Best Awards
-
విజయ ‘గీత’: కసితో చదివారు.. ఆమె పేరు చివర ఆరు డిగ్రీలు
అవార్డులు ఊరికే రావు. ఆ అవార్డు వెనుక... అవార్డు అందుకున్న చేతులు చక్కబెట్టిన బాధ్యతలుంటాయి. ఆ చేతులు తీర్చిదిద్దిన జీవితాలుంటాయి. ఆ చేతులు చేతల్లో చూపించిన విజయాలుంటాయి. ‘బెస్ట్ ఉమన్ ఎంటర్ప్రెన్యూర్ ఫర్ మెంటారింగ్ స్టార్ట్ అప్స్’ అవార్డు అందుకున్న డాక్టర్ గీత ప్రస్థానమూ అలాంటిదే. జీవితంలో ఊహించని అవరోధం ఎదురు కానంత వరకు ఎవరూ జీవితాన్ని తరచి చూసుకోరు. అక్కడి నుంచి మొదలయ్యేదే అసలైన జీవితం... అంటారు యష్మిసొల్యూషన్స్ సీఈవో డాక్టర్ బి. గీతారెడ్డి. యువ పరిశ్రమ యువత పట్టాలు పుచ్చుకుని ఉద్యోగం కోసం ఎదురు చూడడమే మనకు తెలిసిన పురోగతి. ఉద్యోగం కోసం ఎదురు చూడడం కాదు, ఉద్యోగం ఇచ్చేలా ఎదగడం యువత లక్ష్యం అయి ఉండాలి. అందుకోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాను. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్‌తో మా ‘సిఐఎమ్ఎస్ఎమ్ఈ’ ఒప్పందం కుదుర్చుకుంది. సైన్స్, ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అందరికీ ఎంటర్ ప్రెన్యూర్షిప్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం ఇందులో ఉద్దేశం. పరిశ్రమల రంగం యువకులతో, మహిళలతో నిండిపోవాలనేది నా కల. – డాక్టర్ బి. గీతారెడ్డి, చైర్పర్సన్, సిఐఎమ్ఎస్ఎమ్ఈ (ఏపీ స్టేట్). క్లస్టర్ డైరెక్టర్ (ఏపీ, ఒడిషా), కోవె ఎగ్జిక్యూటివ్ మెంబర్ యష్మి సొల్యూషన్స్ స్థాపించి సర్వీస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారడానికి ముందు ఆమె తనకు ఎదురైన ఎన్నో సవాళ్లను మనోధైర్యంతో అధిగమించారు. ప్రభుత్వ భూముల కబ్జా వంటి అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించడంలో మొండిధైర్యంతో సాగిపోయారు. కసితో చదవడం మొదలు పెట్టారు. ఇప్పుడామె పేరు చివర ఆరు డిగ్రీలు కనిపిస్తాయి. అందరమ్మాయిల్లాగానే నేనూ వైజాగ్‌లో పుట్టి పెరిగిన గీత ఎంసీఎ పూర్తయిన తర్వాత పెళ్లయింది. ‘‘పెళ్లి తర్వాత కూడా చదవడమే పనిగా చదివాను. ‘ఒక సమస్య మీద గట్టిగా వాదిస్తావు. పెద్ద పోరాటమే చేస్తావు, నీకు లీగల్ నాలెడ్జ్ ఉంటే పది మందికి ఉపయోగపడతావని చెప్పాడు మా పెద్ద తమ్ముడు. ఆ మాటతో ఎల్ఎల్బీ చేశాను. ఎంబీఏ, ఆస్ట్రాలజీ, మెడికల్ ఆస్ట్రాలజీలో పీహెచ్డీ, ఉమెన్ ఇన్ ప్రొఫెషనల్ స్టడీస్‌లో పీహెచ్డీ చేశాను. ఇదే సమయంలో నాకంటూ ఒక మంచి యాక్టివిటీని అభివృద్ధి చేసుకున్నాను. అప్పుడప్పుడే డిజిటల్ మీడియా ఊపందుకుంటున్న రోజులవి. మా చిన్న తమ్ముడితో కలిసి డిజిటల్ మీడియా సెక్టార్లో సర్వీస్ మొదలు పెట్టాను. తర్వాత 2015లో సొంతంగా సర్వీస్ ఇండస్ట్రీ స్థాపించుకున్నాను. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు పని చేశాను. ఇప్పుడు నా సర్వీస్ బిజినెస్ చూసుకుంటూనే సమాజానికి నా వంతుగా సేవ చేస్తున్నాను. బాధితులు మహిళలే కుటుంబ సమస్యగా కనిపించే అనేక సమస్యలకు నేరుగా బాధితులయ్యేది మహిళలే. ఆ సమస్యను పరిష్కరించగలిగితే పూర్తి కుటుంబం సంతోషంగా సాగిపోతుందని నా గట్టి నమ్మకం. అందుకే మహిళల సమస్యల మీదనే దృష్టి పెట్టాను. లీగల్ కౌన్సెలింగ్, ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు మహిళల స్వయంసమృద్ధి కోసం స్టార్టప్ మెంటార్‌గా కూడా మారాను. ఆర్థిక స్వేచ్ఛ కొరవడడం పరోక్షంగా మానసిక అభద్రతకు కారణమవుతుంటుంది. అక్కడి నుంచి కుటుంబ సమస్యలు తలెత్తుతాయి, అవి న్యాయపరమైన చిక్కులకు దారి తీస్తాయి. కౌన్సెలింగ్ సమయంలో వందలాది మంది మహిళల మనసులను చదివాను. ఆ అనుభవంతో చెప్తున్న మాట ఇది. ‘జాతకాలు చూసి మరీ పెళ్లి చేశారు మా వాళ్లు. అయినా నా జీవితం ఇలా ఉంది’ అని చాలా మంది మహిళలు బాధపడేవాళ్లు. జ్యోతిషం నిజమే అయితే ఫలితాలు ఇలా ఎందుకుంటాయనే సందేహం నాకూ కలిగింది. అప్పుడు జ్యోతిషం చదివాను. ఏ సబ్జెక్టు మీదకు దృష్టి మళ్లితే ఆ కోర్సు చేయడమే ఇప్పటి వరకు నా ప్రస్థానంగా మారింది. ఇప్పుడు బెంగళూరు ఐఐఎమ్ నుంచి మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనేది కోరిక’’ అన్నారు డాక్టర్ గీతారెడ్డి. – వాకా మంజులారెడ్డి ‘వనిత’ల కోసం మన మహిళల ఉత్పత్తులకు ఒక బ్రాండింగ్ డిజైన్ చేస్తే విదేశాల్లో మంచి గుర్తింపు వస్తుంది. హస్తకళాకృతులను, ఇతర ఉత్పత్తులతో ఉపాధి పొందే మహిళలను ఒక త్రాటి మీదకు తీసుకురావడానికి ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్’ ద్వారా ప్రయత్నిస్తున్నాం. గాజులు, మగ్గం వర్క్, పోటరీ, జీడిపప్పు గ్రేడింగ్ అండ్ ప్యాకింగ్ వంటి ఉత్పత్తుల మార్కెట్ కోసం ‘వనిత’ పేరుతో వెబ్సైట్ రూపకల్పన జరుగుతోంది. గార్మెంట్ మేకింగ్‌లో ఉన్న మహిళలకు హిందూస్థాన్ షిప్‌యార్డ్ ఉద్యోగులకు అవసరమైన బాయిలర్ సూట్స్ ఆర్డర్ ఇప్పించడం, తిరుపతిలోని మహిళా యూనివర్సిటీలో శిక్షణ కార్యక్రమాల సమన్వయం జరుగుతోంది. -
ప్రతిభకు పట్టం
– 39 మంది ఇంటర్ విద్యార్థులకు ప్రతిభా అవార్డులు – త్వరలో సీఎం చేతుల మీదుగా అందజేత అనంతపురం ఎడ్యుకేషన్: 2016–17 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. జిల్లాలో 39 మంది విద్యార్థులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. వీరందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నారు. అయితే పురస్కారాల పంపిణీ తేదీ, వేదిక ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. జిల్లాకు సంబంధించిన జాబితా బుధవారం ఆర్ఐఓ కార్యాలయానికి చేరింది. -
అధికారులకు ప్రశంసాపత్రాలు
రామాయంపేట: ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా సోమవారం జిల్లా మంత్రి హరీశ్‌రావుతోపాటు జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి చేతులమీదుగా ఎంపీడీవో రాణి, మండల వ్యవసాయ అధికారి రమేశ్, ఐసీడీఎస్ సీడీపీవో జ్యోతిర్మయి. స్థానిక ఎంపీపీ సూపరిండెంట్ గఫూర్‌ఖాన్ ప్రశాంసాపత్రాలను అందుకున్నారు. మండలానికి చెందిన అధికారులు సన్మానం పొందడంపై ఆయా పార్టీల ప్రతినిధులతోపాటు అధికారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. -
గోవాడపై మరో మరక!
చక్కెర అమ్మకాల్లో గతంలో వెల్లువెత్తిన ఆరోపణలు వెంటాడుతున్న కోర్టు నోటీసులు తాజాగా పాలకవర్గంపై పోలీసు కేసులు చోడవరం: రాష్ట్ర సహకార రంగంలో అతిపెద్ద ఫ్యాక్టరీగా ఉన్న గోవాడ సుగర్స్ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఎన్నో ఉత్తమ అవార్డులు అందుకున్న ఈ ఫ్యాక్టరీని అవకతవకలు, అవినీతి మరకలు కుదిపేస్తున్నాయి. తాజాగా ఫ్యాక్టరీ చైర్మన్, ఎండీలతోపాటు పాలకవర్గంపై గ్రీన్‌మింట్ కంపెనీ కోర్టు కెక్కి కేసులు పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏటా సుమారు 5 లక్షల టన్నులకు పైబడి క్రషింగ్ చేస్తూ 24 వేల మంది రైతులకు ఆసరాగా ఉన్న ఈ ఫ్యాక్టరీలో టీడీపీ పాలకవర్గం వచ్చాక తరుచూ ఏదో అవినీతి ఆరోపణలు చోటుచేసుకుంటున్నాయి. 2014 అక్టోబర్‌లో వచ్చిన హుద్‌హుద్ తుఫాన్ ఈ ఫ్యాక్టరీకి అన్ని రకాలుగా నష్టాలు కలిగించింది. గొడౌన్ల పైకప్పుల ఎగిరిపోయి, పంచదార నిల్వలు తడిసిపోయి నష్టం కలగగా, మరో పక్క ఆ తడిసిన పంచదార అమ్మకాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు, పోలీసు కేసులతో ప్రతిష్ట దిగజారిన పరిస్థితి నెలకొంది. వెల్లువెత్తిన ఆరోపణలు తడిసిన పంచదార అమ్మకాలు, ఇన్సూరెన్సు పరిహారం మంజూరులో కొంత హైడ్రామా నడిచినట్టు అప్పట్లో ఆరోపణలు వెళ్లువెత్తాయి. నష్టాలను బూచిగా చూపిస్తూనే మరో పక్క పాలకవర్గం, యాజమాన్యం కుమ్మక్కై రూ.కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పుమన్నాయి. వైఎస్సార్సీపీ, ఇతర రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు ఆందోళనలు చేశాయి. ఈ విషయమై అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే సైతం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. కశింకోట సీడబ్ల్యుసీ గొడౌన్లలో నిల్వ చేసిన లక్షా 19 వేల క్వింటాళ్ల తడిసిన పంచదార అమ్మకాల్లో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలే ఇప్పుడు ఫ్యాక్టరీని కుదిపేస్తున్నాయి. తడిసిన పంచదారను టెండర్ల ద్వారా అమ్మే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌మింట్ ఇండియా అగ్రిటెక్ ప్రైవేటు కంపెనీ టెండర్లు దగ్గించుకుంది. తర్వాత ఫ్యాక్టరీ యాజమాన్యం మరో ట్రేడర్‌తో ఒప్పందం కుదుర్చుకొని సరకును అమ్మేయడం విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో సుమారు రూ.8 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు వెళ్లువెత్తాయి. నేరుగా రంగంలోకి గ్రీన్‌మింట్ ఫ్యాక్టరీలో ఇంత భాగోతం జరుగుతోందని తెలుసుకున్న గ్రీన్‌మింట్ కంపెనీ నేరుగా రంగంలోకి దిగింది. తన కంపెనీ పేరున వేసిన టెండరు మేరకు సరకు అప్పగించాలని సంబంధిత కంపెనీ యజమాని, ఇన్సూరెన్సు సంస్థకు కోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. మరోపక్క అవినీతి ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడం, మహాజన సభలో సైతం నిరసన తెలియజేయడంతో ప్రభుత్వం అదనపు జాయింట్ కలెక్టర్‌తో చేయిస్తున్న విచారణ కూడా కొనసాగుతోంది. ఇంతలో గ్రీన్‌మింట్ కంపెనీ వేసిన కేసు కారణంగా కోర్టు ఉత్తర్వులు మేరకు చైర్మన్, ఎండీ, ఇన్సూరెన్సు కంపెనీతోపాటు పాలకర్గంలో కొందరు డైరక్టర్లపై చోడవరం పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహరం మరో మారు గుప్పుమంది. పాలకవర్గంపై కేసులు నమోదు కావడం ఫ్యాక్టరీ చరిత్రలో ఇదే మొదటిసారి కావడంతో సర్వత్రా రైతుల్లో, ఫ్యాక్టరీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సుగర్స్ పాలకవర్గాన్ని బర్తరఫ్ చేయాలి చోడవరం: గోవాడ సుగర్ ప్యాక్టరీ పాలకవర్గాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ చెరకు రైతు సంఘం డిమాండ్ చేసింది. ఏపీ చెరకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్రి అప్పారావు, జిల్లా అధ్యక్షుడు యన్నంశెట్టి సీతారాం, జిల్లా కార్యదర్శి నాగిరెడ్డి సత్యనారాయణ బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పారదర్శకతలేని పాలకవర్గం రైతులకు ఎటువంటి మేలు చేయదని, వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పంచదార అమ్మకాల్లో అవినీతికి పాల్పడటమే కాకుండా పోలీసు కేసుల్లో ఇరుక్కున్న పాలకవర్గం ఫ్యాక్టరీని మరింత నాశనం చేసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తంచేశారు. అవినీతి ఆరోపణలు నిగ్గుతేలే వరకు పాలవర్గం ఫ్యాక్టరీ పాలనలో దూరంగా ఉండాలన్నారు. తడిసిన పంచదార అమ్మకాల్లో జరిగిన అవినీతి ఆరోపణలపై వేసిన విచారణ కమిటీ నివేదిక వెంటనే బయటపెట్టాలని కోరారు. -
ఉత్తమ సేవకులకు అవార్డులు
ఆదిలాబాద్ కల్చరల్ : జిల్లాలో కళాప్రదర్శనలు, క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారికి, ఉత్తమ సేవ కార్యక్రమాలు, సామాజిక రంగాల్లో సేవలందించిన వారికి, సంఘాలకు అవార్డులు లభిస్తాయని యువజన సర్వీసుల శాఖ జిల్లా సీఈవో వెంకటేశ్వర్లు అ న్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా యువజన సర్వీసుల శాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని యువతీ, యువకులు, కళాకారులు, ఉద్యోగుల నుంచి ఉత్తమ అవార్డులు, పద్మ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలిపారు. జాతీయ యూత్ అవార్డు కోసం 11 దరఖాస్తులు రాగా ఐ దింటిని ఎంపిక చేశామని వివరించారు. సంఘా ల విభాగంలో తాండూర్‌కు చెందిన అభినవ యూత్ ఆర్గనైజేషన్, మంచిర్యాలకు చెందిన కేజీఎన్ వాలంటీర్ల ఆర్గనైజేషన్, వ్యక్తిగత విభాగంలో తాండూర్‌కు చెందిన కె.సంతోష్, ఆదిలాబాద్ మండలం అంకోలికి చెందిన ఎర్రం న ర్సింగ్‌రావు, ఆదిలాబాద్‌కు చెందిన మిట్టు రవి ఎంపికయ్యారని తెలిపారు. పద్మ అవార్డుల కోసం 27 దరఖాస్తులు రాగా.. 13 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. సాహితీ, విద్యారంగం లో నిర్మల్‌కు చెందిన మడిపెల్లి భద్రయ్య, సా మాజిక సేవారంగంలో లక్సెట్టిపేట మండలం కొత్తూరుకు చెందిన తగరపు సత్తయ్య, తాండూర్ మండలం రేచూరి గ్రామానికి చెందిన కె.సంతోష్, కళారంగంలో నిర్మల్‌కు చెందిన జోసప్ బాపూరావు, సామాజిక సేవారంగంలో బెల్లంపల్లికి చెందిన దాసరి విజయ, నిర్మల్ చెందిన చిత్ర కళాకారుడు భాస్కర్రాజులను ఉత్తమ పద్మ అవార్డులకు ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపించినట్లు తెలిపారు. సామాజిక సేవారంగంలో ఆదిలాబాద్ మండలం దిమ్మ గ్రామానికి చెందిన పసుపుల రాజు, చెన్నూర్ మండలానికి చెందిన గర్మిళ్ల శ్రీనివాస్‌రెడ్డి, లోకేశ్వరం మండ లం ధర్మోర గ్రామానికి చెందిన మదిరి ఆంజనేయులు, ఆదిలాబాద్‌కు చెందిన అల్లొల సంతోష్‌కుమార్, గుడిహత్నూర్ మండలం తోషం గ్రా మానికి చెందిన ఎండి.షాహిద్, కళారంగంలో కడెంకు చెందిన నల్ల రాంరెడ్డి, ఆదిలాబాద్‌కు చెందిన ఫహీమ్ సర్కార్లను పద్మ అవార్డుల కోసం ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపించినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎంపికైన వారిని జాతీయస్థాయికి పంపిస్తారని, రాష్ట్రస్థాయిలో అవార్డులను ప్రకటిస్తారని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఎం.జగన్మోహన్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, యువజన సర్వీసుల శాఖ సీఈవో, డీపీఆర్వోతో కూడిన కమిటీ వీరిని ఎంపిక చేసినట్లు తెలిపారు. సమావేశంలో రెడ్‌క్రాస్ సొసైటీ కో ఆర్డినేటర్ ఖాన్ అరీఫ్ అహ్మద్, యూత్ కో ఆర్టినేటర్ మసూద్ పాల్గొన్నారు. -
సేవకు సత్కారం
తమిళ సినిమా, న్యూస్‌లైన్:అవార్డులు, రివార్డులతో సంబంధం లేకుండా అంకిత భావంతో పని చేసే సేవకు లను సత్కరించుకోవడం సంస్కారమని బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శ్రీకళాసుధ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఉగాది పురస్కారాలు, మహిళా రత్న అవార్డులు, సినీ ఉత్తమ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. పశ్చిమ గోదావరికి చెందిన అరుణ చంద్రాల ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న ప్రజాహిత కార్యక్రమాలకు గాను ఆమెను మహిళా రత్న అవార్డుతో సత్కరించారు. వైద్య, విద్య రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న స్వర్ణ భారత్, అక్షర విద్యాలయం నిర్వాహక అధ్యక్షురాలు, వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్‌కు మహిళా రత్న అవార్డును ప్రదానం చేశారు. 2013కి గాను సినీ అవార్డులను అందించారు. ఉత్తమ చిత్రం అవార్డును అత్తారింటికి దారేది చిత్ర నిర్మాత బీవీఎస్ ఎస్ ప్రసాద్, ఉత్తమ కుటుంబ కథా చిత్రం అవార్డును సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నిర్మాత రాజు, ఉత్తమ హాస్యభరిత చిత్ర అవార్డును వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రానికి గాను ఆ చిత్ర నిర్మాత అంకినేని రావి ప్రసాద్‌కు, ఉత్తమ భక్తిరస చిత్రం అవార్డును జగద్గురు ఆదిశంకర చిత్ర నిర్మాత నారా జయదేవికి, ఉత్తమ నూతన చిత్ర అవార్డును మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు నిర్మాత ఉమాదేవికి అందజేశారు. స్పెషల్ జ్యూరీ అవార్డులను సందీప్ కిషన్ (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్)కు, నటి శ్రీ దివ్య (మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు)కు అందజేశారు. ఉత్తమ సహాయకుడు కాశి విశ్వనాథ్‌కు, నటి రోహిణీకి, ఉత్తమ నూతన నటుడు అవార్డును రాజ్ తరుణ్‌కు, ఉత్తమ నూతన నటి అవార్డును ఇషాకు, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టు అవార్డును గాయని చిన్మయికి, ఉత్తమ కథా రచయిత అవార్డును జెకె భారవికి, ఉత్తమ మాటల రచయిత అవార్డును గణేష్ పాత్రోకు అందించారు. ఉత్తమ కథనం అవార్డును ఏలేటి చంద్రశేఖర్, ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును అనూప్ రూబెల్స్ అందుకున్నారు. తరువాత 1000 చిత్రాలు పూర్తి చేసుకున్న హాస్యనటుడు అలీని సాఫల్య అవార్డుతో ఘనంగా సత్కరించారు. ప్రార్థనా గీతంతో ప్రారంభమై న ఈ కార్యక్రమంలో అశ్విని శాస్త్రి, రోహిణీ శాస్త్రిల పంచాంగ శ్రవణం ఎం.సుందరి ఉగాది విశిష్టత ప్రసంగం, లండన్‌కు చెందిన మేనకా బోర ప్యూజన్ నృత్యం ఆహుతులను అలరించాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ ముఖ్య నేత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రజాసేవకు రాజకీయాలే అవసరం లేదని సేవాభావం గల ప్రతి వారు నాయకులేనన్నారు. కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని, మాతృభూమిని, కన్నతల్లిని ఎప్పుడూ మరచిపోకూడదన్నారు. అలాగే తెలుగు భాషను భారతీయ సంస్కృతి, సంప్రదాయాన్ని గౌరవించాలన్నారు. ఇతర భాషలైన ఇంగ్లీష్ లాంటివి నేర్చుకోండి అయితే ఇంగ్లీష్ వాళ్లు కాకండి అంటూ హితవు పలికారు. వేషం, భాష వేరైనా మనమంతా భారతీయులమని మరచిపోరాదన్నారు. సినిమా వారు కూడా కళా సేవ చేస్తున్నారని అన్నమయ్య లాంటి అద్భు త చిత్రాల రూపకర్తలు చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. అయితే ఇటీవల కొన్ని చిత్రాలు పెడదోవ పడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఉగాదంటే షడ్రచుల కలయిక అని జీవితంలో కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు ఉంటాయన్నారు. వాటిని అధిగమించాలన్నారు. ప్రస్తుత రాజకీయం ఎలక్షన్స్, సెలక్షన్స్, కలెక్షన్స్ అయిపోయిందన్నారు. సంస్కృతి లేని సమాజం బట్టలు లేని మనిషి లాంటిదని పేర్కొన్నారు. ఈ ఉగాది అందరికీ నూతన అధ్యాయాన్ని ప్రవేశపెట్టాలని ఆకాంక్షిస్తున్నానని వెంకయ్యనాయుడు అన్నారు. కళాసుధ తెలుగు అసోసియేషన్ తరపున బేతిరెడ్డి శ్రీనివాస్ వెంకయ్యనాయుడును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వి ఎల్ ఇందిరాదత్, ప్రీతారెడ్డి, మువ్వా పద్మయ్య, పి.నారాయణ, కాట్రగడ్డ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గాయకుడు మనో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
పరిశోధన ఫలించింది
విజయ ఫార్మసీ కళాశాల విద్యార్థినుల ప్రతిభ బీపీ, షుగర్లకు నూతన ఔషధాల తయారీ జాతీయస్థాయి సెమినార్లో గుర్తింపు రెండు పోస్టర్లకు ఉత్తమ అవార్డులు షుగర్.. ఈ వ్యాధి సోకిందని తెలియగానే ఎంతటివారైనా నీరసించిపోతారు. రోజూ క్రమం తప్పకుండా రెండు, మూడు మాత్రలు వేసుకోకుంటే ఈ మహమ్మారి ప్రాణాలను బలిగొనే ప్రమాదం ఉంది. బీపీ కూడా అంతే. ఇంతటి ప్రమాదకరమైన వ్యాధులతో బాధపడుతున్నవారు రోజూ ఒక్క మాత్ర వేసుకుంటే చాలు.. హాయిగా ఉండొచ్చు... అంటే నిజంగా అది వారికి శుభవార్తే. అటువంటి శుభవార్తనే చెబుతున్నారు ఎనికేపాడులోని విజయ ఫార్మసీ కళాశాల విద్యార్థినులు. బీపీ, షుగర్ వ్యాధి గ్రస్తులు రోజుకు ఒక్క మాత్ర వేసుకుంటే చాలు 24 గంటలు పనిచేసే నూతన ఔషధాలను వారు ఆవిష్కరించారు. విజయవాడ, న్యూస్‌లైన్ : వరంగల్‌లోని సెయింట్ పీటర్స్ ఫార్మసీ కళాశాలలో ‘అడ్వాన్స్ ఇన్ ఫార్మాస్యుటికల్ ఎనలిటికల్ టెక్నిక్స్’ అనే అంశంపై ఇటీవల జరిగిన జాతీయ స్థాయి సెమినార్లో ఎనికేపాడుకు చెందిన విజయ ఫార్మసీ కళాశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఇండియన్ ఫార్మాస్యుటికల్ అసోసియేషన్, డ్రగ్ ఇన్ఫర్మేషన్ అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగిన ఈ సెమినార్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 కాలేజీల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొని తమ పరిశోధనలను ఫార్మా రంగ శాస్త్రవేత్తలకు వివరించారు. విజయ ఫార్మసీ కళాశాల నుంచి పాల్గొన్న 30 మంది విద్యార్థులు ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మాస్యుటికల్ ఎనాలసిస్ విభాగాల్లో పది పోస్టర్ ప్రజెంటేషన్లు సమర్పించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) శాస్త్రవేత్త నాగేశ్వరరావు, పలువురు ఇన్విజిలేటర్లు వాటిని పరిశీలించారు. ఫ్లోటింగ్, సస్టైనేడ్ డ్రగ్ డెలివరీసిస్టం (నూతన ఔషధాల పరిశోధనలు) పోస్టర్స్ వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఔషధాలు రోగులకు ఉపయోగపడే విధానాన్ని వాటిని తయారుచేసిన విద్యార్థినులు అలేఖ్య, మహ్మద్ జహ సుల్తానా వివరించగా సంతృప్తి వ్యక్తంచేసిన శాస్త్రవేత్త, పరిశీలకులు ఈరెండింటినీ ఉత్తమ పోస్టర్స్‌గా ఎంపిక చేశారు. ఫ్లోటింగ్ డ్రగ్ డెలివరీ సిస్టం ఈ పరిశోధన బీపీ వ్యాధికి సంబంధించినది. సాధారణంగా బీపీ ఉన్న రోగులు మూడు, నాలుగు గంటలకు ఒకసారి నిఫిడెపెన్ మాత్రలను వేసుకోవాలి. దీనివల్ల కొన్నిసార్లు వికారంగా ఉండటంతోపాటు వాంతులు కూడా అవుతాయి. వయసు మీదపడిన వారు మాత్రలు వేసుకోవడం మరిచిపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యను గుర్తించిన ఫార్మసీ విద్యార్థిని అలేఖ్య నూతన ఔషధాన్ని ఆవిష్కరిం చేందుకు పరిశోధనలు చేసి విజయం సాధించింది. హెచ్పీఎంసీ, సోడియం బైకార్బనెట్లతో నూతన మాత్రను తయారు చేసింది. ఈ మాత్ర ఒకసారి వేసుకుంటే 24 గంటలు పనిచేస్తుందని అలేఖ్య వివరించింది. సస్టైన్డ్ డ్రగ్ డెలివరీ సిస్టం ఇది షుగర్ వ్యాధికి సంబంధించిన పరిశోధన. ఈ వ్యాధి గ్రస్తులు షుగర్ లెవెల్స్‌ను బట్టి మెట్ఫార్మిన్ మాత్రలను 250 ఎంజీ, 500 ఎంజీ, 750 ఎంజీ పవర్లను వాడుతుంటారు. వ్యాధి తీవ్రతను బట్టి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి నిర్ణీత వేళల్లో వేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థిని జహ సుల్తాన్ రూపొందించిన నూతన టాబ్లెట్‌ను షుగర్ ఏ లెవల్స్‌లో ఉన్నవారైనా ఒక్కటి వేసుకుంటే చాలు 24 గంటలు పనిచేస్తుంది. ప్రకృతి సిద్ధంగా లభించే ఆకు మండు తెగులు బ్యాక్టీరియా నుంచి వచ్చే జాంతేన్ గమ్ ద్వారా ఈ ఔషధం తయారు చేసినట్లు సుల్తానా తెలిపారు. జాంతేన్ గమ్ ప్రకృతి సిద్ధంగా లభించడం వల్ల కెమికల్స్‌కు తావు ఉండదని, తయారీ ఖర్చు కూడా తక్కువని చెప్పారు. లేబొరేటరీ స్థాయిలో విజయం సాధించిన ఈ పరిశోధనలను మరింత అభివృద్ధి చేస్తే రోగులకు బాగా ఉపయోగపడతాయి. ఫార్మా రంగ అభివృద్ధికి తోడ్పడతా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులకు సహాయపడాలనే ఫ్లోటింగ్ డ్రగ్ డెలివరీ సిస్టం పరిశోధన ప్రారంభించాను. నా ఆలోచనను మా కళాశాల అధ్యాపకుడు వెంకటేశ్వరరావుకు వివరించా. ఆయన నా పరిశోధనకు ఎంతగానో సహకారం అందించారు. భవిష్యత్తులో మరిన్ని ఔషధాలను ఆవిష్కరించి ఫార్మారంగ అభివృద్ధికి తోడ్పడతాను. - అలేఖ్య, బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ మా నాన్న బాధ చూడలేకే.. మా నాన్న షుగర్ పేషెంట్. నిత్యం మాత్రలు వేసుకుంటూ పడుతున్న ఇబ్బందులను గమనించాను. మెట్ఫార్మిన్ షుగర్ మాత్రలు రోజుకు రెండేసి వేసుకోవాల్సి వచ్చేది. ఒక్కోసారి మరిచిపోయి నిద్రపోయేవారు. దీంతో ఇబ్బందులు పడేవారు. నువ్వే ఏదో కొత్త మందు కనిపెట్టాలమ్మా.. అని తరచూ అనేవారు. ఈ మేరకు సస్టైన్డ్ డ్రగ్ డెలివరీ సిస్టం పరిశోధనను ప్రారంభించి ల్యాబ్ స్థాయిలో విజయం సాధించాను. జాతీయ స్థాయి సదస్సులో ప్రశంసా పత్రం పొందాను. ఈ పరిశోధనను మరింత అభివృద్ధి చేసినూతన ఔషధాలను అందుబాటులోకి తీసుకురావాలన్నదే నా లక్ష్యం. - మహ్మద్ జహ సుల్తానా, బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్