మాతా... వందనం | Special Storys On Chaganti koteswar Rao Pravachanlu | Sakshi
Sakshi News home page

మాతా... వందనం

Published Sun, Dec 29 2019 1:06 AM | Last Updated on Sun, Dec 29 2019 1:06 AM

Special Storys On Chaganti koteswar Rao Pravachanlu - Sakshi

95 ఏళ్ళు వచ్చాయి. ఒళ్ళు బాగా ముడతలు పడిపోయింది. బొమ్మలా చిన్నదిగా మంచంలో ముడుచుకుని పడుకుని ఉంది. రాత్రి 11 గంటలకు కొడుకు ఇంటికి వచ్చి భోజనానికి కూర్చుని రెండు నిమిషాల్లో లేచి పోయాడు. పక్కగదిలో పడుకుని ఉన్న అమ్మ కొడుకుని పిలిచి ‘‘నాన్నా, రెండుమూడు రోజుల్నించి ఇలాగే వస్తున్నావురా, రెండు మూడు నిమిషాల్లో భోజనం ముగించేస్తునావురా... ఇలా అయితే ఆరోగ్యం ఎక్కడ నిలబడుతుందిరా?’’ అంటుంది. వడ్డించక్కరలేదు. వాడు కంచం దగ్గరినుంచి లేచిపోయిన సమయాన్ని బట్టి తల్లి తల్లడిల్లిపోతుంది. దురదృష్టం అంటే... జీవితంలో అమ్మ పోయిననాడే. అమ్మ ఉన్నన్నాళ్ళూ ఓదార్పుకు లోటులేదు. 60 ఏళ్ళు దాటిన కొడుకయినా జ్వరం వచ్చిందని తెలిసి వాడిని దగ్గరికి పిలిచి బొటన వేలితో విభూతి పెట్టి ‘‘చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం’’ అంటూంటే అమ్మ దగ్గర లభించిన ఆ ఓదార్పు ప్రపంచంలో మరెక్కడయినా లభిస్తుందా? అమ్మ శరీరం పడిపోయిన తరువాత అమ్మ కట్టి విప్పిన చీరలను బొంతగా కుట్టుకుని పడుకున్నా సేదదీరుతుంది. అమ్మ కట్టివిప్పిన బట్టకు కూడా అంత ప్రేమ. అది కూడా అంత ఓదార్పునిస్తుంది.

అమ్మవేసుకుని విప్పిన చెప్పులు, కళ్ళజోడు వాటిని చూసేటప్పటికి మనసు ఆర్ద్రతను పొందుతుంది. అమ్మలాంటి వ్యక్తి ఈ సృష్టిలో ఉండదు. అందుకే జగన్మాత అంతటిది కూడా తల్లిని తీసేయవలసి వస్తే బెంగపెట్టుకుంటుందట. వీడు ఇక అమ్మా అని పిలిస్తే నేనేమని జవాబు చెప్పాలి. అలాగని అమ్మచేతిలో బిడ్డ వెళ్ళిపోవడం మర్యాద కాదు. బిడ్డచేతిలో అమ్మే వెళ్ళిపోవాలి. ఒక్క అమ్మను నేను నీ నుండి తీసేయాల్సి వస్తే ముగ్గురు అమ్మలను చూపించి అప్పుడు తీసేసుకుంటానంటుందట. ‘ఒరేయ్, నేను నీకు భూమాతనిచ్చాను. ఈ తల్లి కూడా తల్లే. నువ్వు ఎక్కడున్నా ఈ అమ్మ ఒడిలోనే ఉంటావ్‌’ అని ఈ అమ్మనిచ్చింది. తరువాత దేశమాత. ఈ దేశానికంతటికీ అధిష్ఠానం ఉంది. అది దర్శించారు దేశభక్తులు. ఇది ఈ దేశ రుషి సంప్రదాయం. ఇది కేవలం మట్టి అని వాళ్ళు అనలేదు. ‘వందేమాతరం వందేమాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందేమాతరం’ అన్నాడు బంకించంద్ర ఛటర్జీ.

ఒక వాల్మీకి, ఒక వ్యాసుడు ఎటువంటి వాడో నా దృష్టిలో బంకించంద్ర ఛటర్జీ కూడా అటువంటివాడే. అలా దేశాన్నంతటినీ కూడా ఒక తల్లిరూపంగా చూసి ఆరాధించాడు మహానుభావుడు. అలా భూమాతను, దేశమాతను, గోమాతను ఇచ్చాను. అంత వృద్ధాప్యంలో కూడా పుట్టినరోజునాడు వణికిపోతున్న చేతుల్తో  తలమీద చెయ్యిపెట్టి అక్షింతలు వేసి లడ్డు చేతిలో పెట్టి తిను అనడం కాదు, ఏదీ నోరు తెరు అని నోటిలో పెట్టి నువ్వు తింటూ ఉంటే సంతోషపడే అమ్మ లేదని రేప్పొద్దున నన్ను నింద చేస్తావేమో, అందుకే నీకు గోమాతని ఇస్తున్నాను’’అంటుందట జగన్మాత. ‘‘పుట్టినరోజునాడు ఆవుపాలు తాగు. అవి తాగితే ఎప్పటికీ నీవు అమ్మ చేతి ముద్ద తిన్నవాడివే అవుతావు’’అని ఒక్క అమ్మను తీసుకోవలసి వస్తే ముగ్గురు అమ్మల్ని చూపించి... ఆ పైన...‘మీ అమ్మ ఎక్కడో లేదు.. నాలోనే చేరింది. నా దగ్గరకు వచ్చి నీవు చేసిన నమస్కారం మీ అమ్మకే అందిస్తా’ అంటుందట. అమ్మ అన్నమాట అంత గంభీరం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement