మనమంతా దుర్యోధనులం: రజనీకాంత్
మనమంతా దుర్యోధనులమని, ఆయనలాగే ఏం చేయకూడదు అనుకుంటామో అదే చేస్తామని సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. అంతా అర్జునుడిలాగ మారితే మనిషి జీవితం భగవంతుడిని చేరుతుందని చెప్పారు. చెన్నైలోని రజనీకాంత్ కళ్యాణ మండపంలో పరమహంస యోగానంద రచించిన 'ది డివైన్ రొమాన్స్' తమిళ అనువాదం దైవీక కాదల్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తనను ఓ సినిమా స్టార్‌గా కంటే ఆధ్యాత్మికవాది అంటేనే ఇష్టపడతానని, తనకు సినిమాల కంటే ఆధ్యాత్మిక మార్గమే ఇష్టమని చెప్పారు. మనిషి జన్మ అనేది దేవుడి కృప అని, మానవత్వంతో జీవిస్తేనే ఆ జన్మకు సార్ధకత చేకూరుతుందని చెప్పారు.
ఓ పరమ గురువుగా రామకృష్ణ పరమహంస నుంచి జీవితాన్ని నేర్చుకున్నానని, రమణ మహర్షి రాసిన'నేను ఎవరిని' అనే పుస్తకం నుంచి మనిషి జీవన గమనాన్ని గ్రహించానని రజనీ చెప్పారు. తాను స్వయంగా ఓ పుస్తకాన్ని విడుదల చేయటం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో దైవాన్ని చూసిన మహోన్నత వ్యక్తులు మనకు అందించిన పుస్తకం కావడం వల్లే దీన్ని ఆవిష్కరించానన్నారు. అందరం జీవితాన్ని సార్ధకత చేసుకోవాలంటే అధ్యాత్మిక మార్గమే శరణ్యమని రజనీకాంత్ తెలిపారు.
