రాహుల్‌గాంధీతో జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు
సాక్షి, హైదరాబాద్: పార్టీ అధిష్టానం అల్లంత దూరమనే భావన తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు దూరమవుతోందా? తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని భావిస్తున్న ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు దగ్గరవుతున్నారా? గత మూడు రోజులుగా ఢిల్లీ వేదికగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.
తెలంగాణ నేతలు సోమవారం నుంచి ఢిల్లీలో ప్రత్యేకంగా మకాం వేసి మరీ అధిష్టానం పెద్దలను కలుస్తుండడం, వీహెచ్, జగ్గారెడ్డి తదితర నాయకులకు ఢిల్లీ అగ్రనేతలు వరుసగా అపాయింట్‌మెంట్లు ఇస్తుండడం, త్వరలో రాష్ట్రానికి రానున్న రాహుల్‌గాంధీ పార్టీలోని అన్ని స్థాయిల నేతలను కలిసేందుకు ఏర్పాట్లు జరుగుతుండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
వరుస భేటీలు
తెలంగాణలో పార్టీని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లేందుకు గాను గతంలో ఎన్నడూ లేనివిధంగా 40 మంది రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో రాహుల్‌గాంధీ సమావేశం కావడంతో భేటీల పరంపర మొదలయింది. అంతకుముందే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సమావేశమయ్యారు. రాహుల్‌తో సమావేశం ముగిసిన మరుసటి రోజే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డిలు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ను జగ్గారెడ్డి కుటుంబ సమేతంగా కలిశారు. ఈలోపే రాహుల్‌గాంధీ కూడా జగ్గారెడ్డికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. జగ్గారెడ్డితో పాటు టీపీసీసీ మరో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కూడా కలిసేందుకు అంగీకరించారు.
కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు
జగ్గారెడ్డి.. తన భార్య, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, కుమారుడు భరత్‌సాయిరెడ్డి, కుమార్తె జయారెడ్డిలతో కలిసి వెళ్లి రాహుల్‌ను కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఇక మహేశ్‌కుమార్‌గౌడ్ తన కుమారుడు, లా విద్యార్థి ప్రణవ్‌గౌడ్‌ను వెంటబెట్టుకుని రాహుల్‌ను కలిశారు. ఇద్దరు నేతలు రాహుల్‌ను కలిసినప్పుడు కూడా రాజకీయ అంశాల కంటే పిల్లల చదువులు, కుటుంబ అంశాలపైనే రాహుల్ మాట్లాడినట్టు సమాచారం. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి కూడా రాహుల్‌తో భేటీ అయ్యారు. రాహుల్‌తో భేటీ తర్వాత జగ్గారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తన నియోజకవర్గ నేతలను కూడా ఢిల్లీకి తీసుకువచ్చి రాహుల్‌ను కలిసి ఫొటోలు దిగేలా ప్రయత్నం చేస్తానని చెప్పడం గమనార్హం.
గతానికి భిన్నంగా..
కాంగ్రెస్ పెద్దలను ఢిల్లీ వెళ్లి కలవడం ఎంత కష్టమో.. రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా అంతే కష్టమనే భావన రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో ఉంది. రాహుల్ లేదా సోనియా లేదా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఎవరు వచ్చినా కీలక నాయకులు మినహా ఎవరికీ వారిని కలిసే అవకాశముండేది కాదు. పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు కూడా కాంగ్రెస్ పెద్దలను కలవడం ఓ టాస్క్‌లాగానే ఉండేది. అయితే ఈసారి అందుకు భిన్నంగా రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన ఉంటుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.
ఈనెలాఖరులో రాష్ట్రానికి రానున్న రాహుల్ రెండ్రోజులు ఇక్కడే ఉంటారని, ఒకరోజు బహిరంగ సభకు హాజరు కానుండగా, మరోరోజు రాష్ట్రానికి చెందిన అన్ని స్థాయిల్లోని పార్టీ నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులతో పాటు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ముఖ్య నేతలందరినీ కలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, స్థానిక సంస్థలకు ప్రాతి నిధ్యం వహిస్తున్న నాయకులు, సభ్యత్వ నమోదులో కీలకపాత్ర పోషించిన వారితో కూడా రాహుల్‌తో కలిపించాలనే భావనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.
అందని ద్రాక్షలు కాదు..!
ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అందని ద్రాక్షలేమీ కాదని, అందరితో కలివిడిగా ఉంటారనే భావనను పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లాలనేది రేవంత్‌రెడ్డి యోచనగా కనిపిస్తోంది. ఆ భావన కలిగించడం ద్వారా జరగబోయే ఎన్నికల్లో మరింత క్రియాశీలంగా కేడర్ పనిచేస్తుందనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment