భూరిశ్రవసుడు | This story about Bhurisravasudu | Sakshi
Sakshi News home page

భూరిశ్రవసుడు

Published Sat, Feb 20 2016 11:23 PM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM

భూరిశ్రవసుడు

భూరిశ్రవసుడు

ఐదోవేదం : మహాభారత పాత్రలు - 35
భూరిశ్రవసుడు అర్జునుణ్ని ఆడిపోసు కోవడం మొదలుపెట్టాడు;  
అస్త్ర ధర్మాన్నెరి గిన నువ్వు నీతో యుద్ధం చేయని నా కుడిచేతిని కొట్టెయ్యడం ఏ రకమైన ధర్మం? వాసుదేవుడి మాట విని నువ్వు ఈ నికృష్టమైన పని చేశావని తెలిసిపోతోంది. నువ్వు కృష్ణ సఖుడివి కాకపోతే ఈ పని చేసేవాడివి కావు’ అని అర్జునుణ్ని తప్పు బట్టడమే కాకుండా కృష్ణుణ్ని కూడా దూషించాడు.
 
 
భూరిశ్రవసుడు భీష్ముడికి వరసకు మనవడవుతాడు. భూరిశ్రవసుడికి భూరి దక్షిణుడనీ యూపకేతువనీ యజ్ఞశీలుడనీ పేర్లు ఉన్నాయి. యజ్ఞంలో బలిపశువును కట్టే స్తంభాలను యూపస్తంభాలని అంటారు. ఆ యూపస్తంభాన్నే తన రథానికి ధ్వజంగా చేసుకున్నాడు ఈ కర్మప్రతీకుడు. యజ్ఞ కర్మల్లో ఎక్కువగా దక్షిణలిచ్చేవాడు గనక ఇతన్ని భూరి దక్షిణుడని కూడా అంటారు.
 
భూరిశ్రవసుడి పుట్టుక వెనుక ఒక కథ ఉందని చెబుతారు. వసుదేవుడికి కాబోయే భార్య అయిన దేవకికి స్వయంవరం చేసి నప్పుడు, శిని అనే వృష్ణి వర్గంవాడు, ఆమెను తెచ్చి వసుదేవుడికిచ్చి పెళ్లిచేద్దా మని ఆవిణ్ని తీసుకొని వస్తున్నాడు. తోవలో ఆ పనికి సోమదత్తుడు అడు ్డపడ్డాడు. శినీ సోమదత్తుడూ పోట్లాడు కున్నారు. ఓడిపోయిన సోమదత్తుణ్ని శిని చంపకుండా తన్ని అవమానపరిచి విడిచిపెట్టాడు. ఆ అవమానం సోమదత్తుణ్ని పీడించింది. తన రాజ్యానికి తిరిగి పోకుండా, అతను అక్కణ్నించే తపస్సు చేయడానికి వనానికి వెళ్లిపోయాడు.

అయితే, తపస్సుకు కావలసిన ఫలితం వచ్చేలోపులో శినీ చచ్చిపోయాడు, శిని కొడుకు సత్యకుడూ చచ్చిపోయాడు. అంచేత శిని మనవణ్ని ఓడించగలిగే కొడుకు తనకు కలగాలని వరం కోరుకున్నాడు సోమదత్తుడు. ఆ వరప్రసాదంగానే భూరిశ్రవసుడు పుట్టాడు. శిని మనవడే సత్యకుడికి కొడుకైన సాత్యకి. ఈ సాత్యకి అసలు పేరు యుయుధానుడు. బ్రహ్మచైతన్య యోగం కోసం యుద్ధం చేయడానికి బుద్ధిని ధారణ చేసినవాణ్నే యుయుధానుడని అంటారు.

అంటే, యోగం కోసం పోరాడాలన్న శ్రద్ధా భక్తీ ఉన్నవాడన్నమాట. అంచేతనే ఈ సాత్యకిని శ్రద్ధకు ప్రతీకగా చెబుతారు. శినికో శిని కొడుకుకో పడవలసిన కర్మశిక్ష, శిని మనవడైన సాత్యకికి దిగివచ్చింది. కర్మఫలం తప్పకుండా వచ్చిపడడం వరప్రసాదంగా కథారూపేణా చెప్పుకొంటాం.
 
సాత్యకి అర్జునుడికి శిష్యుడు. సాత్యకి విలువిద్య అంతా అర్జునుడి ప్రసాదం. అదీగాక సాత్యకి వరసకి, సత్యభామకు తమ్ముడుగా, శ్రీకృష్ణుడికి బావమరిది అవుతాడు. సైంధవుణ్ని సూర్యుడు అస్తమించేలోపుగా వధించాలనే ప్రతిజ్ఞను నెరవేర్చుకోడానికి, ద్రోణుణ్ని తప్పించుకొని, కౌరవ సేనా వ్యూహంలో చొరబడిన అర్జునుడికి సాయంగా ఉండమని ధర్మరాజు, భీముణ్నీ సాత్యకినీ పంపించాడు. సాత్యకి యుద్ధం చేస్తూ చాలామందినే సంహరిస్తూ ముందుకు వస్తున్నాడు. చాలా అలసిపోయిన స్థితిలో అతనికి తటాలున భూరిశ్రవసుడు ఎదురయ్యాడు.

‘చాలా కాలానికి నా కోరిక తీరబోతోంది. ఈ రోజున నువ్వు యుద్ధరంగం వదిలి పారిపోకుండా ఉంటే, నా చేతిలో చనిపోవడం నీకు తప్పదు. నా చేతిలో నువ్వు చనిపోయినప్పుడు, నిన్ను ఈ వ్యూహంలోకి పంపిన ధర్మరాజు నీలాంటి దుర్బలుణ్ని పంపినందుకు సిగ్గుపడతాడు. ‘రా, యుద్ధానికి సిద్ధపడు’ అని అంటూ సాత్యకిని కవ్వించాడు భూరిశ్రవసుడు.
 
యుయుధానుడు నవ్వుతూ సమాధానం చెబుతూ, ‘నేను నీ మాటలకే భయపడిపోయే పిరికివాణ్ని కాను. నన్ను యుద్ధంలో నిరాయుధుణ్ని చేసినవాడే నన్ను గెలవగలుగుతాడు. అయినా, వట్టిగా బడబడలాడడం వల్ల లాభమేమిటి? నువ్వన్నది చేసి చూపించు చూద్దాం’ అంటూ ఆ సవాలును స్వీకరించాడు సాత్యకి.
 ఒక ఆడ ఏనుగు కోసం భీషణంగా కొట్టుకొనే రెండు ఏనుగుల్లాగ జయం కోసం పోరాడుతూ వాళ్లిద్దరూ ఒకళ్ల మీద మరొకళ్లు బాణవర్ష ధారలు కురిపించడం మొదలుపెట్టారు.

విల్లులు విరగ్గొట్టుకొని రథాలను ధ్వంసం చేసుకొని, ఇక కత్తి యుద్ధానికి దిగారు. రకరకాలుగా ఖడ్గ యుద్ధం చేస్తూ ఒకరి డాలును మరొకరు విరగ్గొట్టి ఆమీద మల్లయుద్ధానికి ఉపక్ర మించారు. వాళ్లిద్దర్నీ కొంతదూరంలో ఉన్న కృష్ణార్జునులు చూస్తున్నారు. కృష్ణుడు ‘సాత్యకి బాగా అలసిపోయినప్పుడు ఈ భూరిదక్షిణుడు యుద్ధాన్ని కోరుకొంటూ ఎదురుపడ్డాడు. అంచేత వీళ్ల యుద్ధం సమయుద్ధంగా లేదు.

యుయుధానుడు నేలమీద పడిపోయాడు చూడు! నీ శిష్యుణ్ని ఇప్పుడు నువ్వు కాపాడాలి’ అంటూ అర్జునుణ్ని పురిగొల్పాడు.
 సాత్యకి జుట్టు పట్టుకొని, కాలితో ఛాతీమీద తన్నుతూ భూరి శ్రవసుడు తన ఒర నుంచి ఖడ్గాన్ని తీశాడు. యుయుధా నుడి శిరస్సును కోద్దామని భూరిశ్రవసుడు ఉంకిస్తున్నాడు. కుమ్మరి చక్రం మీది కన్నంలో కర్రను పెట్టి కుమ్మరి చక్రాన్ని తిప్పినట్టు, సాత్యకి యూపకేతువు కత్తికి అందకుండా తిప్పుతూ ఉన్నాడు.

‘నువ్వు నీ శిష్యుణ్ని తక్షణమే కాపాడాలి’ అంటూ శ్రీకృష్ణుడు చెబుతూన్న మాటలను విని, అర్జునుడు గాండీవం మీద ఒక బాణాన్ని సంధించి, ఖడ్గంతో సహా భూరిశ్రవసుడి కుడిచేతిని కొట్టేశాడు.
 భూరిశ్రవసుడు అర్జునుణ్ని ఆడిపోసు కోవడం మొదలుపెట్టాడు; ‘మరొకడితో యుద్ధం చేస్తూన్నవాడి చేతిని కొట్టడం నీకు ఇంద్రుడు చెప్పాడో కిరాతుడైన రుద్రుడే చెప్పాడో సాక్షాత్తూ నీ గురువు ద్రోణుడే చెప్పాడో మొదటి గురువు కృపాచార్యుడే చెప్పాడో నాకు తెలియదు.

అస్త్ర ధర్మాన్నెరి గిన నువ్వు నీతో యుద్ధం చేయని నా కుడిచేతిని కొట్టెయ్యడం ఏ రకమైన ధర్మం? వాసుదేవుడి మాట విని నువ్వు ఈ నికృష్టమైన పని చేశావని తెలిసిపోతోంది. నువ్వు కృష్ణ సఖుడివి కాకపోతే ఈ పని చేసేవాడివి కావు’ అని అర్జునుణ్ని తప్పు బట్టడమే కాకుండా కృష్ణుణ్ని కూడా దూషించాడు.
 ‘మాకోసం ప్రాణాలను ఒడ్డి యుద్ధం చేస్తూన్న యోద్ధను రక్షించడం నా ధర్మం.

యుద్ధం చేసే వీరుడు కేవలం తననే రక్షించుకొంటూ కూర్చోకూడదు; తన పనుల్ని చేసి పెడుతూన్న వాళ్లను రక్షించడం కూడా రాజు కర్తవ్యమే. అలాగే వాళ్లు కూడా రాజును రక్షిస్తూ ఉండాలి. అయినా ఈ సంగ్రామం ఒక్కొక్కరూ ఒక్కొక్కరితో చేస్తున్నారని చెప్పడానికి కుదరదు. ఇదో సైన్య సాగరం. ఎవరెవర్ని దెబ్బతీస్తున్నారో చెప్పలేం. ఒక పక్షమూ వేరు పక్షమూ మధ్య జరుగుతూన్న యుద్ధమని చెప్పగలం తప్ప, ఒక ఫలానా యోద్ధా మరొక ఫలానా యోద్ధా మధ్య జరుగుతూన్న యుద్ధంగా దీన్ని చెప్పడం చెల్లదు.

అదీగాక సాత్యకి అలసిపోయి ఉన్నాడు. అంచేతనే నీకు దొరికిపోయాడు. అటువంటి సమయంలో నాలాంటి బాధ్యత గల యోద్ధ అతన్ని కాపాడడంలో ఏ దోషమూ లేదు సరిగదా న్యాయమే ఉంది. అయినా మీరందరూ కలిసి అభిమన్యుణ్ని చంపలేదా? అప్పుడు ఈ నువ్వు చెప్పే న్యాయం ఎక్కడికి పోయింది?’ అంటూ దీటైన జవాబు చెప్పాడు అర్జునుడు. ఈ మాటలు విని, యూపకేతువు మారుమాటాడలేదు.
 
అతను తన ఎడమచేత్తో బాణాలను కింద పరుచుకొని, ఆ శరాసనం మీద కూర్చొని ధ్యానమగ్నుడై ప్రాణాలను వదిలిపెట్టడానికి సంసిద్ధుడయ్యాడు. ‘నాకు ధర్మరాజూ భీముడూ నకుల సహ దేవులూ అంటే ఎంత ప్రేమో నువ్వన్నా అంతే ప్రేమ. నేనూ కృష్ణుడూ నువ్వు పుణ్యలోకాలకు పోవాలని ఆకాంక్షి స్తున్నాం’ అంటూ అర్జునుడు అనడంతో బాటు కృష్ణుడు కూడా ‘నాతో సమానంగా గరుడుడి మీద ఎక్కి సంచరించేవాడివి కా’ అంటూ దీవించాడు. ఇంతలో సాత్యకి లేచి, కృష్ణార్జునులు వద్దు వద్దు అని అంటూన్నా వినకుండా భూరిశ్రవసుడి శిరస్సును తన కత్తితో కోసేశాడు.

దాన్ని తప్పుబట్టిన కౌరవులకు అర్జునుడన్నమాటే అప్పజెప్పాడు: ‘శస్త్రాలూ కత్తులూ ఏమీలేని విరథుడూ కవచ హీనుడూ అయిన అభిమన్యుణ్ని చంపడం ధర్మమైతే ఇదీ అంత ధర్మమే. నేను ఈ భూరిశ్రవుడి తల తీయడానికి నా ప్రతిజ్ఞే కారణం. ఎవరైతే నన్ను రణరంగంలో బతికుండ గానే కోపంతో కాలితో తంతాడో వాణ్ని, అతను ముని వ్రతుడైనా సరే, చంపుతా నని నా ప్రతిజ్ఞ. అది తీర్చుకోవడం సబబే గనక నేను ఈ పని చేశాను’ అని తన పనిని సమర్థించుకొన్నాడు సాత్యకి.
 

కథాపరంగా చూస్తే, ఈ చంపడం ఒప్పా తప్పా అనే వాదాలు సహజంగానే పుడతాయి. కానీ శ్రద్ధను (సాత్యకిని) నాశనం చేద్దామని చూసే కర్మనీ కర్మ బంధాన్నీ (భూరిశ్రవసుణ్ని) మనో నిగ్రహంతో (అర్జునుడి ద్వారా) మట్టు బెట్టడం నూటికి నూరుపాళ్లూ ఒప్పే. అలాగే శ్రద్ధే సూటిగా కర్మబంధాన్ని కోసెయ్యడమూ బేషరతుగా ఒప్పే.
 
ఇటువంటి సన్నివేశం ద్రోణవధ ఘట్టంలో కూడా ఉంది. ద్రోణుడు, కొడుకు చనిపోయాడని వినగానే, కుడిచేయి తెగిన భూరిశ్రవసుడి లాగ, అస్త్ర సన్యాసం చేసి, యోగధ్యానంలో కూర్చున్నాడు. అతన్ని చంపడానికే పుట్టిన ధృష్టద్యుమ్నుడు తటాలున అతని రథం ఎక్కి, ద్రోణుడి తలకాయను నిర్దాక్షిణ్యంగా కోసేశాడు. ఇదీ ఒప్పా తప్పా అనే మీమాంసకు తెరతీసింది. కానీ అలవాట్లను మప్పి నేర్పే వాసన అనే ఆచార్యుడి తలను ఆగమశక్తి తెగ్గోయడం అత్యంతమూ సబబే. అంచేతనే మనం ఈ భారతవ్యాసాల పరంపరలో అంతటా, మనుషుల వెనక ఉన్న భావాలనే గ్రహించాలని పదేపదే చెబుతూ వస్తున్నాం.            
- డా॥ముంజులూరి నరసింహారావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement