జహీరాబాద్, న్యూస్‌లైన్: మున్సిపల్ కౌన్సిలర్ల టికెట్ల కేటాయింపులో మాజీ మంత్రి గీతారెడ్డి తన అనుచరులకు, అనుయాయులకే టికెట్లు ఇచ్చారని మాజీ మంత్రి ఎండీ ఫరీదుద్దీన్ మండిపడ్డారు. టికెట్ల కేటాయింపులో గీతారెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రెండ్రోజుల్లో అధిష్టానం స్పందించాలనీ.. లేదంటే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎలాంటి చర్యలు చేపట్టబోనని, కార్యకర్తలతో చర్చించిన తర్వాత, వాళ్లు ఏం చెప్తే అది చేస్తానన్నారు. తాను పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తూ వస్తున్నానని, అయినా తనను విస్మరించడం సరి కాదన్నారు.
జహీరాబాద్ ఎంపీ సురేష్‌శెట్కార్, డీసీసీ అధ్యక్షుడి సమక్షంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 24 వార్డులకు గాను 8 వార్డుల్లో తాను సూచించిన అభ్యర్థులను నిర్ణయించుకునేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. ఇందుకు సంబంధించిన బీ ఫారాలు పార్టీ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి తీసుకోవాల్సిందిగా తనకు సూచించారన్నారు. ఆ బీ ఫారాలను తనకు అప్పగిస్తానని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి తీసుకువచ్చిన గీతారెడ్డి తన అనుయాయులకే అందజేశారన్నారు.
ఇది ఎంతవరకు న్యాయమని ఫరీదుద్దీన్ ప్రశ్నించారు. తనను నమ్ముకుని నామినేషన్లు వేసినా.. పార్టీ ప్రయోజనాల మేర వారిచేత ఉపసంహరింపజేశానన్నారు. గీతారెడ్డి వ్యవహార శైలిపై ఆయన తో పాటు పార్టీ నేతలంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు అల్లాడి నర్సింహులు, మురళీకృష్ణాగౌడ్, మాజీ ఎంపీపీ అధ్యక్షుడు విజయకుమార్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మాణిక్యమ్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి.రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదేం తీరు
Published Wed, Mar 19 2014 12:09 AM | Last Updated on Tue, Oct 16 2018 6:40 PM
Advertisement
Advertisement