వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ
ఇల్లెందు: అలా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టకండి..! అతడు అరెస్టయినందుకు అటు పోలీసులు, ఇటు ఎన్డీ(చంద్రన్న) నాయకులు ‘ఆనందపడుతున్నారు’..!! ఔను, మీరు చదివింది అక్షరాలా నిజమే..!!! ‘ఎందుకు? ఏమిటి?’ అంటూ, ఒకేసారి ప్రశ్నల వర్షం కురిపించ కండి. అంతగా తెలుసుకోవాలనుకుంటే.. కింది కథనాన్ని తీరిగ్గా చదవండి.. ఎన్డీ(చంద్రన్న) యువ నాయకుడైన మోరే రవి ఎట్టకేలకు పోలీసుల చెంతకు ‘చేరాడు’. లొంగిపోయాడా..? అరెస్టయ్యాడా? ఏదైతేనేం..! అటు పోలీసులు, ఇటు ఎన్డీ నాయకత్వం కోరుకున్నదే జరిగింది.
ఎవరీ రవి..?
ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామస్తుడు. న్యూడెమోక్రసీ అనుబంధ పీవైఎల్‌లో పనిచేశాడు. 2010లో గద్దర్ నాయకత్వంలోని ప్రజాఫ్రంట్‌లో చేరాడు. పాల్వంచ ఏరియాకు మకాం మార్చాడు. 2012లో పాలవంచ మండలం రెడ్డిగూడెం గ్రామంలో భూ వివాదంలో తల దూర్చాడు. అక్కడి సర్పంచ్ భర్త, కాంగ్రెస్ నాయకుడైన కళ్లెం వెంకటరెడ్డి భూముల్లో జెండాలు పాతాడు. అతడు (వెంకటరెడ్డి) లెక్కచేయలేదు. ఈ నేపథ్యంలో, అతడిని చంపాలనుకున్నాడు. మావోయిస్టు పార్టీ భద్రు దళంలోకి వెళ్లాడు. ఏడాది తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. 2013లో ఎన్డీ చీలిక తరువాత చంద్రన్న వర్గంలో చేరాడు.
‘మోస్ట్ వాంటెడ్’ ఎందుకయ్యాడంటే!
2017, ఆగస్టు 16వ తేదీ ఉదయం. పాల్వంచ మండలం పాండురంగాపురం సమీపంలోని నర్సంపేట గ్రామం ప్రశాంతంగా ఉంది. ఆ గ్రామ టీడీపీ నాయకుడు, న్యూడెమోక్రసీ(రాయల) మాజీ నాయకుడైన రాయల భాస్కర్ ఇంటికి ఎన్డీ(చంద్రన్న)కి చెందిన 20మంది సాయుధ అజ్ఞాత దళ సభ్యులు వచ్చారు. అందరూ చూస్తుండగానే ఆయనను పట్టుకున్నారు. సమీపంలోగల జామాయిల్ తోటలోకి తీసుకెళ్లారు. చుట్టూ జనం చూస్తుండగా.. తీవ్రంగా కొట్టి చం పారు. ఈ దారుణాన్ని దగ్గరుండి జరిపించింది ఆ దళ నాయకుడు.. మోరే రవి! అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ హత్యను పోలీసులు సవాల్‌గా భావించారు. అప్పటి నుంచి వారికి ఆ మోరే రవి.. మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. తమ దళ నాయకుడు, ‘కీలక’ ఆపరేషన్లలో ముందుండే మోరే రవి.. ఎన్డీ(చంద్రన్న) పార్టీకి సహజంగానే ‘మోస్ట్ వాంటెడ్’ అయ్యాడు.
వేట మొదలు
‘చిక్కడు–దొరకడు’ అన్నట్టుగా తప్పించుకుని తిరుగుతున్న మోరే రవి కోసం పోలీసుల వేట మొదలైంది. ఇది, ఎన్డీ(చంద్రన్న) ఇతర అజ్ఞాత దళాలకు కూడా సమస్యగా మారింది. టేకులపల్లి మండలం సంపత్‌నగర్ సిద్ధారం అటవీ ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్న రాము (జిల్లా కార్యదర్శి) దళంపై పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఆ దళం త్రుటిలో తప్పించుకుంది. ఇది ఏ దళమో పోలీసులకు ముందుగా తెలియదు. మోరే రవి దళమేమోనన్న అనుమానంతో వచ్చారు. 2017, సెప్టెంబర్ 21న ఇది జరిగింది. ఆ పార్టీ లీగల్ నాయకత్వంపై కూడా పోలీసుల ఒత్తిడి పెరిగింది. మోరే రవితోపాటు, తమ పార్టీ ఏరియా కమిటీ కార్యదర్శి అశోక్ కోసం పోలీసులు విస్తృతంగా వేట సాగిస్తున్నారన్న సమాచారంతో ఎన్డీ(చంద్రన్న) నాయకత్వం కలవరపడింది. ‘మోరే రవి కారణంగా పార్టీ మొత్తం నష్టపోయే పరిస్థితి దాపురించింది’ అనే భావన, ఆ పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది.
‘ఆనందం’ ఎందుకంటే...
మోరే రవి అరెస్టుతో అటు పోలీసులు, ఇటు ఎన్డీ(చంద్రన్న) నాయకత్వం ఆనందంగా ఎందుకు ఉన్నదో ఈపాటికే మీకు అర్థమయి ఉండాలి. తాము ఎన్నాళ్ల నుంచో వెతుకుతున్న ‘మోస్ట్ వాంటెడ్’ క్రిమినల్ దొరికిపోయాడు కాబట్టి పోలీసులు ‘ఆనందం’గా ఉన్నారు. రవి అరెస్టుతో తమ అజ్ఞాత దళాలకు, పార్టీకి పోలీసుల ‘ఒత్తిళ్లు’ తగ్గినట్టేనన్నది ఎన్డీ (చంద్రన్న) నాయకత్వ భావన. ఇదొక రకమైన ఆనందం. ఎలాంటి ప్రాణాపాయం లేకుండా పోలీసులకు రవి ’క్షేమంగా’ చిక్కాడన్నది మరో రకమైన ఆనందం. మూడు ముక్కల్లో చెప్పాలంటే.. మోరే రవి క్షేమంగా ఉండాలి, పోలీసులకు దొరికిపోవాలి. వేట ముగియాలి, ఒత్తిళ్లు తగ్గాలి. ఇవన్నీ నెరవేరాయి. కాబట్టి, ఇటు పోలీసులు–అటు ఎన్డీ(చంద్రన్న) పార్టీ హ్యాపీ...!!!
Comments
Please login to add a commentAdd a comment