సినీమృగాయణం! | Today Animal Rights Day | Sakshi
Sakshi News home page

సినీమృగాయణం!

Published Wed, Dec 10 2014 12:10 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

సినీమృగాయణం! - Sakshi

సినీమృగాయణం!

నేడు జంతు హక్కుల దినోత్సవం
ఆ రోజు అడవిలో జంతువులన్నీ చేరి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాయి. ‘‘సినిమా సక్సెస్ కావాలంటే నేనో, నా గురించి పాటో ఉండి తీరాల్సిందే’’ అంది కోడి. ‘‘అదెలా?’’ అడిగింది బాతు. ‘‘ఓసోసీ పిల్లకోడి పెట్టా... అనీ, బంగారు కోడి పెట్ట వచ్చెనమ్మా... అనే పాటల వల్లనే ఆ సినిమాలు హిట్టయ్యాయి. ఆ సెంటిమెంట్ కొద్దే మగధీరలో కోడి పాట మళ్లీ పెట్టారు. దీన్నిబట్టి కోళ్లు అంటేనే బ్లాక్‌బస్టర్ ఫార్ములా అని తెలీడం లేదూ!’’ అంది కోడి.
 ‘‘చాల్లే ఊరుకో... బంగారూ బాతుగుడ్డూ... అంటూ మా జాతిని తలుచుకోబట్టే వేటగాడు హిట్టయ్యింది. ఫో... ఫో... నీ బోడి గొప్పలూ, నువ్వూనూ’’ అంటూ ఈసడించింది బాతు.
 

‘‘మీ ఇద్దరూ తప్పే... ఓసోసీ పిల్లకోడి పెట్టా... అన్న పల్లవిలో వెంటనే ‘నా వయ్యారీ పావురాయి పిఠ్ఠా’ అంటారు ఎన్టీఆర్. అంటే కోడి ఫోర్సు సరిపోక పావురాళ్లను వాడుకున్నారన్నమాట’’ అంటూ తన గొప్ప చెప్పుకుంటూ వాదనకు దిగింది పావురాయి పిట్ట. ఈలోపు సరసరా పాక్కుంటూ వచ్చింది నాగుపాము. ‘‘సినిమా బ్లాక్‌బస్టర్ కావాలంటే నాగుపాము ఉండి తీరాల్సిందే. ‘నోము’ లాంటి అలనాటి చిత్రాల నుంచి ‘నగీనా’ లాంటి సినిమాల వరకూ అన్నింట్లో నేనుండాల్సిందే. అనకొండ అనీ... అది మాకు దూరబ్బంధువులే! సాక్షాత్తూ హాలీవుడ్ వాళ్లూ మా రిలేటివ్ అయిన దాన్ని పెట్టి సినిమాలు తీస్తుంటారు తెల్సా’’ అంటూ కస్సు ‘బుస్సు’మంది పాము.
 
‘‘విలన్ అబద్ధాలకు నీ రెండు నాల్కలను ఉదాహరణగా చూపిస్తారు. ఫో... ఫో... నీ గొప్పలూ నువ్వూనూ’’ అంటూ విసుక్కున్నాయి పిట్టలు. ‘‘అలనాటి రాజుల సినిమాల నుంచి ఇవ్వాళ్టి మగధీర వరకూ హార్స్ ఉందంటే సినిమాలో ఫోర్స్ ఉన్నట్లే’’ అన్నాయి గుర్రాలు. ఇంతలో గాండ్రిస్తూ సీన్‌లోకి ఎంటరైంది పులి. ‘‘ఆగండాగండి. ఎంత పెద్ద హీరో అయినా నాతో పోల్చుకోవాల్సిందే. ‘పులితో ఫొటో దిగాలనుకున్నావనుకో కాస్త రిస్కయినా పర్లేదు గానీ... చనువిచ్చింది కదా అని పులితో ఆడుకున్నావనుకో...’ అంటూ నాతో గేమ్సాడితే జరిగే పరిణామాలను చెప్పకనే చెబుతాడు హీరో’’ అంటూ తన గొప్పల్ని చెప్పింది పులి.
 
‘‘ఆపండెహె మీ గోల. మీ అందరికంటే నేనే గొప్ప. మాతో పోల్చుకుంటూ హీరో ఏమంటాడో తెల్సా... ‘అడవిలో సింహం... ఇక్కడ నేనూ సేమ్ టు సేమ్ రా. అది గెడ్డం చేసుకోదు... నేను గెడ్డం చేసుకుంటానంతే’ అంటాడు. దీన్నిబట్టి తెలిసేదేమిటి? సింహం ప్రస్తావన ఉంటేనే సినిమాకు సింహబలమొస్తుందన్నమాట’’ గొప్పలు పోయింది సింహం.
 
ఈలోపు బొద్దింక గొంతు సవరించుకుంది. అంతే... అక్కడున్న జంతువులన్నీ ఒక్కసారిగా నవ్వాయి. ‘‘నీకు ఇక్కడ మాట్లాడే సీన్ లేదు. ఫో’’ అంటూ కసురుకున్నాయి జంతువులు. ‘‘మీరంతా మీ ఇండివిడ్యువల్ గొప్పలు చెప్పుకొన్నారు. నేనలా కాదు... ప్రేమే నా మార్గం. సీన్లో నేను కనబడీ కనబడగానే హీరోయిన్ ఎగిరి హీరో అక్కున చేరి ముద్దుముద్దుగా...‘బొద్దింక... అదంటే నాకు భయం’ అంటుంది. అంతే...! అప్పటివరకూ హీరో హీరోయిన్ల మధ్య సెలైంట్‌గా లేటెంట్‌గా ఉన్న ప్రేమ కాస్తా పెల్లుబికి డ్యుయెట్‌లా పారుతుంది.

ఇలా పాట పెట్టడానికి డెరైక్టర్‌కి అవకాశం ఇచ్చేది ఎవరో తెల్సా? నేనే’’ అంటూ మీసాలు తిప్పింది బొద్దింక. ఆ మాటకొస్తే... తన టైటిల్ తోనే తనపై ఫుల్ లెంత్ సినిమా తీశారని ఈగా, ఐశ్వర్యా రాయ్ మెప్పు కోసం సాక్షాత్తూ రోబోయే తమను పట్టుకోడానికి అవస్తలు పడ్డాడని దోమలు సైతం సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాయి.
 
‘‘ఇలా ఎవరి గొప్పలు వాళ్లమే చెప్పుకుంటూ పోతే ఎలా? మన గొప్పను సినీరంగమూ గుర్తించాలి కదా. అందుకు ఏం చేయాలో నక్కను అడుగుదాం. అందరిలోకీ తెలివైనది అదేకదా’’ అని ఒక నిర్ణయానికి వచ్చాయి జంతువులన్నీ. సరే అని నక్క తన సలహా ఇలా చెప్పింది...
 ‘‘మొన్న హుద్‌హుద్ తుఫాను వచ్చినప్పుడు పరిశ్రమలోని పెద్ద సార్లూ, పెద్ద స్టార్లూ, చిన్న నటులంతా ‘మేము సైతం’ అంటూ సహాయం చేశారు కదా.

మరి వాళ్ల సినిమాల హిట్ల కోసం మనం సైతం కష్టపడుతున్నాం కదా. కాబట్టి జంతుహక్కుల కోసం వాళ్లు ఏదైనా చేస్తారేమో చూద్దామా? ఎందరు స్టార్లు... సినిమాల్లో తమకు అండగా ఉండే ఈ జంతువుల సంక్షేమం కోసం పాటుపడతారో లేక సామాన్య జనాలే జంతువులకు సాయం చేసి నిజజీవితంలో రియల్ హీరోలవుతారో చూద్దాం! అంటూ ఓ ఊళ వేసింది నక్క.             - యాసీన్

Related News By Category

Related News By Tags

Advertisement