మధును కోర్టుకు తరలిస్తున్న దృశ్యం
ఇల్లెందు: ‘‘నన్ను పోలీసులు చిత్రహింసలు పెట్టారు’’ అని, న్యూడెమోక్రసీ నేత మధు ఆరోపించారు. ఆయనను గొర్రెబంధం తండా వద్ద అరెస్ట్ చేసినట్టుగా భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ గురువారం ఒక ప్రకటన చేశారు. దీనిని మధు ఖండించారు.
‘‘నన్ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. గొర్రెబంధం తండా వద్ద అరెస్ట్ చేసినట్టుగా అబద్ధమాడుతున్నారు’’ అని చెప్పారు. ఆయనను పోలీసులు గురువారం ఖమ్మం కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయన కోర్టులో సంచలన విషయాలు బయటపెట్టారు.
ఆయన ఏమన్నారంటే... ‘‘ఈ నెల 3వ తేదీన హైదరాబాద్‌లో నన్ను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకొచ్చారు. నన్ను టేకులపల్లి సీఐ రమేష్ రోజంతా విపరీతంగా కొట్టాడు. చిత్రహింసలపాలు చేశాడు.
ఇది చట్ట విరుద్ధం. టేకులపల్లి సీఐ మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నా వద్ద ఆయుధం లేదు. కానీ, ఆయుధం ఉన్నట్టుగా చూపించి తప్పుడు కేసులు నమోదు చేశారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే చిత్రహింసలు పెట్టడమా...?
ఏ నేరం చేశానని నన్ను అరెస్టు చేశారు? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నేను పీడిత ప్రజలపక్షాన పోరాడతాను. భవిష్యత్తులో కూడా వారి కోసం నిలబడతాను. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఇంకొంతమంది కలిసి నా మీద రాజ్యహింసను ప్రయోగిస్తున్నారు. నా మీద కోర్టులో కేసులు పెండింగులో ఉన్నాయి. వాటి విచారణకు హాజరవుతున్నాను. నన్ను అప్రజామికంగా అరెస్ట్ చేశారు’’.
Comments
Please login to add a commentAdd a comment