భీముడు అలియాస్ సుధాకర్ (ఫైల్)
పీడిత–తాడిత జనోద్ధరణ లక్ష్యంతో అడవి బాట పట్టి, అజ్ఞాతం నుంచి ఉద్యమం సాగిస్తున్న న్యూడెమోక్రసీ ‘అన్న’లు ఒకరొక్కరుగా పోలీసులకు చిక్కుతున్నారు. కొన్నాళ్ల నుంచి తమ సహచరులను పోలీసులు పట్టుకోవడం, తాజాగా, ఎన్డీ(చంద్రన్న) గుండాల ఏరియా దళ నేత భీముడిని కూసుమంచి మండలం చౌటుపల్లిలో అరెస్ట్ చేయడంతో అజ్ఞాత ఉద్యమ నేతల్లో సహజంగానే అలజడి పుడుతోంది.
ఇల్లెందు : న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ నేతలను కొన్ని నెలల కిందట పోలీసులు వరుసబెట్టి అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఇవి ఆగిపోయాయి. ఈ వరుస అరెస్టుల పర్వం ముగిసిందని ఎన్డీ శ్రేణు లు, అభిమానులు అనుకుంటున్న తరుణంలో.. తాజాగా, ఎన్డీ చంద్రన్న వర్గం గుండాల ఏరియా దళ నేత భీముడు అలియాస్ సుధాకర్‌ను కూసుమంచి మండలం చౌటుపల్లి తండాలో పోలీసులు శనివారం తెల్లారుజామున అరెస్ట్ చేశారు. అడివిని వదిలి, అజ్ఞాతాన్ని వీడిన నేతలు.. పోలీసుల వలలో చిక్కుకుంటున్నారు. ఎందుకిలా జరుగుతోంది..? న్యూడెమోక్రసీ అభిమానులు ఆవేదనా పూరిత స్వరంతో అడుగుతున్న ఈ ప్రశ్నపు... ‘‘అనారోగ్యంతో బాధపడుతున్న దళ నేతలు వైద్యం, విశ్రాంతి కోసం అడవి/అజ్ఞాతం నుంచి అనివార్యంగా బయటకు రావడమే ఈ పరిస్థితికి కారణమవుతోంది’’ అని, నాయకులు సమాధానంగా చెబుతున్నారు.
ఈ భీముడు ఎవరు...?
గుండాల మండలం నర్సాపురం తండాకు చెందిన భీముడు(సుధాకర్), గుండాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఉమ్మడి ఎన్డీలో లీగల్ కార్యకర్తగా పనిచేశారు. గుండాల ఏరియాలో పీపీజీతో ఎన్డీకి తీవ్ర వైరం నెలకొన్న నేపథ్యంలో అజ్ఞాత దళంలోకి భీముడు వెళ్లారు. గుండాల, నర్సంపేట, కొత్తగూడ ఏరియాలో సుదీర్ఘ కాలంపాటు దళ నేతగా పనిచేశారు. 2011లో ఎన్డీ రెండు(రాయల–చంద్రన్న) వర్గాలుగా చీలింది. చంద్రన్న వర్గంలోకి వెళ్లిన భీముడు.. పాకాల కొత్తగూడ, ఇల్లెందు, గుండాల ఏరియాలో దళ నేతగా పని చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ను వైద్యం కోసం నాయకత్వం ఖమ్మం తరలించింది. పార్టీ కామ్రేడ్ ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న భీముడును పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎన్డీ దళ కమాండర్ బోడ భీముడు అరెస్ట్
కూసుమంచి : న్యూడెమోక్రసీ (చంద్రన్న) గుండాల ఏరియా దళ కమాండర్ బోడ భీముడు అలియాస్ సుధాకరన్నను శనివారం తెల్లవారుజామున మండలంలోని చౌటపల్లి గ్రామ శివారు బండమీదతండాలోని ఓ ఇంటిలో పోలీసులు అరెస్ట్ చేశారు. కూసుమంచి సీఐ ఆధ్వర్యంలో కూసుమంచి, ఖమ్మం పోలీసులు ఆ ఇంటిని చుట్టిముట్టి, అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీ సానుభూతిపరుడు, భీముడుకు ఆశ్రయమిచ్చిన భూక్యా మచ్చూ నాయక్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. భీముడు వద్ద పోలీసులకు రివాల్వర్ దొరికినట్టు సమాచారం. కూసుమంచి మండలంలో చంద్రన్న వర్గం బలంగా ఉంది. దీంతో, అజ్ఞాత దళ నేతలు ఇక్కడకు రావచ్చునన్న అనుమానంతో పోలీసులు నిఘా వేశారు. భీముడు వచ్చాడన్న సమాచారంతో అరెస్ట్ చేశారు. ఇతడిని భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు తీసుకెళ్లినట్టు, మచ్చూ నాయక్‌ను మాత్రం కూసుమంచి పోలీసుల అదుపులోనే ఉన్నట్టు తెలిసింది. భీముడు అరెస్టును పోలీసులు అధికారకంగా ధ్రువీకరించలేదు.
భీముడు ఎందుకొచ్చాడు..?
బండమీదితండాకు భీముడు ఎందుకు వచ్చాడన్న ప్రశ్నకు కచ్చితమైన సమాధానం దొరకలేదు. గూడ నొప్పితో బాధపడుతున్నాడని, విశ్రాంతి తీసుకునేందుకు పార్టీ సానుభూతిపరుడైన... తన దగ్గరి బంధువైనన మచ్చు నాయక్ ఇంటికి మూడు రోజుల క్రితం వచ్చినట్టు తెలిసింది. మచ్చూ నాయక్‌కు పసర వైద్యం తెలిసుండడం, మండల కేంద్రానికి మారుమూలన ఈ తండా ఉండడంతో, అన్ని విధాలుగా ఈ తండానే అనువుగా ఉంటుందని భీముడు భావించి ఇక్కడకు వచ్చినట్లు సమాచారం. దళాన్ని పటిష్టపరిచే, విస్తృతపరిచే లక్ష్యంతోనే భీముడు ఇక్కడకు వచ్చాడన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
పక్కా సమాచారంతో...
బండమీదితండాలో భీముడు ఉన్నాడని నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో పోలీసు లు అప్రమత్తమయ్యారని తెలిసింది. తప్పిపో యిన గేదెలను వెతుకున్నట్టు కాపరులు/యజమానుల మాదిరిగా పోలీసులు 3రోజుల నుంచి తండాలో తిరిగినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment