- విజయ ఫార్మసీ కళాశాల విద్యార్థినుల ప్రతిభ
- బీపీ, షుగర్‌లకు నూతన ఔషధాల తయారీ
- జాతీయస్థాయి సెమినార్‌లో గుర్తింపు
- రెండు పోస్టర్లకు ఉత్తమ అవార్డులు
షుగర్.. ఈ వ్యాధి సోకిందని తెలియగానే ఎంతటివారైనా నీరసించిపోతారు. రోజూ క్రమం తప్పకుండా రెండు, మూడు మాత్రలు వేసుకోకుంటే ఈ మహమ్మారి ప్రాణాలను బలిగొనే ప్రమాదం ఉంది. బీపీ కూడా అంతే. ఇంతటి ప్రమాదకరమైన వ్యాధులతో బాధపడుతున్నవారు రోజూ ఒక్క మాత్ర వేసుకుంటే చాలు.. హాయిగా ఉండొచ్చు... అంటే నిజంగా అది వారికి శుభవార్తే. అటువంటి శుభవార్తనే చెబుతున్నారు ఎనికేపాడులోని విజయ ఫార్మసీ కళాశాల విద్యార్థినులు. బీపీ, షుగర్ వ్యాధి గ్రస్తులు రోజుకు ఒక్క మాత్ర వేసుకుంటే చాలు 24 గంటలు పనిచేసే నూతన ఔషధాలను వారు ఆవిష్కరించారు.
విజయవాడ, న్యూస్‌లైన్ : వరంగల్‌లోని సెయింట్ పీటర్స్ ఫార్మసీ కళాశాలలో ‘అడ్వాన్స్ ఇన్ ఫార్మాస్యుటికల్ ఎనలిటికల్ టెక్నిక్స్’ అనే అంశంపై ఇటీవల జరిగిన జాతీయ స్థాయి సెమినార్‌లో ఎనికేపాడుకు చెందిన విజయ ఫార్మసీ కళాశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఇండియన్ ఫార్మాస్యుటికల్ అసోసియేషన్, డ్రగ్ ఇన్ఫర్మేషన్ అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగిన ఈ సెమినార్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 కాలేజీల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొని తమ పరిశోధనలను ఫార్మా రంగ శాస్త్రవేత్తలకు వివరించారు.
విజయ ఫార్మసీ కళాశాల నుంచి పాల్గొన్న 30 మంది విద్యార్థులు ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మాస్యుటికల్ ఎనాలసిస్ విభాగాల్లో పది పోస్టర్ ప్రజెంటేషన్లు సమర్పించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) శాస్త్రవేత్త నాగేశ్వరరావు, పలువురు ఇన్విజిలేటర్లు వాటిని పరిశీలించారు. ఫ్లోటింగ్, సస్‌టైనేడ్ డ్రగ్ డెలివరీసిస్టం (నూతన ఔషధాల పరిశోధనలు) పోస్టర్స్ వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఔషధాలు రోగులకు ఉపయోగపడే విధానాన్ని వాటిని తయారుచేసిన విద్యార్థినులు అలేఖ్య, మహ్మద్ జహ సుల్తానా వివరించగా సంతృప్తి వ్యక్తంచేసిన శాస్త్రవేత్త, పరిశీలకులు ఈరెండింటినీ ఉత్తమ పోస్టర్స్‌గా ఎంపిక చేశారు.
ఫ్లోటింగ్ డ్రగ్ డెలివరీ సిస్టం
ఈ పరిశోధన బీపీ వ్యాధికి సంబంధించినది. సాధారణంగా బీపీ ఉన్న రోగులు మూడు, నాలుగు గంటలకు ఒకసారి నిఫిడెపెన్ మాత్రలను వేసుకోవాలి. దీనివల్ల కొన్నిసార్లు వికారంగా ఉండటంతోపాటు వాంతులు కూడా అవుతాయి. వయసు మీదపడిన వారు మాత్రలు వేసుకోవడం మరిచిపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యను గుర్తించిన ఫార్మసీ విద్యార్థిని అలేఖ్య నూతన ఔషధాన్ని ఆవిష్కరిం చేందుకు పరిశోధనలు చేసి విజయం సాధించింది. హెచ్‌పీఎంసీ, సోడియం బైకార్బనెట్‌లతో నూతన మాత్రను తయారు చేసింది. ఈ మాత్ర ఒకసారి వేసుకుంటే 24 గంటలు పనిచేస్తుందని అలేఖ్య వివరించింది.
సస్‌టైన్‌డ్ డ్రగ్ డెలివరీ సిస్టం
ఇది షుగర్ వ్యాధికి సంబంధించిన పరిశోధన. ఈ వ్యాధి గ్రస్తులు షుగర్ లెవెల్స్‌ను బట్టి మెట్‌ఫార్మిన్ మాత్రలను 250 ఎంజీ, 500 ఎంజీ, 750 ఎంజీ పవర్‌లను వాడుతుంటారు. వ్యాధి తీవ్రతను బట్టి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి నిర్ణీత వేళల్లో వేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థిని జహ సుల్తాన్ రూపొందించిన నూతన టాబ్లెట్‌ను షుగర్ ఏ లెవల్స్‌లో ఉన్నవారైనా ఒక్కటి వేసుకుంటే చాలు 24 గంటలు పనిచేస్తుంది. ప్రకృతి సిద్ధంగా లభించే ఆకు మండు తెగులు బ్యాక్టీరియా నుంచి వచ్చే జాంతేన్ గమ్ ద్వారా ఈ ఔషధం తయారు చేసినట్లు సుల్తానా తెలిపారు. జాంతేన్ గమ్ ప్రకృతి సిద్ధంగా లభించడం వల్ల కెమికల్స్‌కు తావు ఉండదని, తయారీ ఖర్చు కూడా తక్కువని చెప్పారు. లేబొరేటరీ స్థాయిలో విజయం సాధించిన ఈ పరిశోధనలను మరింత అభివృద్ధి చేస్తే రోగులకు బాగా ఉపయోగపడతాయి.
ఫార్మా రంగ అభివృద్ధికి తోడ్పడతా
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులకు సహాయపడాలనే ఫ్లోటింగ్ డ్రగ్ డెలివరీ సిస్టం పరిశోధన ప్రారంభించాను. నా ఆలోచనను మా కళాశాల అధ్యాపకుడు వెంకటేశ్వరరావుకు వివరించా. ఆయన నా పరిశోధనకు ఎంతగానో సహకారం అందించారు. భవిష్యత్తులో మరిన్ని ఔషధాలను ఆవిష్కరించి ఫార్మారంగ అభివృద్ధికి తోడ్పడతాను.
- అలేఖ్య, బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్
మా నాన్న బాధ చూడలేకే..
మా నాన్న షుగర్ పేషెంట్. నిత్యం మాత్రలు వేసుకుంటూ పడుతున్న ఇబ్బందులను గమనించాను. మెట్‌ఫార్మిన్ షుగర్ మాత్రలు రోజుకు రెండేసి వేసుకోవాల్సి వచ్చేది. ఒక్కోసారి మరిచిపోయి నిద్రపోయేవారు. దీంతో ఇబ్బందులు పడేవారు. నువ్వే ఏదో కొత్త మందు కనిపెట్టాలమ్మా.. అని తరచూ అనేవారు. ఈ మేరకు సస్‌టైన్‌డ్ డ్రగ్ డెలివరీ సిస్టం పరిశోధనను ప్రారంభించి ల్యాబ్ స్థాయిలో విజయం సాధించాను. జాతీయ స్థాయి సదస్సులో ప్రశంసా పత్రం పొందాను. ఈ పరిశోధనను మరింత అభివృద్ధి చేసినూతన ఔషధాలను అందుబాటులోకి తీసుకురావాలన్నదే నా లక్ష్యం.
- మహ్మద్ జహ సుల్తానా, బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్