ఊపిరితిత్తుల క్యాన్సర్ - కొత్త చికిత్సలు హాయిగా ఊపిరి పీల్చుకోండి! | Now, New drugs could be done it potentially treat lung cancer | Sakshi
Sakshi News home page

ఊపిరితిత్తుల క్యాన్సర్ - కొత్త చికిత్సలు హాయిగా ఊపిరి పీల్చుకోండి!

Published Sun, Nov 24 2013 11:16 PM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM

Now, New drugs could be done it potentially treat lung cancer

ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న క్యాన్సర్ మరణాల్లో మూడోవంతు ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగానే కలుగుతున్నాయి. రొమ్ము, పెద్దపేగు, ప్రోస్టేట్ క్యాన్సర్‌లు.. ఈ మొత్తాన్ని కలుపుకున్నా, వాటన్నిటికంటే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో సంభవించే మరణాలే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అంటే దీని తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో ఈ వ్యాధి తీవ్రతపై సమగ్రమైన అధ్యయనాలు లేవు. పైగా లక్షణాల ఆధారంగా దాన్ని ట్యూబర్క్యులోసిస్ (టీబీ) గా పొరబడి చికిత్స విషయంలోనూ ఆలస్యం జరిగే కేసులే ఎక్కువ. కాబట్టి ప్రపంచవ్యాప్తపు లెక్కల ఆధారంగా చూస్తే మన దేశంలో దీనివల్ల కలిగే మరణాలు ఎక్కువేనని తెలుస్తోంది. ఒక అంచనా ప్రకారం ఏడాదికి మన దేశంలో 63,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. అందులో 80 శాతం మంది పురుషులే. తీవ్రత, వ్యాధి నిర్ధారణలో పొరబడే అవకాశాలను దృష్టిలో పెట్టుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవడం ఎంత అవసరమో తెలుస్తుంది. ఆ అవగాహన కోసమే ఈ కథనం.
 
 ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు అనేక అంశాలు దోహదపడతాయి. మన దేశంలో 90 శాతం కేసుల్లో క్యాన్సర్ వ్యాప్తికి పొగాకు వాడకమే ప్రధాన కారణం. సాధారణ వ్యక్తితో పోలిస్తే పొగతాగేవారిలో ఈ వ్యాధి రావడానికి అవకాశాలు 2.5 రెట్లు ఎక్కువ. అయితే పొగతాగడం అలవాటు లేని ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్లలో 65 శాతం మహిళలు కాగా... కేవలం 35 శాతం మంది మాత్రమే పురుషులున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటున్న వివరాల మేరకు వాతావరణ కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణం.
 
 ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు:  
 మానకుండా అదేపనిగా వచ్చే దగ్గు  
 కళ్లెలో రక్తం పడటం
 ఛాతీలో నొప్పి  
 ఒకవేళ మెదడుకు పాకితే తలనొప్పి  
 వాంతులు వంటివి. నెలరోజులకు పైగా ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తున్నా, బరువు క్రమంగా తగ్గుతున్నా, గొంతులో (స్వరంలో) మార్పు కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
 
 చికిత్స: గతంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తే ఏ రోగికైనా ఒకేలాంటి చికిత్స చేసేవారు. అయితే ఇప్పుడు రోగిని, అతడికి ఉన్న లక్షణాలను బట్టి ప్రత్యేకంగా చికిత్స చేస్తున్నారు. అంటే ఒకే చికిత్స దశ నుంచి ఇప్పుడు వ్యక్తిగతమైన చికిత్స అవసరమైన (పర్సనలైజ్‌డ్ ట్రీట్‌మెంట్) దశకు వైద్యవిజ్ఞానం చేరుకుంది. దీనికోసం రోగి జీవశాస్త్రపరమైన స్వభావాన్ని (నేచురల్ హిస్టరీ/బయలాజికల్ హిస్టరీ) తెలుసుకునేందుకు అనేక పరీక్షలు చేసి అతడికి అవసరమైన చికిత్స ఏమిటో నిర్ణయించాల్సి ఉంటుంది.
 
 అర్లీ లంగ్ క్యాన్సర్‌లో...
 గతంలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను త్వరగా (అర్లీ లంగ్ క్యాన్సర్స్‌ను) గుర్తిస్తే, క్యాన్సర్‌కు గురైన మేరకు ఊపిరితిత్తిని గాని వ్యాధికి గురైన మొత్తం తమ్మె (లోబ్) ను గాని తొలగించేవారు. ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో కోత అవసరం లేకుండా చేసే రేడియో సర్జరీ పద్ధతులను అవలంబిస్తున్నా రు. అయితే గతంలోని శస్త్రచికిత్సకు ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అవలంబిస్తున్న రేడియో సర్జరీ ప్రక్రియలో రోగులు ఔట్ పేషెంట్ గానే ఆసుపత్రికి వచ్చి నొప్పి లేని ఈ రేడియోథెరపీ తీసుకుంటే చాలు. దీనివల్ల గతంతో పోలిస్తే చికిత్స వ్యవధి కూడా బాగా తగ్గింది. ఈ తరహా చికిత్సల కోసం ఇప్పుడు ర్యాపిడ్ ఆర్క్ వంటి సరికొత్త ఆధునిక ప్రక్రియలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
 
 కాస్తంత అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్న రోగులకు...
 ఇక అర్లీ దశను దాటి కాస్తంత అడ్వాన్స్‌డ్ దశకు చేరుకున్న రోగులకు కీమోథెరపీగాని లేదా కీమోతో పాటు రేడియోథెరపీ సహాయంతో గాని చికిత్స చేయాల్సి ఉంటుంది. కీమోథెరపీలో క్యాన్సర్ కణాలను తుదముట్టించే విధంగా పనిచేసే ఇంజెక్షన్‌లను నోటి ద్వారా తీసుకునే విధంగా (ఓరల్‌గా) గాని ఇంజెక్షన్‌ల రూపంలో గాని మందులు ఇస్తారు. గతంలో కంటే భిన్నంగా ఇప్పుడు రోగికి ఉన్న క్యాన్సర్ తీవ్రతను బట్టి అతడికే ప్రత్యేకంగా ఉద్దేశించిన విధంగా (పర్సనలైజ్‌డ్) చికిత్స జరుగుతోంది. ఇలా వ్యక్తిగతమైన చికిత్స వల్ల కేవలం క్యాన్సర్ ఉన్న మేరకే క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని చికిత్స చేస్తారన్నమాట. అందుకే దీన్ని టార్గెటెడ్ థెరపీగా అభివర్ణిస్తున్నారు.
 
 దీనివల్ల క్యాన్సర్ రోగుల చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. కేవలం వ్యాధి ఉన్న ప్రాంతాన్నే లక్ష్యంగా చేసుకుని చికిత్స ఇవ్వడం, గతంలో తప్పనిసరిగా శస్త్రచికిత్స అవసరమైన సందర్భాల్లోనూ, నోటి ద్వారానే ట్యాబ్లెట్లను, మందులను తీసుకోగలగడం, శస్త్రచికిత్స అవసరాలను గణనీయంగా తగ్గించగలగడం వంటివి చేస్తున్నారు. గతంలో మందుల దుష్ర్పభావాలైన... జుట్టు రాలిపోవడం, ఆకలి లేకపోవడం, వాంతులు, వికారం, వ్యాధినిరోధకశక్తి తగ్గడం ఇలాంటివన్నీ చాలావరకు తగ్గాయి.
 
 మరిన్ని ఆధునిక విధానాలు

  ‘ట్రిపుల్ ఎఫ్ బీమ్స్’ అనే కిరణాలతో చేసే చికిత్స ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో మరింత ఆధునికమైనది. ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని చికిత్స విధానాలతో పోలిస్తే దీనివల్ల చికిత్స గతంలో కంటే మరింత వేగంగా, సురక్షితంగా, ప్రభావపూర్వకంగా జరుగుతుంది. ఈ కిరణాల వల్ల క్యాన్సర్ ఉన్న భాగానికి చికిత్స చేసినప్పుడు, పక్కన ఉండే కణజాలంపై పడే ప్రభావం అత్యంత తక్కువ. దాంతో దీర్ఘకాలికంగా కనిపించే దుష్ర్పభావాలూ తక్కువే. ఎలాంటి కత్తిగాటు లేకుండానే, శస్త్రచికిత్స చేయకుండానే, ఈ ట్రిపుల్ ఎఫ్ బీమ్‌తో సమర్థంగా చికిత్స చేయవచ్చు.
 
 ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధారణ సంప్రదాయ సీటీ స్కానర్లతో పోలిస్తే ఇప్పుడు 4డీ-సీటీ స్కాన్ (ఫోర్త్ డైమన్షనల్ సీటీ) వసతులు సైతం అందుబాటులోకి వచ్చాయి. గతంలోని స్కాన్‌ల సహాయంతో వ్యాధిగ్రస్తమైన క్యాన్సర్ ట్యూమర్‌ను చూసినప్పుడు దాని ఆకృతిలో, పొడవు, వెడల్పు, ఎత్తు వంటి పరిమాణాలలో ఎంతోకొంత తేడా (డిస్టార్షన్) ఉండేది. కానీ ఈ సరికొత్త స్కానర్లతో రోగగ్రస్తమైన భాగాన్ని పరిశీలిస్తే దానిలో ఎలాంటి తేడాలు (డిస్టార్షన్స్) ఉండనంత కచ్చితంగా ట్యూమర్‌లను చూడవచ్చు.
 
 కదులుతున్నా చికిత్స చేయగల ‘రెస్పిరేటరీ గేటింగ్’ టెక్నిక్...
 ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు చికిత్స విషయంలో ఒకింత కష్టమయ్యే అంశం ఏమిటంటే... ఇవి స్థిరంగా ఉండవు. మనం శ్వాసించేటప్పుడు ఇవి క్రమబద్ధంగా కదులుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. అందుకే ఊపిరితిత్తులతో పాటు వాటిపై ఉండే ట్యూమర్ కూడా క్రమబద్ధంగా కదులుతూ ఉంటుంది. రేడియోథెరపీ ఇచ్చే సమయంలో ఈ అంశం డాక్టర్లకు ఒక సవాలుగా ఉంటుంది. ఇప్పుడు ‘రెస్పిరేటరీ గేటింగ్’ అనే ఊపిరితిత్తుల కదలికలను నిత్యం పర్యవేక్షించే ఉపకరణం (మానిటరింగ్ డివైజ్) ఉపయోగపడుతుంది. ఈ రెస్పిరేటరీ గేటింగ్ టెక్నిక్ ఆధారంగా ట్యూమర్ ఎప్పుడూ ఒక నిర్దిష్టమైన స్థానంలో ఉన్నప్పుడే రేడియోథెరపీ తరంగాలు దాన్ని తాకేలా ‘ఆన్’ అవుతూ ఉంటుంది. అంటే... మిగతాచోట్ల ఉన్నప్పుడు తరంగాలు తగలకుండా ‘ఆఫ్’ అయిపోయే ప్రక్రియ నడుస్తుంటుంది. దీనివల్ల రోగగ్రస్థం కాని భాగానికి రేడియోథెరపీ తరంగాలు తగలవు. కేవలం వ్యాధి ఉన్న కణజాలాన్నే ఈ కిరణాలు నాశనం చేస్తాయన్నమాట.
 
 టార్గెటెడ్ థెరపీ: ఇప్పుడు లభ్యమవుతున్న క్యాన్సర్ చికిత్స ప్రక్రియలన్నింటిలోనూ ఇది అత్యాధునికమైనదని చెప్పవచ్చు. దీన్ని కీమోథెరపీతోగాని కీమో, రేడియోథెరపీలతో పాటు గాని ఇస్తుంటారు. ఇందులో నోటి ద్వారానే మందులు తీసుకోవడానికి వీలవుతుంది. దీని కారణంగా గతంలో ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాల్సిన అడ్వాన్స్‌డ్ దశ పేషెంట్లు సైతం ఇప్పుడు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే (ఇంట్లోనే) చికిత్స తీసుకోవచ్చు. అన్ని పనులూ యథావిధిగా చేసుకోవచ్చు. ఫలితంగా రోగి జీవన నాణ్యతలో ఎలాంటి మార్పూ ఉండదన్నమాట. ఈ కారణంగానే ఈ ప్రక్రియ మరింత ప్రాచుర్యం పొందుతోంది.
 
 ఇక సాధారణ కీమోథెరపీలో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ టార్గెటెడ్ థెరపీలో ఉండవు. అందుకే ఇప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు చికిత్స తీసుకోవాల్సి వస్తే రోగులు గతంలోలాగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మునుపటికంటే మెరుగైన చికిత్స తీసుకోవచ్చు.
 
 నిర్వహణ: యాసీన్
 
 నివారణ: పొగతాగే అలవాటును, పొగాకు వాడకాన్ని తక్షణం మానేయడం ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణకు తోడ్పడే విషయం అన్నది తెలిసిందే. దీనికి తోడు ఒకవేళ క్యాన్సర్ వచ్చినవారిలోనూ పొగ అలవాటు లేనట్లయితే మందులు ఇంకా బాగా పనిచేసే అవకాశం ఉంటుందని తేలింది. ఇక పొగతాగేవారి పక్కన ఉండటం  (ప్యాసివ్ స్మోకింగ్) కూడా చేయకూడదు. వాహనపు పొగల వంటి వాహన కాలుష్యం నుంచి, పరిసరాల్లో వ్యాపించే వాతావరణ కాలుష్యం నుంచి దూరంగా ఉండాలి.  పరిశుభ్రమైన వాతావరణంలో నివసించాలి.  
 
 పొగతాగే కోరికను అధిగమించలేని వారికి ఇప్పుడు పొగ తాగే కోరికను తగ్గించే మందులు సైతం అందుబాటులోకి వచ్చాయి. వీటిని వాడటం కూడా ఒక రకంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించడం వంటిదే. అందుకే పొగతాగే అలవాటు ఉన్నవారు, పొగాకు ఏ రూపంలోనైనా వాడే అలవాటు ఉన్నవారు తక్షణం, ఆ అలవాటు నుంచి దూరం కావాలి. అది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు అనేక క్యాన్సర్ల నివారణకు తొలిమెట్టు.
 
 పొగతాగడం మానేయండి... మీకంతా లాభమే...
 మందులు రోగులపై ఎలా పనిచేస్తున్నాయన్న అంశంపై నిర్వహించిన అధ్యయనాల్లో... పొగ అలవాటు లేనివారిలో, మహిళల్లో మందుల ప్రభావం చాలా సమర్థంగా ఉంటోందని తేలింది.
 
 ఇంకా ఆసక్తికరమైన అంశమేమిటంటే... పాశ్చాత్య దేశాల్లోని జనాభా కంటే మన దేశస్థుల్లో (ప్రధానంగా ఆసియా ఖండవాసులందరిలోనూ) ఈ మందులు బాగా పనిచేస్తున్నాయని పరిశోధనల్లో తెలిసింది.
 
 అందుకే పొగతాగడం మానేస్తే ఎన్నో ప్రయోజనాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement