పుట్టుక లేని పకీరు | Funday Sayipatham - antarvedam 6 | Sakshi
Sakshi News home page

పుట్టుక లేని పకీరు

Published Sun, Jun 24 2018 12:38 AM | Last Updated on Sun, Jun 24 2018 12:38 AM

Funday Sayipatham - antarvedam 6 - Sakshi

ఎవరిదైనా ఓ జీవిత చరిత్రని రాయాలంటే స్పష్టమైన ఆధారాలు లభించినప్పుడు మాత్రమే దాన్ని లోకానికి ప్రచారం చేయడం సరైన పని. అలా కాక ఆధారాల్లేకపోయినా ఏదో ఊహలతోనో, ఎవరెవరో చెప్పిన కట్టుకథలతోనో జీవిత చరిత్రలని గనుక రాస్తే నిజమైనదేదో, నమ్మాల్సిందేదోనన్న విషయం ఓ జీవితకాలంలో తెలియదు ఎవరికీ కూడా. రామకథకి వాల్మీకి రాసిన శ్రీమద్రామాయణమే ప్రమాణం అవుతుంటే, పూర్తిగా శ్రీమద్రామాయణాన్ని చదవని ఎందరో కొంత శ్రీమద్రామాయణంలోనిదీ, కొంత మరో రామాయణంలోనిదీ, మరికొంత అక్కడక్కడ హరికథల్లో విన్నదీ కలిపి చెప్పేస్తున్న కారణంగానే నేటికీ శ్రీమద్రామాయణం అసలు కథ ఏదో అది నూటికి  తొంభైమందికి తెలియకుండా పోయింది, కేవలం ఇలాంటివారి వల్ల. అలాగే, వ్యాసుడు రాసిన భారత భాగవత కథలు కూడా పూర్తిగా చదవనివారి కారణంగానే కల్పిత కథలతో ప్రచారమవుతూ నిజమైన కథ ఏదో తెలియకుండా పోయింది. కేవలం ఇలాంటివారి వల్లే.. ‘ధర్మసందేహాలు’ వస్తూనే ఉంటాయి ఓ జన్మకాలమంతా. దానిక్కారణం దేన్నీ సరిగా లోకానికి రానీయక పోయినందువల్ల. ఇలా చెప్తున్నారేమిటి? అని ప్రశ్నించేవారూ, అలా చెప్పడం సరికాదని ఎదురు తిరిగే వారూ లేకపోయినందువల్లనే.హేమాడ్‌ పంత్‌ ఒక బాధ్యతాయుతమైన మేజిస్ట్రేట్‌ పదవిని నిర్వహించినవాడైన కారణంగా తగిన సాక్ష్యాధారాలు, వీటితో పాటు ఎవరినుండైనా విన్న కొన్ని సమాచారాలుంటే వాటిలో నిజానిజాలెంతో పరిశీలించగల శక్తి ఉన్న తన బుద్ధితో విచారించి ఆ ప్రమాణబద్ధమైన అంశాలు కలిపి సాయి పుట్టింది ఎప్పుడు? ఎక్కడ? ఎలా? అనే విశేషాలని తేల్చగలిగాడు.

సాయి మొదటి దశ
అది 1854వ సంవత్సరం. షిర్డీ గ్రామానికి వెలుపల, అంటే పొలిమేర అనుకోవచ్చు. అక్కడో పెద్ద వేపచెట్టుండేది. దాని కిందే సాయి ఉండేవాడు. అప్పటికి ఆయన 16 సంవత్సరాల వయసువానిగా కన్పించాడు అందరికీ. అంటే ఆయన పుట్టినది 1838వ సంవత్సరం అయ్యుండచ్చు.ఎప్పుడూ ఆ చెట్టు కిందే బస. ఓ రాత్రి లేదు, ఓ పగలు లేదు, ఓ ఎండ అనీ లేదు, ఓ వాన అనీ లేదు, ఓ చలి అనీ లేదు. అక్కడే అక్కడే అక్కడే. షిర్డీ గ్రామానికి వస్తూండేవారూ పోతుండేవారూ ఏవేవో వృత్తులు చేసుకుంటూండేవారూ గానీ, ఎందుకు ఈ బాలుడు ఇలా కూర్చున్నాడో ఎవరికీ కనీసం తెలుసుకుందామని కూడా అనిపించలేదు. అడిగిన వారు కూడా లేరు.కొన్నాళ్లిలా గడిచాక, ముస్లిం పద్ధతిలో కనిపిస్తున్న ఆ బాలుణ్ని గమనించాక, ఎప్పుడూ అల్లానామాన్నే జపిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమయ్యాక, ఎవరో ఒకామె తన పుత్రికని తీసుకొచ్చి, తన పాప కండ్ల కలకతో బాధపడుతోందని నమస్కరించి చూపించింది. సాయి టక్కున లేచి కొంతదూరంలో ఉన్న చెట్టువద్దకెళ్లి పసరు తీసి ఆమె కళ్లలో వేసాడు. మరురోజుకి తగ్గింది.అంతే! ఆ మరునాడు మరో ఇద్దరొచ్చారు. ఈ వ్యాధీ ఆ వ్యాధీ అంటూ ఎవ్వరొచ్చినా మాట్లాడే ధోరణే లేదు. వినడం, ఏ చెట్టు ఏ తీగ అనే దాన్ని చూసుకోవడం, టక్కున లేచి కొంత దూరం వెళ్లి తేవడం, ఆ పసరుని నోటిలోనో, గాయంపైనో వేసి ఆ వ్యాధి తగ్గేట్టుగా వైద్యం చేయడం, పంపించివేయడం ఇలా జరిగేది. దీంతో ఐదుగురు పది మందిగా, పదిమంది వందగా అయిపోయారు. ఇలా జనం పెరుగుతున్నా ఆయనకి విసుగు, విరామం లేకుండా వైద్యం చేస్తూనే ఉండేవారు. అప్పుడైనా ఏ ఒక్కరికీ ఇంతటి వైద్యం చేసిన ఆయన్ని ఏ ఇంటిలోకో, వసారాలోకో ఉండవలసిందిగా పిలుద్దామని, నిత్యం భోజనాన్ని సమకూరుద్దామని వాళ్లకీ అనిపించలేదు. ఈయనకు కూడా అడుగుదామనే ఆలోచన ఏమాత్రమూ లేదు. ఆయన వివరాలని ఎవరూ అడిగిందీ లేదు. ఈయన చెప్పిందీ లేదు. 

ఈయనది ఏ మతం?
జనసంఖ్య పెరగడంతో మెల్లగా ఈయన గురించిన వివరాల్లోకి ఆలోచనలు సాగాయి.ఫకీరు రూపంలో ఉన్నాడు కాబట్టి, మసీదు గోడకి ఆనుకుని కూర్చున్నాడు కాబట్టి, మధ్యమధ్యలో పైకి ‘అల్లాహ్‌మాలిక్‌’ (అల్లాయే నా జీవిత యజమానీ దైవం కూడా) అంటూ ఉన్నాడు కాబట్టి... ఈయన ముస్లిం మాత్రమే అని కొందరు ఓ నిర్ణయానికొచ్చేశారు. పైగా మహమ్మదీయులకి ఇలాంటి పసరు వైద్యాలు, తాయెత్తులు, దిష్టి తొలగించే వైద్యాలు వంశ పరంపరగా వస్తూంటాయి కాబట్టి కూడా ఈయన ముస్లిమే అనే నిశ్చయం చేసుకున్నారు.అయితే మరికొందరు మాత్రం సాయి చెవులు రెంటికీ ఉన్న చిల్లుల్ని చూసి ఇవి హిందూధర్మం ప్రకారం ఉపనయనం (ఒడుగు) కార్యక్రమంలో చేయబడే సంస్కారాలు చెవులు కుట్టడం (కర్ణవేధ) అలాగే పుట్టువెండ్రుకల్ని తీసివేయడం (చౌలం) అనేవి స్పష్టంగా కనిపిస్తున్న కారణంగా హిందువేననే నిర్ణయానికొచ్చేశారు.కొద్దిగా పరిచయమయ్యాక మాటలు దొర్లుతాయిగా! బాబూ! నీ బస ఎక్కడ? ఇక్కడే కనిపిస్తూ ఉంటావని అడిగితే ఆ మసీదు చూపిస్తూ ‘అదుగో! ద్వారక నా నివాసమన్నట్లు చూపించాడు. చనువుతో మసీదులోపల తిరిగి చూస్తే మహమ్మదీయ విధానానికి విరుద్ధంగానూ, హైందవ ధర్మానికి అనుగుణంగానూ ‘తులసిమొక్క’ కనిపిస్తోంది. అదేదో తనంత తాను పెరిగింది కాదు. పెంచబడుతూన్న ధోరణి కనిపిస్తోంది. మరి కొద్దికాలమయ్యాక ‘నువ్వెవరివి?’ అని అడిగితే కొందరితో రాముడిననీ, మరికొందరితో కబీరుననీ, ఝాన్సీ లక్ష్మీబాయ్‌ కొలువులో సిపాయిననీ, బట్టలని నేస్తూ ఉండేవాడిననీ... ఇంకా విచిత్రంగా మహాలక్ష్మిననీ... ఇలా చెప్తుంటే ఆశ్చర్యపడేవారు అందరూ. అయినా మన రోగాలన్నీ నయమవుతూంటేనూ, ఈ కుర్రవాడు ఏ సొమ్మునీ తీసుకోకుండా చిటికెలో వైద్యం చేస్తుంటేనూ, వయసులో స్త్రీలందరినీ ఎంతో గౌరవ మర్యాదలతో సభ్యదృష్టితోనే చూస్తున్న కారణంగానూ మనకి ఇతర వివరాలెందుకనుకుంటూ వాళ్లంతా ఏనాడూ ఈయన గురించిన లో వివరాలకి పోలేదు. ఒకవేళ వివరాలని ఆయన చెప్పినా అవి అర్థమయ్యేవి కాదు. ఇలా అన్నింటినీ జోడించుకు చూసుకుంటే లౌకికంగా ఆయన ఓ పిచ్చివానిలా అనిపించేవాడు కూడా. అలా ఆయన్ని పిచ్చివాడుగా అనుకోవడానికి ఇష్టముండేది కాదు. మనసు అంగీకరించేది కాదు. ఇతరులకి ఈయన గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో తెలిసేదీ కాదు.ఇదిలా ఉండగా ఓసారి సాయిని ధులియా అనే ఊళ్లో మేజిస్ట్రేటు కోర్టులో ఎవరి వ్యాజ్యంలోనో సాక్షిగా విచారించవలసి వచ్చింది. అప్పుడు సాయిని గురించి ప్రశ్నా సమాధానాలు ఇలా ఉన్నాయి.

‘‘నీపేరు?’’‘‘బాబా.’’‘‘నీ తండ్రి పేరు?’’‘‘బాబా.’’తండ్రీకొడుకుల పేర్లు ఒకలానే ఎందుకుంటాయి? అని ఒక్కక్షణం మేజిస్ట్రేటు ఆశ్చర్యపడినా తన బాధ్యత చెప్పింది రాసుకోవడం మాత్రమే కాబట్టి, ఇంకా ఏదైనా అడిగితే అది న్యాయస్థాన నియమాలకి వ్యతిరేకం కాబట్టి అలాగే నమోదు చేశాడు.‘‘సరే! నీ మతం ఏమిటి?’’‘‘కబీరు మతం.’’‘‘ఏ కులం నీది?’’‘‘దేవుడి కులం’’‘‘ఇంకా ఏమైనా నీ వివరాలని చెప్తావా?’’‘‘నేను అనసూయాదేవిని, మహాలక్ష్మిని.’’మేజిస్ట్రేటు మారు మాట్లాడక ‘వెళ్లవచ్చు’నన్నట్టు చూశాడు. చిత్రమేమంటే మేజిస్ట్రేటు ఎక్కడా కూడా ‘నీ ఊరేది?’ అని అడగలేదు. సాయి చెప్పలేదు కూడా.షిర్డీకి వంద మైళ్ల దూరంలో పత్రి అనే గ్రామం ఉంది. ఆ ఊళ్లోనే సాయి పుట్టాడనే ఓ వదంతి ఉంది. ఆ దిశగా పరిశీలించారు కొందరు మేధావులు.జన్మస్థలం ‘పత్రి’కాదుసహజంగా ఎవరైనా ఎక్కడైనా పుడితే ఆ విషయం తెలియకుండా ఉండదు. పుట్టాడు అనగానే తల్లి, తండ్రి, మేనత్త, మేనమామ, ఇతర బంధువులు, ఆప్తులూ తిరిగిన ప్రదేశం చదువుకున్న బడీ, లేదా పనిచేసిన పొలం... ఇలా ఏవో కొన్ని వివరాలు తప్పక ఉంటాయి. ఒకరికి కాకపోతే మరొకరికైనా తెలిసి తీరుతాయి కదా! నిజంగా సాయే గనుక పత్రి గ్రామంలోనే పుట్టి ఉండి ఉంటే, ఆ గ్రామం షిర్డీకి కేవలం వంద మైళ్ల దూరంలోనే ఉంది కాబట్టి, ఆ ఊరి ప్రజలు ఇక్కడికీ, ఇక్కడివారు అక్కడికీ ఏవో వృత్తి వ్యాపారాల మీద తిరుగుతూనే ఉంటారు కాబట్టి ఈ నిజం తప్పక బయటపడి ఉండేదే తగిన సాక్ష్యాధారాలతో. ఒక వ్యక్తి జన్మించాడంటే పైన అనుకున్న తీరుగా ఏ కొందరో బంధువులు తప్పనిసరి కాబట్టి, నేరుగా షిర్డీలో మసీదు గోడనానుకుని కూర్చుని ఉన్న సాయి దగ్గరకే వచ్చి, ఈ పత్రి గ్రామం, జన్మస్థలం... వ్యవహారాన్ని చెప్పి ఉండకపోవచ్చును గానీ, ఏ ఒక్కరో అయినా ఆ నోట ఈ నోట ఫలానివారికి కలిగిన కుర్రవాడు, వాని లక్షణాలు ఇవీ, వృత్తి ఇదీ, ఇల్లు ఇదీ.. అంటూ చెప్పకుండా ఉండగలరా?

పోనీ! ఎవరికైనా జన్మస్థలం జన్మనిచ్చిన తల్లి అతిముఖ్యులు కాబట్టి, తన తల్లిపేరునీ ఊరిపేరునీ సాయి ఎక్కడైనా చెప్పాడా? చెప్పుకున్నాడా? పదిమందిలో చూచాయిగానైనా అన్నాడా?.. అని పరిశీలిస్తే ఎక్కడా కూడా ఆ ప్రస్తావనే రాలేదు ఆయననుండి. పోనీ! ఏ ఊరు పేరూ గుర్తింపూలేని వ్యక్తుల విషయంలోనైతే సమాచారం తెలియకపోవచ్చుననుకోవచ్చు గానీ, ఇందరు రోగులకి రోగ బాధని నయం చేస్తూనూ, ఒంటరిగా ఉంటూ ఎవరి జోలికీ పోకుండా ఇంత చిన్నవయసులో ఇంత సభ్యతతో ఉంటూ కనిపిస్తూంటేనూ, ఏమీ ఆశించకుండానూ ఏం తింటున్నాడో ఎలా జీవనాన్ని గడుపుతున్నాడో ఎవరికీ తెలియని రీతిలో ఉంటూంటేనూ ఆయన గురించి సమాచారం వంద మైళ్ల దూరంలో ఉన్న ‘పత్రి’ గ్రామవాసులకి తెలిసి ఉండదా?ఇదంతా ఒకెత్తూ... సాయికి బాగా దగ్గరగా ఉండే వారైన నానాదీక్షిత్, అలాగే బూటీ... మరికొందరికీ సాయి చెప్పి ఉండడా? లేక వీరు అడిగి ఉండరా? తెలిసి ఉండదా? వాళ్లెవరూ సాయిది ‘పత్రి’ గ్రామమనకపోవడంతో పాటు అసలు ఆయన జన్మస్థలం గురించిన ప్రస్తావననే తేకపోవడం మరొకెత్తూను.సాయి ఇంకా ఈ లోకంలో ఉండగానే ‘ఖండోబా’ అనే గ్రామదేవత ఆలయంలో అర్చకునిగా ఉంటున్న ‘మహల్సాపతి’ అనే ఆయన సాయిమీది విశేష భక్తితో అనేక పర్యాయాలు సాయికీర్తనలని రాగయుక్తంగా పాడాడు కదా! ఆయన కూడా ఎక్కడా ఏనాడూ ఏ చోటా సాయి ఎక్కడ పుట్టాడనే విషయాన్ని గానీ, విశేషించి ‘పత్రి గ్రామం’ పేరుగాని ఎత్తనే లేదు.మరి ఈ జన్మస్థలం గురించిన ఈ చర్చ అపోహలకి కారణం ఒక్కటే. ‘ఖండోబా’ అనే గ్రామదేవత ఆలయంలో అర్చకునిగా పనిచేస్తూండే ‘మహల్సాపతి’ అనే ఆయన ఒక పెన్సిలుతో ఒక కాగితం మీద ‘సాయి షిర్డీ సమీపంలోని పత్రి గ్రామంలో పుట్టాడు’ అని రాసి ఉండడమే. ఈ రాతకి ఏ మాత్రం ఆధారం లేనే లేదు.

ఏతావతా తేలిందేమంటే మనం చెప్పుకోబోయిన కథ చెప్పుకున్న మన సాయి కథా ‘కంచికి వెళ్లకుండా మళ్లీ అనగనగా... అంటూ కథ ప్రారంభానికే వచ్చేసిం’దని. దీన్ని బట్టి సప్రమాణంగా తెలిసేదేమంటే... సాయి జన్మస్థలం, తల్లిదండ్రులు, సాయి పేరు, సాయి మతం, సాయి బాల్య విశేషాలు, సాయి చేసే వృత్తి.. ఇలా ఏమీ కూడా ఇప్పటివరకూ తెలియనే తెలియవనీ, తెలియడం కోసం ప్రయత్నించిన అందరికీ కూడా అంతుబట్టనే లేదనీను.ఇదంతా ఇలా ఉంచి ఆయన్ని అడిగితే ఏం చెప్తాడోనని ఆలోచించి, చివరి ప్రయత్నంగా ఆయన్ని గురించిన వివరాలని ధైర్యం చేసి ఆ సాయినే అడిగితే ఆయన, చిరునవ్వుని మౌనంగా నవ్వి మరో పక్కకి తొలిగిపోయేవాడు కూడా.ఊరు, పేరూ వివరాలూ లేకుండా ఉండడం సాధ్యమా?పైన చదివిందాని ప్రకారం సాయి ఊరూ పేరూ వివరాలూ.. ఇలా ఏమీ తెలియవీల్లేదని అనుకున్నా, అలా ఉండడం సాధ్యమా? అనే సందేహం మనకి వస్తుంది. అలా రావడం తప్పుకాదు కూడా.ఇప్పుడు యథార్థాన్ని తెలుసుకుందాం!సాయి మనలా ఒక కులానికీ, మతానికీ సంప్రదాయానికీ చెందిన వాడు కాదు. అందుకే కులాన్ని గురించి అడిగితే దేవుడికులమని, మతాన్ని అడిగితే కబీరు మతమనీ అన్నాడు. సంప్రదాయం గురించిఎవరూ అడగకున్నా.. వేషం ప్రకారం మహ్మదీయం, తులసి మొక్క నాటడం, నిత్యం అగ్నిహోత్రాన్ని చేసే సంప్రదాయం(ధుని) అలాగే మసీదుని ద్వారక అనడం ప్రకారం హైందవమనీ తెలియజేసుకున్నాడాయన.తాను పుట్టిన 16 సంవత్సరాల వరకూ ఏ ఉనికీ లేకుండా అకస్మాత్తుగా వెలుగులోకి రావడం ప్రకారం ఆయన ఏదో ఓ ఘనకార్యాన్ని లోకానికి చేయదలిచి వచ్చినవారే అని అర్థమవుతుంది.

దీనికి బలమైన ఆధారం కూడా ఒకటుంది! లోకంలో అందరికీ ఈ అకస్మాత్తుగా ఊడిపడ్డ సాయిని గురించిన అనుమానం కలిగి షిర్డీగ్రామంలో ఉన్న గ్రామదేవతకి జరిగే ఉత్సవాల్లో ఓ రోజున ఈయనని గురించి తెలుసుకోవాలనుకున్నాడు.ఆ రోజుల్లో యథార్థమైన ‘పూనకాలు’ ఉంటూండేవి. ‘పూనకం’ అంటే ఒక దైవశక్తి. నిత్యం ఆ దేవిని ఉపాసిస్తూండే ఒక వ్యక్తిలోనికి ప్రవేశించడమని అర్థం. అలా దైవశక్తి ఈలోనికి ఆవహించిన వేళ, అలా ఆవహింపబడిన వ్యక్తికి బాహ్యస్పృహా స్మృతీ ఉండవు. అంటే తానెవరో, ఎక్కడ నుంచి వచ్చాడో, తన వివరాలేమిటో తనకి తెలియవు. కేవలం ఆ దేవీ స్మృతీ స్పృహలోనే ఉంటారు.అలాంటి పూనకం వచ్చిన వ్యక్తిని అక్కడి ప్రజలంతా ఈ 16 సంవత్సరాల బాలుని గురించి చెప్పవలసిందిగా కోరారట. అంతే! ఒక గునపం తెమ్మని చెప్పి ఒక ప్రదేశాన్ని చూపించి తవ్వవలసిందన్నాడు ఆ పూనకం వచ్చిన వ్యక్తి. కొద్దిగా తవ్వగా ఒక బండరాయి కనిపించింది. ఆ రాతిని తొలగించి చూస్తే నాలుగు దీపాల ప్రమిదలూ కన్పించాయి. అంతేకాదు, అప్పుడే పూజ చేసి ఎక్కడికో వెళ్లిన తీరులో పూజాద్రవ్యాలూ పూజ చేసిన విధానాలు కనిపించాయి అందరికీ. ‘‘ఈ బాలుడు 12 సంవత్సరాలు ఈ నేలమాళిగలో తపస్సు చేశాడు. ప్రతి నిత్యం ఇలా చేస్తూ పైకి వస్తూంటే అక్కడి జనమంతా అనవసర ప్రశ్నలతో బాధిస్తుంటే, ఆ ప్రదేశాన్ని విడువబోతూ ఈ బండని కప్పి.. దయచేసి ఈ ప్రదేశాన్ని పాడుచేయకండి అని ప్రార్థించి వెళ్లిపోయాడు’’ అని చెప్పాడు పూనకం వచ్చిన వ్యక్తి.అంటే దాదాపు 1838లో జన్మించిన సాయి 1842 లో (నాల్గవ సంవత్సరంలో) తపస్సు ప్రారంభించి 12 ఏళ్ల పాటు తపస్సు చేసి 1854లో షిర్డీ పొలిమేర జనులందరికీ కనిపించాడన్నమాట. అక్కడి నుంచిమరో నాలుగు సంవత్సరాల పాటు సాయి ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు. పోనీ! ఇంత గొప్పవాడు సాయి అనే అభిప్రాయంతో ఆ గ్రామదేవత అయిన ఖండోబా ఆలయంలో ఎక్కడో ఒక చిన్న గదినైనా సాయికి ఇయ్యగలిగారా ఎవరైనా? అంటే ఈయన హైందవధర్మానికి చెందినవాడు కాదు గదా! అని ఆ ఆలయ అర్చకుడు ‘మహల్సాపతి’తో పాటు అందరూ నిరాకరించారు ఇవ్వడానికి, లేదా మౌనంగా ఉండిపోయారు. చిత్రమేమంటే ఆయన 1858లో తిరిగి షిర్డీకి రాగానే ఆయన ప్రతిభ ప్రారంభమయింది. ఆయనకి పేరు పెట్టడంతో సహా లీలలన్నీ జనులకి ఒకటొకటిగా తెలియసాగాయి. తన పాదాలనుండి ‘దాసగణు’ అనేమహాభక్తునికి గంగా యమునా నదీ ధారలని చూపించాడు సాయి. ఎలాగో చూద్దాం.
∙డా. మైలవరపు శ్రీనివాసరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement