ఎముక క్యాన్సర్లు అస్థికకు అనర్థం | Stapes bone cancers | Sakshi
Sakshi News home page

ఎముక క్యాన్సర్లు అస్థికకు అనర్థం

Published Mon, Dec 1 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

ఎముక క్యాన్సర్లు అస్థికకు అనర్థం

ఎముక క్యాన్సర్లు అస్థికకు అనర్థం

శరీరం లోపల మనకు ఎముక లేకపోతే... అసలు మనకు రూపమే ఉండదు. ఎముకల సముదాయంతో అస్థిపంజరం మనకో అస్థిత్వాన్ని ఇస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆకృతికి మూలం అస్థిసముదాయమే. శరీరంలోని భాగమే కాబట్టి అన్ని అవయవాల్లాగే దానికీ క్యాన్సర్ల వంటి జబ్బులు వస్తాయి. కాకపోతే నేరుగా ఎముకకే క్యాన్సర్ రావడం కాస్తంత అరుదు. కానీ ఇతర క్యాన్సర్లు ఎముకలకు పాకడం  సాధారణం. ఎముకలకు వచ్చే క్యాన్సర్లు, వాటి లక్షణాలు, ఇటీవల ఈ రంగంలోనూ వచ్చిన ఆధునిక చికిత్సల వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం.
 
రకాలు...
బయటకు కనిపించే శరీరాకృతిని అలా నిలబెట్టి ఉంచడానికి తోడ్పడేవి ఎముకలే. వీటిలో మూడు రకాల కణాలు ఉంటాయి. మొదటివి ఆస్టియోబ్లాస్ట్స్ (ఎముక పెరిగే సమయంలో దీని నుంచే కొత్త కణాలు పుడుతుంటాయి); రెండోవి ఆస్టియోసైట్స్ (అంటే ఇవి ప్రధాన ఎముక కణాలన్నమాట), మూడో రకం కణాలను ఆస్టియోక్లాస్ట్స్ అంటారు. అంటే ఎముక కణాల జీవితం పూర్తయ్యాక వాటిని శిథిలం చేసే కణాలివి.
 
ఎముక క్యాన్సర్ గురించి తెలుసుకునే ముందు మనం క్యాన్సర్ గురించీ కాస్త తెలుసుకోవాలి. ఏ అవయవంలోని కణాలైనా ఒక నిర్దిష్ట క్రమంలో కాకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా హానికరమైన రీతిలో పెరగడమే క్యాన్సర్. ఇది శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు. శరీరంలోని ఏ భాగంలో క్యాన్సర్ మొదలైతే... దాన్ని ఆ అవయవ క్యాన్సర్‌గా చెబుతారు. ఉదాహరణకు ఊపిరితిత్తులకు క్యాన్సర్ వస్తే దాన్ని లంగ్ క్యాన్సర్ అంటారు. ఏ భాగానికి ముందుగా క్యాన్సర్ వచ్చిందో దాన్ని ప్రైమరీ క్యాన్సర్ అంటారు. ఇక క్యాన్సర్ అన్నది ఆ భాగానికే పరిమితం కాకుండా అలా ఎటుపడితే అటు పెరిగిపోతుందన్న విషయం కూడా తెలిసిందే. ఇలా ఒక క్యాన్సర్ పెరగడాన్ని మెటస్టాసిస్ అంటారు.
 
క్యాన్సర్ అన్నది తొలుత ఎముకలోనే మొదలైతే దాన్ని ‘ప్రైమరీ బోన్ క్యాన్సర్’ అంటారు. ఒకవేళ శరీరంలోని వేరే ఏదైనా భాగానికి క్యాన్సర్ వచ్చి అది పాకే (మెటాస్టాటైజ్) క్రమంలో ఎముకకు చేరితే దాన్ని సెకండరీ బోన్ క్యాన్సర్ అంటారు. మామూలుగా ఈ క్యాన్సర్ ఏ ఎముకకైనా రావచ్చు. కానీ చిన్న ఎముకలతో పోలిస్తే పొడుగ్గా పెరిగేందుకు అవకాశం ఉన్న కాళ్లు, చేతుల ఎముకలకు రావడం ఒకింత ఎక్కువ.

సాధారణంగా నేరుగా ఎముకకు క్యాన్సర్ రావడం అరుదే అయినప్పటికీ... రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటివి వచ్చి... ఆ కణుతులు పెరుగుతూ ఎముకలకు పాకి... నిర్దిష్టమైన ఆకృతిలో సాఫీగా ఉండే ఎముకలపై సైతం కణుతులుగా ఏర్పడతాయి. ఇవి గాక... శరీరంలోని మృదు కణజాలమైన చర్మం, కండరాలు, నరాలూ-రక్తనాళాల సముదాయం, కొవ్వు కణాలు, ఎముకలోనే ఉండే మృదువైన కణజాలపు పొర సైనోవియమ్ వంటి వాటికి వచ్చే క్యాన్సర్లు మరో రకం.
 
 
లక్షణాలు

ఎముకలో నొప్పి: ఎముకని ఏదైనా భాగంలో కణితి పెరగగానే కనిపించే మొదటి లక్షణం నొప్పి. తొలుత ఈ నొప్పి రోజులోని ఏదో ఒక సమయంలో వస్తుంటుంది. క్యాన్సర్ పెరుగుతున్న కొద్దీ నొప్పి వచ్చే వ్యవధి కూడా పెరుగుతుంది. అయితే ప్రతి నొప్పినీ క్యాన్సర్‌గా భావించనవసరం లేదు. ఎందుకంటే ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి సాధారణ జబ్బుల్లోనూ ఎముకలూ, కీళ్లలో నొప్పులు వస్తాయి. ఇదే సమయంలో మరో విషయమూ గుర్తుంచుకోవాలి. ఒక్కోసారి ఎముకలకు వచ్చే కణుతులను ఆటల్లో తగిలిన గాయాలుగా పొరబడే అవకాశమూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా పరీక్ష చేయించుకుని, క్యాన్సర్ కాదని నిర్ధారణ అయితే నిశ్చింతగా ఉండాలి.
 
వాపు : ఎముకలో నొప్పి వచ్చే చోట, వాపు కూడా కనిపించవచ్చు.
ఎముక విరగడం : సాధారణంగా క్యాన్సర్ కణాలు వృద్ధి చెందిన ప్రాంతంలో ఎముక బలహీనంగా మారుతుంది. అందుకే అక్కడ అది తేలిగ్గా విరుగుతుంది.
 
శరీర కదలికలు తగ్గడం : సాధారణంగా ఎముక క్యాన్సర్‌లో కణితి కీళ్ల వద్ద వస్తే మామూలు కదలికలు సైతం తీవ్రమైన నొప్పిని కలగజేస్తాయి. కాబట్టి శరీర కదలికలు తగ్గుతాయి.
 ఇతర లక్షణాలు: ఎముకల్లో నొప్పితో పాటు బరువు తగ్గడం వంటి అవాంఛిత పరిణామాలూ, నీరసం, నిస్సత్తువ కనిపిస్తాయి. క్యాన్సర్ ఇతర అవయవాలకు పాకితే సదరు అవయవానికి చెందిన లక్షణాలూ కనిపిస్తుంటాయి.
 
ఎముక మృదుకణజాల క్యాన్సర్లలో : ఎముకలోని మృదు కణజాలానికి క్యాన్సర్ వ్యాపించినప్పుడు తొలి దశల్లో లక్షణాలు అంతగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఎముక మృదుకణజాలానికి సాగేగుణం (ఎలాస్టిసిటీ) ఎక్కువ. మనం దాన్ని కనుగొనే సమయానికి దాని పరిమాణం చాలా పెద్దగా పెరిగిపోయి ఉంటుంది. అందుకే ఈ తరహా క్యాన్సర్లలో మొదటి లక్షణం... నొప్పి లేని గడ్డ. ఈ గడ్డ పెరుగుతూ పోతున్నకొద్దీ నరాలనూ, కండరాలనూ నొక్కుతూ వాటిపై ఒత్తిడి పెంచుతుంది. దాంతో నొప్పి కలుగుతుంది.
 
ప్రైమరీ బోన్ క్యాన్సర్
 క్యాన్సర్ ముందుగా ఎముకలోనే పుట్టడాన్ని ప్రైమరీ క్యాన్సర్ అంటారన్నది తెలిసిందే. ఈ తరహా క్యాన్సర్‌ను ‘సార్కోమా’ అంటారు. ఇందులోని మరికొన్ని రకాలివి...

ఆస్టియోసార్కోమా: ఎముకలోనే పుడుతుంది కాబట్టి దీన్ని ‘ఆస్టియోజెనిక్ సార్కోమా’ అని కూడా అంటారు. ఎముక క్యాన్సర్లలో ఇది అత్యంత సాధారణంగా కనిపిస్తుంది. ప్రధానంగా భుజాలు, కాళ్లు, పృష్టభాగం (పెల్విస్) ప్రాంతపు ఎముకల్లో 10 నుంచి 30 ఏళ్ల వారికి వచ్చే అవకాశాలు ఎక్కువ.

కాండ్రోసార్కోమా : ఎముకల చివర్లో మృదువైన అస్థికణజాలం ఉంటుంది. దీన్నే కార్టిలేజ్ అంటారు. ఈ కార్టిలేజ్‌లో వచ్చే క్యాన్సర్‌ను కాండ్రోసార్కోమా అంటారు. సాధారణంగా ఇది 20 ఏళ్లలోపు వారికి చాలా అరుదు. అయితే వయసుతో పాటు ఎదుగుతున్న క్రమంలో ఇది వచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువ.

ఎవింగ్స్ సార్కోమా : ఇది ఎముకల్లోనూ మొదలుకావచ్చు లేదా కండరాల్లోనూ ఆవిర్భవించవచ్చు. పిల్లలు, టీనేజర్లలో ఎక్కువగా కనిపించే సాధారణ క్యాన్సర్లలో దీనిని మూడో స్థానం.

ఫైబ్రోసార్కోమా అండ్ మ్యాలిగ్నెంట్ ఫైబ్రస్ హిస్టియోసైటోమా : ఈ రెండు రకాల క్యాన్సర్లూ వృద్ధుల ఎముకల చివర్లలో ఉండే మృదుకణజాలంలో మొదలవుతాయి. ప్రధానంగా భుజాలు, కాళ్లు, దవడ ఎముకల్లో ఈ తరహా క్యాన్సర్ల మొదలవుతాయి.

జెయింట్ సెల్ ట్యూమర్ ఆఫ్ బోన్: ఈ తరహా క్యాన్సర్‌లలో నిరపాయకరమైనవీ ఉంటాయి. హాని చేసేవీ ఉంటాయి. అయితే అపాయం కలిగించని తరహావే ఎక్కువ. సాధారణంగా యుక్తవయస్కులు, మధ్యవయస్కుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. చాలావరకు పాకకుండా స్థిరంగా ఉంటాయి. శస్త్రచికిత్స తర్వాత మళ్లీ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ.

కాడోమా: సాధారణంగా 30 ఏళ్లు దాటినవారిలో ఇది వెన్నెముకకుగానీ లేదా పుర్రె కింది భాగపు ఎముకలకు గాని వచ్చే క్యాన్సర్. మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఇది వచ్చే అవకాశాలు రెండు రెట్లు ఎక్కువ. చాలా నెమ్మదిగా పెరుగుతాయి. కానీ విస్తరించవు. అయితే శస్త్రచికిత్స తర్వాత మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువ. అప్పుడవి ఊపిరితిత్తులకూ, కాలేయానికీ, లింఫ్‌నోడ్స్‌కూ వ్యాపిస్తాయి.
 
ఎముక క్యాన్సర్... దశలు
ఎముక క్యాన్సర్‌ను అక్కడి నుంచి చిన్న ముక్క తీసి (బయాప్సీ), పరీక్షించి నిర్ధారణ చేస్తారు. అది ఏ మేరకు పాకింది, ఎంత విస్తరించిందన్న అంశాల ఆధారంగా క్యాన్సర్ ఏ దశలో ఉందన్నది నిర్ధారణ చేస్తారు. బయాప్సీ ద్వారా క్యాన్సర్ దశలో ఉందన్న విషయాన్ని నిర్ణయించడం పైనే చికిత్స ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎముకకు క్యాన్సర్ అని, అది ఏ దశలో ఉందన్నది నిర్ధారణ అయితే ఇతర ఆర్థోపెడిక్ సర్జన్లతోనూ సంప్రదించి, రోగిని బతికించడానికి సదరు అవయవాన్ని ఏ మేరకు తొలగించాలన్న విషయాన్నీ నిర్ధారణ చేస్తారు.
 
సాధారణంగా ఎముక క్యాన్సర్ ఏ దశలో ఉందనే విషయాన్ని నిర్ధారణ చేయడానికి అమెరికన్ జాయింట్ కమిషన్ ఆన్ క్యాన్సర్ (ఏజేసీసీ)  రూపొందించిన మార్గదర్శకాలను పాటిస్తున్నారు. ఇందులో ట్యూమర్ (టీ), లింఫ్ నోడ్ (ఎన్), మెటాస్టాసిస్ (ఎమ్) అనే మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. దీన్ని బట్టి క్యాన్సర్ ఏ దశ (గ్రేడ్)లో ఉందో తెలుసుకుంటారు. అందుకే ఈ దశను ‘జీ’ (గ్రేడ్) అనే ఇంగ్లిష్ అక్షరం ద్వారా సూచిస్తారు. జీ1, జీ2 అనే దశలో తక్కువ తీవ్రమైనవిగానూ, జీ3, జీ4 దశలో చాలా తీవ్రమైనవిగానూ నిర్ణయిస్తారు. వ్యాధి తీవ్రత ఆధారంగా చికిత్స ప్రక్రియలు మారుతుంటాయి.
 
సెకండరీ బోన్ క్యాన్సర్
ఇక ఈ తరహా క్యాన్సర్లు శరీరంలోని ఏ భాగంలోనైనా ఆవిర్భవించి, ఎముకకు పాకితే దాన్ని సెకండరీ క్యాన్సర్‌గా చెప్పుకోవచ్చు. రక్తప్రవాహంతో గానీ, లింఫ్ ప్రవాహంతోగానీ క్యాన్సర్ కణాలు ఎముకకు పాకి అక్కడ పెరుగుతాయి. ఈ తరహా క్యాన్సర్ల సాధారణంగా శరీరం మధ్యభాగంలో ఉండే ఎముకలు అంటే పృష్ఠభాగం (పెల్విస్)లోగానీ వెన్నెముక (స్పైన్)లోగాని కనిపిస్తాయి.
 
 
చికిత్స ప్రక్రియలు
ఎముక క్యాన్సర్‌కు ఇప్పటివరకూ అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయ చికిత్స ప్రక్రియలు... శస్త్రచికిత్స, కీమోథెరపీ, ఫ్రాక్షనేటెడ్ డోస్ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ.
 
శస్త్రచికిత్స : ఇక ఎముకల మృదు కణజాలానికి క్యాన్సర్ వస్తే అనుసరించే ప్రక్రియల్లో శస్త్రచికిత్స చాలా సాధారణం. ఈ శస్త్రచికిత్సల్లోనూ తొలిదశలో క్యాన్సర్‌ను గుర్తించినా లేదా చుట్టూ ఉన్న మృదుకణజాలానికే క్యాన్సర్ పరిమితమైనా... శస్త్రచికిత్స ప్రక్రియను అనుసరించినప్పటికీ, వ్యాధి సోకిన అవయవాన్ని సాధ్యమైనంత వరకు తొలగించకుండా రక్షించడానికే ప్రయత్నిస్తారు. ఒకవేళ క్యాన్సర్ ముదిరిపోయిన దశలో ఉంటే అప్పుడు కూడా అవయవాన్ని తొలగించాల్సిన పరిస్థితుల్లోనూ... కేవలం ఎముకను మాత్రమే తొలగించి, దాని స్థానంలో లోహంతో తయారు చేసిన, కొత్తదైన కృత్రిమ ఎముకను అమర్చి అవయవం ఎప్పటిలాగే ఉంచేలా చూస్తారు.

ఒకవేళ క్యాన్సర్ గనక లింఫ్‌నోడ్స్‌కు చేరితే... (లింఫ్‌నోడ్స్... అన్ని అవయవాలకూ క్యాన్సర్‌ను చేర్చే గేట్ వే లాంటివి కాబట్టి) వాటిని పూర్తిగా తొలగిస్తారు. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ కణజాలాన్ని తొలగించాక... ఆ అవయవం మునుపటి ఆకృతి కోల్పోతే... అది ముందులాగే ఉండేలా చూసేందుకు ‘రీ-కన్‌స్ట్రక్టివ్ సర్జరీ లేదా రీప్లేస్‌మెంట్ సర్జరీ’ని నిర్వహిస్తారు. ఇక క్యాన్సర్ కారణంగా ఎముకలకు తీవ్రమైన నొప్పి వస్తే... చివరి ఉపశమనంగా నిర్వహించే శస్త్రచికిత్సను ‘ప్యాలియేటివ్ సర్జరీ’ అంటారు.

ఇందులో ఏ రకమైన శస్త్రచికిత్సను ఎంపిక చేయాలన్న అంశం... వ్యాధి ఏ దశలో ఉంది, ఎముకలోని ఏ ప్రాంతంలో ఉంది, ఆ క్యాన్సర్ గడ్డ సైజ్ ఎంత, రోగి తాలూకు ఇతర ఆరోగ్యపరిస్థితులేమిటి వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. దీనితో పాటు అవసరాన్ని బట్టి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ కూడా ఇవ్వాలి.
 
సర్జరీ అవసరం లేకుండా చేసే చికిత్సలు: క్యాన్సర్ గడ్డ ఏ రకానికి చెందినది, అది ఏ ప్రాంతంలో ఉంది అన్న అంశం ఆధారంగా చేయాల్సిన చికిత్స-ప్రణాళికను నిర్ణయిస్తారన్నది తెలిసిందే. ఒకవేళ శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం లేని సందర్భాల్లో క్యాన్సర్ కణాలను నాశనం చేసే బీమ్‌రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి మార్గాలు అనుసరిస్తారు. అయితే క్యాన్సర్ ఉన్న ప్రాంతం, గ్రేడ్, రోగి వయసు, ఆరోగ్యపరిస్థితి వంటి అనేక అంశాల ఆధారంగా శస్త్రచికిత్స, కీమో, రేడియేషన్ థెరపీలను సంయుక్తంగా ఉపయోగించుకుంటారు.
 
అవయవాన్ని కాపాడటమే ప్రధాన లక్ష్యం... ఎల్‌ఎస్‌ఎస్
కాలి ఎముక లేదా చేతి ఎముక ఇలా ఏ ఎముకకు క్యాన్సర్ సోకినా... డాక్టర్ల ప్రధాన లక్ష్యం సాధ్యమైనంత వరకు ఆ అవయవాన్ని కోల్పోకుండా కాపాడటమే. శస్త్రచికిత్స ప్రక్రియను ఎంపిక చేసుకున్నప్పటికీ ఇందుకోసమే డాక్టర్లు శ్రమిస్తారు. డాక్టర్ల ఈ ఉద్దేశాన్నే వైద్యపరిభాషలో ‘లింబ్ సాల్వేజ్ సర్జరీ’ (ఎల్.ఎస్.ఎస్.)అంటారు. ఇందులో రెండు అంచెలుంటాయి. మొదటి అంచెలో ఆరోగ్యకరమైన భాగాన్ని వీలైనంతగా రక్షించుకుంటూ... క్యాన్సర్‌కు గురైన భాగాన్ని పూర్తిగా తొలగించడం. రెండో అంచెలో... ఇలా తొలగింపు తర్వాత కోల్పోయిన భాగాన్ని పునర్నిర్మించడం.

ఈ పునర్నిర్మాణం కోసం రకరకాల మార్గాలు అవలంబిస్తారు. ఉదాహరణకు... కోల్పోయిన ఎముక స్థానంలో లోహంతో చేసిన అలాంటి ఆకృతినే అమర్చుతారు. ఇలా కృత్రిమంగా అమర్చే లోహభాగాన్ని ‘ప్రోస్థెసిస్’ అంటారు. ఒక్కోసారి మొత్తం ఎముకే... లోహంతో తయారు చేసి తొలగించిన ఎముక స్థానంలో దీన్ని అమరుస్తారు. ఇది ఒకరకంగా చెప్పాలంటే ఎముక మార్పిడి (బోన్ ట్రాన్స్‌ప్లాంట్) చికిత్స అన్నమాట. ఇలా చేయడానికి అనుగుణంగా ఇప్పుడు సర్జన్సకు రకరకాల లోహాలు అంటే... మృదులాస్థి కోసం మృదువైన లోహాలతో తయారైనవీ (వీటిని సాఫ్ట్ టిష్యూ అల్లోగ్రాఫ్ట్ప్ అంటారు); గట్టి ఎముకల కోసం గట్టి లోహాలతో రూపొందించనవీ... రోగి ఎముక పరిమాణం ఎంతుందో అంతే సైజ్‌లో ఉన్నవీ లభ్యమవుతున్నాయి.
 
వయసుతో పాటూ ఎదిగే కృత్రిమ ఎముకలు...
ఇప్పుడు వైద్యవిజ్ఞానశాస్త్రంలో ఈ శస్త్రచికిత్స ప్రక్రియల పురోగతి ఎంతగా ఉందంటే... ఎదిగే వయసులో ఉన్న ఒక అబ్బాయికి ఎముక క్యాన్సర్ సోకి... ఎముకను తొలగించాల్సి వస్తే... అతడిది పెరిగే వయసు కాబట్టి... పెరుగుతున్న కొద్దీ లోహపు ఎముక కూడా పెరిగేలా వ్యాప్తిచెందే కృత్రిమ ఎముకలూ ఉన్నాయి. రోగి అవయవాన్ని రక్షించడం కోసమే ఈ తరహా ఉపకరణాలను రూపొందించారన్నమాట.
 
శస్త్రచికిత్సల్లో మరో రెండు ప్రక్రియలు...
ఆర్థ్రోడెసిస్: ఈ ప్రక్రియలో రోగి నుంచే తీసుకున్న ఎముకను గానీ... లేదా ఎముకల బ్యాంకులో అతడికి సరిపడే ఎముకనుగానీ స్వీకరించి ఎముక మార్పిడి చికిత్స చేస్తారు. ఆర్థ్రోడెసిస్ ప్రక్రియను అనుసరిస్తే... కీలు వద్ద కూడా ఎముక వంగదు. ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. కానీ రోగి అవయవాన్ని కోల్పోకుండా ఉండే సౌలభ్యం మాత్రం ఉంటుంది.
 
ఆర్థ్రోప్లాస్టీ : ఇందులో రోగి నుంచి తొలగించిన ఎముక పరిణామం, అతడిలో సరిగ్గా ఇమిడిపోగల తత్వం వంటి సౌకర్యాలు ఉంటాయి.
 
ప్రతికూలతలూ ఉండవచ్చు...
అయితే ఆర్థ్రోడెసిస్ లేదా ఆర్థ్రోప్లాస్టీ... ఇలా ప్రక్రియ ఏదైనప్పటికీ కృత్రిమ  ఎముక మార్పిడి చికిత్స తర్వాత ఎముక అరగడం, ప్రమాదాల వంటివి జరిగినప్పుడు ఎముక విరగడం వంటి ప్రతికూలతలూ ఉంటాయి. ఇక కృత్రిమ ఎముకల అమరిక అన్నది రోగులందరికీ సాధ్యం కాకపోవచ్చు. పరిస్థితులను బట్టి అనుకూలతలు లేకపోతే కొందరిలో అవయవాన్ని తొలగించాల్సిన పరిస్థితీ ఉండవచ్చు. ఇవన్నీ రోగి పరిస్థితిని బట్టి చికిత్స చేసే డాక్టర్ల బృందం సంయుక్తంగా తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
 
అలాగే ఎముక మార్పిడి విషయంలో ఎముకలను ఇతర వ్యక్తుల నుంచి సేకరించి ఉంచిన ‘బోన్ బ్యాంకు’ నుంచి స్వీకరించి, దాన్ని రోగి శరీరంలో అమర్చితే రోగి దేహం దాన్ని ఆమోదించకపోవడం వంటి ప్రతికూలతలూ ఉంటాయి. అరుగుదల రేటూ ఎక్కువే. కానీ లోహపు ప్రోస్థసిస్ వంటివి అమరిస్తే మాత్రం ఇలాంటి కాంప్లికేషన్లకు అవకాశం తక్కువ.
 
ఇన్ని సౌకర్యాలూ, ఆధునిక పరిజ్ఞానం, వయసు ఎదిగే కొద్దీ పెరిగే కృత్రిమ ఎముకల అందుబాటు వంటి ఎన్నెన్నో మార్గాలు ఉన్నప్పటికీ డాక్టర్ ప్రధాన ధ్యేయం రోగి ప్రాణాలను రక్షించడమే. ఆ తర్వాతే సాధ్యమైనంత వరకు మిగతా అంశాలను పరిగణనలోకి తీసుకుని, రోగి మునపటి సౌకర్యాలను వీలైనంతగా పొందేలా డాక్టర్లు చూస్తారు. దీనితో పాటు రోగికి అవసరమైన ఆహారం (న్యూట్రిషన్), నొప్పి తగ్గించడం (పెయిన్ మేనేజ్‌మెంట్), కదలికలను మునుపటిలా చేసే స్వాభావిక చికిత్స (నేచురోపతి మెడిసిన్), ఫిజియోథెరపీ, ఆధ్యాత్మిక అంశాల బోధన వంటి అనేక విషయాలతో రోగికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
  - నిర్వహణ: యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement