఈ లోకంలో ఉండగానే ‘ఖండోబా’ అనే గ్రామదేవత ఆలయంలో అర్చకునిగా ఉంటున్న ‘మహల్సాపతి’ అనే ఆయన సాయిమీది విశేష భక్తితో అనేక పర్యాయాలు సాయికీర్తనలని రాగయుక్తంగా పాడాడు కదా! ఆయన కూడా ఎక్కడా ఏనాడూ ఏ చోటా సాయి ఎక్కడ పుట్టాడనే విషయాన్ని గానీ, విశేషించి ‘పత్రి గ్రామం’ పేరుగాని ఎత్తనే లేదు.మరి ఈ జన్మస్థలం గురించిన ఈ చర్చ అపోహలకి కారణం ఒక్కటే. ‘ఖండోబా’ అనే గ్రామదేవత ఆలయంలో అర్చకునిగా పనిచేస్తూండే ‘మహల్సాపతి’ అనే ఆయన ఒక పెన్సిలుతో ఒక కాగితం మీద ‘సాయి షిర్డీ సమీపంలోని పత్రి గ్రామంలో పుట్టాడు’ అని రాసి ఉండడమే. ఈ రాతకి ఏ మాత్రం ఆధారం లేనే లేదు. ఏతావతా తేలిందేమంటే మనం చెప్పుకోబోయిన కథ చెప్పుకున్న మన సాయి కథా ‘కంచికి వెళ్లకుండా మళ్లీ అనగనగా... అంటూ కథ ప్రారంభానికే వచ్చేసిం’దని. దీన్ని బట్టి సప్రమాణంగా తెలిసేదేమంటే... సాయి జన్మస్థలం, తల్లిదండ్రులు, సాయి పేరు, సాయి మతం, సాయి బాల్య విశేషాలు, సాయి చేసే వృత్తి.. ఇలా ఏమీ కూడా ఇప్పటివరకూ తెలియనే తెలియవనీ, తెలియడం కోసం ప్రయత్నించిన అందరికీ కూడా అంతుబట్టనే లేదనీను.ఇదంతా ఇలా ఉంచి ఆయన్ని అడిగితే ఏం చెప్తాడోనని ఆలోచించి, చివరి ప్రయత్నంగా ఆయన్ని గురించిన వివరాలని ధైర్యం చేసి ఆ సాయినే అడిగితే ఆయన, చిరునవ్వుని మౌనంగా నవ్వి మరో పక్కకి తొలిగిపోయేవాడు కూడా.ఊరు, పేరూ వివరాలూ లేకుండా ఉండడం సాధ్యమా?పైన చదివిందాని ప్రకారం సాయి ఊరూ పేరూ వివరాలూ.. ఇలా ఏమీ తెలియవీల్లేదని అనుకున్నా, అలా ఉండడం సాధ్యమా? అనే సందేహం మనకి వస్తుంది. అలా రావడం తప్పుకాదు కూడా.ఇప్పుడు యథార్థాన్ని తెలుసుకుందాం!సాయి మనలా ఒక కులానికీ, మతానికీ సంప్రదాయానికీ చెందిన వాడు కాదు. అందుకే కులాన్ని గురించి అడిగితే దేవుడికులమని, మతాన్ని అడిగితే కబీరు మతమనీ అన్నాడు. సంప్రదాయం గురించిఎవరూ అడగకున్నా.. వేషం ప్రకారం మహ్మదీయం, తులసి మొక్క నాటడం, నిత్యం అగ్నిహోత్రాన్ని చేసే సంప్రదాయం(ధుని) అలాగే మసీదుని ద్వారక అనడం ప్రకారం హైందవమనీ తెలియజేసుకున్నాడాయన.తాను పుట్టిన 16 సంవత్సరాల వరకూ ఏ ఉనికీ లేకుండా అకస్మాత్తుగా వెలుగులోకి రావడం ప్రకారం ఆయన ఏదో ఓ ఘనకార్యాన్ని లోకానికి చేయదలిచి వచ్చినవారే అని అర్థమవుతుంది. దీనికి బలమైన ఆధారం కూడా ఒకటుంది! లోకంలో అందరికీ ఈ అకస్మాత్తుగా ఊడిపడ్డ సాయిని గురించిన అనుమానం కలిగి షిర్డీగ్రామంలో ఉన్న గ్రామదేవతకి జరిగే ఉత్సవాల్లో ఓ రోజున ఈయనని గురించి తెలుసుకోవాలనుకున్నాడు.ఆ రోజుల్లో యథార్థమైన ‘పూనకాలు’ ఉంటూండేవి. ‘పూనకం’ అంటే ఒక దైవశక్తి. నిత్యం ఆ దేవిని ఉపాసిస్తూండే ఒక వ్యక్తిలోనికి ప్రవేశించడమని అర్థం. అలా దైవశక్తి ఈలోనికి ఆవహించిన వేళ, అలా ఆవహింపబడిన వ్యక్తికి బాహ్యస్పృహా స్మృతీ ఉండవు. అంటే తానెవరో, ఎక్కడ నుంచి వచ్చాడో, తన వివరాలేమిటో తనకి తెలియవు. కేవలం ఆ దేవీ స్మృతీ స్పృహలోనే ఉంటారు.అలాంటి పూనకం వచ్చిన వ్యక్తిని అక్కడి ప్రజలంతా ఈ 16 సంవత్సరాల బాలుని గురించి చెప్పవలసిందిగా కోరారట. అంతే! ఒక గునపం తెమ్మని చెప్పి ఒక ప్రదేశాన్ని చూపించి తవ్వవలసిందన్నాడు ఆ పూనకం వచ్చిన వ్యక్తి. కొద్దిగా తవ్వగా ఒక బండరాయి కనిపించింది. ఆ రాతిని తొలగించి చూస్తే నాలుగు దీపాల ప్రమిదలూ కన్పించాయి. అంతేకాదు, అప్పుడే పూజ చేసి ఎక్కడికో వెళ్లిన తీరులో పూజాద్రవ్యాలూ పూజ చేసిన విధానాలు కనిపించాయి అందరికీ. ‘‘ఈ బాలుడు 12 సంవత్సరాలు ఈ నేలమాళిగలో తపస్సు చేశాడు. ప్రతి నిత్యం ఇలా చేస్తూ పైకి వస్తూంటే అక్కడి జనమంతా అనవసర ప్రశ్నలతో బాధిస్తుంటే, ఆ ప్రదేశాన్ని విడువబోతూ ఈ బండని కప్పి.. దయచేసి ఈ ప్రదేశాన్ని పాడుచేయకండి అని ప్రార్థించి వెళ్లిపోయాడు’’ అని చెప్పాడు పూనకం వచ్చిన వ్యక్తి.అంటే దాదాపు 1838లో జన్మించిన సాయి 1842 లో (నాల్గవ సంవత్సరంలో) తపస్సు ప్రారంభించి 12 ఏళ్ల పాటు తపస్సు చేసి 1854లో షిర్డీ పొలిమేర జనులందరికీ కనిపించాడన్నమాట. అక్కడి నుంచిమరో నాలుగు సంవత్సరాల పాటు సాయి ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు. పోనీ! ఇంత గొప్పవాడు సాయి అనే అభిప్రాయంతో ఆ గ్రామదేవత అయిన ఖండోబా ఆలయంలో ఎక్కడో ఒక చిన్న గదినైనా సాయికి ఇయ్యగలిగారా ఎవరైనా? అంటే ఈయన హైందవధర్మానికి చెందినవాడు కాదు గదా! అని ఆ ఆలయ అర్చకుడు ‘మహల్సాపతి’తో పాటు అందరూ నిరాకరించారు ఇవ్వడానికి, లేదా మౌనంగా ఉండిపోయారు. చిత్రమేమంటే ఆయన 1858లో తిరిగి షిర్డీకి రాగానే ఆయన ప్రతిభ ప్రారంభమయింది. ఆయనకి పేరు పెట్టడంతో సహా లీలలన్నీ జనులకి ఒకటొకటిగా తెలియసాగాయి. తన పాదాలనుండి ‘దాసగణు’ అనేమహాభక్తునికి గంగా యమునా నదీ ధారలని చూపించాడు సాయి. ఎలాగో చూద్దాం. ∙డా. మైలవరపు శ్రీనివాసరావు -
వేదవ్యాసుడు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 2 మహాభారతం రాసింది వేదవ్యాసుడే అయినా, వ్యాసుడు అందులో ఒక పాత్ర కూడా. ఋషుల పుట్టుక గురించీ నదుల పుట్టుక గురించీ అడగకూడదంటారు. ఎంత పెద్ద నది అయినా దాని మూలంలో అది చాలా చిన్నదిగానే ఉంటుంది; చుక్కలు చుక్కలుగానే పడుతూ ఉంటుంది. ‘ఆ నదేనా ఇక్కడ పుట్టింది?’ అన్నంత ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది. ఋషుల పుట్టుక గూడా అలాగే ఉంటుంది కానీ, వారి విషయంలో దాన్ని వేరుగా అర్థం చేసుకోవాలి. ఒక బెస్తలదొర పేరు దాశరాజు. అతని దగ్గర చాలామంది చేపలు పట్టేవాళ్లే ఉన్నారు. ఓసారి వాళ్లు సముద్రంలోకి వేటకోసం వెళ్లారు. వాళ్లకు ఆ రోజున కడుపుతో ఉన్న పెద్ద చేప ఒకటి చిక్కింది. దాన్ని తెచ్చి దొర చేతికిచ్చారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ చేప కడుపును చీల్చినప్పుడు, దానిలోనుంచి ఒక పిల్లాడూ, ఒక పిల్లా బయటపడ్డారు! దాశరాజు వాళ్లనిద్దర్నీ తీసుకొనిపోయి వాళ్ల రాజుగారికి చూపించాడు. ఆ రాజుగారు ఎంతో ఆనందంతో దాశరాజుకి అమ్మాయినిచ్చి, తానేమో పిల్లవాణ్ని తీసుకొన్నాడు. దాశరాజు ఆమెకు ‘సత్యవతి’ అని పేరుపెట్టుకొని, అల్లారు ముద్దుగా పెంచుకొన్నాడు. చేపల వాసనతో ఉన్న ఆ పిల్లను ‘మత్స్యగంధి’ అని అందరూ పిలుస్తూ ఉండేవాళ్లు. తండ్రికి సాయం చేయడానికి ఆ అమ్మాయి యమునానది మీద నావ నడుపుతూ ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకూ, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకూ యాత్రికుల్ని చేరవేస్తూ ఉండేది. ఓసారి, తీర్థయాత్రలు చేస్తూ వస్తున్న పరాశర మహర్షి ఆ నావ ఎక్కేడు. ఆ అమ్మాయి రూపానికి ముగ్ధుడైన పరాశరుడు ఆమెను దగ్గరికి పిలిచాడు. ఆమె సిగ్గుతో, భయంతో ‘ఆవలి ఒడ్డునా ఈవల ఒడ్డునా చాలామందే చూస్తూ ఉన్నారు. అదీగాక, తండ్రి చాటు బిడ్డను నేను. నా కన్యాత్వం పోతే, తిరిగి నాన్నగారికి నా ముఖం ఎలా చూపించగలను?’ అని వాపోయింది. పరాశరుడు గొప్ప యోగి. తక్షణమే మంచుతెరనొకదాన్ని సృష్టించి అంతా చీకటిగా మార్చేశాడు. ‘నీ కన్యాత్వం ఎక్కడికీ పోదులే’ అని పలుకుతూ, ‘ఏదైనా నీకు ఇష్టమొచ్చిన వరం కోరుకో’మని అన్నాడు. అందరూ ఆమె ఒంటి నుంచి వచ్చే చేపల వాసనను వెక్కిరిస్తూ ఉండేవాళ్లు. అదీగాక, యౌవనంలో ఉన్న ఆమె దగ్గరికి ఎవరు రావాలన్నా కొంత సంకోచిస్తూనే ఉండేవాళ్లు. అందుకనే ఆమె, తన శరీరానికున్న చేపల గబ్బును పోగొట్టి పద్మపుష్పాల సుగంధం వచ్చేలా చేయమని అడిగింది. ఆవిడ కోరిక తీరింది. ఆమె అప్పణ్నించీ ‘గంధవతి’గా మారింది. ఆమె ఒంటి నుంచి వచ్చే ఆ సువాసన యోజనం దాకా, అంటే, పన్నెండు పదమూడు కిలోమీటర్ల దాకా విస్తరించడాన్ని చూసి, ఆమెను‘యోజనగంధి’ అని కూడా పిలవడం మొదలుపెట్టారు. యోజనం అంటే కలపడం అని కూడా అర్థం ఉంది. ఆ సుగంధమే ఆవిణ్ని శాంతన మహారాజుగారితో కలిపింది తరువాత. అప్పటికప్పుడు శోభనం గదిని తయారుచేసినట్టుగా మంచుతెరను సృష్టించినవాడు మామూలు మనుషుల్లా సంగమించవలసిన పనిలేదు. అటువంటివాళ్లు వట్టి మానస భావంతోనే పిల్లల్ని సృష్టించగలరు. సంగమించి కన్నా, సంగమించకుండా కన్నా పరాశరుడి లాంటి మహాయోగులకు తేడా ఏమీ ఉండదు. నేలమీది జనుల్ని ఉద్ధరించడానికి ఒక మహానుభావుణ్ని తీసుకురావలసిన సమయం దగ్గరపడ్డప్పుడు, ఇటువంటి కథల్ని చెబుతూ ఉంటాయి పురాణాలు. పురాణాల పద్ధతి అది. ఇలా చెప్పినది ఠకీమని ఎక్కుతుంది. పైన చెప్పినట్టుగా మానసిక భావంతో కన్నాడన్నమాట నమ్మబుద్ధి కాదు. మనకన్నా వాళ్లు వేరుగా ఎలా ఉంటారని అనిపిస్తుంది. ఆ సందేహాన్ని పుట్టించకుండా ఉండటానికే పురాణాలు ఈ పద్ధతిని ఉపయోగిస్తాయి. దీనివల్ల ఆ మహాయోగులకు వచ్చిన నష్టమేమీ ఉండదు. పరాశర మహర్షి వల్ల ఆమెకు అప్పటికప్పుడే ఆ యమునానదీ ద్వీపంలోనే ఒక పదహారేళ్ల పడుచువాడు పుట్టుకొని వచ్చాడు. అతను పుడుతూనే తపస్సుకు వెళ్లిపోతూ, ‘అమ్మా! నీకు అవసరమైనప్పుడు నేను వస్తాను’ అని చెప్పి వెళ్లిపోయాడు.ఆ పడుచువాడే వేదవ్యాసుడు. ద్వీపంలో పుట్టాడు గనక అతన్ని ద్వైపాయనుడని కూడా అంటారు. మంచుతెర అనే చీకట్లో నల్లటి రూపంలో పుట్టాడు గనక అతను కృష్ణుడు కూడాను. రెండు పేర్లనూ కలిపి వెరసి అతన్ని కృష్ణ ద్వైపాయనుడని పిలుస్తూ ఉంటారు. యుగయుగంలోనూ ధర్మం తాలూకు పాదాలు కుంచించుకొని పోతూ ఉంటాయి. మనిషికి రెండు పాదాలూ సజావుగా ఉంటే నిటారుగానూ హుందాగానూ నడవగలుగుతాడు. అలాగే ధర్మానికున్న తపస్సూ, శుచిత్వమూ, దయా, సత్యమూ అనే నాలుగు పాదాలూ సమానమైన పొడుగులో ఉంటే, ధర్మం ఏ కుంటూ లేకుండా సాగుతుంది. కానీ తపస్సు చేస్తున్నామన్నది గర్వాన్ని తెస్తుంది; ఆ గర్వంతో అది తన ‘పొడుగు’ను పోగొట్టుకుంటుంది. నలుగురితోనూ విచ్చలవిడిగా చేతులు కలపడంతోనూ తిరగడంతోనూ శుచిత్వం సమసిపోతుంది. ‘నేను చాలా దయావంతుణ్ని’ అనే భావం తలకెక్కుతుంది. క్రమంగా అది అహంగా మారిపోతుంది. ఇలా కాలం గడుస్తూన్నకొద్దీ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అదీగాక, మనుషుల ఆయుష్షూ శక్తీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్ని చూసే కృష్ణద్వైపాయనుడు ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు భాగాలుగా విడదీశాడు. అందుకనే అతను వేదవ్యాసుడయ్యాడు. ఏ విషయం గురించైనా విరివిగా రాయడాన్నే వ్యాసమని అంటారు. ఇతను కూడా వేదంలోని విషయాలను విపులంగా వివరిస్తూ 18 పురాణాలను రాశాడు. ఇంటి పనుల్లో మునిగి ఉండే ఇల్లాళ్లకూ పొలం పనుల్లో తలమునకలై ఉండే పాలేర్లకూ రోజువారీ జీవితానికి అవసరమైన వస్తువుల్ని చేరవేస్తూ వ్యవహారాలు చేసే వర్తకులకూ కూడా వేదార్థాన్ని చేరవేద్దామన్న తపనతోనూ జాలితోనూ పంచమ వేద రూపంలో మహాభారతాన్ని కూడా రాశాడితను. అందుకనే వేదవ్యాసుణ్ని అందరికీ గురువుగా ఆరాధిస్తారు. ఆషాఢ పూర్ణిమకు గురుపూర్ణిమ అని పేరుపెట్టి ఈ మహాగురువుకి పూజను చేస్తూ ఉంటారు. మహాభారతాన్ని రాయడమే గాక దాంట్లో ఒక పాత్రగా కూడా ఉన్నాడీయన. తల్లి సత్యవతి తలుచుకోగానే వచ్చి, రాజసంతానం లేక విధవలుగా ఉన్న అంబికా అంబాలికా అనే రాజపత్నులకు సంతానాన్ని ప్రసాదించాడితను. అంబిక, ఇతని గెడ్డాలూ మీసాలూ చూసి కళ్లు మూసుకోబట్టి గుడ్డి ధృతరాష్ట్రుడు పుట్టాడు; అంబాలిక ఇతన్ని చూసి భయపడి పాలిపోబట్టి పాలిపోయిన శరీరంతో పాండురాజు పుట్టాడు. ఈ సంతానం ఇటువంటిదని ఎరిగిన సత్యవతి, మళ్లీ కొడుకుని వేడుకోగా, వచ్చిన వ్యాసుడి దగ్గరికి అంబాలిక, ధైర్యంగా ఉన్న దాసిని పంపించడంతో మహావివేకి అయిన విదురుడు పుట్టాడు. పిల్లల వైనాన్నిబట్టి చూస్తే ఇదంతా మానసిక సంతానమే అని అర్థమవుతోంది. పాండురాజు భార్యకు అప్పుడే పిల్లవాడు పుట్టేశాడనే దుగ్ధతో ధృతరాష్ట్రుడి భార్య గాంధారి, గర్భంతో ఉన్న తన పొట్టను రాయితో చీల్చుకోవడంతో ఒక మాంస పిండం బయటపడింది. అప్పుడు వ్యాసుడే వచ్చి, ఆ మాంసపు ముద్దను వంద ముక్కలుగా చేస్తూ ఆవునేతి కుండల్లో పెట్టి, సాకేలాగ చేశాడు. ఆ పనిలో ఉండగా, గాంధారి, ‘ఒక కూతురు కూడా ఉంటే బాగుంటుంది’ అంటే, వ్యాసుడు మరోముక్కను విడదీశాడు. అలాగ దుర్యోధనాదులతో పాటు దుశ్శల అనే కూతురు కూడా పుట్టింది. ఆవునేతి కుండల్ని టెస్టుట్యూబులుగా ఉపయోగించిన పద్ధతిని కొంత మనం పరిశోధిస్తే ఆ పద్ధతేమిటో అర్థమవుతుంది. ఈ విధంగా కౌరవులకూ పాండవులకూ ఇతను తాతగారవుతాడు; భీష్ముడిగా ప్రసిద్ధికెక్కిన గంగాదత్తుడైన దేవపుత్రుడికి సోదరుడవుతాడు. మహాభారతంలో అవసరమైనప్పుడల్లా వచ్చి సలహాలనిచ్చి వెళ్తూ ఉంటాడు. ఒక స్త్రీ (ద్రౌపది) ఐదుగురికి ఆలిగా కావలసివచ్చినప్పుడు, అందులోని ధర్మసూక్ష్మాలను వివరిస్తూ రెండు పక్షాలవాళ్లనూ ఒడంబరిచినవాడు ఈయన. పాండవులకు ఎప్పటికప్పుడు ఏవిధంగా ముందుకు నడవాలో దిగ్దర్శనం చేసినవాడూ ఈయనే. యుద్ధంలో అభిమన్యుడు చిన్నవయస్సులోనే చనిపోయినప్పుడు ధర్మరాజూ అర్జునుడూ బెంబేలు పడి ఏడుస్తూ ఉంటే, వచ్చి ఓదార్చినవాడూ ఈయనే. వ్యాసుడికి పాండవులూ కౌరవులూ మనవళ్లే అయినా ఎవరిమీదా ఆయన వల్లమాలిన ప్రేమనూ చూపించడు, ద్వేషమూ కనబరచడు. రెండువైపుల వాళ్లకూ సలహాలనిస్తూ మంచిని చెబుతూ, చెడును తెగుడుతూ తన సర్వగురుత్వాన్ని నిలుపుకొన్నవాడు ఇతను. ఇతన్ని గురువనడానికి ఒక పెద్దకారణముంది. ఈ జగత్తులో ఉన్నదంతా ఎప్పుడూ ఒకేలా ఉండదు, క్షణక్షణమూ మారిపోతూ ఉంటుంది. అయితే, ఈ మార్పులన్నింటి వెనకా ఎప్పటికీ మారని తత్త్వం ఒకటి ఉంది. గాలుల వల్ల నీళ్లల్లో కెరటాలు పుడుతూ ఉంటాయి. కానీ ఆ కెరటాల రూపంలో ఉన్నవీ, వాటికి ఆధారంగా ఉన్నవీ అన్నీ ఒకే నీళ్లు. కెరటాలనూ కెరటాల వెనక ఉన్న నీళ్లనూ ఒకేసారి చూసి, ఇతరులకు చూపిస్తూ, కెరటాలు వేరూ, కిందనున్న నీళ్లు వేరూ అనే మోసంలో పడకుండా కాపాడే వాడే గురువు. వేడీ చలవా హాయీ బాధా మొదలైన జమిలి భావాలనూ, వేరువేరుగా అనిపించే వస్తువుల వెనకనున్న సత్యాన్ని సూక్ష్మదృష్టితో చూడగలిగిన వివేకాన్నీ ఆ మహాచైతన్యం ఏ భావంలో పొదిగిందో ఆ భావస్వరూపమే వ్యాసత్వమూ గురుత్వమూను. పరాశరత్వమంటే, గొప్పగా ఛిన్నాభిన్నం చేసే సామర్థ్యం. సత్యమనిపించే ఈ జగత్తులోని మార్పుల మాయనీ మోసాన్నీ వివేకంతో ఛిన్నాభిన్నంచేసి నిరూపించే తత్త్వమే ఈ వ్యాసగురుత్వం. సత్యవత్తుగా, అంటే, నిజం లాగే అనిపించే జడప్రకృతే సత్యవతి. గంగాదేవిని జ్ఞానప్రవాహ స్వరూపమైన ప్రకృతిగా ఇంతకుముందు చెప్పుకొన్నాం: స్వచ్ఛమైన ఆ ప్రకృతిని పరాప్రకృతి అని అంటారు. ఆ పరాప్రకృతే ఎదురుగుండా అవుపించని తన సంతానంతో ఈ సృష్టినంతనీ ధరించే జగద్ధాత్రి. తన రూపవిలాసాలతో మహర్షులక్కూడా రిమ్మతెగులు పుట్టించే మలిన ప్రకృతి అయిన సత్యవతే అపరాప్రకృతి. శాంతనుచైతన్యం ఈ సత్యవతీ ప్రకృతితో కలసి మంచీచెడుల జగన్నాటకాన్ని నడిపించడానికి నాందీ ప్రస్తావనలను చేసింది. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు Mb.No: 9000765972