geeta reddy
-
TS Election 2023: గీతారెడ్డి ఇంటికి రేవంత్‌రెడ్డి..
సంగారెడ్డి: నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వికారాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే శనివారం రాత్రి చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఆదివారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వికారాబాద్‌కు చెందిన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌తో కలిసి చంద్రశేఖర్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జహీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించడం చక చకా జరిగిపోయాయి. తన తాత ముత్తాతలు, తల్లిదండ్రులు జహీరాబాద్ నియోజకవర్గంలోని రాజనెల్లి గ్రామానికి చెందిన వారని, భార్య స్వస్థలం జహీరాబాద్ కావడంతో తనకు కలిసివస్తుందని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. ఈ నెల 18న కాంగ్రెస్‌లో అధికారికంగా చేరుతున్నట్లు ప్రకటించారు. జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం చంద్రశేఖర్ పేరును ప్రతిపాదించినట్లు ప్రచారం సాగుతోంది. గీతారెడ్డి ఇంటికి రేవంత్‌రెడ్డి.. మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి జె.గీతారెడ్డిని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం రాత్రి ఎంపీపీ అధ్యక్షుడు ఎన్.గిరిధర్‌రెడ్డితో కలిసి ఆమె నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఆరోగ్య పరిస్థితుల కారణంగా గీతారెడ్డి ఎన్నికల్లో పోటీచేసే విషయంలో సుముఖంగా లేనట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి పదవి, లేదా రాజ్యసభ సీటు ఇవ్వాలనే దానిపై ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. తన స్థానంలో అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా అభ్యంతరం లేదని, గెలిచే అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని గీతారెడ్డి సూచించినట్లు వినికిడి. ఈ సందర్భంగా వికారాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ పేరు ప్రస్తావనకు రాగా ఆమె సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
‘కొండెక్కిన’ పార్కింగ్ ఫీజు
సాక్షి, యాదాద్రి: కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు తీసుకుని కొండపైకి వెళ్లాలనుకునే భక్తులకు యాదగిరిగుట్ట దేవస్థానం పార్కింగ్ ఫీజుల షాక్ ఇచ్చింది. తిరుమల తరహాలో యాదాద్రిలో భక్తులకు వసతులు కల్పిస్తామన్న దేవస్థానం ప్రకటనతో సంతోషపడ్డ భక్తులు పార్కింగ్ ఫీజుల పెంపు ప్రకటనతో దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలను కొండపైన పార్కింగ్ చేస్తే గంటకు రూ.500, ఆ పైన ప్రతి గంటకు అదనంగా రూ.100 వసూలు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. దేవస్థానం తాజా ఉత్తర్వుల ప్రకారం ఆదివారం నుంచి ఈ పార్కింగ్ చార్జీల వసూలు ప్రారంభం కానుంది. ఈ మేరకు శనివారం ఈవో గీతారెడ్డి ఆదేశాలు జారీచేశారు. మార్చి 28న లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం ఉద్ఘాటన జరగ్గా, ఆ రోజు నుంచి భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. కొండకింద నుంచి పైకి, పైనుంచి కిందకు ఆర్టీసీ బస్సుల్లోనే భక్తులను ఉచితంగా చేరవేస్తున్నారు. అయితే స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించాలని పెద్ద ఎత్తున వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా తీసుకున్న నిర్ణయం చాల ఖరీదుగా మారింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఉన్నతస్థాయి అధికారులు, న్యాయమూర్తుల ప్రొటోకాల్ వాహనాలకు పార్కింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన దాతల గుర్తింపు కార్డులు చూపించిన వారి వాహనాలకు కూడా పార్కింగ్ ఫీజు లేదు. వాహనాల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి ఇద్దరు దేవస్థానం ఉద్యోగులను నియమించారు. ఫీజు చెల్లించిన వాహనాలను క్యూ కాంప్లెక్స్ ఎదురుగా గల బస్టాండ్, వీఐపీ గెస్‌హౌస్ పక్కన గల ఖాళీ స్థలంలో నిలపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో యాదాద్రి కొండపైకి వచ్చే భక్తుల ద్విచక్ర వాహనాలకు కాలపరిమితి లేకుండా రూ.15, కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలకు రూ.100 పార్కింగ్ ఫీజు వసూలు చేసే వారు. ప్రస్తుతానికి ద్విచక్ర వాహనాలకు పాత ఫీజునే వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. తాజా నిర్ణయంతో దేవస్థానం వ్యాపారమయంగా మారిందని, ఫీజు తగ్గించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
అధిష్టానం ‘అలయ్ బలయ్’!
సాక్షి, హైదరాబాద్: పార్టీ అధిష్టానం అల్లంత దూరమనే భావన తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు దూరమవుతోందా? తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని భావిస్తున్న ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు దగ్గరవుతున్నారా? గత మూడు రోజులుగా ఢిల్లీ వేదికగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. తెలంగాణ నేతలు సోమవారం నుంచి ఢిల్లీలో ప్రత్యేకంగా మకాం వేసి మరీ అధిష్టానం పెద్దలను కలుస్తుండడం, వీహెచ్, జగ్గారెడ్డి తదితర నాయకులకు ఢిల్లీ అగ్రనేతలు వరుసగా అపాయింట్మెంట్లు ఇస్తుండడం, త్వరలో రాష్ట్రానికి రానున్న రాహుల్‌గాంధీ పార్టీలోని అన్ని స్థాయిల నేతలను కలిసేందుకు ఏర్పాట్లు జరుగుతుండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వరుస భేటీలు తెలంగాణలో పార్టీని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లేందుకు గాను గతంలో ఎన్నడూ లేనివిధంగా 40 మంది రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో రాహుల్‌గాంధీ సమావేశం కావడంతో భేటీల పరంపర మొదలయింది. అంతకుముందే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సమావేశమయ్యారు. రాహుల్‌తో సమావేశం ముగిసిన మరుసటి రోజే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డిలు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌ను జగ్గారెడ్డి కుటుంబ సమేతంగా కలిశారు. ఈలోపే రాహుల్‌గాంధీ కూడా జగ్గారెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చారు. జగ్గారెడ్డితో పాటు టీపీసీసీ మరో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కూడా కలిసేందుకు అంగీకరించారు. కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు జగ్గారెడ్డి.. తన భార్య, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, కుమారుడు భరత్‌సాయిరెడ్డి, కుమార్తె జయారెడ్డిలతో కలిసి వెళ్లి రాహుల్‌ను కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఇక మహేశ్‌కుమార్‌గౌడ్ తన కుమారుడు, లా విద్యార్థి ప్రణవ్గౌడ్ను వెంటబెట్టుకుని రాహుల్‌ను కలిశారు. ఇద్దరు నేతలు రాహుల్‌ను కలిసినప్పుడు కూడా రాజకీయ అంశాల కంటే పిల్లల చదువులు, కుటుంబ అంశాలపైనే రాహుల్ మాట్లాడినట్టు సమాచారం. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి కూడా రాహుల్‌తో భేటీ అయ్యారు. రాహుల్‌తో భేటీ తర్వాత జగ్గారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తన నియోజకవర్గ నేతలను కూడా ఢిల్లీకి తీసుకువచ్చి రాహుల్‌ను కలిసి ఫొటోలు దిగేలా ప్రయత్నం చేస్తానని చెప్పడం గమనార్హం. గతానికి భిన్నంగా.. కాంగ్రెస్ పెద్దలను ఢిల్లీ వెళ్లి కలవడం ఎంత కష్టమో.. రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా అంతే కష్టమనే భావన రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో ఉంది. రాహుల్ లేదా సోనియా లేదా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఎవరు వచ్చినా కీలక నాయకులు మినహా ఎవరికీ వారిని కలిసే అవకాశముండేది కాదు. పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు కూడా కాంగ్రెస్ పెద్దలను కలవడం ఓ టాస్క్లాగానే ఉండేది. అయితే ఈసారి అందుకు భిన్నంగా రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన ఉంటుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈనెలాఖరులో రాష్ట్రానికి రానున్న రాహుల్ రెండ్రోజులు ఇక్కడే ఉంటారని, ఒకరోజు బహిరంగ సభకు హాజరు కానుండగా, మరోరోజు రాష్ట్రానికి చెందిన అన్ని స్థాయిల్లోని పార్టీ నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులతో పాటు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ముఖ్య నేతలందరినీ కలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, స్థానిక సంస్థలకు ప్రాతి నిధ్యం వహిస్తున్న నాయకులు, సభ్యత్వ నమోదులో కీలకపాత్ర పోషించిన వారితో కూడా రాహుల్‌తో కలిపించాలనే భావనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అందని ద్రాక్షలు కాదు..! ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అందని ద్రాక్షలేమీ కాదని, అందరితో కలివిడిగా ఉంటారనే భావనను పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లాలనేది రేవంత్‌రెడ్డి యోచనగా కనిపిస్తోంది. ఆ భావన కలిగించడం ద్వారా జరగబోయే ఎన్నికల్లో మరింత క్రియాశీలంగా కేడర్ పనిచేస్తుందనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. -
ముగిసిన కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పలువురు భేటీ అయ్యారు. భేటీ ముగిసిన అనంతరం సీనియర్‌నేత వీ. హన్మంతరావు మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో జరిగిన పరిణామాలపై చర్చించామని, సీనియర్ల విషయంలో జరుగుతున్న అవమానాలపై మాట్లాడినట్లు తెలిపారు. అధిష్టానం దృష్టికి అన్ని విషయాలను తీసుకెళ్తామని అన్నారు. మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో సంస్థాగతమైన మార్పులు జరగాలని వర్కింగ్ కమిటీ సోనియా గాంధీని కోరారని తెలిపారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏవిధంగా ప్రజల విశ్వాసం పొందుతుందనే దానిపై నిర్ణయాలు ఉండాలని తెలిపారు. పార్టీకి పూర్వ వైభవం రావాలని దానిపై చర్చించామని పేర్కొన్నారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్న వారు.. పార్టీకి అనుబంధంగా ఉన్నారా లేదా అనేది చూడాలని అన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు సమావేశంలో బయట జరుగుతున్న ఊహాగానాలు ఏమి లేవని, ఆదివారం సోనియా గాంధీ ఏర్పాటు చేసిన సమావేశంపై చర్చించామని పేర్కొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం ఉండాలని చర్చించామని తెలిపారు. ఆ కుటుంబం అడుగుజాడల్లో కార్యకర్తలు నడుస్తారని అన్నారు. పార్టీతో కొన్ని ఏళ్లుగా అనుబంధంగా కొనసాగుతున్న నేతలుగా చర్చించుకున్నామని చెప్పారు. ఢిల్లీ సమావేశం పైనే చర్చించామని, వీహెచ్ చెప్పిన అంశాలు చర్చకు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్‌కు రెట్టింపు బలం కోసం ఏ విధంగా పని చేయాలనే దానిపై మాట్లాడినట్లు తెలిపారు. -
యాదాద్రి విల్లాకు రూ.7.5 కోట్ల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండకు దిగువన యాదగిరిపల్లి సమీపంలో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలకు దాతలు సహకారాన్ని అందించారు. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రెసిడెన్షియల్ సూట్‌తో పాటు 14 విల్లాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఒక వీవీఐపీ విల్లాకు హైదరాబాద్‌కు చెందిన కాటూరి వైద్య కళాశాల చైర్మన్ కాటూరి సుబ్బారావు రూ.7.5 కోట్ల విరాళం అందించారు. వీవీఐపీ విల్లా తాళాలను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డిలు దాత కాటూరి సుబ్బారావుకు అందజేశారు. గత నెల 12న ప్రెసిడెన్షియల్ సూట్‌తోపాటు 13 విల్లాలను దాతలకు అధికారులు కేటాయించారు. -
విజయ ‘గీత’: కసితో చదివారు.. ఆమె పేరు చివర ఆరు డిగ్రీలు
అవార్డులు ఊరికే రావు. ఆ అవార్డు వెనుక... అవార్డు అందుకున్న చేతులు చక్కబెట్టిన బాధ్యతలుంటాయి. ఆ చేతులు తీర్చిదిద్దిన జీవితాలుంటాయి. ఆ చేతులు చేతల్లో చూపించిన విజయాలుంటాయి. ‘బెస్ట్ ఉమన్ ఎంటర్ప్రెన్యూర్ ఫర్ మెంటారింగ్ స్టార్ట్ అప్స్’ అవార్డు అందుకున్న డాక్టర్ గీత ప్రస్థానమూ అలాంటిదే. జీవితంలో ఊహించని అవరోధం ఎదురు కానంత వరకు ఎవరూ జీవితాన్ని తరచి చూసుకోరు. అక్కడి నుంచి మొదలయ్యేదే అసలైన జీవితం... అంటారు యష్మిసొల్యూషన్స్ సీఈవో డాక్టర్ బి. గీతారెడ్డి. యువ పరిశ్రమ యువత పట్టాలు పుచ్చుకుని ఉద్యోగం కోసం ఎదురు చూడడమే మనకు తెలిసిన పురోగతి. ఉద్యోగం కోసం ఎదురు చూడడం కాదు, ఉద్యోగం ఇచ్చేలా ఎదగడం యువత లక్ష్యం అయి ఉండాలి. అందుకోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాను. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్‌తో మా ‘సిఐఎమ్ఎస్ఎమ్ఈ’ ఒప్పందం కుదుర్చుకుంది. సైన్స్, ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అందరికీ ఎంటర్ ప్రెన్యూర్షిప్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం ఇందులో ఉద్దేశం. పరిశ్రమల రంగం యువకులతో, మహిళలతో నిండిపోవాలనేది నా కల. – డాక్టర్ బి. గీతారెడ్డి, చైర్పర్సన్, సిఐఎమ్ఎస్ఎమ్ఈ (ఏపీ స్టేట్). క్లస్టర్ డైరెక్టర్ (ఏపీ, ఒడిషా), కోవె ఎగ్జిక్యూటివ్ మెంబర్ యష్మి సొల్యూషన్స్ స్థాపించి సర్వీస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారడానికి ముందు ఆమె తనకు ఎదురైన ఎన్నో సవాళ్లను మనోధైర్యంతో అధిగమించారు. ప్రభుత్వ భూముల కబ్జా వంటి అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించడంలో మొండిధైర్యంతో సాగిపోయారు. కసితో చదవడం మొదలు పెట్టారు. ఇప్పుడామె పేరు చివర ఆరు డిగ్రీలు కనిపిస్తాయి. అందరమ్మాయిల్లాగానే నేనూ వైజాగ్‌లో పుట్టి పెరిగిన గీత ఎంసీఎ పూర్తయిన తర్వాత పెళ్లయింది. ‘‘పెళ్లి తర్వాత కూడా చదవడమే పనిగా చదివాను. ‘ఒక సమస్య మీద గట్టిగా వాదిస్తావు. పెద్ద పోరాటమే చేస్తావు, నీకు లీగల్ నాలెడ్జ్ ఉంటే పది మందికి ఉపయోగపడతావని చెప్పాడు మా పెద్ద తమ్ముడు. ఆ మాటతో ఎల్ఎల్బీ చేశాను. ఎంబీఏ, ఆస్ట్రాలజీ, మెడికల్ ఆస్ట్రాలజీలో పీహెచ్డీ, ఉమెన్ ఇన్ ప్రొఫెషనల్ స్టడీస్‌లో పీహెచ్డీ చేశాను. ఇదే సమయంలో నాకంటూ ఒక మంచి యాక్టివిటీని అభివృద్ధి చేసుకున్నాను. అప్పుడప్పుడే డిజిటల్ మీడియా ఊపందుకుంటున్న రోజులవి. మా చిన్న తమ్ముడితో కలిసి డిజిటల్ మీడియా సెక్టార్లో సర్వీస్ మొదలు పెట్టాను. తర్వాత 2015లో సొంతంగా సర్వీస్ ఇండస్ట్రీ స్థాపించుకున్నాను. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు పని చేశాను. ఇప్పుడు నా సర్వీస్ బిజినెస్ చూసుకుంటూనే సమాజానికి నా వంతుగా సేవ చేస్తున్నాను. బాధితులు మహిళలే కుటుంబ సమస్యగా కనిపించే అనేక సమస్యలకు నేరుగా బాధితులయ్యేది మహిళలే. ఆ సమస్యను పరిష్కరించగలిగితే పూర్తి కుటుంబం సంతోషంగా సాగిపోతుందని నా గట్టి నమ్మకం. అందుకే మహిళల సమస్యల మీదనే దృష్టి పెట్టాను. లీగల్ కౌన్సెలింగ్, ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు మహిళల స్వయంసమృద్ధి కోసం స్టార్టప్ మెంటార్‌గా కూడా మారాను. ఆర్థిక స్వేచ్ఛ కొరవడడం పరోక్షంగా మానసిక అభద్రతకు కారణమవుతుంటుంది. అక్కడి నుంచి కుటుంబ సమస్యలు తలెత్తుతాయి, అవి న్యాయపరమైన చిక్కులకు దారి తీస్తాయి. కౌన్సెలింగ్ సమయంలో వందలాది మంది మహిళల మనసులను చదివాను. ఆ అనుభవంతో చెప్తున్న మాట ఇది. ‘జాతకాలు చూసి మరీ పెళ్లి చేశారు మా వాళ్లు. అయినా నా జీవితం ఇలా ఉంది’ అని చాలా మంది మహిళలు బాధపడేవాళ్లు. జ్యోతిషం నిజమే అయితే ఫలితాలు ఇలా ఎందుకుంటాయనే సందేహం నాకూ కలిగింది. అప్పుడు జ్యోతిషం చదివాను. ఏ సబ్జెక్టు మీదకు దృష్టి మళ్లితే ఆ కోర్సు చేయడమే ఇప్పటి వరకు నా ప్రస్థానంగా మారింది. ఇప్పుడు బెంగళూరు ఐఐఎమ్ నుంచి మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనేది కోరిక’’ అన్నారు డాక్టర్ గీతారెడ్డి. – వాకా మంజులారెడ్డి ‘వనిత’ల కోసం మన మహిళల ఉత్పత్తులకు ఒక బ్రాండింగ్ డిజైన్ చేస్తే విదేశాల్లో మంచి గుర్తింపు వస్తుంది. హస్తకళాకృతులను, ఇతర ఉత్పత్తులతో ఉపాధి పొందే మహిళలను ఒక త్రాటి మీదకు తీసుకురావడానికి ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్’ ద్వారా ప్రయత్నిస్తున్నాం. గాజులు, మగ్గం వర్క్, పోటరీ, జీడిపప్పు గ్రేడింగ్ అండ్ ప్యాకింగ్ వంటి ఉత్పత్తుల మార్కెట్ కోసం ‘వనిత’ పేరుతో వెబ్సైట్ రూపకల్పన జరుగుతోంది. గార్మెంట్ మేకింగ్‌లో ఉన్న మహిళలకు హిందూస్థాన్ షిప్‌యార్డ్ ఉద్యోగులకు అవసరమైన బాయిలర్ సూట్స్ ఆర్డర్ ఇప్పించడం, తిరుపతిలోని మహిళా యూనివర్సిటీలో శిక్షణ కార్యక్రమాల సమన్వయం జరుగుతోంది. -
‘బీజేపీ బీ టీమ్ టీఆర్ఎస్ పార్టీ’
సాక్షి, హైదరాబాద్ : విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుకుంటూ.. వారిని నిరుద్యోగులుగానే ఉంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఏఐసీసీ సెక్రటరీ మధు యాష్కి ఆరోపించారు. ఈ సందర్భంగా శనివారమిక్కడ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తానన్న కేసీఆర్.. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు మాత్రం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను నియంతృత్వ పాలనలో పరిపాలిస్తుందన్నారు. సాగుకోసం రైతులు నీళ్లడిగితే ఊళ్లకు ఊళ్లను నిర్బంధిస్తున్నారని విమర్శించారు. సాయుధ రైతాంగ పోరాటం చేసిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డదని గుర్తు చేశారు. కానీ కేసీఆర్, కవితలు ఈ చరిత్ర మర్చిపోయారని అందువల్లే ప్రజలకు మేలు చేసే నిజాం షుగర్ ఫ్యాక్టరిని మూసివేశారని ఆరోపించారు. బీజేపీ ‘బీ’ టీమ్ టీఆర్ఎస్ పార్టీ తన అవినీతి బయటపడుతుందనే కేసీఆర్ మోడీ కాళ్ళు మొక్కుతూ తిరుగుతున్నారని మధు యాష్కి విమర్శించారు. ప్రత్యేక ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన అన్ని ప్రజా సంఘాలు, వర్గాలు, మహిళలు ముందుండి ఈ ప్రజాకంటక పాలనను గద్దె దించాలని పిలుపునిచ్చారు. మహిళల అక్రమ రవాణాలో మనమే ముందున్నాం : గీతారెడ్డి మహిళల అభివృద్ధికోసం కృషి చేస్తున్నామంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం ఒక్క మహిళా మంత్రి కూడా లేదంటూ కాంగ్రెస్ నాయకురాలు గీతా రెడ్డి ఎద్దేవాచేశారు. మహిళల అక్రమ రవాణాలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉంది. దీన్ని బట్టే తెలంగాణలో ఎలాంటి పాలన ఉందో అర్ధమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం చాలా చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకం ప్రారంభించినా మహిళల పేరుతోనే మొదలు పెట్టేదని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పాలనలో స్వయం ఉపాధి మహిళా సంఘాలకు చాలా అన్యాయం జరిగిందన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాహుల్ ఈ మహిళా సంఘాలతో సమావేశం అవుతారని తెలిపారు. అందువల్ల మహిళలు పెద్దఎత్తున ఈ సమావేశానికి హాజరుకావాలని కోరారు. కేంద్రం బైసన్ పోలో గ్రౌండ్‌ను సెక్రెటేరియట్ కోసం ఇస్తే భారీ ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. -
స్కాలర్‌షిప్‌ల మంజూరులో జాప్యమెందుకు?
సాక్షి, హైదరాబాద్: విద్యా ర్థులకు స్కాలర్షిప్లను మంజూరులో జాప్యంపై పీఏసీ చైర్పర్సన్ జె.గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశా రు. విద్యార్థుల స్కాలర్షిప్లు, ఉపకార వేతనాల మంజూరులో జాప్యం పై ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) శుక్రవారం సమీక్షించింది. విద్యార్థులు స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆయా శాఖలు అనుసరిస్తున్న విధానంపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. దరఖాస్తులను ఆన్లైన్లోనే తీసుకుంటున్నామని, కోర్సు, విద్యాసంస్థ, సామాజిక, ఆర్థిక అర్హతలన్నీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటేనే ఆన్లైన్లో నమోదవుతాయని అధికారులు వివరించారు. కాలేజీ, వర్సిటీల్లోని విద్యా ప్రమాణాలను బట్టి స్కాలర్షిప్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని అధికారులు వెల్లడించారు. స్కాలర్‌షిప్‌ల మం జూరు, వాటిలో ఇబ్బందులపై చర్చించడానికి వీసీలతో భేటీ ఏర్పాటు చేయాలన్నారు. -
ప్రజలను మోసం చేసి పాలిస్తున్నారు: గీతారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రజలను మోసం చేసి పాలిస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ ఉపనేత జె.గీతారెడ్డి ఆరోపణలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ముగించి తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేశారని, రాష్ట్రం బాగుందని చెప్పేందుకు అప్పులను రెవెన్యూగా చూపించారని దుయ్యబట్టారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎల్పీ మరో ఉపనేత జీవన్‌రెడ్డితో కలసి గీతారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం అధీనంలోని ఉదయ్ పథకం కింద డిస్కంలకు రూ.9 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ.7,500 కోట్లు ఇచ్చారని.. మిగిలిన మొత్తాన్ని గ్రాంటుగా కాకుండా ఈక్విటీగా చూపారన్నారు. హడ్కో నుంచి రూ.1,000 కోట్ల రుణం తీసుకుని దాన్నీ రెవెన్యూగా చూపించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని, ఇలాంటి నేరాలు చేస్తే ప్రైవేటు వ్యక్తులను జైలుకు పంపుతారని వ్యాఖ్యానించారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. మిగులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని విమర్శించారు. అప్పులు చేయడానికి తప్పుడు లెక్కలు చూపించారని.. సంక్షేమానికి నిధులివ్వని ఈ ప్రభుత్వాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు క్షమించవన్నారు. ప్రాజెక్టుల వద్దకు ఎవరో ఒకరిని తీసుకెళ్లి హరీశ్ మార్కెటింగ్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. -
చెబుతున్నంత గొప్పగా ఏం లేదు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘కేసీఆర్ కిట్’పథకం ప్రభుత్వం చెప్పుకొంటున్నంత గొప్పగా ఏమీ లేదని మాజీ మంత్రి, సీఎల్పీ ఉపనేత జె.గీతారెడ్డి వ్యాఖ్యానించారు. పథకం అమల్లోని ఉద్దేశాన్ని అభినందిస్తూనే.. లోపాలు, ప్రభుత్వ విపరీత ప్రచారంపై సెటైర్లు వేశారు. కేసీఆర్ కిట్ పథకంపై శుక్రవారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఇందులో గీతారెడ్డి కాంగ్రెస్ తరఫున మాట్లాడారు. ప్రభుత్వం చెప్పుకొంటున్నంత గొప్పగా కేసీఆర్ పథకం పరిస్థితి క్షేత్రస్థాయిలో ఏమీ లేదన్నారు. అసలు ఈ తరహా పథకం ఇదే తొలిసారి కాదని, గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా అమలుచేసిందని చెప్పారు. తమిళనాడులో ముత్తులక్ష్మి పేరిట ఉన్న పథకాన్నే ఇక్కడ కొనసాగిస్తున్నారని, ఇందులో పీఎంఎంవీవై కింద కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం ఉందని వివరించారు. ఈ పథకం అమల్లోకి వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో 93,927 ప్రసవాలు జరిగాయని లెక్కలు చెబుతున్నారని.. అలాంటప్పుడు 91,148 కిట్లే ఎలా పంపిణీ చేశారని, మిగతావి ఎందుకు పంపిణీ చేయలేదని నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్న లెక్కలు బాగానే ఉన్నా.. అరకొర సౌకర్యాలతో సమస్యల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఖమ్మం ఆసుపత్రిలో ఓ మహిళకు టేబుల్‌పై డెలివరీ చేయగా.. శిశువు కింద పడి చనిపోయిన ఉదంతం దేనికి నిదర్శనమని నిలదీశారు. నల్లగొండ జిల్లా దేవరకొండ ఆస్పత్రికి ఓ గర్భిణి ప్రసవం కోసం వెళితే బెడ్లు లేవని పంపేశారని.. నల్లగొండ ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు డెలివరీ జరిగి బిడ్డ చనిపోయిందని గీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఒక గుడ్డు ఎక్కువిస్తున్నారు అంతే! పలు ప్రభుత్వ పథకాలపై గీతారెడ్డి వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. అలాంటి పథకాలను కాంగ్రెస్ చాలా తీసుకొచ్చిందని.. డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి స్వయం సహాయక రుణాలిచ్చిందే తామని గుర్తుచేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ అమృతహస్తం కింద అంగన్వాడీల్లో పథకాలు పెట్టామని.. అయితే ఇప్పుడు ఓ గుడ్డు ఎక్కువ ఇస్తున్నారేమోనని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో మహిళా కమిషన్ వేయలేదని, సమైక్యాంధ్రకు చెందిన వ్యక్తి తెలంగాణ మహిళా కమిషన్‌ను నడిపిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో 6గురు మహిళా మంత్రులు ఉంటే అందులో ఐదుగురం తెలంగాణ వారమని.. ఇప్పుడు ఒక్క మహిళ కూడా మంత్రివర్గంలో లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఆస్పత్రులను మెరుగుపర్చండి కేసీఆర్ కిట్ పథకం మంచిదే అయినా.. ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలని ఇతర విపక్షాలకు చెందిన సభ్యులు డిమాండ్ చేశారు. సొమ్ము కేంద్రానిది అయితే, సోకు రాష్ట్రానిది అన్నట్లుగా పరిస్థితి ఉందని, కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 1,243 కేసీఆర్ కిట్లు మాత్రమే ఎందుకు పంపిణీ చేశారని బీజేపీ సభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. బడ్జెట్లో కేసీఆర్ కిట్ పథకాన్ని పెట్టలేదని.. అలాంటప్పుడు ఈ పథకం కోసం ఇస్తున్న నిధులను ఏ అంశం నుంచి తగ్గించి ఇస్తున్నారో చెప్పాలని టీడీపీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య కోరారు. ప్రసవాలకు అవకాశమున్న ఆరోగ్య కేంద్రాల్లో 5,118 వైద్య పోస్టులు ఉండగా.. 3,171 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మరి ప్రసవాల సంఖ్య ఎలా పెంచుతారని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య నిలదీశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక్క వైద్య పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రుల్లో పరిస్థితిని మెరుగుపర్చాలని ఎంఐఎం సభ్యుడు మొజంఖాన్ కోరారు. ఏపీకి తెలంగాణ స్ఫూర్తి: కొండా సురేఖ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా దాని పేరు మార్చి ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారని టీఆర్ఎస్ సభ్యురాలు కొండా సురేఖ అన్నారు. గురువారం కేసీఆర్ కిట్ పథకంపై శాసనసభలో జరిగిన లఘు చర్చను ఆమె ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు స్ఫూర్తిగా నిలుస్తోందని అన్నారు. ఇక్కడ ఒక పథకం ప్రవేశపెడితే, అదే తరహాలో అక్కడ కూడా మరో పథకాన్ని తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబంలో మేనమామ, తాత, అన్న అనే కోణాల్లో ఆలోచించిన సీఎం కేసీఆర్ తెలంగాణ మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ఆమె ప్రశంసించారు. ఆ తర్వాత మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్ మాట్లాడుతూ కేసీఆర్ కిట్ పథకం గిరిజన మహిళలకు ఎంతో ఉపయుక్తంగా మారిందని అన్నారు. సిజేరియన్లు రాష్ట్రంలోనే ఎక్కువ: లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: సిజేరియన్లు మన రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాలను పెంచి ఆపరేషన్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సహజ ప్రసవాలను పెంచేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా మిడ్ వైఫరీ కోర్సును ప్రారంభించామన్నారు. శుక్రవారం అసెంబ్లీలో కేసీఆర్ కిట్ పథకంపై జరిగిన స్వల్ప చర్చలో మంత్రి మాట్లాడారు. ‘మాతృత్వ మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్), నవజాత శిశువుల మరణాల నిష్పత్తి (ఐఎంఆర్) తగ్గించడం.. గర్భిణుల ఆరోగ్య పరిరక్షణ, వేతన కష్టాలను తీర్చడం, ఆరోగ్యకరమైన భవిష్యత్ తరాన్ని తయారు చేయడం వంటి లక్ష్యాలతో కేసీఆర్ కిట్ పథకం అమలవుతోంది.ఈ ఏడాది జూన్ 2న కేసీఆర్ కిట్ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 93,927 కాన్పులు జరిగాయి. ’అని వివరించారు. -
వ్యవసాయ శాఖలో 1,446 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు వ్యవసాయ శాఖలో 1,446 పోస్టులను భర్తీ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పుట్టా మధుకర్, అల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, ఆరూరి రమేశ్‌లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. తమ శాఖలో ఇప్పటివరకు 1,311 మంది వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో), 114 వ్యవసాయాధికారులు, 18 జూనియర్ అసిస్టెంట్లు, మూడు టైపిస్టు పోస్టులను భర్తీ చేశామన్నారు. అలాగే నాలుగు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు, ఒక ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. 4 ఔటర్ రింగ్‌రోడ్లు: మంత్రి తుమ్మల సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, ఆరూరి రమేశ్, పువ్వాడ అజయ్‌కుమార్‌లు ఔటర్ రింగ్రోడ్లకు సంబంధించి అడిగిన ప్రశ్నలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బదులిచ్చారు. గజ్వేల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్‌లకు ప్రభుత్వం ఔటర్ రింగ్రోడ్లను మంజూరు చేసిందన్నారు. సూర్యాపేటృ అశ్వారావుపేట, కోదాడృమహబూబాబాద్లకు జాతీయ రహదారి మంజూరైందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ రోడ్లకు ఏదో ఒకవైపు కాకుండా రెండు వైపులా భూమిని సేకరించాలన్నారు. ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద రాష్ట్రంలో 496 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని ఇంధన, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 81.32 కోట్ల మొక్కలు నాటాం: జోగు రామన్న హరితహారం కింద ఇప్పటివరకు రాష్ట్రంలో 81.32 కోట్ల మొక్కలు నాటినట్లు అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సభ్యులు మనోహర్‌రెడ్డి, రవీంద్రకుమార్, గువ్వల బాలరాజు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. నాటిన మొక్కల మనుగడను పర్యవేక్షించేందుకు జియో రిఫరెన్సింగ్ నిమిత్తం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. చెక్‌డ్యాంలపై సభ్యులు చల్లా ధర్మారెడ్డి, దుర్గం చిన్నయ్య, పుట్టా మధుకర్‌లు అడిగిన ప్రశ్నలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధానమిచ్చారు. వివిధ గ్రాంట్ల కింద రాష్ట్రంలో రూ. 273.60 కోట్లతో 105 చెక్‌డ్యాంలను, వంతెనల నిర్మాణం చేపట్టామన్నారు. అందులో 24 పూర్తయ్యాయన్నారు. పాత పెన్షన్ స్కీమ్‌నే వర్తింపజేయాలి 1.20 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి పాత పెన్షన్ స్కీమ్‌నే వర్తింప చేయాలని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. దీనిపై సీఎం పునరాలోచన చేయాలన్నారు. సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య మాట్లాడుతూ ఇటీవల భారీ వర్షాలకు రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నదన్నారు. 10 లక్షల ఎకరాలకు ఎర్ర తెగులు సోకిందన్నారు. దీంతో అటువంటి పత్తికి ధర రావడంలేదన్నారు. పత్తికి రూ. 8 వేలు ధర చెల్లించాలని ఆయన కోరారు. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలో మాదాని కురువ, మాదారి కురువలకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వడంలేదని సభ్యుడు చిన్నారెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవలి వర్షాలకు పత్తిలోని విత్తనాలు మొలకెత్తాయని టీఆర్ఎస్ సభ్యుడు అంజయ్య యాదవ్ పేర్కొన్నారు. దీంతో దళారులు తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పత్తికి బోనస్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. పూరిగుడిసెకు లక్ష కరెంటు బిల్లా? జహీరాబాద్ నియోజకవర్గంలోని దిడిగి గ్రామంలో ఒక వ్యక్తికి చెందిన పూరి గుడిసెకు ఏకంగా రూ.1.05 లక్షల కరెంటు బిల్లు రావడాన్ని జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డి లేవనెత్తారు. అధికారుల నిర్వాకంపై ఆమె మండిపడ్డారు. బిల్లు కట్టకపోతే చర్యలు తీసుకుంటామని అక్కడి బిల్ కలెక్టర్ హెచ్చరించడం శోచనీయమని చెప్పారు. దీంతో ఆ కుటుంబ యజమాని చనిపోయాడన్నారు. అయినా ఇప్పటికీ ఎవరూ స్పందించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా అదే గ్రామంలో రూ. 95 వేలు, రూ. 65 వేలు కరెంటు బిల్లులు వచ్చినవారున్నారని తెలిపారు. దీనికి మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ పూర్తి పరిశీలన చేసి ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
మీరొచ్చే నాటికే హైదరాబాద్ విశ్వనగరం
♦ టీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి చురకలు ♦ కాంగ్రెస్ హయాంలోనే పరిశ్రమలు, పరిశోధన సంస్థలొచ్చాయ్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడే నాటికే హైదరాబాద్ విశ్వనగరమన్న విషయాన్ని మరిచిపోతే ఎలా గని కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి చురకలంటించారు. కాంగ్రెస్ హయాంలోనే భారీ పరిశ్రమలు, ప్రభుత్వ, పరిశోధన సంస్థలు హైదరాబాద్‌లో కొలువు దీరా యని.. ఓఆర్ఆర్, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే.. తదితర మౌలిక వసతులతో అందరికీ అతి ప్రాధాన్య నగరంగా మారిందన్నారు. గురు వారం శాసనసభలో మాట్లాడుతూ.. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బుక్’లోనూ సౌత్ ఏషియాలోనే హైదరాబాద్ నంబర్‌వన్ స్థానం లో నిలిచిందని చెప్పారు. మేకిన్ తెలంగాణ అంటున్న ప్రభుత్వం.. యువతకు ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలను ప్రోత్స హిం చాలని, ఉత్పాదకత పెంచే పరిశ్రమలైతేనే ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు లభిస్తా యన్నారు. కానీ, మూడేళ్లలో రాష్ట్రానికి ఎన్ని తయారీ పరిశ్రమలు వచ్చాయని అడిగితే ప్రభుత్వం వద్ద సరైన సమా ధానం లేదని ఎద్దేవా చేశారు. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యు ఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)ను కాంగ్రెస్ హయాంలో మంజూరు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం దాని అభివృద్ధిపై శ్రద్ద చూపడం లేదన్నారు. 4 లక్షలకుపైగా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయని, ప్రభుత్వం పట్టించు కోకపోవ డంతో వాటిలో అధిక భాగం ఖాయిలా పడ్డాయని ఆరోపించారు. కొనుగోలు దారుల సకాలంలో సొమ్ము చెల్లించక పలు సంస్థలు ఎన్పీఏలుగా మారాయాని చెప్పారు. -
మా బాహుబలి జానా, ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డిలే బాహుబలి అని ఆ పార్టీ ఎమ్మెల్యే గీతారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చాలా బలముందని, ఇతర పార్టీల నుంచి బాహుబలి రావాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వాల్లో మీడియా ప్రతినిధులు అసెంబ్లీ అం తటా కనిపించేవారని, ఇప్పుడెందుకు కనిపించడంలేదన్నారు. కాంగ్రెస్ కుస్తీ పార్టీకాదు: మల్లు రవి బాహుబలిలు ఎవరైనా ఉంటే సినిమాల్లోకి లేదా కుస్తీపోటీలకు పోతే మంచిదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కుస్తీల పార్టీ కాదని, రాజకీయాల్లో బాహుబలికి స్థానం లేదన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, వైఎస్ రాజశే ఖరరెడ్డి వంటివారంతా ప్రజల నాయకులు అని, వారంతా బాహుబలిలు కాదన్నారు. -
'అసలు బాహుబలి జానారెడ్డే'
హైదరాబాద్: టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్‌ను ఓడించడానికి బాహుబలి వస్తాడని కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు కే. జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గీతారెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌లో సమర్థులు లేరా.. అని జానారెడ్డి వ్యాఖ్యల పట్ల విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. తమపార్టీలోనే చాలా మంది బాహుబలులు ఉన్నారని గీతారెడ్డి అన్నారు. అసలు బాహుబలి సీఎల్పీ నేత జానారెడ్డే అని ఆమె వివరణ ఇచ్చారు. జానారెడ్డి బాహుబలి వ్యాఖ్యలు.. పార్టీలో సమర్థులు లేరన్నట్టుగా, బయట పార్టీల నుంచి వస్తే తప్ప కాంగ్రెస్ పార్టీని కాపాడలేరని అన్నట్టుగా తప్పు డు సంకేతాలను పంపిస్తున్నాయని పార్టీ నేతలు కొందరు అసంతృప్తికి లోనైనట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. -
బాధితురాలికి న్యాయం చేయాలి: గీతారెడ్డి
హైదరాబాద్: వీణవంక మండలం చల్లూరులో సామూహిక అత్యాచారానికి గురైన దళిత యువతికి నష్టపరి హారం పెంచడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం భాదితురాలు తల్లిదండ్రులతో అమీర్‌పేటలోని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మను కలసి తమకు న్యాయం చేయాలని అభ్యర్థించింది. కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని కోరింది. అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని యువతి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా కమిషన్ కార్యాలయానికి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... ఎస్సీ కమిషన్ ద్వారా ఇచ్చే 1.5 లక్షల నష్టపరిహారం పెంచాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. నష్టపరిహారాన్ని పెంచేందుకు జాతీయ ఎస్సీ కమిషన్‌కు నివేదిక పంపిస్తున్నామని కమలమ్మ తెలి పారు. నిందితులపై ఏ చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై కరీంనగర్ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడారు. నిందితులు మైనర్లా, మేజర్లా అన్నది తెలియాల్సి ఉందని, విచారణ అనంతరం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమలమ్మ తెలిపారు. -
అధికారముందని విర్రవీగితే పరాభవమే
బీజేపీకి ఢిల్లీలో పట్టిన గతి టీఆర్ఎస్కు తప్పదు టీఆర్ఎస్కు ఏఐసీసీ నేత కుంతియా హెచ్చరిక హైదరాబాద్: అధికారం ఉందని అహంభావంతో విర్రవీగితే ప్రజల చేతుల్లో పరాభవం తప్పదని ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా హెచ్చరించారు. సచివాలయం, ఛాతీ ఆసుపత్రిని మార్చొద్దంటూ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా పోలీసుల చేతిలో గాయపడిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఆయన మంగళవారం పరామర్శించారు. అనంతరం పార్టీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గీతారెడ్డితో కలసి కుంతియా మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు ప్రకారం గాంధేయమార్గంలో ర్యాలీని ప్రారంభిస్తే పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం కిరాతకంగా దాడి చేయడం గర్హనీయమన్నారు. దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరిస్తే ఢిల్లీలో బీజేపీకి పట్టిన గతే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు పడుతుందని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దేశ రాజధానిలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయిందని కుంతియా అన్నారు. ఢిల్లీలో 15 ఏళ్లపాటు వరుసగా అధికారంలో ఉండడం వల్ల ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకత వల్లే ఓడిపోయామని వివరించారు. అధికారంలోకి వస్తామన్న బీజేపీకి ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వలేదంటే 8 నెలల్లోనే ఆ పార్టీపై వచ్చిన వ్యతిరేకతకు ఇది నిదర్శనమన్నారు. ఈ ప్రజాతీర్పును తెలంగాణరాష్ట్రంలో టీఆర్ఎస్ కూడా గమనంలో ఉంచుకుంటే మంచిదని హితవు పలికారు. తప్పులు చేయొద్దంటే దాడిచేస్తారా: పొన్నాల సచివాలయం మార్చడం, ఛాతీ ఆసుపత్రిని ఎర్రగడ్డ నుంచి తరలించడం వంటి తప్పులు చేయొద్దంటూ ర్యాలీ నిర్వహిస్తే పోలీసులతో ప్రభుత్వం దాడి చేయించిందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. పోలీసుల నిర్బంధాలతో ప్రజల ఆగ్రహాన్ని, కాంగ్రెస్ ఉద్యమాలను కట్టడి చేయలేరని హెచ్చరించారు. మొన్నటిదాకా తెలంగాణకోసం టీఆర్ఎస్ చేసిన ఉద్యమాలకు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎంతో సహకరించామని గుర్తుచేశారు. టీఆర్ఎస్ను ప్రజాకోర్టులోనే నిలదీస్తామని హెచ్చరించారు. ఢిల్లీ ఎన్నికల్లో నరేంద్రమోడీ- కిరణ్‌బేడీ ఎన్నికల్లో జోడీ కట్టినా ఢిల్లీ ప్రజలు తిరస్కరించారని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా బీజేపీ యూ-టర్న్ తీసుకున్నదన్నారు. -
బీడీ కార్మికులను మోసగించిన కేసీఆర్
బీడీ కార్మికుల ఓట్లతో ఎన్నికల్లో గెలిచి, వారినే మోసగిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగాల్సిందేనని జహీరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గీతారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ ఆల్ బీడీ కార్మిక సంఘం (ఐఎన్టీయూసీ) ఆధ్వర్యంలో దుబ్బాకలో నిర్వహించిన బీడీ కార్మిక మహాసభలో ఆమె మాట్లాడుతూ బీడీ కార్మికులు కుటుంబాలను పోషించుకోలేక భిక్షాటన చేయాల్సిన దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందని ఆమె విమర్శించారు. బీడీ కార్మికుల జీవన స్థితిగతులు తనకు తెలుసునని, అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి నెలకు రూ. వెయ్యి జీవన భృతి చెల్లిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారన్నారు. బీడీ కార్మికులకు భృతి ఇచ్చేంత వరకు కేసీఆర్ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమన్నారు. ఆంధ్ర ప్రాంత నేతలు వద్దన్నా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినా వేయకున్నా తమకేమీ బాధ లేదని, టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా బీడీ కార్మికులకు నెలకు రూ. వెయ్యి భృతి చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బీడీ కార్మికులకు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయిం చుకున్నారన్నారు. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారన్నారు. రాష్ట్రంలో పింఛన్లు రాక వృద్ధులు చనిపోతుంటే హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల కోసం పాదయాత్రలు చేస్తున్నారన్నారు. సభలో డీసీసీ అధ్యక్షరాలు సునీతా లక్ష్మారెడ్డి, ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు బండి నర్సాగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి శ్రావణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. -
కేసీఆర్ ఘన విజయం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉద్యమాల పురిటిగడ్డ మెతుకుసీమలో టీఆర్ఎస్ ధూం..ధాం చేసింది. తెలంగాణ తెచ్చిన ఉద్యమ పార్టీకే జిల్లా ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉద్ధండులు దామోదర రాజనర్సింహ, సునీతారెడ్డి, జగ్గారెడ్డి, విజయశాంతి తదితరులు ఓటమిపాలయ్యారు. జిల్లా ముద్దుబిడ్డ, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్)ను తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం దాదాపు లాంఛనమే. జిల్లాలోని మొత్తం పది అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది స్థానాలను, రెండు పార్లమెంటు సీట్లనూ గెలుచుకుని టీఆర్ఎస్ సత్తా చాటింది. ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రతి రౌండ్లోనూ ఆధిక్యత కనబరిచారు. గజ్వేల్, సిద్దిపేట, మెదక్, పటాన్చెరు, సంగారెడ్డి, దుబ్బాక, నర్సాపూర్, అందోల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. నారాయణఖేడ్, జహీరాబాద్‌లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ తిరిగి తన స్థానాన్ని పదిలపరుచుకుంది. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలహీనంగా ఉన్నట్టు కనిపించినా.. సార్వత్రిక ఎన్నికల్లో ‘యువతరం’ అండగా నిలబడి ఏకపక్షంగా ఓట్లు వేయడంతో ఆ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. శనివారం జరగబోయే టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సభాపక్ష నాయకునిగా కేసీఆర్ పేరు ప్రతిపాదించనున్నారు. హరీష్‌రావు భారీ మెజార్టీతో గెలుపు సిద్దిపేట నియోజకవర్గం నుంచి హరీష్‌రావు భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నారు. సిద్దిపేటలో సుమారు 1.50 లక్షల ఓట్లు పోల్ కాగా హరీష్‌రావుకు 1.18 లక్షల ఓట్లు వచ్చాయి. మొత్తం 93,928 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. మిగిలిన పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. నిజానికి గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో హరీష్‌కు 95,858 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే గతంలో పాలిస్తే పోలింగ్ శాతం ఈ ఎన్నికల్లో తగ్గడంతో ఆయనకు కొద్దిగా ఆధిక్యం తగ్గింది. ఇక కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ నుంచి 19,218 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గజ్వేల్ నియోజకవర్గంలో 1.99 లక్షల ఓట్లు పోల్ కాగా కేసీఆర్‌కు 86,372 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డికి 67,154 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నర్సారెడ్డి 33,998 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. మెదక్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయశాంతిని 39, 234 ఓట్ల మెజార్టీతో ఓడించారు. దుబ్బాక నియోజకవర్గంలో సోలిపేట రామలింగారెడ్డి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేపై 37,899 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. హోరాహోరీ పోరులో.... అందోల్ నియోజకవర్గంలో మొదటి నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆధిక్యత కనబరిచినప్పటికీ చివరి రౌండ్లలో చేతులెత్తేశారు. 10వ రౌండ్ వరకు రాజనర్సింహ దాదాపు 1,700 ఓట్ల మెజార్టీ ఉన్నారు. ఆ తర్వాత రౌండ్లలో కూడా ఆయన మెజార్టీని కనబరిచారు. చివరి ఐదు రౌండ్ల నుంచి బాబూమోహన్ అనూహ్యంగా దూసుకురావడంతో దామోదరకు ఓటమి తప్పలేదు. మాజీ మంత్రి గీతారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గం నుంచి చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు స్వల్ప ఆధిక్యంతో గెలిచి ఊపిరి పీల్చుకున్నారు. నువ్వా-నేనా అన్నట్లు సాగిన పోరులో చివరికి గీతారెడ్డి 814 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావుపై గెలుపొందారు. అభ్యర్థుల ఓట్ల వివరాలు గజ్వేల్‌లో కేసీఆర్: గజ్వేల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విజయం సాధించారు. 19,218 ఓట్ల మెజార్టీతో సమీప టీడీపీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డిపై గెలుపొందారు. గజ్వేల్‌లో నియోజకవర్గం ఎమ్మెల్యే బరిలో పది మంది పోటీ చేయగా ఏడుగురి డిపాజిట్లు గల్లంతయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కె.చంద్రశేఖర్‌రావుకు 86,372 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డికి 67,154, కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డికి 33,998 ఓట్లు సాధించారు. గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపొందటం ఇదే ప్రథమం. సిద్దిపేటలో హరీష్ ఐదోమారు విజయం: సిద్దిపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ అభ్యర్థి తన్నీరు హరీష్‌రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. 93,928 ఓట్ల మెజార్టీతో సమీప కాంగ్రెస్ అభ్యర్థి తాడురు శ్రీనివాస్‌గౌడ్‌పై గెలుపొందారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఆయన ఐదో మారు గెలిచారు. ఇక్కడ బరిలో ఉన్న పది మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఎమ్మెల్యే బరిలో 11 మంది ఉండగా హరీష్‌రావుకు 1,08,699 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి తాడూరు శ్రీనివాస్‌గౌడ్‌కు 15,371, బీజేపీ అభ్యర్థి చొప్పదండి విద్యాసాగర్‌కు 13,003 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి బత్తుల చంద్రంకు 3,774, లోక్‌సత్తా అభ్యర్థి శ్రీనివాస్‌కు 627, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి కమలాకర్‌కు 1,140 ఓట్లు వచ్చాయి. సంగారెడ్డిలో చింతాదే గెలుపు: సంగారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ 29,814 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి ఇక్కడ ఓటమి చవిచూశారు. జగ్గారెడ్డికి 53,046 ఓట్లు రాగా బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కె. సత్యనారాయణకు 11,091 ఓట్లు, సీపీఎం అభ్యర్థి బి.మల్లేశానికి 2,681 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలో మొత్తం 13 మంది అభర్థులు పోటీ చేయగా పది మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. దుబ్బాకలో రామలింగారెడ్డి ఘన విజయం: దుబ్బాక నియోజవకర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి ఘన విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డిపై ఆయన 37,899 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపు సొంతం చేసుకున్నారు. నియోజవకర్గంలో 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా రామలింగారెడ్డికి 82,123 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి చెరుకు ముత్యంరెడ్డికి 44,224, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 15,118 ఓట్లు సాధించారు. తొమ్మిది మంది అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. పటాన్చెరులో గూడెం గెలుపు: పటాన్చెరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి గెలుపొందారు. మహిపాల్‌రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి ఎం. సపాన్‌దేవ్‌పై 19,007 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సపాన్‌దేవ్‌కు 55,100 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యరి టి. నందీశ్వర్‌గౌడ్‌కు 37,205తో మూడో స్థానంలో నిలిచారు. నియోజకవర్గంలో మొత్తం 17 మంది బరిలో నిలవగా 14 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. అందోలులో బాబూమోహన్ విక్టరీ: అందోలు నియోజవకర్గంలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మాజీ డిప్యూటీ సీఎం సి. దామోదరను టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పి. బాబూమోహన్ ఓడించారు. దామోదర, బాబూమోహన్ మధ్య విజయం నీదా నాదా అన్నట్టు దోబూచులాడింది. చివరకు బాబూమోహన్ 3,208 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బాబూమోహన్‌కు మొత్తం 86,759 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి దామోదరకు 83,551 ఓట్లు వచ్చాయి. బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎల్లయ్యకు 3,059 ఓట్లు పొందారు. నర్సాపూర్‌లో టీఆర్ఎస్ పాగా: కాంగ్రెస్‌కు కంచుకోటలాంటి నర్సాపూర్ నియోజకవర్గంలో మొదటిసారిగా టీఆర్ఎస్ పాగా వేసింది. మాజీ మంత్రి సునీతారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి విజయం సాధించారు. చిలుముల మదన్‌రెడ్డి 14,217 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మదన్‌రెడ్డికి మొత్తం 85,890 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డికి 71,673, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బల్వీందర్నాథ్కు 6,075 ఓట్లు వచ్చాయి. మెదక్‌లో వికసించిన ‘పద్మ’: మెదక్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయశాంతిని ఓడించారు. పద్మా దేవేందర్‌రెడ్డి 39,234 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించింది. పద్మా దేవేందర్‌రెడ్డికి 89,119 ఓట్లు రాగా విజయశాంతికి 49,885 ఓట్లు వచ్చాయి. టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బట్టి జగపతికి 9,266 ఓట్లు వచ్చాయి. ఖేడ్‌లో మళ్లీ కిష్టారెడ్డే: నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల కిష్టారెడ్డి రెండోమారు విజయం సాధించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపాల్‌రెడ్డిపై ఆయన 14,782 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కిష్టారెడ్డికి మొత్తం 62,007 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎం. భూపాల్‌రెడ్డికి 47,225, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి విజయపాల్‌రెడ్డికి 40,307 ఓట్లు వచ్చాయి. స్వల్ప మెజార్టీతో గీతమ్మ విజయం: మాజీ మంత్రి జెట్టి గీతారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గం నుంచి రెండోమారు గెలుపును సొంతం చేసుకున్నారు. చివరివరకు ఉత్కంఠగా సాగిన పోరులో టీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావుపై గీతారెడ్డి 842 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గీతారెడ్డికి 57,558 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్‌రావుకు 56,716, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వై. నరోత్తంకు 39,057 ఓట్లు వచ్చాయి. -
విజయశాంతి ఓటమి
మెదక్: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. శాసనసభ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులు అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధించారు. మెదక్‌లో విజయశాంతికి షాక్ తగిలింది. టీఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్‌రెడ్డి చేతిలో విజయశాంతి ఓటమి పాలయ్యారు. దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి గెలిచారు. జహీరాబాద్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి జె.గీతారెడ్డి గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి కె.మాణిక్రావుపై గెలుపొందారు. -
ఎత్తిపోతల ప్రారంభమెన్నడో?
న్యాల్కల్,న్యూస్‌లైన్: కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారు. పథకం పనులు పూర్తయి 15 సంవత్సరాలు దాటింది. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా వినియోగంలోకి రావడం లేదని రైతలు ఆరోపిస్తున్నారు.పథకంలో వినియోగించిన సామగ్రి తుప్పుపడుతోంది. మరికొంత సామగ్రి దొంగల పాలవుతోంది.రైతులు ఈ పథకం కోసం ఎదురుచూసి దానిని మరచిపోయారు. పథకం పూర్తయి వినియోగంలోకి వస్తుందనే ఆశ వారిలో నశించిపోయింది. పథకం పనులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని మాజీ మంత్రి గీతారెడ్డి ఆదేశించినా అధికారుల్లో చలనం రాలేదంటే వారి పని తీరుకు అద్దం పడుతోంది. ఏళ్ల తరబడి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ సొమ్ము ఖర్చయినా ఆశయం మాత్రం నెరవేరడం లేదు. బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు న్యాల్కల్ మండలం అమీరాబాద్ గ్రామ శివారులో మంజీరా నది తీరంలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.అందులో భాగంగా 1993లో అప్పటి నారాయణఖేడ్ శాసన సభ్యుడు కిష్టారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించారు.పథకం నిర్మాణం కోసం నాబార్డు కింద రూ. 1.30కోట్లు మంజూరు చే యించారు. పథకం పనులు ప్రారంభించే సమయంలో శాసన సభకు ఎన్నిలు రావడం, రాష్ట్రంలో ప్రభుత్వ మారడంతో పనులు ప్రారంభం కా లేదు. మళ్లీ ఐదేళ్ల తర్వాత జరిన ఎన్నికల్లో తిరిగి కిష్టారెడ్డి శాసన సభ్యుడుగా ఎన్నికయ్యారు.1999లో ఎమ్మె ల్యే ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. నిధులు సరి పోక పోవడంతో పనులు నిలిచిపోయాయి. నాబార్డు ఆర్ఐడీఎఫ్ పేజ్-3లో రూ.88.80లక్షలు మంజూరు చేయించి మిగిలిపోయిన పనులు పూర్తి చేయించారు.ఈపథకం ద్వారా 21మంది ఎస్సీలకు సంబంధించిన 49.36హెక్టార్లు,31మంది బీసీలకు చెందిన 114.03హెక్టార్లు,ఇతర వర్గాలకు చెందిన 331.01హెక్టార్ల భూమిని సాగులోకి తేవాలనేది పథకం ఉద్దేశం. పంపుహౌస్ ఏర్పాటు ఈపథకం ద్వారా పొలాలకు నీరందించేందుకు మం జీర నది తీరంలో పంపుహౌస్‌ను ఏర్పాటు చేశారు.అం దుకు అవసరమయ్యే విద్యుత్ కోసం ట్రాన్స్‌ఫార్మర్లును కూడా ఏర్పాటు చేశారు.పంపుహౌస్ నుంచి పొలాలకు పైపులైన్ వేశారు. ఇవన్నీ ఏర్పాటు చేసిన అధికారులు దానిని ప్రారంభించడం మరిచారు.అప్పట్లో పనులు కూడా నాసిరకంగా జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.ఎత్తి పోతల పథకానికి విద్యుత్ సరఫరా చాలా రోజులుగా నిలిచిపోయిందని రైతులు తెలిపారు.పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు వంగిపోవడం వలన ఈసమస్య ఉత్పన్నమయిందన్నారు. 15ఏళ్లు దాటినా ప్రారంభం కాని పథకం ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి 15ఏళ్లు దాటినా ఇప్పటికి ప్రారంభం కాలేదు.దీంతో పథకం నిరూపయోగం గా మారింది. పథకం వినియోగంలోకి వస్తే బీడు భూములు సాగవుతాయని రైతులు ఎదురుచూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఎప్పుడు ఫలి స్తాయో? పంపుహౌస్ నుంచి పంట పొలాలకు నీరందించేందు గ్రామ సమీపంలో పైప్‌లైన్ ఏర్పాటు చేశారు.అక్కడ నుంచి కాల్వల ద్వారా నీరందించాలని అధికారులు నిర్ణయించారు. దీని వల్ల అధిక శాతం నీరు భూమిలోకి ఇంకిపోవడం వల్ల పంట పొలాలకు నీరు సక్రమంగా అందించాడానికి అవకాశం లేకపోవడంతో పంట పొలాలల వరకు పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.అందుకోసం అవసరమయ్యే నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.నాలుగేళ్ల క్రితం పైప్‌లైన్ కోసం రూ:42లక్షలు మంజూరయ్యాయి.పైప్‌లైన్ పనులు ఇటీవలే పూర్తయ్యాయి.సంబంధిత కాంట్రాక్టర్ పనులను పూర్తి చేసినప్పటికి సంప్హోస్ నుంచి వచ్చే మెయిన్ పైప్‌లైన్ పలు ప్రాంతాల్లో లీకేజీవుతుంది. దీంతో నీరు పంట పోలాలకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని పనులు త్వరిగతిన పూర్తి చేయించి పథకాన్ని వినియోగంలోకి తేవాలని గ్రామ రైతులు కోరుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు అధికారులు పథకం గురించి పట్టించుకోవడం లేదు.పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయి.మెయిన్‌లైన్ నుంచి పొలాలకు నీటిని సరఫరా చేసే పైప్‌లైన్ లీకేజీ పలు ప్రాంతాల్లో లీకేజీ అవుతోంది. ప్రతి ఏడాది పొలం పనులు ప్రారంభమయ్యే ముందు వచ్చి పనులు చేస్తామంటారు.అప్పుడు రైతులు ఒప్పుకోరు. ఇప్పుడేమోరారు. పనులు పూర్తి చేయరు. ప్రతి ఏడాది ఈదే విధంగా జరుగుతోంది. కలెక్టర్ ఈసారైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు పూర్తి చేయించాలి. -మేత్రి శరణప్ప, రైతు,అమీరాబాద్ గ్రామం త్వరలో పథకం వినియోగంలోకి.. పనులలు పూర్తయ్యాయి.టెస్టింగ్ చేయాల్సిఉంది.అది పూర్తి కాగానే పథకం వినియోగంలోకి వస్తుంది. -సౌరాజ్,ఏపీఎస్ఐడీసీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ -
ఇదేం తీరు
జహీరాబాద్, న్యూస్‌లైన్: మున్సిపల్ కౌన్సిలర్ల టికెట్ల కేటాయింపులో మాజీ మంత్రి గీతారెడ్డి తన అనుచరులకు, అనుయాయులకే టికెట్లు ఇచ్చారని మాజీ మంత్రి ఎండీ ఫరీదుద్దీన్ మండిపడ్డారు. టికెట్ల కేటాయింపులో గీతారెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రెండ్రోజుల్లో అధిష్టానం స్పందించాలనీ.. లేదంటే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎలాంటి చర్యలు చేపట్టబోనని, కార్యకర్తలతో చర్చించిన తర్వాత, వాళ్లు ఏం చెప్తే అది చేస్తానన్నారు. తాను పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తూ వస్తున్నానని, అయినా తనను విస్మరించడం సరి కాదన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేష్‌శెట్కార్, డీసీసీ అధ్యక్షుడి సమక్షంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 24 వార్డులకు గాను 8 వార్డుల్లో తాను సూచించిన అభ్యర్థులను నిర్ణయించుకునేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. ఇందుకు సంబంధించిన బీ ఫారాలు పార్టీ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి తీసుకోవాల్సిందిగా తనకు సూచించారన్నారు. ఆ బీ ఫారాలను తనకు అప్పగిస్తానని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి తీసుకువచ్చిన గీతారెడ్డి తన అనుయాయులకే అందజేశారన్నారు. ఇది ఎంతవరకు న్యాయమని ఫరీదుద్దీన్ ప్రశ్నించారు. తనను నమ్ముకుని నామినేషన్లు వేసినా.. పార్టీ ప్రయోజనాల మేర వారిచేత ఉపసంహరింపజేశానన్నారు. గీతారెడ్డి వ్యవహార శైలిపై ఆయన తో పాటు పార్టీ నేతలంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు అల్లాడి నర్సింహులు, మురళీకృష్ణాగౌడ్, మాజీ ఎంపీపీ అధ్యక్షుడు విజయకుమార్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మాణిక్యమ్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి.రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘తెలంగాణ’ సభకు సోనియా
తప్పకుండా వస్తానన్న కాంగ్రెస్ అధినేత్రి మార్చి 2, లేదా 3న హైదరాబాద్‌లో భారీ సభ ఆలోచించే విభజన.. తెలంగాణలో పార్టీని కాపాడండి సీమాంధ్రులను గాయపరచొద్దు : సోనియా హితవు కాంగ్రెస్‌ను గెలిపించి కానుకిస్తాం: టీ నేతలు న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో మార్చిలో హైదరాబాద్‌లో భారీ ఎత్తున తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అంగీకరించారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర మంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో పాటు సుమారు 60 మంది 10,జనపథ్‌కు వెళ్లి సోనియాను కలిశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమాచారం మేరకు... తెలంగాణ ప్రజలంతా మీకు కృతజ్ఞతలు చెప్పాలని ఎదురు చూస్తున్నారని సోనియాతో జానా, గీతారెడ్డి అన్నారు. ఆమె వీలును బట్టి మార్చి 2, లేదా 3 తేదీల్లో భారీ బహిరంగ సభ తలపెట్టినట్టు చెప్పారు. సోనియా సానుకూలంగా స్పందించారు. ‘తప్పకుండా వస్తా. తెలంగాణ ప్రజలను కలవాలనుకుంటున్నా. ఏ రోజు వచ్చేది మళ్లీ చెబుతా. మీరు దిగ్విజయ్‌సింగ్‌తో టచ్‌లో ఉండండి’ అని బదులిచ్చారు. సీమాంధ్రలో పార్టీకి నష్టం జరిగినా, ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ వాగ్దానాన్ని అమలు చేశామని సోనియా అన్నారు. అయితే తనకు సీమాంధ్రపై ద్వేషం లేదని స్పష్టం చేశారు. ‘‘ఇకపై సీమాంధ్ర మనసులు గాయపడేలా ఎవరూ మాట్లాడొద్దు. వాళ్లు కూడా నాకు సోదర సమానులే. రాగద్వేషాలకు తావులేకుండా అన్నదమ్ముల్లా కలిసుంటూ ఇరు ప్రాంతాలను అభివృద్ధి చేసుకోండి’’ అని హితవు పలికారు. తెలంగాణలో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు ప్రజలంతా కాంగ్రెస్‌కు రుణపడి ఉంటారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి కానుకగా ఇస్తామని నేతలు బదులిచ్చారు. రాష్ట్రపతి పాలన అంశాన్ని ఒకరిద్దరు ప్రస్తావించినాసోనియా పెదవి విప్పలేదు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు సోనియాను కలిశాక నేతలంతా ఏపీ భవన్లో సమావేశమయ్యారు. హైదరాబాద్ బహిరంగ సభకు జన సమీకరణ తదితరాలపై చర్చించుకున్నారు. కనీవినీ ఎరగని రీతిలో జనాన్ని తీసుకు రావాలనుకున్నారు. జిల్లాలవారీగా ఎవరు ఎంతమందిని సమీకరించాలన్నదీ చర్చకు వచ్చింది. ‘‘ఆదివారం మధ్నాహం ఒంటిగంటకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా గన్‌పార్క్ వద్దకు వెళ్దాం. అమరవీరులకు నివాళులర్పించి గాంధీభవన్‌కు వెళ్లి కార్యకర్తలతో సమావేశమవుదాం’’ అని తీర్మానించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు కె.జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, డీకే అరుణ, సునీత లక్ష్మారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బసవరాజు సారయ్య, ప్రసాద్‌కుమార్, ఎంపీలు వి.హన్మంతరావు, పొన్నం ప్రభాకర్, సురేశ్ షెట్కార్, సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సీనియర్ నేతలు కె.ఆర్.సురేశ్‌రెడ్డి, బి.కమలాకరరావు, మల్లు రవి తదితరులు భేటీలో పాల్గొన్నారు. అనంతరం ఆయా నేతలతో కలసి జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఊరూరా విజయోత్సవ సభలు నిర్వహించి సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతామన్నారు. దిగ్విజయ్‌తో భేటీ అంతకుముందు నేతలు దిగ్విజయ్‌ను కలసి బహిరంగ సభ తేదీ ఖరారుపై చర్చించారు. మార్చి 5-15 మధ్యలో పెట్టుకోవాలని ఆయనన్నారు. ఆలోపే ఎన్నికల షెడ్యూల్ రావచ్చని నేతలనడంతో తొలి వారంలోనే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విభజనపై గెజిట్ నోటిఫికేషన్ రాగానే రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా పీసీసీ అధ్యక్షులను నియమిస్తామన్నారు. ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని సూచించారు. రాష్ట్రపతి పాలన రాదు సోనియాతో భేటీ తర్వాత టీ మంత్రుల వ్యాఖ్య ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకు ఆస్కారమే లేదని ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు. కచ్చితంగా కొత్త ముఖ్యమంత్రి వస్తారని, ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీకి లోక్‌సభతో పాటే ఎన్నికలు జరుగుతాయన్నారు. శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలసిన అనంతరం తెలంగాణ మంత్రులు, సీనియర్ నేతలు ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి పాలన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు దామోదర్ స్పందిస్తూ, కాంగ్రెస్‌కు అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో మెజారిటీ ఉందన్నారు. సీమాంధ్రలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అక్కడి నేతలు చెబుతున్న అంశాన్ని ప్రస్తావించగా... వారికి తప్పకుండా మద్దతు ఇస్తామని ఆయన బదులిచ్చారు. రెండు రాష్ట్రాలైనా తామంతా కాంగ్రెస్ వాళ్లమేనన్నారు. అసెంబ్లీ ఎన్నికలను ఆర్నెల్ల పాటు వాయిదా వేయాలన్న డిమాండ్లను కేంద్రం పరిశీలిస్తోందన్నారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. సీఎం కిరణ్ కూడా కాంగ్రెస్‌ను తిడుతున్నారుగా అని ప్రశ్నించగా, ‘‘కిరణ్ ఏ రకంగా వచ్చాడో ఆ రకంగానే మాయమయ్యాడు. ఇంకా ఆయన గురించి మాట్లాడాల్సిందేముంది?’’ అంటూ బదులిచ్చారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం అంశాన్ని అధిష్టానం పెద్దలు చూసుకుంటున్నారని, వారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పారు. విలీనానికి ముందే కేసీఆర్‌కు చెక్! కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం కాకముందే తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఘనతను చాటుకునే విషయంలో టీఆర్ఎస్ కన్నా ముందుండటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణలో భారీ సభ ప్రకటన అందులో భాగమేనంటున్నారు. పైగా కాంగ్రెస్ నేతలు తెలంగాణ జేఏసీ నేతలను శుక్రవారం సోనియాగాంధీతో కలిపించారు. వారు కేవలం టీఆర్ఎస్తోనే లేరని, రాజకీయేతర శక్తిగా కాంగ్రెస్ సహా ఎవరితోనైనా కలసి పని చేస్తారని, తెలంగాణ ఇచ్చాక విలీనాలతో పని లేదని మేడమ్‌కు సూచించడమే వారి ఉద్దేశమంటున్నారు. తెలంగాణలో భారీ సభ పెట్టి, దానికి సోనియాను ఆహ్వానించాలన్న కేసీఆర్ యోచనను పసిగట్టిన నేతలు, అంతకంటే ముందే తామే బహిరంగ సభ ప్రకటన చేశారు. కేసీఆర్ కూడా మార్చిలోనే సభ పెడుతున్నారంటూ దిగ్విజయ్‌కి చెప్పి మరీ, అంతకుముందే సభ నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ పొందారు. మొత్తానికి విలీనానికి ముందే టీఆర్ఎస్కు కాంగ్రెస్ తన మార్కు రాజకీయాలను రుచి చూపిస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
గాదె- మహిళా మంత్రుల సంవాదం
హైదరాబాద్: తెలంగాణ మహిళా మంత్రులతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మధ్య శాసనసభ ప్రాంగణంలో ఆసక్తికర సంవాదం నడిచింది. కేబినెట్ సమావేశానికి ఎందుకు రాలేదని మంత్రులు డీకే అరుణ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను గాదె వెంకటరెడ్డి ప్రశ్నించారు. మంత్రి పదవులకు రాజీనామా చేసి నిరసన తెలపొచ్చు కదా అని అడిగారు. అయితే వెంకటరెడ్డి వ్యాఖ్యలకు మహిళా మంత్రులు దీటుగా స్పందించారు. ఢిల్లీలో సమైక్య నిరసన తెలిపేందుకు ముందు మీరెందుకు రాజీనామా చేయలేదని వారు ఎదురు ప్రశ్నించారు. విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా చూడాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎంపీలు బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మౌనదీక్ష చేసిన సంగతి తెలిసిందే. -
స్థాయి మరచి ధిక్కారమా?: దామోదర్ రాజనర్సింహ
సాక్షి, న్యూఢిల్లీ: తన స్థాయి, మూలాలు మరచి సీఎం కిరణ్ కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా ధిక్కారం వినిపిస్తున్నారని డిప్యూటీ సీఎం దామోదర్ రాజ నర్సింహ మండిపడ్డారు. ఇందుకు సీఎంపై సరైన చర్యలుంటాయని విశ్వసిస్తున్నామన్నారు. ఢిల్లీలో బుధ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక ప్రాం తానికి సీఎంగా వ్యవహరిస్తున్న కిరణ్‌కు నైతిక విలువలుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని సీఎంను అడగడానికి వెళ్లిన మంత్రులు గీతారెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డి, డీకే అరుణ సహా తెలంగాణ మంత్రులపై ఢిల్లీ పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం తమ ప్రాంత ప్రజలను, ప్రజాప్రతినిధులను అవమానించడమేనని ధ్వజమెత్తారు. సీఎం ఆదేశాల మేరకే ఆడపడుచులైన మంత్రుల పట్ల ఢిల్లీ పోలీసులు ఇలా ప్రవర్తించారన్నారు. చంద్రబాబు, కిరణ్, జగన్‌లా మోసం చేయకుండా తెలంగాణ బిల్లుకు సహకరించాలని బీజేపీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. కుట్రలు, కుతంత్రాలకు కిరణ్ పర్యాయపదం అన్నారు. తెలంగాణపై ఇచ్చినమాట నిలబెట్టుకున్న సోనియాకు రుణపడి ఉంటామన్నారు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని చేసిన తీర్మానం, సీడబ్ల్యూసీ నిర్ణయం వచ్చాక కొత్త రాజధానికి ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు అడిగిన విషయాన్నీ గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీలో బీజేపీని కలసి చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ విలీనం విషయాన్ని హైకమాండ్ చూసుకుంటుందన్నారు. కన్నీళ్లు పెట్టుకున్న గీతారెడ్డి.. పోలీసుల చర్యలను మీడియా సమావేశంలో వివరిస్తూ మంత్రి గీతారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. కిరణ్‌ను రాష్ట్రానికి సీఎంగా సోనియా నియమిస్తే ఆయన సీమాంధ్ర కోసమే పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. సీమాంధ్ర కోసమే సీఎం అయితే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తానన్న కిరణ్ ఇప్పుడు ధిక్కరిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో ఎంపీలు అంజన్ కుమార్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, వీహెచ్, రాజయ్య, మంత్రి పొన్నాల, చీఫ్‌విప్ గండ్ర తదితరులు పాల్గొన్నారు. -
విన్నపాలు వినవలే..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఏఐసీసీ పరిశీలకుడు గెడెం ఆనందరావు శుక్రవారం జిల్లాకు వచ్చారు. సంగారెడ్డిలో ఆయన జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని ఎంపీ, ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. అంతకుముందు ఆనందరావు హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి గీతారెడ్డితో సమావేశమై.. జహీరాబాద్ ఎంపీ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది. ప్రత్యర్థి పార్టీల నుంచి ఎవరు బరిలో ఉంటారు, మన పార్టీలో ఎవరికి టికెట్ ఇస్తే ఎన్నికల్లో గెలుపొందుతారు అనే వివరాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఆ తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాంభద్రయ్యతో కలిసి ఏఐసీసీ పరిశీలకుడు జిల్లా కేంద్రం సంగారెడ్డికి వచ్చారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహం వద్ద జిల్లా కాంగ్రెస్ నాయకులు తోపాజీ అనంతకిషన్, షేక్‌సాబేర్ ఏఐసీసీ పరిశీలకునికి స్వాగతం పలికారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి ఏఐసీసీ పరిశీలకున్ని కలిసి సన్మానం చేశారు. ఎంపీ టికెట్ కోసం ముగ్గురు పోటీ జహీరాబాద్ ఎంపీ స్థానం కోసం ముగ్గురు నేతలు ఏఐసీసీ పరిశీలకుని ఎదుట పోటీ పడినట్టు తెలిసింది. సిట్టింగ్ ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, డీసీసీబీ చైర్మన్ జైపాల్‌రెడ్డిలు తమ మద్దతుదారులతో ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందిగా కోరినట్టు సమాచారం. ఎంపీ షెట్కార్ పేరును డిప్యూటీ సీఎం దామోదర, మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యే కిష్టారెడ్డి బలపర్చినట్లు సమాచారం. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల నేతలతో ఏఐసీసీ పరిశీలకులు గెడెం ఆనందరావు విడివిడిగా సమావేశమయ్యారు. మొదట అందోలునియోజకవర్గం నాయకులతో ఆనందరావు భేటీ అయ్యారు. మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్య, డీసీఎంఎస్ చైర్మన్ సిద్ధన్నపాటిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంరెడ్డి, నియోజకవర్గ నేత జగన్మోహన్రెడ్డి తదితరులు ఏఐసీసీ పరిశీలకులు ఆనందరావును కలిసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరిగి డిప్యూటీ సీఎం దామోదర పోటీ చేయాలని, ఎంపీ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ ఉంటే పార్టీకి బాగుంటుందని వివరించినట్లు సమాచారం. షెట్కార్, కిష్టారెడ్డి పరస్పరం మద్దతు జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని మరోమారు ఆశిస్తున్న సురేష్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డిలు తమ మద్దతుదారులతో కలిసి ఏఐసీసీ పరిశీలకుడిని కలిశారు. సురేష్ షెట్కార్ ఎంపీ టికెట్ కోరగా అందుకు కిష్టారెడ్డి మద్దతు తెలిపినట్లు సమాచారం. అలాగే ఎమ్మెల్యే టికెట్ కిష్టారెడ్డికి ఇస్తే బాగుటుందని షెట్కార్ ఏఐసీసీ పరిశీలకునికి చెప్పినట్లు తెలుస్తోంది. జహీరాబాద్ నుంచి గీతారెడ్డి వద్దు? జహీరాబాద్ నియోజకవర్గం నుంచి మూడు గ్రూపులకు చెందిన నాయకులు విడివిడిగా ఏఐసీసీ పరిశీలకుడు ఆనందరావును కలిశారు. మాజీ మంత్రి ఫరీదుద్దీన్ వర్గానికి చెందిన నాయకులు శేరి ఆశోక్, విజయ్‌కుమార్ తదితరులు ఎమ్మెల్యే టికెట్ మంత్రి గీతారెడ్డికి కేటాయించవద్దని, ఆమెకు ఇస్తే పార్టీ ఓటమిపాలవుతుందని చెప్పినట్లు సమాచారం. నియోజకవర్గ నాయకులు హన్మంతరావుపాటిల్, అల్లాడి నర్సింలు, తదితరులు మాత్రం మంత్రి గీతారెడ్డికి టికెట్ కేటాయించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. మాజీ జడ్పీటీసీ మాణిక్యమ్మ, కాంగ్రెస్ జిల్లా నాయకులు సామ్యుయేల్, ఎన్ఎస్యుఐ నాయకుడు నవీన్ తమకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని ఏఐసీసీ పరిశీలకున్ని కోరారు. నేడు ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్ రాక మెదక్పార్లమెంట్కు సంబంధించిన ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్ శనివారం సంగారెడ్డికి రానున్నారు. మెదక్ పార్లమెంట్పరిధిలోని సిద్దిపేట, మెదక్, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, బ్లాక్ కాంగ్రెస్, పట్టణకాంగ్రెస్ అధ్యక్షులతో సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహంలో సమావేశం కానున్నారు.