సేవకు సత్కారం
Published Mon, Mar 31 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM
తమిళ సినిమా, న్యూస్‌లైన్:అవార్డులు, రివార్డులతో సంబంధం లేకుండా అంకిత భావంతో పని చేసే సేవకు లను సత్కరించుకోవడం సంస్కారమని బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శ్రీకళాసుధ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఉగాది పురస్కారాలు, మహిళా రత్న అవార్డులు, సినీ ఉత్తమ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. పశ్చిమ గోదావరికి చెందిన అరుణ చంద్రాల ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న ప్రజాహిత కార్యక్రమాలకు గాను ఆమెను మహిళా రత్న అవార్డుతో సత్కరించారు. వైద్య, విద్య రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న స్వర్ణ భారత్, అక్షర విద్యాలయం నిర్వాహక అధ్యక్షురాలు, వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్‌కు మహిళా రత్న అవార్డును ప్రదానం చేశారు. 2013కి గాను సినీ అవార్డులను అందించారు. ఉత్తమ చిత్రం అవార్డును అత్తారింటికి దారేది చిత్ర నిర్మాత బీవీఎస్ ఎస్ ప్రసాద్, ఉత్తమ కుటుంబ కథా చిత్రం అవార్డును సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నిర్మాత రాజు, ఉత్తమ హాస్యభరిత చిత్ర అవార్డును వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రానికి గాను ఆ చిత్ర నిర్మాత అంకినేని రావి ప్రసాద్‌కు, ఉత్తమ భక్తిరస చిత్రం అవార్డును జగద్గురు ఆదిశంకర చిత్ర నిర్మాత నారా జయదేవికి, ఉత్తమ నూతన చిత్ర అవార్డును మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు నిర్మాత ఉమాదేవికి అందజేశారు.
స్పెషల్ జ్యూరీ అవార్డులను సందీప్ కిషన్ (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్)కు, నటి శ్రీ దివ్య (మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు)కు అందజేశారు. ఉత్తమ సహాయకుడు కాశి విశ్వనాథ్‌కు, నటి రోహిణీకి, ఉత్తమ నూతన నటుడు అవార్డును రాజ్ తరుణ్‌కు, ఉత్తమ నూతన నటి అవార్డును ఇషాకు, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టు అవార్డును గాయని చిన్మయికి, ఉత్తమ కథా రచయిత అవార్డును జెకె భారవికి, ఉత్తమ మాటల రచయిత అవార్డును గణేష్ పాత్రోకు అందించారు. ఉత్తమ కథనం అవార్డును ఏలేటి చంద్రశేఖర్, ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును అనూప్ రూబెల్స్ అందుకున్నారు. తరువాత 1000 చిత్రాలు పూర్తి చేసుకున్న హాస్యనటుడు అలీని సాఫల్య అవార్డుతో ఘనంగా సత్కరించారు. ప్రార్థనా గీతంతో ప్రారంభమై న ఈ కార్యక్రమంలో అశ్విని శాస్త్రి, రోహిణీ శాస్త్రిల పంచాంగ శ్రవణం ఎం.సుందరి ఉగాది విశిష్టత ప్రసంగం, లండన్‌కు చెందిన మేనకా బోర ప్యూజన్ నృత్యం ఆహుతులను అలరించాయి.
ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ ముఖ్య నేత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రజాసేవకు రాజకీయాలే అవసరం లేదని సేవాభావం గల ప్రతి వారు నాయకులేనన్నారు. కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని, మాతృభూమిని, కన్నతల్లిని ఎప్పుడూ మరచిపోకూడదన్నారు. అలాగే తెలుగు భాషను భారతీయ సంస్కృతి, సంప్రదాయాన్ని గౌరవించాలన్నారు. ఇతర భాషలైన ఇంగ్లీష్ లాంటివి నేర్చుకోండి అయితే ఇంగ్లీష్ వాళ్లు కాకండి అంటూ హితవు పలికారు. వేషం, భాష వేరైనా మనమంతా భారతీయులమని మరచిపోరాదన్నారు. సినిమా వారు కూడా కళా సేవ చేస్తున్నారని అన్నమయ్య లాంటి అద్భు త చిత్రాల రూపకర్తలు చాలామంది ఉన్నారని పేర్కొన్నారు.
అయితే ఇటీవల కొన్ని చిత్రాలు పెడదోవ పడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఉగాదంటే షడ్రచుల కలయిక అని జీవితంలో కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు ఉంటాయన్నారు. వాటిని అధిగమించాలన్నారు. ప్రస్తుత రాజకీయం ఎలక్షన్స్, సెలక్షన్స్, కలెక్షన్స్ అయిపోయిందన్నారు. సంస్కృతి లేని సమాజం బట్టలు లేని మనిషి లాంటిదని పేర్కొన్నారు. ఈ ఉగాది అందరికీ నూతన అధ్యాయాన్ని ప్రవేశపెట్టాలని ఆకాంక్షిస్తున్నానని వెంకయ్యనాయుడు అన్నారు. కళాసుధ తెలుగు అసోసియేషన్ తరపున బేతిరెడ్డి శ్రీనివాస్ వెంకయ్యనాయుడును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వి ఎల్ ఇందిరాదత్, ప్రీతారెడ్డి, మువ్వా పద్మయ్య, పి.నారాయణ, కాట్రగడ్డ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గాయకుడు మనో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
Advertisement
Advertisement