అవార్డులు ఊరికే రావు. ఆ అవార్డు వెనుక... అవార్డు అందుకున్న చేతులు చక్కబెట్టిన బాధ్యతలుంటాయి. ఆ చేతులు తీర్చిదిద్దిన జీవితాలుంటాయి. ఆ చేతులు చేతల్లో చూపించిన విజయాలుంటాయి. ‘బెస్ట్ ఉమన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫర్ మెంటారింగ్ స్టార్ట్ అప్స్’ అవార్డు అందుకున్న డాక్టర్ గీత ప్రస్థానమూ అలాంటిదే. జీవితంలో ఊహించని అవరోధం ఎదురు కానంత వరకు ఎవరూ జీవితాన్ని తరచి చూసుకోరు. అక్కడి నుంచి మొదలయ్యేదే అసలైన జీవితం... అంటారు యష్మిసొల్యూషన్స్ సీఈవో డాక్టర్ బి. గీతారెడ్డి.
యువ పరిశ్రమ
యువత పట్టాలు పుచ్చుకుని ఉద్యోగం కోసం ఎదురు చూడడమే మనకు తెలిసిన పురోగతి. ఉద్యోగం కోసం ఎదురు చూడడం కాదు, ఉద్యోగం ఇచ్చేలా ఎదగడం యువత లక్ష్యం అయి ఉండాలి. అందుకోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాను. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్‌తో మా ‘సిఐఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ’ ఒప్పందం కుదుర్చుకుంది. సైన్స్, ఆర్ట్స్, కామర్స్, మేనేజ్‌మెంట్ స్టూడెంట్స్ అందరికీ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం ఇందులో ఉద్దేశం. పరిశ్రమల రంగం యువకులతో, మహిళలతో నిండిపోవాలనేది నా కల.
– డాక్టర్ బి. గీతారెడ్డి, చైర్‌పర్సన్, సిఐఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ (ఏపీ స్టేట్). క్లస్టర్ డైరెక్టర్ (ఏపీ, ఒడిషా), కోవె ఎగ్జిక్యూటివ్ మెంబర్
యష్మి సొల్యూషన్స్ స్థాపించి సర్వీస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారడానికి ముందు ఆమె తనకు ఎదురైన ఎన్నో సవాళ్లను మనోధైర్యంతో అధిగమించారు. ప్రభుత్వ భూముల కబ్జా వంటి అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించడంలో మొండిధైర్యంతో సాగిపోయారు. కసితో చదవడం మొదలు పెట్టారు. ఇప్పుడామె పేరు చివర ఆరు డిగ్రీలు కనిపిస్తాయి.
అందరమ్మాయిల్లాగానే నేనూ
వైజాగ్‌లో పుట్టి పెరిగిన గీత ఎంసీఎ పూర్తయిన తర్వాత పెళ్లయింది. ‘‘పెళ్లి తర్వాత కూడా చదవడమే పనిగా చదివాను. ‘ఒక సమస్య మీద గట్టిగా వాదిస్తావు. పెద్ద పోరాటమే చేస్తావు, నీకు లీగల్ నాలెడ్జ్ ఉంటే పది మందికి ఉపయోగపడతావని చెప్పాడు మా పెద్ద తమ్ముడు. ఆ మాటతో ఎల్‌ఎల్‌బీ చేశాను. ఎంబీఏ, ఆస్ట్రాలజీ, మెడికల్ ఆస్ట్రాలజీలో పీహెచ్‌డీ, ఉమెన్ ఇన్ ప్రొఫెషనల్ స్టడీస్‌లో పీహెచ్‌డీ చేశాను. ఇదే సమయంలో నాకంటూ ఒక మంచి యాక్టివిటీని అభివృద్ధి చేసుకున్నాను. అప్పుడప్పుడే డిజిటల్ మీడియా ఊపందుకుంటున్న రోజులవి. మా చిన్న తమ్ముడితో కలిసి డిజిటల్ మీడియా సెక్టార్‌లో సర్వీస్ మొదలు పెట్టాను. తర్వాత 2015లో సొంతంగా సర్వీస్ ఇండస్ట్రీ స్థాపించుకున్నాను. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు పని చేశాను. ఇప్పుడు నా సర్వీస్ బిజినెస్ చూసుకుంటూనే సమాజానికి నా వంతుగా సేవ చేస్తున్నాను.
బాధితులు మహిళలే
కుటుంబ సమస్యగా కనిపించే అనేక సమస్యలకు నేరుగా బాధితులయ్యేది మహిళలే. ఆ సమస్యను పరిష్కరించగలిగితే పూర్తి కుటుంబం సంతోషంగా సాగిపోతుందని నా గట్టి నమ్మకం. అందుకే మహిళల సమస్యల మీదనే దృష్టి పెట్టాను. లీగల్ కౌన్సెలింగ్, ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు మహిళల స్వయంసమృద్ధి కోసం స్టార్టప్ మెంటార్‌గా కూడా మారాను. ఆర్థిక స్వేచ్ఛ కొరవడడం పరోక్షంగా మానసిక అభద్రతకు కారణమవుతుంటుంది.
అక్కడి నుంచి కుటుంబ సమస్యలు తలెత్తుతాయి, అవి న్యాయపరమైన చిక్కులకు దారి తీస్తాయి. కౌన్సెలింగ్ సమయంలో వందలాది మంది మహిళల మనసులను చదివాను. ఆ అనుభవంతో చెప్తున్న మాట ఇది. ‘జాతకాలు చూసి మరీ పెళ్లి చేశారు మా వాళ్లు. అయినా నా జీవితం ఇలా ఉంది’ అని చాలా మంది మహిళలు బాధపడేవాళ్లు. జ్యోతిషం నిజమే అయితే ఫలితాలు ఇలా ఎందుకుంటాయనే సందేహం నాకూ కలిగింది. అప్పుడు జ్యోతిషం చదివాను. ఏ సబ్జెక్టు మీదకు దృష్టి మళ్లితే ఆ కోర్సు చేయడమే ఇప్పటి వరకు నా ప్రస్థానంగా మారింది. ఇప్పుడు బెంగళూరు ఐఐఎమ్ నుంచి మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనేది కోరిక’’ అన్నారు డాక్టర్ గీతారెడ్డి.
– వాకా మంజులారెడ్డి
‘వనిత’ల కోసం
మన మహిళల ఉత్పత్తులకు ఒక బ్రాండింగ్ డిజైన్ చేస్తే విదేశాల్లో మంచి గుర్తింపు వస్తుంది. హస్తకళాకృతులను, ఇతర ఉత్పత్తులతో ఉపాధి పొందే మహిళలను ఒక త్రాటి మీదకు తీసుకురావడానికి ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్’ ద్వారా ప్రయత్నిస్తున్నాం. గాజులు, మగ్గం వర్క్, పోటరీ, జీడిపప్పు గ్రేడింగ్ అండ్ ప్యాకింగ్ వంటి ఉత్పత్తుల మార్కెట్ కోసం ‘వనిత’ పేరుతో వెబ్‌సైట్ రూపకల్పన జరుగుతోంది. గార్మెంట్ మేకింగ్‌లో ఉన్న మహిళలకు హిందూస్థాన్ షిప్‌యార్డ్ ఉద్యోగులకు అవసరమైన బాయిలర్ సూట్స్ ఆర్డర్ ఇప్పించడం, తిరుపతిలోని మహిళా యూనివర్సిటీలో శిక్షణ కార్యక్రమాల సమన్వయం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment