యానల్ ఫిషర్ చెప్పుకోలేని చోట బాధ... పంచుకోలేని వ్యధ! | Transperineal Sonographic Anal Sphincter Complex Evaluation in Chronic Anal Fissures | Sakshi
Sakshi News home page

యానల్ ఫిషర్ చెప్పుకోలేని చోట బాధ... పంచుకోలేని వ్యధ!

Published Mon, Nov 3 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 3:49 PM

యానల్ ఫిషర్ చెప్పుకోలేని చోట బాధ... పంచుకోలేని వ్యధ!

యానల్ ఫిషర్ చెప్పుకోలేని చోట బాధ... పంచుకోలేని వ్యధ!

చెప్పుకోలేని చోట బాధ... పంచుకోలేని వ్యధ... వ్యక్తం చేయాలంటే సిగ్గు, బిడియం, మొహమాటం.చూపించుకోవాలంటే ఇబ్బంది. ఈ మాటలకు నిజమైన నిర్వచనం... యానల్ ఫిషర్. మల విసర్జన ద్వారం వద్ద ఏర్పడే తిన్నటి పగులును ‘యానల్ ఫిషర్ లేదా ఫిషర్ ఇన్ ఏనో’ అంటారు. ప్రతి 350 మందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధి సాధారణంగా స్త్రీ, పురుషులిరువురిలోనూ కనిపిస్తుంది. ప్రధానంగా 15 నుంచి 40 ఏళ్ల వారిలో ఎక్కువగా వస్తుంటుంది. విపరీతమైన నొప్పితో బాధిస్తూ, తొలిదశలో చికిత్స తీసుకోకపోతే మరింత లోపలికి చీరుకుపోయి వేధిస్తూ ఉండే ‘యానల్ ఫిషర్’ వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం.
 

యానల్ ఫిషర్ అంటే...
మలద్వారం వద్ద చిన్న పగులులా కనిపించే ఇది తొలి దశలో మలద్వారం అంచునుంచి చిన్న చిరుగులా ఉంటుంది. అంటే తొలిదశలో ఇది కేవలం చర్మం పైపొరకు (ఎపిథీలియమ్‌కు) మాత్రమే పరిమితమవుతుందన్నమాట. ఆ దశలో ఎలాంటి చికిత్సా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అక్కడి మృదువైన లోపలి పొరల్లోనూ (మ్యూకస్ మెంబ్రేన్‌లలో) పగుళ్లు ఏర్పడి చీరుకుపోయే ప్రమాదం ఉంది.
 
ఫిషర్‌లలో రకాలు...
ఫిషర్ ఏర్పడిన వ్యవధిని బట్టి దీన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది అప్పటికప్పుడు కనిపించే అక్యూట్ ఫిషర్. రెండోది దీర్ఘకాలం పాటు కొనసాగుతూ బాధించే క్రానిక్ ఫిషర్.

ఆక్యూట్ ఫిషర్ : ఇందులో తొలుత మలద్వారం బయటి చర్మం చీరుకుపోయినట్లుగా అవుతుంది. ఆ తర్వాత అక్కడి మెత్తటి కణజాలం పొరల (మ్యూకోజా)లో కూడా పగుళ్లు ఏర్పడినట్లు అవుతుంది. ఒకవేళ ఈ ఫిషర్‌కు తగిన చికిత్స తీసుకోకుండా అలాగే వదిలేసి, అలా చాలాకాలం పాటు ఉంటే అదే దీర్ఘకాలం కొనసాగే ఫిషర్ (క్రానిక్ ఫిషర్)గా రూపొందవచ్చు.
     
క్రానిక్ ఫిషర్ : ఇలా దీర్ఘకాలం పాటు కొనసాగే క్రానిక్ ఫిషర్ నిర్దిష్టమైన లక్షణాలను కనబరుస్తుంది. ఉదాహరణకు మలద్వారాన్ని గట్టిగా పట్టేసినట్లుగా ఉంచి, బలంగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్ కండరాలు చీరుకుపోయినట్లుగా కనిపిస్తుంటాయి. ఫిషర్ చివరల్లో మలద్వారం వద్ద చీరుకుపోయిన చోట కండ పెరిగినట్లుగా ఉండి, దాని చివరభాగం బయటకు తోసుకొచ్చినట్లుగా
 కనిపిస్తుంది.
 
ఫిషర్ రాకుండా నివారణ ఇలా...

ఫిషర్ నొప్పితో బాటు సామాజికంగా చాలా ఇబ్బందిని కలిగించే సమస్య. అందుకే వచ్చాక దీనికి చికిత్స చేయించుకోవడం కంటే అసలు రాకుండానే నివారించుకోవడం మేలు. పైగా ఫిషర్‌ను నివారించుకోవడం చాలా సులువు కూడా. నివారణ మార్గాలేమిటంటే...
* మనం తీసుకునే ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే ఆకుపచ్చటి ఆకుకూరలు, తాజా పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవడం, రోజులో ఎక్కువసార్లు మంచినీళ్లు తాగుతూ ఉండాలి.
* మలం గట్టిగా మారడానికి తోడ్పడే ఆహారపదార్థాలైన మసాలాలూ, మాంసాహారం, పచ్చళ్ల మోతాదును గణనీయంగా తగ్గించుకోవడం వంటి జాగ్రత్తలతో ఫిషర్‌ను సమర్థంగా నివారించుకోవచ్చు.
* మాటిమాటికీ నీళ్ల విరేచనాలు అవుతున్నవారు, ఇలా తరచూ ఎందుకు జరుగుతుందన్న విషయాన్ని డాక్టర్‌ను సంప్రదించి తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవాలి.
* మలవిసర్జన తర్వాత ఆ ప్రాంతాన్ని చక్కగా శుభ్రం చేసుకోవడం, పొడిగా ఉంచుకోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) విధానాలను పాటించాలి. మలవిసర్జన తర్వాత టాయిలెట్ పేపర్‌తో శుభ్రపరచుకునే వారు చాలా మృదువైన వాటిని ఉపయోగించడం మేలు.
* ఒకవేళ అప్పటికే చిన్నపాటి ఫిషర్ ఉన్నవారు మలవిసర్జన సాఫీగా జరిగేలా అక్కడ ఒరిపిడిని తగ్గించే ల్యూబ్రికేటింగ్ ఆయింట్‌మెంట్స్ వాడాలి.
 
చికిత్స
ఆక్యూట్ ఫిషర్‌ను కనుగొన్నప్పుడు చేసే చికిత్సలో నేరుగా ఫిషర్‌కు చికిత్స చేయడం కాకుండా... దాదాపు 80 శాతం పైగా సందర్భాల్లో ఫిషర్ ఏర్పడటానికి కారణమైన అంశాలను నివారించడానికి చికిత్స చేస్తుండటం సాధారణంగా జరుగుతుంటుంది. ఇందులో భాగంగా మలబద్దకాన్ని నివారించే మందులు ఇవ్వడం, మలాన్ని మృదువుగా మార్చే ఔషధాలు వాడటం, మలవిసర్జన సమయంలో కలిగే నొప్పిని నివారించే మందులు ఇవ్వడం వంటివి చేస్తారు. మలవిసర్జన సాఫీగా జరిగేలా పేగు కదలికలు (బవెల్ మూవ్‌మెంట్స్) క్రమబద్ధంగా జరిగేలా చూస్తారు.
 
ఇక మొదటిదశ చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీట్‌మెంట్)గా మలం మృదువుగా మారేలా స్టూల్‌సాఫ్టెనర్స్ ఇస్తారు. మలవిసర్జన తర్వాత తగినంత గోరువెచ్చని నీటితో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలని సూచించి, అక్కడ నొప్పిని తగ్గించడం, స్ఫింక్టర్ గట్టిగా బిగుసుకుపోవడాన్ని (స్ఫింక్టర్ స్పాజమ్) నిరోధించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు.
 ఇలా ఫిషర్‌కు మొదటి దశ చికిత్స (ఫస్ట్ లైన్)ను నిర్లక్ష్యం చేస్తే సాధారణంగా 30% నుంచి 70% కేసుల్లో అది మళ్లీ తిరగబెడుతుంటుంది. కేవలం పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధి తిరగబెట్టడాన్ని 15% నుంచి 20%కి
 తగ్గించవచ్చు.
 
ఇక రెండోదశ చికిత్సగా (సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్‌మెంట్) మలద్వారం లోపలికి 0.4% నైట్రోగ్లిజరిన్ వంటి మందులతో పాటు గ్లిజెరాల్ ట్రైనైట్రేట్ ఆయింట్‌మెంట్ వంటివి స్ఫింక్టర్ లోపల పూతమందుగా వాడాల్సి ఉంటుంది. నిఫైడిపైన్ ఆయింట్‌మెంట్, డిల్షియాజెమ్ ఆయింట్‌మెంట్ వంటి పూతమందులు కూడా బాగా పనిచేస్తాయి.
 
శస్త్రచికిత్స ప్రక్రియలు
ఆక్యూట్ ఫిషర్‌కు మందులను 3 నుంచి 4 వారాల పాటు వాడినా గుణం కనిపించని సందర్భాల్లోనూ లేదా యానల్ ఫిషర్ దీర్ఘకాలిక ఫిషర్ (క్రానిక్)గా రూపొందిన సమయాల్లోనూ శస్త్రచికిత్సను నిర్వహించాల్సి రావచ్చు. శస్త్రచికిత్స విధానాలివి...

స్ఫింక్టర్ డయలేషన్ : ఈ శస్త్రచికిత్సను శరీరమంతటికీ మత్తు మందు (జనరల్ అనస్థీషియా) ఇచ్చి నిర్వహిస్తారు. ఇందులో మలద్వారాన్ని గట్టిగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్‌ను వెడల్పు చేస్తారు. అయితే సాధారణంగా ఈ ప్రక్రియను చాలామంది డాక్టర్లు అంతగా సిఫార్సు చేయరు. ఎందుకంటే ఈ తరహా శస్త్రచికిత్స తర్వాత చాలామంది మలనియంత్రణపై అదుపు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించాలంటే సర్జన్ మంచి నిపుణులై ఉండాలి.
     
ల్యాటరల్ ఇంటర్నల్ స్ఫింక్టరెక్టమీ : ఈ శస్త్రచికిత్స ప్రక్రియను కూడా సాధారణంగా పూర్తి మత్తు (జనరల్ అనస్థీషియా) లేదా వెన్నెముకకు మత్తుమందు (స్పైనల్ అనస్థీషియా) ఇవ్వడం ద్వారా నిర్వహిస్తారు. ఇందులో స్ఫింక్టర్‌లో గట్టిబారిన కండరప్రాంతాన్ని (హైపర్‌ట్రొఫాయిడ్ ఇంటర్నల్ స్ఫింక్టర్) జాగ్రత్తగా ఒలిచినట్లుగా చేసి తొలగిస్తారు. దాంతో స్ఫింక్టర్ కండరం తన బిగుతును కోల్పోయి మునుపటిలా మృదువుగా మారుతుంది. ఫలితంగా మలవిసర్జన సమయంలో ఒరిపిడి తగ్గి, క్రమంగా మలద్వారం వద్ద ఉన్న పగులు/చిరుగు క్రమంగా తగ్గిపోతుంది.
 
 
లక్షణాలు
మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇలా వచ్చిన నొప్పి ఆ తర్వాత కొద్ది గంటల సేపు బాధిస్తుంటుంది. మలవిసర్జనకు వెళ్లిన ప్రతిసారీ నొప్పి తిరగబెడుతుంటుంది. దీంతో మలవిసర్జనకు వెళ్లాలంటేనే రోగి తీవ్రమైన ఆందోళనకు గురవుతుంటాడు. మలవిసర్జనకు వెళ్లడానికి విముఖత చూపుతుంటాడు. ఫలితంగా మలబద్దకం ఏర్పడి, మలవిసర్జన క్రమం (సైకిల్) దెబ్బతినవచ్చు. పైగా మలవిసర్జనకు వెళ్లడానికి విముఖత చూపుతూ... మాటిమాటికీ ఆపుకోవడం వల్ల మలం మరింత గట్టిగా మారి, మలవిసర్జన మరింత బాధాకరంగా పరిణమిస్తుంది.

చాలా మంది రోగుల్లో మల విసర్జన జరిగినప్పుడు రక్తస్రావం కావడం లేదా ప్రక్షాళన సమయంలో రక్తం చేతికి లేదా టాయిలెట్ పేపర్‌కు అంటడం జరుగుతుంది. అయితే ఫిషర్ విషయంలో ఎక్కువ రక్తస్రావం జరగదు. కాస్తంత రక్తం మాత్రమే కనిపించి, మలద్వార ప్రాంతంలో దురదగా (ప్రూరిటస్ యానీ) అనిపించవచ్చు. ఇక మరికొందరిలో మలద్వారం వద్ద దుర్వాసనతో కూడిన స్రావాలూ కనిపించవచ్చు. కొంతమందిలో మూత్రవిసర్జన కూడా నొప్పిగా ఉంటుంది. ఒక్కోసారి అసలు మూత్రవిసర్జన జరగడమూ కష్టం కావచ్చు.
 
 
నిర్ధారణ
రోగితో మాట్లాడి అతడి వ్యాధి చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోవడం, మలవిసర్జన ద్వారం ప్రాంతాన్ని జాగ్రత్తగానూ, సున్నితంగానూ పరిశీలించడం ద్వారా ఫిషర్‌ను నిర్ధారణ చేయవచ్చు. ఒక్కోసారి పరీక్ష చేయడానికి రోగిని ఆ ప్రాంతంలో చూసినా కూడా ఫిషర్ కనిపించకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ ప్రాంతంలో పూతమందు రూపంలో లభ్యమయ్యే నొప్పి, స్పర్శ తెలియనివ్వని స్థానిక మత్తుమందు (టాపికల్ అనస్థీషియా)చ్చి పరిశీలించడం అవసరం కావచ్చు.
 
ఇక మలద్వారం నుంచి రక్తస్రావం అయ్యేవారిలో... ఆ ప్రాంతంలో గొట్టంతో పరీక్ష చేసే సిగ్మాయిడోస్కోపీ వంటి పరీక్షలు అవసరం కావచ్చు. సాధారణంగా రోగి 50 ఏళ్లలోపు వారైతే, ఈ తరహా పరీక్ష అవసరమవుతుంది. ఇక కొందరిలో 50 ఏళ్లు దాటాక మలద్వార క్యాన్సర్ ఉన్న కుటుంబ చరిత్ర ఉన్నవారైతే వారిలో పెద్దపేగునంతా పరిశీలించడానికి డాక్టర్లు కొలనోస్కోపీ పరీక్షను సిఫార్సు చేసే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ నేరుగా కాకుండా కొంతకాలం మందులు ఇచ్చి చూసి, మెరుగుదల కనిపించే తీరును బట్టి పై పరీక్షలను చేయాల్సి ఉంటుంది. ఇక కొందరిలో మలద్వారం స్ఫింక్టర్ మూసుకుపోయేందుకు కలిగే ఒత్తిడి ఎంత ఉందో పరిశీలించేందుకు యానోరెక్టల్ మ్యానోమెట్రీ అనే పరీక్షనూ నిర్వహించవచ్చు.
 
 
కారణాలు
నిజానికి ఇలా మలద్వారం చీరుకుపోయి ఫిషర్ ఏర్పడటానికి ఇతమిత్థమైన కారణాలు ఇంకా తెలియదు. కానీ మలవిసర్జన సమయంలో చీలికను ఒరుసుకుంటూ మలం బయటికి రావడం వల్ల, తీవ్రమైన నొప్పి వల్ల దీని ఉనికి తెలుస్తుంది.  మనం తీసుకునే ఆహారంలో ఆకుపచ్చటి ఆకుకూరలు, తాజాపండ్ల వంటి  పీచును కలిగి ఉండే పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల కూడా ఫిషర్ ఏర్పడుతుందని అనేక అధ్యయనాల్లో నిర్ధారణ అయ్యింది.  కొన్ని సందర్భాల్లో మలద్వారం వద్ద ఉండే కండరాలు గట్టిగానూ, మందంగానూ మారడం వల్ల మలవిసర్జన సాఫీగా సాగక బలంగా ఒరుసుకుపోతూ జరుగుతుంది. దీనివల్ల అక్కడ చీలిక ఏర్పడటం, చిరిగినట్లు కావడం వల్ల కూడా ఫిషర్ రావచ్చు.
 
కొంతమందిలో మలబద్దకం వల్ల ముక్కి ముక్కి మల విసర్జన చేయాల్సి వస్తుంటుంది. మలం చాలా గట్టిగా మారడం వల్ల ఇలా జరుగుతుంది. ఇలా మలం గట్టిగా ఉండటం కారణంగా మల విసర్జన సమయంలో ఆ ప్రాంతం చీరుకుపోవచ్చు. ఇక మరికొందరిలో దీర్ఘకాలం పాటు నీళ్లవిరేచనాలు అవుతుండటం వల్ల... దీర్ఘకాలం ఆ ప్రాంతం తడిగానూ, తేమగానూ ఉండటం వల్ల కూడా ఆ ప్రాంతానికి రక్తసరఫరా తగ్గి ఫిషర్ ఏర్పడవచ్చు.
 
మల విసర్జన తర్వాత ఇక అక్కడి నుంచి మలం లీక్ కాకుండా ఉండేందుకు మలద్వారాన్ని చాలా గట్టిగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్ కండరాలు ఉంటాయి. అందువల్లనే మనకు మల విసర్జన తర్వాత మళ్లీ ఇంకొక సారి మల విసర్జనకు వెళ్లే వరకు ఎలాంటి మలమూ లీక్ కాదు. అయితే ఏదైనా కారణం వల్ల మలద్వార ప్రాంతంలో శస్త్రచికిత్స జరిగితే స్ఫింక్టర్‌కు గాయం కావచ్చు లేదా మలద్వారం ఉండాల్సిన రీతిలో కాకుండా సన్నబడిపోవచ్చు. ఇలా సన్నబడిపోవడాన్ని స్టెనోసిస్ అంటారు. ఇలాంటిది జరిగినప్పుడు ఆ సన్నబడ్డ ద్వారం నుంచి మలం బయటకు రావాలంటే చాలా బలంగా ఒత్తిడి కలిగించాల్సి వస్తుంటుంది. ఈ కారణంగా మలద్వారం చీరుకుపోయి ఫిషర్‌కు దారితీసే ప్రమాదం ఉంది.  
 
* కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక టీబీ, ల్యూకేమియా, క్యాన్సర్లు, ఎయిడ్స్ వంటి జబ్బులు దీర్ఘకాలంలో మలవిసర్జన ప్రాంతంలో ఇన్‌ఫ్లమేషన్ కలిగించడం, అది క్రమంగా ఫిషర్‌కు దారితీయడం కూడా జరగవచ్చు.
* సెక్స్ ద్వారా సంక్రమించే వ్యాధులు (ఎస్‌టీడీలు) సోకినప్పుడు అవి క్రమంగా ముదిరి దీర్ఘకాలంలో ఫిషర్‌కు దారితీయవచ్చు. ఉదాహరణకు సిఫిలిస్, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, క్లమీడియా వంటి వ్యాధులు మలవిసర్జన ద్వారానికీ విస్తరించడం వల్ల అక్కడ పగుళ్లు రావడం, చీరుకుపోవడం జరిగి ఫిషర్ ఏర్పడవచ్చు.
* ఇక మహిళల్లో ప్రసవం సమయంలోనూ మలద్వారం చీరుకుపోయి ఫిషర్ రావచ్చు.
* కొందరిలో క్రోన్స్ డిసీజ్, మాటిమాటికీ మలవిసర్జనకు వెళ్లాల్సి వచ్చే అల్సరేటివ్ కొలైటిస్, మలవిసర్జన తర్వాత మలద్వార ప్రాంతాన్ని శుభ్రంగానూ, పొడిగానూ ఉంచుకోకపోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత విధానాలు పాటించకపోవడం (పూర్ టాయిలెటింగ్ హ్యాబిట్స్) కూడా ఫిషర్‌కు దారితీయవచ్చు.
 
శస్త్రచికిత్స ప్రక్రియలు
ఆక్యూట్ ఫిషర్‌కు మందులను 3 నుంచి 4 వారాల పాటు వాడినా గుణం కనిపించని సందర్భాల్లోనూ లేదా యానల్ ఫిషర్ దీర్ఘకాలిక ఫిషర్ (క్రానిక్)గా రూపొందిన సమయాల్లోనూ శస్త్రచికిత్సను నిర్వహించాల్సి రావచ్చు. శస్త్రచికిత్స విధానాలివి...
    
స్ఫింక్టర్ డయలేషన్ : ఈ శస్త్రచికిత్సను శరీరమంతటికీ మత్తు మందు (జనరల్ అనస్థీషియా) ఇచ్చి నిర్వహిస్తారు. ఇందులో మలద్వారాన్ని గట్టిగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్‌ను వెడల్పు చేస్తారు. అయితే సాధారణంగా ఈ ప్రక్రియను చాలామంది డాక్టర్లు అంతగా సిఫార్సు చేయరు. ఎందుకంటే ఈ తరహా శస్త్రచికిత్స తర్వాత చాలామంది మలనియంత్రణపై అదుపు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించాలంటే సర్జన్ మంచి నిపుణులై ఉండాలి.
     
ల్యాటరల్ ఇంటర్నల్ స్ఫింక్టరెక్టమీ : ఈ శస్త్రచికిత్స ప్రక్రియను కూడా సాధారణంగా పూర్తి మత్తు (జనరల్ అనస్థీషియా) లేదా వెన్నెముకకు మత్తుమందు (స్పైనల్ అనస్థీషియా) ఇవ్వడం ద్వారా నిర్వహిస్తారు. ఇందులో స్ఫింక్టర్‌లో గట్టిబారిన కండరప్రాంతాన్ని (హైపర్‌ట్రొఫాయిడ్ ఇంటర్నల్ స్ఫింక్టర్) జాగ్రత్తగా ఒలిచినట్లుగా చేసి తొలగిస్తారు. దాంతో స్ఫింక్టర్ కండరం తన బిగుతును కోల్పోయి మునుపటిలా మృదువుగా మారుతుంది. ఫలితంగా మలవిసర్జన సమయంలో ఒరిపిడి తగ్గి, క్రమంగా మలద్వారం వద్ద ఉన్న పగులు/చిరుగు క్రమంగా తగ్గిపోతుంది.
 
శస్త్రచికిత్స వల్ల కలిగే దుష్పరిణామాలు

ఫిషర్‌కు శస్త్రచికిత్స వల్ల కలిగే మేళ్లతో పాటు కొన్ని దుష్పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఫిషర్‌కు శస్త్రచికిత్స చేశాక, అది నిర్వహించిన ప్రాంతం గాలిసోకని విధంగా, అవయవాల ముడుతల్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది. ఒక్కోసారి శస్త్రచికిత్స తర్వాత రక్తస్రావం కూడా కావచ్చు. ఫిషర్ క్రమంగా లోపలివైపునకు సాగుతూ పేగుల్లో పొడుగాటి పైపులా పాకే ‘ఫిస్టులా’ అనే కండిషన్‌కూ దారితీయవచ్చు.

ఇక అన్నింటికంటే ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే... శస్త్రచికిత్స తర్వాత కొందరిలో మలాన్ని లోపలే పట్టి ఉంచేలా చేసే నియంత్రణ శక్తి కోల్పోయి... అక్కడి నుంచి కొద్దికొద్దిగా మలం బయటకు వస్తూ ఉండవచ్చు. దీన్నే ‘ఇన్‌కాంటినెన్స్’ అంటారు. శస్త్రచికిత్స తర్వాత ఈ ఇన్‌కాంటినెన్స్ వస్తే అది మరింత ఇబ్బందికరం కాబట్టి ఇలాంటి శస్త్రచికిత్సలు అవసరమైనప్పుడు అత్యంత నిపుణులైన సర్జన్‌ల ఆధ్వర్యంలోనే ఈ తరహా శస్త్రచికిత్సలు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
 
సర్జరీ విషయంలో మరో హెచ్చరిక...
సాధారణంగా ఫిషర్ సమస్యను తగ్గించడానికి చేసే సర్జరీ విజయవంతమైతే పరవాలేదు. కానీ ఇక్కడ ఒక అంశాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో చేసే శస్త్రచికిత్స తర్వాత కూడా ఒక శాతం నుంచి ఆరు శాతం కేసుల్లో ఫిషర్ మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది. ఈ అంశాన్ని గమనంలో ఉంచుకుని మానసికంగా సిద్ధపడే శస్త్రచికిత్సకు ముందుకెళ్లాలి.
 ఫిషర్ సమస్య వ్యక్తిగతంగా, సామాజికంగా ఇలా అన్నిరకాలుగా ఇబ్బందికరం. పైగా పూర్తిగా తగ్గించాలని చేసే శస్త్రచికిత్సతోనూ కొన్ని దుష్పరిణామాలు వచ్చే అవకాశం ఉంది.

ఈ అంశాలన్నింటినీ గుర్తుపెట్టుకుంటే... దీనికి చికిత్స కంటే నివారణ చాలా సులభం కాబట్టీ అంటే... కేవలం వేళకు భోజనం చేయడం వంటి మంచి ఆహారపు అలవాట్లు, పీచు పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు, నీళ్లు ఎక్కువగా తాగడం, మలద్వారం వద్ద వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించడం వంటి సాధారణ జాగ్రత్తలతోనే దీని నివారణ జరిగిపోతుంది కాబట్టి వాటిని ఫిషర్ ఉన్నా లేకున్నా అందరూ ఈ జాగ్రత్తలను పాటించడం వల్ల అసలు ఫిషర్ రాకుండానే నివారించుకోవచ్చునని గుర్తుంచుకోండి.
  - నిర్వహణ: యాసీన్
 -  మంజులారెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement