ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ | Import and Export | Sakshi
Sakshi News home page

ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్

Published Mon, Feb 1 2016 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM

ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్

ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్

  హ్యూమర్ ప్లస్

‘‘నేనొక బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాన్రా’’ అన్నాడు మా రాంబాబు గాడు.
‘‘ఏంట్రా అదీ’’ అడిగాను.
‘‘ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్’’ అని చెప్పాడు.
‘‘ఏం ఎగుమతి చేస్తావు. ఏమేమి దిగుమతి చేసుకుంటావ్’’ అని అడిగాను. చెప్పాడు.  అంతేకాదు... వాడి బిజినెస్ ఐడియాకి బ్యాక్‌గ్రౌండునూ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. నౌ ద ఫ్లాష్‌బ్యాక్ బిగిన్స్:


ఒక ఆనవాలు : మా రాంబాబు గాడు చదువులో పెద్ద క్లవరేమీ కాదు. అయితే వాడికి మాసార్లూ, మాస్టార్లూ టిక్కు పెట్టి ఇచ్చిన కొన్ని ఐఎంపీ ప్రశ్న-జవాబులు మాత్రం  వచ్చు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ టైమ్‌లో వాడికి వచ్చిన ఆన్సర్లలో ఒకటి నాకు చూపించాడు. రానే వచ్చింది రిజల్ట్స్ టైమ్! వాడు అత్తెసరు మార్కులతో పాస్. నాకు ఫస్ట్ క్లాస్.

మరో తార్కాణం : డిగ్రీ అయ్యాక గ్రూప్-ఒన్ రిటెన్ టెస్ట్ రాయడానికి హైదరాబాద్ వెళ్లాలి. ప్రయాణంలో తోడు కోసం వాడు రంగారావు గాడితోనూ అప్లై చేయించాడు. రంగా విన్నయ్యాడు. మా రాంబాబు సేఫ్‌గా రిటర్న్ అయ్యాడు. అంతేకాదు... గవర్నమెంట్ జాబ్ వచ్చిన కొన్నాళ్లకే మా రాంబాబుగాడు రహస్యంగా ప్రేమించే పిల్ల వాళ్ల నాన్న కూడా... సదరు అమ్మాయిని రంగారావుగాడికే ఇచ్చి పెళ్లి చేశాడు. దాంతో రాంబాబుగాడు రహస్యంగా దేవదాసు వేషాలు వేసుకుంటూ, మనసులోనే శాలువా కప్పుకుంటూ, ఊహల్లోనే కుయ్ కుయ్ అనే కుక్కపిల్లల ఒళ్లు నిమురుతూ, బయటకు మాత్రం రయ్ రయ్ మంటూ తిరుగుతూ ఉండేవాడు.

ఇంకో దృష్టాంతం : ఏదో కొనడానికి వెళ్తూ వెళ్తూ రాంబాబు గాడు నన్ను తోడుతీసుకెళ్లాడు. షాపింగ్ అంటే బోరురా అని నేను మొత్తుకుంటున్నా వాడు విన్లేదు. తీరా వెళ్లాక అక్కడ నాకు అవసరమైందేదో కనిపించి కొన్నాను. రెండ్రోజుల తర్వాత షాపు వాళ్లు నిర్వహించిన లక్కీడిప్‌లో నాకు ఇరవైనాలుగించుల టీవీ బహుమతిగా వచ్చింది. అదే రోజు రాంబాబు గాడి టీవీ రిపేరుకు వచ్చింది. వాడి మతిపోయింది.  

ఈ వరస సంఘటనల తర్వాత రాంబాబు మాకో ఫిలాసఫీ బోధిస్తూ ఉండేవాడు. ‘‘ఒరేయ్... మామిడికాయ్ పచ్చడి పెట్టిన కొత్తలో ఆ ముక్క తింటే కొత్తకారం వల్ల  నోరు పొక్కిపోయేది. అందుకే మా అమ్మ ఒక పని చేసేది. కాయను కడిగిచ్చేది. కడిగితే కారం పోతుంది. కానీ ఆ ముక్కలోని పులుపెక్కడికి పోతుందీ! నా దురదృష్టపు బలుపెక్కడికి పోతుంది!!’’ అంటూ నవ్వేసేవాడు.

బ్యాక్ టు ఫ్యూచర్ : రాంబాబు గాడి ఫ్లాష్‌బ్యాక్‌కూ వాడి బిజినెస్ ఐడియాకూ సంబంధం ఏమిటని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? తన ఫ్యూచర్ బాగుండాలనుకునేవాడు మావాడితో ఫ్రెండ్‌షిప్ చేయవచ్చట. అందుకు నిర్ణీత రుసుం చెల్లించాలట. అలా తమ దురదృష్టాన్ని రాంబాబుగాడికి అంటగట్టేసి, తమ అదృష్టాలకు అంటు కట్టేసుకోవచ్చట. దురదృష్ట-అదృష్టాల ఈ ఇంపోర్టు-ఎక్స్‌పోర్టు బిజినెస్‌కు... వాడో  ట్యాగ్‌లైన్‌నూ రెడీ చేశాడు. అది... ‘అదృష్టం అమ్మబడునూ... దురదృష్టం కొనబడును’ అట!
 - యాసీన్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement