municipal councillor
-
జమ్మికుంట కౌన్సిలర్ అరాచకం..
జమ్మికుంట: ప్రభుత్వ భూమి కబ్జా చేసి బోరు వేయడమే కాకుండా.. ఆక్రమణ సరికాదని అడ్డుచెప్పిన ముగ్గురు గ్రామస్తులపై కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. రామన్నపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మూడోవార్డులోని రామన్నపల్లి ప్రభుత్వ పాఠశాల, వాటర్ ట్యాంక్ సమీప సర్వే నంబర్ 422లో కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ ప్రభుత్వ భూమి కబ్జా చేశాడు. అక్రమంగా బోరు వేసేందుకు యత్నిస్తుండగా , గ్రామస్తులు మర్రి మల్లయ్య, కోలకాని రాజు, మేడిపల్లి రమేశ్ అడ్డుకున్నారు. ఆగ్రహించిన కౌన్సిలర్ రవీందర్.. బుధవారం ఇనుప రాడ్‌తో ముగ్గురిపై విచక్షణ రహితంగా దాడిచేశాడు. దాడిలో మల్లయ్య, రాజుకు తీవ్రగాయాలు కాగా రమేశ్‌కు గాయాలయ్యాయి. మల్లయ్యను జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, మిగిలిన ఇద్దరినీ స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, మల్లయ్య భార్య రజిత ఫిర్యాదు మేరకు రవీందర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వి.రవి తెలిపారు. -
బీఆర్ఎస్కు షాక్.. నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పీఠం ‘హస్త’గతం
సాక్షి, నల్గొండ: నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై కాంగ్రెస్ పార్టి కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గంది. మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉండగా సోమవారం ప్రవేశ పెట్టి అవిశ్వాస తీర్మానానికి 47మంది కౌన్సిలర్ హాజరయ్యారు. వీరిలో 41మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టికి మద్దతు తెలపడంతో మున్సిపల్ ఛైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టి కైవసం చేసుకుంది. ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపగా. న్యూట్రల్‌గా ఉన్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిలర్లు పిల్లిరామరాజు మీగత ఇద్దరు సభ్యలు అవిశ్వాసం తీర్మానానికి హాజరు కాలేదు. నూతన చైర్మన్ ఎన్నుకునే వరకు తాత్కాలిక చైర్మన్‌గా.. ప్రస్తుత వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. -
మున్సిపాలిటీల్లో అవిశ్వాసం ఆపాలన్న పిటిషన్ల కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను ఆపాలంటూ రాష్ట్రవ్యాప్తంగా పలువురు చైర్పర్సన్లు, వైస్ చైర్మన్లు దాఖలు చేసిన 28 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 9న కౌన్సిలర్లు తనపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని జిల్లా కలెక్టర్ స్వీకరించడం, సంబంధిత ప్రక్రియ ప్రారంభించడాన్ని గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ నేతి చిన్న రాజమౌళి హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు తమ వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వవద్దని కోరుతూ కౌన్సిలర్ల తరఫున గౌరారం రాజశేఖర్‌రెడ్డి కేవియట్ దాఖలు చేశారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా అవిశ్వాసాలను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ఏప్రిల్‌లో తీర్పు రిజర్వు చేశారు. కొత్త తెలంగాణ మునిసిపాలిటీల చట్టం–2019 ప్రకారం చైర్పర్సన్ లేదా వైస్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఎలాంటి నిబంధనలు రూపొందించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. అవిశ్వాస ప్రక్రియకు జారీ చేసిన నిబంధనలు ఏపీ మున్సిపాలిటీల చట్టం–1965 ప్రకారం రూపొందించినవని, అయితే అవి రద్దయ్యాయని పేర్కొన్నారు. కొత్త క్లాజ్‌లో సెక్షన్ 299, సెక్షన్ 299 (2)లను ఏపీ మునిసిపాలిటీల చట్టం నుంచే రూపొందించారని రాజశేఖర్‌రెడ్డి వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు. ప్రతివాదుల వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. చట్టప్రకారం అవిశ్వాస తీర్మాన ప్రక్రియ సాగుతుందని పేర్కొంటూ పిటిషన్లు కొట్టివేశారు. పిటిషన్లు వేసిన మున్సిపల్ చైర్మన్లు,వైస్ చైర్మన్లు వీరే... ఎరుకల సుధ(యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట చైర్పర్సన్), మంజుల రమేశ్(వికారాబాద్ చైర్పర్సన్), శంషాద్ బేగం(వికారాబాద్ వైస్ చైర్పర్సన్), తాటికొండ స్వప్న పరిమళ్(వికారాబాద్ జిల్లా తాండూరు చైర్పర్సన్), స్రవంతి(రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చైర్పర్సన్), కోతా ఆర్థిక (రంగారెడ్డి ఆదిబట్ల చైర్పర్సన్), ముత్యం సునీత(కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ చైర్పర్సన్), తోకల చంద్రకళ(నల్లగొండ జిల్లా చండూర్ చైర్పర్సన్), దోతి సుజాత(నల్లగొండ జిల్లా చండూర్ వైస్ చైర్పర్సన్), వి. ప్రణీత(మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ చైర్పర్సన్), మర్రి దీపిక(మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ చైర్పర్సన్), కరుణ అనుషారెడ్డి(నల్లగొండ జిల్లా నందికొండ చైర్పర్సన్), మందకుమార్ రఘువీర్(నల్లగొండ జిల్లా నందికొండ వైస్ చైర్మన్), వి.శంకరయ్య(యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు చైర్మన్), గందే రాధిక(కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ చైర్పర్సన్), పోకల జమున(జనగాం జిల్లా జనగాం చైర్పర్సన్), శ్రీరాంప్రసాద్ మేకల(జనగాం జిల్లా జనగాం వైస్ చైర్మన్), గూడెం మల్లయ్య(సంగారెడ్డి జిల్లా ఆందోల్–జోగిపేట్ చైర్మన్), మేదరి విజయలక్ష్మి(సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి చైర్పర్సన్), దమ్మాలపాటి వెంకటేశ్వర్రావు(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు చైర్మన్), పిల్లోడి జయమ్మ(సంగారెడ్డి జిల్లా సదాశివపేట చైర్పర్సన్), నేతి చిన్న రాజమౌళి(సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ చైర్మన్), అర్రగొల్ల మురళీధర్ యాదవ్(మెదక్ జిల్లా నర్సాపూర్ చైర్మన్), వి.రాజు(యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ చైర్మన్), సుతకాని జైపాల్(ఖమ్మం జిల్లా వైరా చైర్మన్), సి.కిష్టయ్య(యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి వైస్ చైర్మన్), ఎ.ఆంజనేయులు (యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి చైర్మన్). వీరి పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. -
ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపై దాడి.. ఇల్లు తగలబెట్టిన దుండగులు
-
కశ్మీర్లో ఉగ్ర ఘాతుకం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ముష్కరులు మళ్లీ రెచ్చిపోయారు. మున్సిపల్ కౌన్సిలర్‌ను, ఆయన వ్యక్తిగత అంగరక్షకుడిని కాల్చి చంపారు. బారాముల్లా జిల్లాలోని సోపోరు పట్టణంలో సోమవారం ఈ దారుణం జరిగింది. మధ్యాహ్నం సోపోరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా గుర్తుతెలియని సాయుధులు లోపలికి ప్రవేశించారు. మున్సిపల్ కౌన్సిలర్ రియాజ్ అహ్మద్, సెక్యూరిటీ గార్డు షఫ్‌ఖాత్ అహ్మద్‌పై తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శంషుద్దీన్ పీర్ అనే మరో కౌన్సిలర్ గాయపడ్డాడు. జమ్మూకశ్మీర్ డీజీపీ విజయ్ కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. దుండగుల దుశ్చర్యపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ దాడిలో లష్కరే తోయిబాకు చెందిన ముదాసిర్ పండిట్ అనే ఉగ్రవాది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముష్కరులను పట్టుకొనేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కౌన్సిల్ సమావేశ మందిరంలోకి చొరబడి ఉగ్రవాదులు కాల్పులు జరపడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని విమర్శించింది. వారిని పట్టుకొని, కఠినంగా శిక్షించాలని బీజేపీ జమ్మూకశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా డిమాండ్ చేశారు. మృతులకు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా సంతాపం తెలిపారు. ముష్కరుల అకృత్యాన్ని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన రియాజ్ అహ్మద్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, గెలిచారు. -
కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లను అభినందించిన ఎమ్మెల్యే
-
టీఆర్ఎస్లో రచ్చ.. తన్నుకున్న కౌన్సిలర్లు
సాక్షి, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో అధికార పార్టీ టీఆర్ఎస్ కౌన్సిలర్లు కొట్లాటకు దిగారు. అధికార పార్టీ చైర్ పర్సన్, వైస్ చైర్మన్లా మధ్య శనివారం ప్రోటో కాల్ వివాదం తలెత్తింది. సర్దార్ వల్లభబాయ్ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో పూలమాలలు వేసే క్రమంలో ప్రోటో కాల్ పాటించాలని వైస్ చైర్మన్ వాగ్వాదానికి దిగాడు. దీంతో అప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిన కౌన్సిలర్లు అసభ్య పదజాలంతో నెట్టేసుకుంటు సంఘర్షణకు దిగారు. అక్కడే ఉన్న మరికొంత మంది కౌన్సిలర్లు అపేందుకు ప్రయత్నం చేసినా ఎవరూ ఆగలేదు. చదవండి: మజ్లిస్ మోచేతి నీళ్లు తాగుతున్నారు: కిషన్ రెడ్డి అక్కడితో ఆగకుండా నాది టీఆర్ఎస్, నాది టీఆర్ఎస్ అనుకుంటూ సభ్య సమాజం ఇలాంటి వారిని నాయకులుగా ఎన్నుకున్నమా అనే విధంగా ప్రవర్తించారు. అయితే గత కొంత కాలంగా మున్సిపల్లో చైర్మన్ రామ తీర్థపు మాధవి, అతని భర్త రాజుకు వైస్ చైర్మన్ మధు రాజేందర్‌కు విభేదాలు కొనసాగుతున్నాయి .గతంలో ఎమ్యెల్యే దృష్టికి వెళ్లిన వారు పట్టించుకోకపోవడంతో గొడవలు ప్రారంభమయ్యాయి అనేది పలువురు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజలకు సేవ చేయాల్సిన కౌన్సిలర్లు కొట్లాడుకోవడం, అందులోనే ఇద్దరూ అధికార పక్ష నాయకులు వాదులాడుకోవడం ఆశ్చర్యకరంగా మారింది. ఇక టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు తన్నుకోవడంపై అధిష్టానం, స్థానిక ఎమ్యెల్యే రమేష్ బాబు, జిల్లా మంత్రి కేటీఆర్ స్పందించలేదు. వాల్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. చదవండి: దుబ్బాక ఉప ఎన్నిక: ఎవరి ధీమా వారిదే -
రసాభాసగా రాజమండ్రి మున్సిపల్ సర్వసభ్య సమావేశం
-
రసాభాసగా విజయవాడ కౌన్సిల్ సమావేశం
సాక్షి, విజయవాడ: విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. గురువారం జరిగిన కౌన్సిల్ మీటింగ్‌లో ప్ర్యతేక హోదాపై చంద్రబాబు అవలంభిస్తున్న రెండు నాలుకల ధోరిణిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నిలదీశారు. దీంతో ఇద్దరు కార్పొరేటర్లను కౌన్సిల్ నుంచి మేయర్ కోనేరు శ్రీధర్ సస్సెండ్ చేశారు. దీంతో సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా మున్సిపల్ హాల్లోనే వైఎస్సార్సీపీ సభ్యులు షేక్ బీజన్ బీ, జమల పూర్ణమ్మ దీక్ష చేపట్టారు. వారికి మద్దతుగా మిగిలిన కార్పొరేటర్లు దీక్షలో కూర్చుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ.. తమకు మేయర్ క్షమాపణ చెప్పే వరకు దీక్ష కొనసాగిస్తామన్నారు. హోదాపై చంద్రబాబు తప్పులను ఎత్తిచూపుతామనే భయంతోనే తమను సస్పెండ్ చేశారన్నారు. హోదాకు వెన్నుపోటు పొడిచిన టీడీపీనే.. నేడు కౌన్సిల్లో ఏకగ్రీవ తీర్మానం చేస్తామంటే ఎవరు నమ్ముతారని నిలదీశారు. తీర్మానం చేసే ముందు హోదాపై కౌన్సిల్లో చర్చ జరగాలన్నారు. నాలుగు సంవత్సరాల పాటు హోదాను ఏనాడు పట్టించుకోని చంద్రబాబు, ఈ రోజు హోదా గురించి మాట్లాడడం ప్రజలను మోసాగించడమేనని దుయ్యబట్టారు. హోదా కోసం పోరాటం చేసిన వైఎస్పార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టించిన బాబు, ఇప్పుడు హోదా కోసం మాట్లాడటం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. హోదాపై అనేక సార్లు యూ టర్న్ తీసుకున్న చంద్రబాబు ప్రజలకు ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
రసాభసగా ప్రొద్దుటూరు మున్సిసిపల్ సమావేశం
-
రాజకీయ నాయకుడి రాసలీలల వీడియో..?
సిరిసిల్లక్రైం: ప్రజలకు సేవ చేయాల్సిన నాయకుడొకరు ఓ వివాహితతో అక్రమ సంబంధాన్ని నెరిపిన సంఘటనపై రాజన్నసిరిసిల్ల జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతోంది. సిరిసిల్లలోని ఓ కౌన్సిలర్ వివాహితతో రాసలీలను కొందరు యువకులు వీడియో తీయగా.. భయాందోళనకు గురైన సదరు కౌన్సిలర్ తన పేరు బయటపడకుండా ఉండేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సిరిసిల్ల రాజీవ్‌నగర్ ఏరియాలోని ఓ స్థావరంలో కొద్ది రోజులుగా ఈ వ్యవహారం జరుగుతుండగా.. దాన్ని రోజూవారీగా గమనించిన స్థానిక యువకులు ఎలాగైనా సదరు నాయకున్ని పట్టించాలన్న క్రమంలో మాటు వేసినట్లు తెలిసింది. శనివారం రాత్రి వీడియో వ్యవహారం ఆనోటా ఈనోటా బయటకు పొక్కడంతో బహిర్గతం కాకుండా నాయకుడు యత్నిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయమై సిరిసిల్ల సీఐ శ్రీనివాస్‌రావును వివరణ కోరగా.. బయట జరుగుతున్న ప్రచారం, దానికి సంబంధించిన ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
అధికారం, పదవి శాశ్వతం కావు: హరీశ్
సిద్దిపేట: ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవడమే నిజమైన అభివృద్ధి అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారం, పదవి శాశ్వతం కాదని .. రేపటి మన పిల్లల భవిష్యత్‌కు ఉపయోగపడేలా నాలుగు మంచి పనులు చేయాలి. తాత్కాలిక ప్రయోజనాల గురించి ఆలోచించకుండా దీర్ఘకాల లాభాలనిచ్చే పనులు చేయాలని సూచించారు. -
మరోసారి భూమా, శిల్పా వర్గాల మధ్య విభేదాలు
-
మరోసారి భూమా, శిల్పా వర్గాల మధ్య విభేదాలు
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో భూమా, శిల్పా వర్గాల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహారశైలిలపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల మున్సిపాలటీ అధికారులు, కౌన్సిలర్లతో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తొలిసారి మంత్రి అఖిలప్రియ పాల్గొన్నారు. అయితే చైర్పర్సన్ దేశం సులోచన రాకముందే భూమా అఖిల ప్రియ సమావేశం ప్రారంభించారు. కాస్త ఆలస్యంగా సమావేశంలో పాల్గొన్న చైర్‌పర్సన్‌కు మంత్రి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో తమ వర్గానికి మాట్లాడే అవకాశం ఎందుకివ్వరని సులోచన అఖిలప్రియను ప్రశ్నించారు. చైర్ పర్సన్ రాకముందే మీటింగ్ ప్రారంభించడం కాకుంగా చైర్పర్సన్ పట్ల అఖిల ప్రియ కనీస మర్యాద లేకుండా ప్రవర్తించడంతో చైర్ పర్సన్ భర్త, కోఆప్షన్ మెంబర్ దేశం సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. భూమా అఖిల ప్రియ తమ వార్డులలో సమస్యలు ఉంటే చెప్పాలని అడుగుతున్నారే తప్ప చైర్పర్సన్ కు అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సమావేశంలో ఉండగానే తనకు కర్నూల్ వెళ్లాల్సి ఉందని, మీరు మాట్లాడుకోండి అని అఖిలప్రియ అనడంతో సుధాకర్ రెడ్డి వెంటనే లేచి మంత్రి గారు మీకు ఇది సబబుకాదని.. చైర్ పర్సన్ కు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అలా ఎలా వెళ్లిపోతారని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌ను అఖిల ప్రియ అవమానించారని సుధాకర్ రెడ్డి తెలిపారు. మంత్రి అయి ఉండి ఇలా చేయడం చాలా భాధ కలిగించిందని.. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. అలాగే చైర్పర్సన్ అనుమతి లేకుండా సమావేశానికి వస్తే సహించేది లేదని ఘాటుగా స్పందించారు. -
టీడీపీ క్యాంప్ రాజకీయం
- బస్సులో టూర్‌కు వెళ్లిన విష్ణు వర్గీయులు - శిల్పా చక్రపాణి రెడ్డికి ఓటు వేయాలని ఒతిళ్లు - ఒక్కో ఓటుకు రూ. లక్ష ఇచ్చినట్లు సమాచారం గూడూరు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడడంతో టీడీపీ క్యాంప్ రాజకీయాలు జోరందుకున్నాయి. ఆ పార్టీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి గెలుపే ధ్యేయంగా టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. టీడీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి డి.విష్ణువర్ధన్‌రెడ్డి వర్గానికి చెందిన స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లను సోమవారం బస్సులో విహారయాత్రకు తరలించారు. వీరంతా మొదట కర్నూలులో విష్ణువర్ధన్‌రెడ్డి ఇంటికి అక్కడి నుంచి తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసేందుకు ఒక్కో కౌన్సిలర్‌కు రూ. లక్ష డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. టూర్‌కు వెళ్లిన వారిలో మున్సిపల్ చైర్పర్సన్ సుభాషిణి, వైస్ చైర్మన్ కె.రామాంజనేయులు, మరో పది మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరంతా వైఎస్సార్సీపీ తరఫున గెలిచి టీడీపీలోకి ఫిరాయించారు. వీరిని వైఎస్ఆర్సీపీకి ఓటు వేయనీయకుండా విహారయాత్ర పేరుతో ఇక్కడి నుంచి తరలించారు. -
రసాబాసగా విజయవాడ మున్సిపల్ సమావేశం
-
తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
రాజకీయ చైతన్యానికి మారుపేరయిన గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగుదేశం పార్టీ అసలు రంగు బయటపడింది. మున్సిపల్ కౌన్సిల్ సాక్షిగా టీడీపీ కౌన్సిలర్లు తన్నుకున్నారు. ముష్టియుద్ధాన్ని తలపించిన ఈ ఘటనలో కౌన్సిలర్లు గుమ్మడి రమేష్, పసుపులేటి త్రిమూర్తులు వీధిరౌడీలను తలపించారు. అసభ్య పదజాలం ఉపయోగిస్తూ.. ఒకరిపై ఒకరు కలబడ్డారు. తాము ప్రజలతో ఎన్నుకున్న గౌరవనీయ సభ్యులన్న విషయాన్ని కూడా మరిచి ఒకరిపై ఒకరు కలబడ్డారు. తెలుగు తమ్ముళ్ల ముష్టిఘతాలతో నివ్వెరపోయిన తెనాలి కౌన్సిల్‌లోని ఇతర సభ్యులు వీరిద్దరిని నిలువరించేందుకు ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. మినిట్స్ బుక్‌లో ఎంట్రీలకు సంబంధించిన విషయమై ఇద్దరు సభ్యుల మధ్య తొలుత మాట మాట పెరిగింది. ఇంతలో పసుపులేటి త్రిమూర్తులు, గుమ్మడి రమేష్ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ గొడవకు దిగారు. క్షణాల్లో పరిస్థితి అదుపుతప్పి ఇద్దరు వీధిరౌడిల్లా ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో కౌన్సిల్ సమావేశాన్ని గంట పాటు వాయిదా వేశారు. -
కాంగ్రెస్ పార్టీలో 11 ఏళ్లుగా శ్రమించా
కంప్లి : గత 11 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కష్టపడ్డానని అయితే కొంత మంది కుతంత్రాల వల్ల పార్టీకి విరుద్ధంగా స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేశానే తప్పా కాంగ్రెస్ పార్టీపై ద్వేషంతో ఎంతమాత్రం కాదని దేవసముద్ర జెడ్పీ క్షేత్ర స్వతంత్య్ర అభ్యర్థి కే.శ్రీనివాసమూర్తి స్పష్టం చేశారు. ఆయనకు బుధవారం తన గెలుపును పురష్కరించుకుని స్థానిక అతిథి గృహంలో మున్సిపల్ కౌన్సిలర్లు డాక్టర్ వీఎల్.బాబు, ఎం.సుధీర్, భట్టా ప్రసాద్ తదితరులు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సన్మానం అనంతరం ఆయన మాట్లాడుతూ తనపై దేవసముద్ర జెడ్పీ క్షేత్ర పరిధిలోని గ్రామాల్లోని ప్రజల్లో ఇంతటి ఆదరాభిమానం ఉంటుందని ఊహించలేదన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నాగరాజ్, భట్టా ప్రసాద్ మాట్లాడుతూ ఇకపై తాము శ్రీనివాసమూర్తి వెంటే ఉంటామన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు ఎం.మహేష్, రాజాసాబ్, మారెణ్ణ, ప్రముఖులు మూకయ్యస్వామి, కారేకల్లు మనోహభర్, బీ.లక్ష్మణ, కేటీ.బసవరాజ్, రేణుకప్పలు తదితరులు పాల్గొన్నారు. -
'లంచాలు అడగకుండా సేవ చేయండి'
ప్రొద్దుటూరు: ‘మీ పాదాలకు మొక్కుతా..ఒత్తిడులకు లొంగకుండా, లంచాలు తీసుకోకుండా ప్రజలకు సేవ చేయండి..’అంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అధికారులను కోరారు. శనివారం ఉదయం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన అధికారులును పై విధంగా ఆర్థించారు. సమావేశంలో అధికారుల వద్దకు వెళ్లిన ఆయన నేలపై కూర్చుని వినూత్న రీతిలో అధికారులను అభ్యర్థించారు. దీంతో ఒకింత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న అధికారులు లంచాలు అడక్కుండా విధులు నిర్వర్తిస్తామని ముక్తకంఠంతో సమాధానమిచ్చారు. మున్సిపల్ ఆస్తులను ఆక్రమణల నుంచి కాపాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, కౌన్సిలర్లు కమిషనర్‌ను ఇటీవల కోరారు. స్పందించిన ఆయన...పట్టణంలో ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే, టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి.. ఆదేశాల అమలును అడ్డుకున్నారు. పెపైచ్చు ఈ విషయంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ ఒకరు టౌన్ ప్లానింగ్ అధికారిపై దాడికి పాల్పడ్డారంటూ అక్రమ కేసు పెట్టించారు.ఈ చర్యల నేపథ్యంలోనే అధికారులు ఒత్తిడులకు, లంచాలకు లొంగకుండా విధులు నిర్వర్తించాలని ఎమ్మెల్యే కోరారు. -
ఆధిపత్యం కోసం టీడీపీ కౌన్సిలర్ యత్నం
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వీరంగం సమావేశ మందిరం వైపు దూసుకు వెళ్లిన తెలుగు తమ్ముళ్లు కౌన్సిలర్ హడావుడితో సమావేశం వాయిదా తాడేపల్లి రూరల్ : ప్రజాభివృద్ధిపై చర్చ జరిగి ఒకరినొకరు సమన్వయపరచుకుంటూ నిర్వహించాల్సిన మునిసిపల్ సమావేశం తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ నిర్వాకంతో ఆరంభం కాకుండానే వాయిదా పడింది. ప్రజా సమస్యలపై చర్చించే సమయాన్ని జన్మభూమి కమిటీల చర్చతో సదరు కౌన్సిలర్ పక్కదోవ పట్టించారు. తాడేపల్లి మునిసిపల్ సంఘం ప్రత్యేక, సాధారణ సమావేశాలను బుధవారం నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. ఈ క్రమంలో చైర్పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి అధ్యక్షతన సమావేశం ప్రారంభించారు. అయితే ఆరంభంలోనే కమిషనర్ శివారెడ్డి జన్మభూమి కమిటీలను నూతనంగా ఏర్పాటు చేయాల్సి ఉందని, ఆ విషయంపై చర్చ ప్రారంభించారు. ఈ క్రమంలో నూతన కమిటీలను ఎన్నుకోవాల్సిన అవసరం ఏముందంటూ వైస్ చైర్మన్ దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు బుర్రముక్కు వేణుగోపాలరెడ్డి, గోరేబాబు, ఈదులమూడి డేవిడ్, ఓలేటి రాము, మాచర్ల అబ్బు తదితరులు ప్రశ్నించారు. మరో రెండు రోజుల్లో జన్మభూమి జరగబోతుంటే ఇప్పుడు కమిటీలు ఎలా వేస్తారంటూ వ్యాఖ్యానించారు. దీనికి సమాధానంగా కమిషనర్ మాట్లాడుతూ మంత్రి జీవో జారీ చేశారని, దాన్ని అనుసరించే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. జీవో నెంబర్ 20ను అమలు చేసి తీరాలని, పాత కమిటీలను ఎలా రద్దు చేస్తారని కౌన్సిలర్లు ప్రశ్నించారు. దీంతో టీడీపీ ఫ్లోర్ లీడర్ ఇట్టా భాస్కర్ స్పందిస్తూ అధికార పార్టీ మాది, మేం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని, మీరెవరు ప్రశ్నించడానికి అంటూ కౌన్సిలర్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. దీంతో మిగతా కౌన్సిలర్లు ‘మీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కమిటీలు వేసుకుని, మీకు నచ్చిన విధంగా చేసుకోవాల’ని సూచించారు. దాంతో భాస్కర్ మా పార్టీని, మా నాయకుడిని అవమానిస్తారా? అంటూ వీరంగం వేస్తూ చైర్‌పర్సర్ చాంబర్ ముందు బైఠాయించి, అజెండా పత్రాలను చించివేశాడు. ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తున్నాడంటూ మిగతా కౌన్సిలర్లు వ్యాఖ్యానించడంతో, నన్ను సస్పెండ్ చేయండి, బయటకు పంపేయండి అంటూ సమావేశాన్ని అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు జన్మభూమి కొత్త కమిటీలను ఎన్నుకోవడానికి మేము వ్యతిరేకం అంటూ సమావేశ మందిరం నుండి బయటకు వెళ్లిపోయారు. ఆ సమయంలో తాడేపల్లి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇట్టా పెంచలయ్య.. ‘ఎవర్రా మా పార్టీ గురించి మాట్లాడింది, మీ సంగతి తేలుస్తా’నంటూ వేలు చూపిస్తూ కౌన్సిలర్లకు వార్నింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. దీంతో కౌన్సిలర్లు జరిగిన విషయాన్ని తెలియజేసేసరికి అక్కడ నుండి జారుకున్నారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ చాంబర్లో చైర్పర్సన్ మహాలక్ష్మి, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ అయిన వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధంగా టీడీపీ కౌన్సిలర్లు సమావేశ మందిరాల్లో లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వారి నియోజకవర్గ ఇన్చార్జి ఇచ్చిన లేఖ మేరకు జన్మభూమి కమిటీలను ఎలా ఎంచుకుంటారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కేళి వెంకటేశ్వరరావు, దాసరి ప్రమీలారాణి, మేకా పావని, వేముల లక్ష్మీరోజా, చింతపల్లి సుమలత, దర్శి విజయశ్రీ, చిట్టిమళ్ల స్నేహసంధ్య, కాటాబత్తుల నిర్మల, జమ్మలమడుగు విజయలక్ష్మి, సింకా గంగాధర్‌రావు, తమ్మా ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకాళహస్తి టీడీపీలో ముసలం
చిత్తూరు : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణ టీడీపీలో ముసలం పుట్టింది. ఛైర్మన్ రాధారెడ్డి అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అధికార పార్టీ నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రకు గురువారం 15 మంది టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. వార్డుల్లో ఏ ఒక్కపని జరగడం లేదని వారు ఆరోపిస్తున్నారు. జనం వద్దకు ఏ మొహం పెట్టుకుని వెళ్లాలంటూ సదరు కౌన్సిలర్ల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తోపులాట
-
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తోపులాట
గుంటూరు : తెనాలిలో సోమవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ, వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరగడంతో సమావేశంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు ఎజెండాలోని అంశాలను వివరించగా.. వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ టీడీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. దాంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. -
మా కమిషనర్ బంగారం
కోదాడటౌన్ కోదాడ మున్సిపల్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కమిషనర్, చైర్పర్సన్ మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం పతాకస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే కమిషనర్‌ను బదిలీ చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ ముగ్గురు మంత్రులను కలిసి స్వయంగా ఫిర్యాదు చేసిందా..? బదిలీ చేస్తామని వారు ఆమెకు మాట ఇచ్చారా? కమిషనర్ బదిలీ వద్దని మున్సిపల్ కౌన్సిలర్ల సంతకాలను కమిషనర్ అనుచరులు సేకరిస్తున్నారా? ఈ విషయమై 11 మంది అధికార, కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లు సంతకాలు చేశారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. రెండు రోజులుగా కొందరు కమిషనర్ బదిలీ వద్దని, ఆయన ఎన్నో మంచి పనులు చేశారని పేర్కొంటూ గుట్టుగా కౌన్సిలర్ల సంతకాలు సేకరిస్తున్నారు. శనివారం విపక్షాలకు చెందిన కౌన్సిలర్ల వద్దకు సంతకాల కోసం వెల్లడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో ఎక్కడ చూసినా ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. అసలు విషయం ఏమిటంటే.. నాలుగు నెలల క్రితం బాళోజినాయక్ కోదాడ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీపై వచ్చారు. మున్సిపాలిటీకి చెందిన ఓ కౌన్సిలర్, మాజీ ఎమ్మెల్యే చొరవతో ఆయనకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారనే పుకార్లు నాడు వచ్చాయి. ఆయన సదరు నేత మాట వింటూ తనను ఇబ్బంది పెడుతున్నారని చైర్పర్సన్ తన అనుచరులవద్ద వాపోతున్నది. ఈ క్రమంలో ఒకటి రెండు సార్లు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఇది తీవ్రం కావడంతో ప్రతి సమావేశం గందరగోళంగా తయారైంది. ఇక లాభం లేదనుకున్న చైర్పర్సన్ ఇటీవల ముగ్గురు మంత్రులను స్వయంగా కలిశారు. మహిళనైన తనను కమిషనర్ ఇబ్బంది పెడుతున్నాడని, అతడిని బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం. అంతే కాకుండా ఆరోపణల చిట్టాను కూడా మంత్రులకు ఇవ్వడంతో ఆయనను బదిలీ చేస్తామని వారు హమీ ఇచ్చినట్లు తెలసింది. దీంతో పాటు గత కమిషనర్ ఎన్ఓసీ రద్దు చేసిన ఓ భవనానికి తాజాగా ఎన్ఓసీ జారీ కావడంతో కొందరు సీడీఎంఏకు నేరుగా కమిషనర్‌పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారుల నుంచి తాకీదు రావడంతో ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లిన కమిషనర్‌కు అక్కడి అధికారులు ఈ విషయాల ను చెవిన వేయడంతో బదిలీని ఆపుకునేందుకు కౌన్సిలర్ల సంతకాలు సేకరిస్తున్నట్లు సమాచారం. 15మంది సంతకాలు కోదాడ మున్సిపల్ కమిషనర్ చాలా మంచి వాడని, మున్సిపల్ నిధులను సక్రమంగా వినియోగిస్తున్నాడని, ఆక్రమణలకు గురైన గాంధీపార్కును ఖాళీ చేయించిన ఘనత ఆయనదేనని, రోడ్డు వెంట ఉన్న దుకాణాలను తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుం డా చేశాడంటూ...ఒక వినతి పత్రాన్ని తయారు చేసి దాని మీద కౌన్సిలర్ల సంతకాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 11మంది అధికారపార్టీ కౌన్సిలర్లు, నలుగురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కమిషనర్‌కు మద్దతుగా సంతకాలు చేశారు. ఈ విషయాన్ని కొందరు కౌన్సిలర్లు ధ్రువీకరించారు కూడా. మిగిలిన వారు కొందరు తరువాత చేస్తామంటే.. మరికొందరు తిరష్కరించినట్లు సమచారం. చివరకు ఇది ఎటుదారి తీస్తుందోనని పలువురు ఆసక్తిగా గమనిస్తున్నారు. -
‘గూడెం’ కౌన్సిల్లో రగడ
గందరగోళంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం - పలు అంశాలను లేవనెత్తిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ సస్పెన్షన్ - టెండర్ల రద్దుపై కొనసాగిన వాదనలు - మీడియాను అనుమతించని కమిషనర్ కొత్తగూడెం: పాలకవర్గం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందంటూ బుధవారం కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు ధ్వజమెత్తడంతో..సభలో గందరగోళం నెలకొంది. 37 అంశాలతో చేపట్టిన మున్సిపల్ సమావేశంలో కనీసం ప్రతిపక్షానికి సమాధానం చెప్పకుండానే ఏకపక్షంగా కొనసాగింది. సింగిల్ టెండర్ల రద్దు విషయంపై వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కంభంపాటి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ జీవో 94 ప్రకారం లెస్‌కు వేసిన సింగిల్ టెండర్లు ఆమోదించాల్సి ఉండగా..రద్దు చేయాలంటూ పాలకపక్షం తీర్మానించడం సబబు కాదన్నారు. 10 నెలల కాలంలో ఐదు సింగిల్ టెండర్లను ఆమోదించిన కౌన్సిల్, కేవలం తమ వర్గానికి చెందినవారికి టెండర్ దక్కలేదనే దురుద్దేశంతోనే వాటిని రద్దు చేయాలని తీర్మానించిందన్నారు. ఎజెండాలో అంశాలను ఆమోదం కొరకు చేర్చే పాలకపక్షం వారే దానిని వ్యతిరేకించడం తగదన్నారు. ఈ విషయంపై గంటపాటు వాదోపవాదాలు జరిగాయి. మున్సిపల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్‌గా పనిచేసిన కె.స్వామిని గతేడాది సెప్టెంబర్‌లో సరెండర్ చేస్తున్నట్లు తీర్మానించి, దళితుడు కావడంతో ఏడు నెలలుగా లెటర్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌కు కారు ఏర్పాటు విషయంలో టెండర్లు పిలవకుండా కొటేషన్లను ఆమోదం కోసం కౌన్సిల్ అంశంలో చేర్చడమేంటని ప్రశ్నించారు. పీఎఫ్, ఈఎస్ఐ లేకుండానే టౌన్‌లెవెల్ ఫెడరేషన్‌కు కాంట్రాక్టును అప్పగించడంపై అభ్యంతరం తెలిపారు. ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ సస్పెన్షన్.. ఇష్టారాజ్యంగా మున్సిపల్ ఎజెండాలో చేర్చిన అంశాలపై ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కంభంపాటి దుర్గాప్రసాద్‌ను రెండు నెలలు సస్పెండ్ చేయాలంటూ చైర్పర్సన్ పులి గీత తీర్మానం ప్రవేశపెట్టడం గమనార్హం. కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడి 15 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు కౌన్సిలర్లను సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు. స్థానిక ప్రజా ప్రతినిధి ఒత్తిడి మేరకు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు మున్సిపల్ కార్యాలయం ముందు తిష్టవేసి ఆదేశాలు జారీ చేయడంతో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారనే విమర్శలు విన్పిస్తున్నాయి. అంశాలు చర్చించకుండానే ఆమోదం.. మున్సిపల్ సాధారణ సమావేశంలో ఎజెండాలో 38 సాధారణ అంశాలతోపాటు మరో రెండు అంశాలపై చర్చించి కౌన్సిల్ ఆమోదం పొందాల్సి ఉంది. అయితే రెండుమూడు అంశాలపై వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కంభంపాటి దుర్గాప్రసాద్, భీమా శ్రీవల్లి చర్చను లేవనెత్తారు. దీంతో దుర్గాప్రసాద్‌ను సస్పెండ్ చేశారు. అనంతరం 38 అంశాలను కౌన్సిల్లో చర్చించకుండానే ఆమోదిస్తున్నట్లుగా చైర్పర్సన్ ప్రకటించారు. ప్రజల సమస్యలపై చర్చించకుండానే ఏకపక్షంగా కౌన్సిల్ ఆమోదించడంపట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోమారు మీడియాపై ఆంక్షలు.. మున్సిపల్ చట్టం షెడ్యూల్-3, రూల్-1 ప్రకారం మున్సిపాల్టీలో జరిగే అన్ని సమావేశాలకు మీడియాను అనుమతించాల్సి ఉంది. అయితే గతనెల జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మీడియాను నిషేధిస్తూ బయటకు పంపించి వేశారు. ఈ అంశంపై అదేరోజు మీడియా ప్రతినిధులు ఆందోళన సైతం చేశారు. ఈ క్రమంలో బుధవారం జరిగిన సాధారణ సమావేశంలో కూడా మీడియా ప్రతినిధులను అనుమతించకుండా ఆంక్షలు విధించారు. కేవలం పాలకపక్షం స్వలాభం కోసం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేందుకే మీడియూను అనుమతించలేదని పాలకపక్ష కౌన్సిలర్లే పేర్కొనడం గమనార్హం. కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పులిగీత, కమిషనర్ సైఫుల్లా అహ్మద్, డీఈ సలీం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.