విలనే నా హీరో!
హ్యూమర్
హైనాలన్నా, విలన్లన్నా నాకు చిన్నప్పట్నుంచీ తెగ ఇష్టం. కాకపోతే ఈ విషయం బహిరంగంగా చెప్పుకోడానికీ, ఒప్పుకోడానికీ చాలా ఇబ్బంది. కారణం... దీన్ని లోకం ఒప్పదు. కానీ మనలోమనమైనా నిజాలు ఒప్పుకోక తప్పదు. హైనాలు పరమ నీచమైన జీవులే. జంతుప్రపంచంలో దాదాగిరి చేస్తుంటాయి. ఇతర జంతువులు న్యాయంగా వేటాడిన వాటిని పరమ జబర్దస్తీగా లాక్కుంటాయి. సాటి జీవుల పట్ల రౌడీల్లా వ్యవహరిస్తుంటాయి. ఇక విలన్లంటే సాక్షాత్తూ నరరూప హైనాలే కదా. హైనాలూ విలన్లలా నవ్వుతుంటాయట. మనిషిలాగే నవ్వు సౌండ్ వినిపించేలా చేస్తాయట. సాటి మనషేమోనని భ్రమింపజేస్తాయట. అలా వికటాట్టహాసంతో మనుషుల్ని మోసం చేస్తుంటాయట.
మరిక విలన్ల గురించి కొత్తగా చెప్పేదేముంటుంది. వాళ్లు ‘హహ్హహా’ అంటూ చేసే ఆ వికటాట్ట హాసానికి విలన్‌నవ్వు అన్న పేరు ఎప్పట్నుంచో ఫిక్సయి ఉంది. యాంగ్రీయంగ్ మేన్ అయిన హీరో ఎప్పుడోగానీ నవ్వడేమోగానీ విలన్ మాత్రం ఒక్క చివరి సీన్‌లో తప్ప ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. హీరోకు చిరు దరహాసం తప్ప అట్టహాసం తెలియదు. అది విలన్లకు మాత్రమే ప్రాప్తం. హీరో ఒక లక్ష్యం కోసం సినిమా ఆద్యంతమూ తెగ కష్టాలు పడుతూ ఉంటాడు. కానీ విలన్ మాత్రం పతాక సన్నివేశంలో తప్ప నిత్యం పకపకలాడుతూ ఉంటాడు. వాడికి నవ్వడం ఎంత తేలికంటే... ఒక గుండుసున్నా గీసి, అందులో నెలవంక లాంటి గీత గీస్తే అది స్మైలీ అయినంత తేలిక. ఈ మాత్రం చిత్రం ఎవ్వడైనా గీయగలడు. అలాగే సినిమా ఆద్యంతమూ విలన్ నవ్వగలడు. వాడివన్నీ హైనా వేషాలే. వాస్తవంగా వేటాడిన జంతువు ఎలా పోతేనేం? మన హైనాకు ఆహారం దక్కుతుంది. ఇక సినిమాలోనూ ఇదే న్యాయం కొనసాగుతుంటుంది. బియాండ్ ద మూవీ ఏం జరుగుతుందో కాస్త ఊహిద్దాం. ఆఖరి సన్నివేశం తర్వాతి సీన్లు మనకు కనిపించవు గానీ కాస్త ఆలోచిస్తే వాటిని ఊహించవచ్చు. సాధారణంగా సినిమా చివరన విలన్‌కు తీవ్ర పశ్చాత్తాపం కలుగుతుంది.
దాంతో శుభం కార్డుకు ముందు అతడు తన కూతుర్ని హీరోకు ఇచ్చి పెళ్లి చేస్తుంటాడు. ఆదర్శవంతుడైన కారణాన హీరో అయిన వాడు పెళ్లాన్ని బాగా చూసుకోక తప్పుతుందా? కాబట్టి విలన్ కూతుర్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉండాల్సిందే కదా. తన కూతురు హ్యాపీగా ఉండటం చూసి మళ్లీ సదరు విలన్ సంతోషంగా నవ్వుతూ ఉంటాడేమో కదా. కాబట్టి సాధారణంగా విలన్ అనేవాడు ఎల్లప్పుడూ సహజానంద గుణంతో నిత్యానందంగా ఉంటాడని అనుకునేందుకు పూర్తి ఆస్కారాలూ, గట్టి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి మనం హీరో పక్షం వహించామనుకోండి. నిత్యం ఖేదం, ఆఖర్లోనే మోదం. ఒక్క క్లైమాక్స్ ఫైట్‌లో మాత్రమే మన హర్షాతిరేకాలు వ్యక్తం చేసుకోడానికి మనకు అవకాశం ఉంటుంది. కానీ విలన్ పక్షం వహించామనుకోండి. ఆల్వేస్ హ్యాపీ. ఇప్పుడు చెప్పండి... ఎప్పుడో ఆఖరి సన్నివేశంలో మాత్రమే మనం నవ్వడానికి పనికొచ్చే హీరో బెటరా? నిత్య వికటాట్టహాస విలన్ బెటరా?
- యాసీన్