Animal Rights Day
-
National Animal Rights Day: జంతువులను ప్రేమిద్దాం..
మన కాలనీలో ఓ కుక్క కాలు విరిగి ఈడ్చుకుంటూ వెళుతుంటుంది... చూసి, పట్టనట్టు వెళ్లిపోతుంటాం. ఓ చిన్న సందులో పిల్లి ఇరుక్కుని గిలగిల్లాడుతుంటుంది ... దానిని కాపాడటం మన పని కాదులే అని తప్పుకుంటాం. వాటికి ఆకలేసినా, ప్రమాదాలు జరిగినా మనసున్న మనుషులుగా మనమెంతవరకు పట్టించుకుంటున్నాం? మనతో పాటు మూగజీవాలకూ బతికే హక్కు ఉందని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిది అని అంటున్నారు హైదరాబాద్‌లో ఉంటున్న జంతుప్రేమికులు సాయిశ్రీ, పంచ్, శారద, డాక్టర్ కృష్ణప్రియ. ప్రజలలో మూగ జీవాల పట్ల అవగాహన కలిగించేందుకు, సురక్షితంగా ఉంచేందుకు నార్డ్ గ్లోబల్ ఆర్గనైజేషన్‌తో కలిసి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నేషనల్ యానిమల్ రైట్స్ డే సందర్భంగా జంతు ప్రేమికులు చెబుతున్న విషయాలు. స్కూల్, కాలేజీలకు వెళ్లి.. జంతువులకు కూడా జీవించే హక్కు ఉంది అని చెప్పడానికి నార్డ్ అనే సంస్థ అంతర్జాతీయంగా వర్క్ చేస్తుంది. కొన్ని ఆర్గనైజేషన్స్‌తో కలిసి వర్క్ చేస్తాం. ప్రజల్లో అవగాహన కల్పించడమే ఉద్దేశంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి. మూడేళ్లుగా యానిమల్ సేవలో పాల్గొంటున్నాను. మనిషి కారణంగా ఏ జంతువూ బాధపడకూడదు. ఎవరూ వాటిని హింసించకూడదు. నేను ఒక స్ట్రీట్ డాగ్‌ను దత్తత తీసుకున్నా. అప్పటి నుంచి నాకు ఈ సేవ పట్ల ఆసక్తి పెరిగింది. స్కూల్, కాలేజీలకు వెళ్లి కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తుంటాం. జంతు ఆధారిత ఉత్పత్తులను ఏవీ ఉపయోగించం. – పంచ్, యానిమల్ యాక్టివిస్ట్, సైనిక్‌పురి పూర్తి సమయం కేటాయింపు.. మన వీధిలో ఒక కుక్క ఉందంటే అది ఆ కాలనీవారందరి బాధ్యతగా ఉండాలి. దానికి ఏదైనా దెబ్బ తగిలినా, తిండి లేకుండా పడి ఉన్నా ఎవరూ పట్టించుకోరు. అలాంటి కుక్కలు, పిల్లలు, గోవులు... వీధుల్లో తిరిగేవాటిని తీసుకొచ్చి, సేవ చేస్తాం. వీధుల్లో ఉండే కుక్కలకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేయిస్తాం. ఐదేళ్లయ్యింది ఈ వర్క్ చేయబట్టి. ఎనిమిదేళ్ల క్రితం మా ఫ్రెండ్ అక్కవాళ్ల దగ్గర నుంచి ఒక కుక్కను తీసుకున్నాను. స్ట్రీట్ డాగ్స్‌కు దెబ్బలు తగిలినప్పుడు ట్రీట్మెంట్ చేసేదాన్ని, చేయించేదాన్ని. ఆ తర్వాత షెల్టర్ స్టార్ట్ చేశాను. దీనికి మరొక ఫౌండర్ జత కలవడంతో ఇప్పుడు ఇక్కడ రెండు వందల వరకు యానిమల్స్ ఉన్నాయి. గోవులు ఆరున్నాయి. ఇప్పటి వరకు నాలుగు వేల స్ట్రీట్ యానిమల్స్‌కి సేవలందించాను. నేషనల్ బాక్సర్‌గా ఉన్న నేను ఈ వైపుగా ఆసక్తి పెరగడంతో పూర్తి సమయాన్ని జంతువుల సేవకే కేటాయిస్తున్నాను. వీగన్ పదార్థాల తయారీ, ప్రొడక్ట్స్ బిజినెస్ కూడా చేస్తుంటాను. వీటి వల్ల వచ్చే ఆదాయంలో 15 శాతం జంతు సేవలకే ఉపయోగిస్తుంటాను. – సాయి శ్రీ, బోరంపేట్, దుండిగల్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది.. మా అపార్ట్మెంట్ దగ్గర 20 కుక్కలను సేవ్ చేసి, వాటికి షెల్టర్ ఏర్పాటు చేశాను. ఇందుకు చాలా మందితో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కుక్కలకు ఆహారం పెడుతుంటే, పై నుంచి బాటిల్స్ వేసినవారున్నారు. అవే కుక్కల మీద పడితే, వాటికి ఎంత ప్రమాదం జరిగేదో అస్సలు ఆలోచించరు. న్యూసెన్స్ అవుతుందని కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సి వచ్చింది. యానిమల్ రైట్స్ గురించి చెప్పినప్పుడు, అందరూ తగ్గారు. మొదట్లో స్ట్రీట్ డాగ్‌ని దత్తత తీసుకొని, పెంచేదాన్ని. ఆ తర్వాత ఆ కాలనీలో తిరుగుతున్నవాటిని రెస్క్యూ చేయడం మొదలుపెట్టాను. అక్కడి నుంచి మా ఫ్రెండ్ షెల్టర్‌కి పంపిస్తుంటాను. – శారద, యానిమల్ యాక్టివిస్ట్, ప్రగతినగర్ బ్లడ్ అవసరమైతే.. నేను డెంటిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. అలాగే, అవసరమైన డాగ్స్‌కి బ్లడ్ అందేలా చూస్తుంటాను. నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం. ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ల కుక్కకు ప్రమాదం జరిగి, బ్లడ్ అవసరమైంది. ఆ సమయంలో మరో కుక్క నుంచి బ్లడ్ తీసి, మ్యాచ్ చేసి ప్రమాదం నుంచి గట్టెక్కించారు. అప్పటి నుంచి కుక్కలకు కూడా బ్లడ్ అవసరం అని భావించి, రికార్డ్ చేస్తున్నాను. ఇందుకు సంబంధించి వెటర్నరీ డాక్టర్స్‌ని, వారి ద్వారా అవసరమైన కుక్కలకు మరో పెట్ పేరెంట్ ద్వారా బ్లడ్ అందేలా చూస్తుంటాను. – డాక్టర్ కృష్ణప్రియ, మలక్‌పేట – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సినీమృగాయణం!
నేడు జంతు హక్కుల దినోత్సవం ఆ రోజు అడవిలో జంతువులన్నీ చేరి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాయి. ‘‘సినిమా సక్సెస్ కావాలంటే నేనో, నా గురించి పాటో ఉండి తీరాల్సిందే’’ అంది కోడి. ‘‘అదెలా?’’ అడిగింది బాతు. ‘‘ఓసోసీ పిల్లకోడి పెట్టా... అనీ, బంగారు కోడి పెట్ట వచ్చెనమ్మా... అనే పాటల వల్లనే ఆ సినిమాలు హిట్టయ్యాయి. ఆ సెంటిమెంట్ కొద్దే మగధీరలో కోడి పాట మళ్లీ పెట్టారు. దీన్నిబట్టి కోళ్లు అంటేనే బ్లాక్‌బస్టర్ ఫార్ములా అని తెలీడం లేదూ!’’ అంది కోడి. ‘‘చాల్లే ఊరుకో... బంగారూ బాతుగుడ్డూ... అంటూ మా జాతిని తలుచుకోబట్టే వేటగాడు హిట్టయ్యింది. ఫో... ఫో... నీ బోడి గొప్పలూ, నువ్వూనూ’’ అంటూ ఈసడించింది బాతు. ‘‘మీ ఇద్దరూ తప్పే... ఓసోసీ పిల్లకోడి పెట్టా... అన్న పల్లవిలో వెంటనే ‘నా వయ్యారీ పావురాయి పిఠ్ఠా’ అంటారు ఎన్టీఆర్. అంటే కోడి ఫోర్సు సరిపోక పావురాళ్లను వాడుకున్నారన్నమాట’’ అంటూ తన గొప్ప చెప్పుకుంటూ వాదనకు దిగింది పావురాయి పిట్ట. ఈలోపు సరసరా పాక్కుంటూ వచ్చింది నాగుపాము. ‘‘సినిమా బ్లాక్‌బస్టర్ కావాలంటే నాగుపాము ఉండి తీరాల్సిందే. ‘నోము’ లాంటి అలనాటి చిత్రాల నుంచి ‘నగీనా’ లాంటి సినిమాల వరకూ అన్నింట్లో నేనుండాల్సిందే. అనకొండ అనీ... అది మాకు దూరబ్బంధువులే! సాక్షాత్తూ హాలీవుడ్ వాళ్లూ మా రిలేటివ్ అయిన దాన్ని పెట్టి సినిమాలు తీస్తుంటారు తెల్సా’’ అంటూ కస్సు ‘బుస్సు’మంది పాము. ‘‘విలన్ అబద్ధాలకు నీ రెండు నాల్కలను ఉదాహరణగా చూపిస్తారు. ఫో... ఫో... నీ గొప్పలూ నువ్వూనూ’’ అంటూ విసుక్కున్నాయి పిట్టలు. ‘‘అలనాటి రాజుల సినిమాల నుంచి ఇవ్వాళ్టి మగధీర వరకూ హార్స్ ఉందంటే సినిమాలో ఫోర్స్ ఉన్నట్లే’’ అన్నాయి గుర్రాలు. ఇంతలో గాండ్రిస్తూ సీన్లోకి ఎంటరైంది పులి. ‘‘ఆగండాగండి. ఎంత పెద్ద హీరో అయినా నాతో పోల్చుకోవాల్సిందే. ‘పులితో ఫొటో దిగాలనుకున్నావనుకో కాస్త రిస్కయినా పర్లేదు గానీ... చనువిచ్చింది కదా అని పులితో ఆడుకున్నావనుకో...’ అంటూ నాతో గేమ్సాడితే జరిగే పరిణామాలను చెప్పకనే చెబుతాడు హీరో’’ అంటూ తన గొప్పల్ని చెప్పింది పులి. ‘‘ఆపండెహె మీ గోల. మీ అందరికంటే నేనే గొప్ప. మాతో పోల్చుకుంటూ హీరో ఏమంటాడో తెల్సా... ‘అడవిలో సింహం... ఇక్కడ నేనూ సేమ్ టు సేమ్ రా. అది గెడ్డం చేసుకోదు... నేను గెడ్డం చేసుకుంటానంతే’ అంటాడు. దీన్నిబట్టి తెలిసేదేమిటి? సింహం ప్రస్తావన ఉంటేనే సినిమాకు సింహబలమొస్తుందన్నమాట’’ గొప్పలు పోయింది సింహం. ఈలోపు బొద్దింక గొంతు సవరించుకుంది. అంతే... అక్కడున్న జంతువులన్నీ ఒక్కసారిగా నవ్వాయి. ‘‘నీకు ఇక్కడ మాట్లాడే సీన్ లేదు. ఫో’’ అంటూ కసురుకున్నాయి జంతువులు. ‘‘మీరంతా మీ ఇండివిడ్యువల్ గొప్పలు చెప్పుకొన్నారు. నేనలా కాదు... ప్రేమే నా మార్గం. సీన్లో నేను కనబడీ కనబడగానే హీరోయిన్ ఎగిరి హీరో అక్కున చేరి ముద్దుముద్దుగా...‘బొద్దింక... అదంటే నాకు భయం’ అంటుంది. అంతే...! అప్పటివరకూ హీరో హీరోయిన్ల మధ్య సెలైంట్‌గా లేటెంట్గా ఉన్న ప్రేమ కాస్తా పెల్లుబికి డ్యుయెట్‌లా పారుతుంది. ఇలా పాట పెట్టడానికి డెరైక్టర్‌కి అవకాశం ఇచ్చేది ఎవరో తెల్సా? నేనే’’ అంటూ మీసాలు తిప్పింది బొద్దింక. ఆ మాటకొస్తే... తన టైటిల్ తోనే తనపై ఫుల్ లెంత్ సినిమా తీశారని ఈగా, ఐశ్వర్యా రాయ్ మెప్పు కోసం సాక్షాత్తూ రోబోయే తమను పట్టుకోడానికి అవస్తలు పడ్డాడని దోమలు సైతం సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాయి. ‘‘ఇలా ఎవరి గొప్పలు వాళ్లమే చెప్పుకుంటూ పోతే ఎలా? మన గొప్పను సినీరంగమూ గుర్తించాలి కదా. అందుకు ఏం చేయాలో నక్కను అడుగుదాం. అందరిలోకీ తెలివైనది అదేకదా’’ అని ఒక నిర్ణయానికి వచ్చాయి జంతువులన్నీ. సరే అని నక్క తన సలహా ఇలా చెప్పింది... ‘‘మొన్న హుద్‌హుద్ తుఫాను వచ్చినప్పుడు పరిశ్రమలోని పెద్ద సార్లూ, పెద్ద స్టార్లూ, చిన్న నటులంతా ‘మేము సైతం’ అంటూ సహాయం చేశారు కదా. మరి వాళ్ల సినిమాల హిట్ల కోసం మనం సైతం కష్టపడుతున్నాం కదా. కాబట్టి జంతుహక్కుల కోసం వాళ్లు ఏదైనా చేస్తారేమో చూద్దామా? ఎందరు స్టార్లు... సినిమాల్లో తమకు అండగా ఉండే ఈ జంతువుల సంక్షేమం కోసం పాటుపడతారో లేక సామాన్య జనాలే జంతువులకు సాయం చేసి నిజజీవితంలో రియల్ హీరోలవుతారో చూద్దాం! అంటూ ఓ ఊళ వేసింది నక్క. - యాసీన్