కాశీని శపించబోయిన వ్యాసుడు,ఆ తర్వాత ఏం జరిగిందంటే.. | When Vyasa Tries To Curse Kashi What Happen Next | Sakshi
Sakshi News home page

కాశీని శపించబోయిన వ్యాసుడు,ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Published Fri, Oct 13 2023 3:35 PM | Last Updated on Fri, Oct 13 2023 3:44 PM

When Vyasa Tries To Curse Kashi What Happen Next - Sakshi

విశాలాక్షీ సమేతుడైన విశ్వనాథుడు కొలువుదీరిన కాశీ నగరంలో కొంతకాలం గడుపుదామని భావించి, శిష్యగణాన్ని వెంటబెట్టుకుని అక్కడకు చేరుకున్నాడు. ఆయన వెంట వచ్చిన శిష్యులలో వైశంపాయనుడు, జైమిని, పైలుడు, సుమంతుడు సహా ఎందరెందరో మహామహులు ఉన్నారు. కాశీలో వ్యాసుడు ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. రోజూ వేకువ జామునే కాలకృత్యాలు తీర్చుకుని, గంగలో స్నానం చేసి, సంధ్యవార్చి, ఆశ్రమంలో అగ్నికార్యం, అనుష్ఠానం పూర్తయ్యాక మధ్యాహ్నం భిక్షాటన కోసం ఊళ్లో తలోదారిన బయలుదేరేవారు. కాశీలో వారికి భిక్షకు లోటు ఉండేది కాదు.

రోజులు ఇలా గడిచిపోతుండగా, విశ్వేశ్వరుడికి వ్యాసుణ్ణి పరీక్షించాలనిపించింది. ‘వ్యాసుడి అంతరంగం ఎలాంటిదో తెలుసుకుందాం. అతడికీ, అతడి శిష్యులకూ ఎక్కడా భిక్ష పుట్టకుండా చేయి’ అని విశాలాక్షితో చెప్పాడు. ఆమె సరేనంది. మరునాడు వ్యాసుడు, అతడి శిష్యులు యథాప్రకారం భిక్షాటనకు బయలుదేరారు. విశాలాక్షి ప్రభావంతో ఏ ఇల్లాలికీ భిక్ష పెట్టే ఇచ్ఛ లేకుండాపోయింది. వ్యాసుడు ఇల్లిల్లూ తిరుగుతూ గుమ్మం ముందు నిలబడి ‘భిక్షాందేహి’ అని గొంతెత్తి పిలిచినా, కొందరు గృహస్థులు కనీసం తలుపులైనా తీశారు కాదు. వ్యాసుడికి ఎదురైన అనుభవమే అతడి శిష్యులకూ ఎదురైంది. కాలే కడుపులతో, ఖాళీ భిక్షపాత్రలతో ఒక్కొక్కరే ఆశ్రమానికి చేరుకున్నారు. 

‘నాకు ఎక్కడా ఒక్క మెతుకైనా పుట్టలేదు. మీలో ఎవరికైనా భిక్ష దొరికిందా?’ శిష్యులను అడిగాడు వ్యాసుడు. ‘లేదు గురుదేవా! ఎవరూ మాకు భిక్ష వేయలేదు’ బదులిచ్చారు శిష్యులు. వ్యాసుడు, అతడి శిష్యులు కడుపులో కాళ్లు ముడుచుకుని పస్తు పడుకున్నారు. మర్నాడు వేకువనే నిద్రలేని స్నాన సం«ధ్యాది నిత్య నైమిత్తిక అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుని మళ్లీ భిక్షకు బయలుదేరారు. ఎక్కడా భిక్ష పుట్టలేదు. సాయంత్రం అయ్యే సరికి అందరూ నీరసంగా ఆశ్రమానికి చేరుకున్నారు. ఒక రోజు రెండు రోజులు కాదు, వరుసగా ఏడు రోజులు వ్యాసుడికి గాని, అతడి శిష్యులకు గాని కాశీ నగరంలో ఎక్కడా భిక్ష పుట్టలేదు.

విశాలాక్షీ సమేతుడైన విశ్వేశ్వరుడు కొలువైన కాశీ నగరంలో ప్రతి ఇల్లాలూ ఒక అన్నపూర్ణ అని లోకం చెప్పుకుంటుంటే, తనకు తన శిష్యులకు ఇలా ఉపవాసాలు ఎదురవడం ఏమిటని వ్యాసుడు అమితంగా బాధపడ్డాడు. ఎనిమిదో రోజు వ్యాసుడు, అతడి శిష్యులు నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకుని, కాశీలో కొలువుదీరిన దేవతలందరికీ నమస్కారాలు పెట్టుకుని భిక్షకు బయలుదేరారు.  వ్యాసుడికి ఒక్క ఇంటా భిక్ష దొరకలేదు. వరుస ఉపవాసాలతో వ్యాసుడు వ్యాకుల పడ్డాడు. తన శిష్యుల దురవస్థ తలచుకుని దుఃఖించాడు. అతడికి సహనం నశించింది. ఉక్రోషం ముంచుకొచ్చింది.

నడివీథిలో తన భిక్షపాత్రను రాళ్లకేసి కొట్టి పగులగొట్టాడు. కాశీ వాసులకు మూడు తరాల వరకు విద్య, భక్తి, ధనమూ లేకుండా పోవాలని సంకల్పిస్తూ, కమండలం నుంచి శాపజలం అందుకోబోయాడు. వణుకుతున్న చెయ్యి ముందుకు రాకుండా నిలిచిపోయింది. అప్పుడే ఆ వీథిలోనున్న ఒక ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. సర్వాభరణ భూషితురాలైన ఒక నడివయసు స్త్రీ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది. ‘ఓ బ్రాహ్మడా! ఏమిటీ అఘాయిత్యం! కోపం మాని ఇలా రా’ అని పిలిచింది. ఆమె పిలుపుతో వ్యాసుడు తెప్పరిల్లాడు. ఆమె ఎవరో కనుక్కోకుండానే అప్రయత్నంగా నమస్కరించాడు. 

‘భిక్ష దొరకనంత మాత్రాన కాశీ నగరాన్ని శపించేయడానికి సిద్ధపడ్డావే! ఇది నీకు విశ్వేశ్వరుడు పెట్టిన పరీక్ష. ఇదేనా నీ ధీరత్వం? ఏడురోజులు భిక్ష దొరకనంత మాత్రానికే నీ స్థైర్యం సడలిందేం?’ అని మందలిస్తూ, ‘మధ్యాహ్నానికి వస్తే, భిక్ష పెడతాను’ అంది. ‘తల్లీ! నన్నొక్కణ్ణేనా? నా శిష్యులను కూడానా? నాతో పాటే వాళ్లూ వారం రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు’ అన్నాడు వ్యాసుడు.‘గంగ వద్ద మధ్యాహ్న పూజలు ముగించుకుని అందరూ రండి. కడుపు నిండా భోజనం పెడతాను’ అందామె. మధ్యాహ్నం వెళ్లగానే విస్తర్లు వేసి, అందరూ ఆపోశనలు పట్టండని చెప్పింది. విస్తర్లు ఖాళీగా ఉన్నాయి. ఆపోశనలు పట్టగానే విస్తర్లలో ఎవరికి ఇష్టమైన పదార్థాలు వారికి ప్రత్యక్షమయ్యాయి.

ఈమె సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అయి ఉంటుందనుకుని అందరూ తృప్తిగా భోజనం చేశారు. భోజనాలు పూర్తి చేసి విశ్రమిస్తుండగా, పార్వతీ సమేతంగా శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పార్వతీదేవి ప్రశాంతంగానే ఉన్నా, శివుడి ముఖం కోపంతో చిరచిరలాడుతూ ఉంది. శివుడు వ్యాసుణ్ణి కోపంగా చూస్తూ ‘ఓరీ దుర్మార్గుడా! నా భార్యలాంటి కాశీ నగరానికే శాపం ఇవ్వబోతావా? నువ్వు కాశీలో అడుగు పెట్టడమే ద్రోహం. నువ్వూ నీ శిష్యులూ కాశీ పొలిమేరలు దాటి వెళ్లండి’ అన్నాడు. చేసిన తప్పుకు బాధపడుతూ వ్యాసుడు శిష్యులతో సహా కాశీ నగరాన్ని విడిచిపెట్టాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement