పురపాలకులు కొలువుతీరేది నేడే | The first session of the new Council of municipalities | Sakshi
Sakshi News home page

పురపాలకులు కొలువుతీరేది నేడే

Published Thu, Jul 3 2014 12:55 AM | Last Updated on Tue, Oct 16 2018 6:40 PM

పురపాలకులు కొలువుతీరేది నేడే - Sakshi

పురపాలకులు కొలువుతీరేది నేడే

 సాక్షి, రాజమండ్రి : పురపాలకులు గురువారం కొలువుదీరనున్నారు. మున్సిపాలిటీల కొత్త కౌన్సిళ్ల తొలి సమావేశాలు నేటి ఉదయం జరగనున్నాయి. ఏప్రిల్ 30న రాజమండ్రి నగర పాలక సంస్థతో పాటు ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రాజమండ్రిలో కార్పొరేటర్లుగా గెలిచిన వారు మేయర్, డిప్యూటీ మేయర్‌లను, తక్కిన చోట్ల గెలిచిన కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకోనున్నారు. పలు చోట్ల చైర్మన్ ఎన్నిక లాంఛనప్రాయమే అయినా ‘వైస్’ల ఎన్నికే జటిలం కానుంది.

జిల్లాలో అన్ని పట్టణాల్లో చైర్మన్ పీఠాలు దక్కించుకునేందుకు ఉత్సాహంతో ఉన్న టీడీపీకి వైస్ చైర్మన్‌ల ఎంపిక  సమస్య కానుంది. ఇప్పటికే కులాలు, వర్గాల వారీ పార్టీలో గ్రూపులుగా ఏర్పడి వైస్ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. సమావేశాల్లో ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్‌చైర్మన్‌ల ఎన్నికలు జరుగుతాయి.

వాసిరెడ్డికి డిప్యూటీ మేయర్!
రాజమండ్రిలోని 50 డివిజన్‌లలో 34 మంది టీడీపీ కార్పొరేటర్లు కాగా, 8 మంది వైఎస్సార్ కాంగ్రెస్, ఐదుగురు ఇండిపెండెంట్లు,  బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లకు ఒక్కో కార్పొరేటర్ ఉన్నారు. మేయర్ అభ్యర్థిగా పంతం రజనీ శేషసాయిని ఎన్నికల ముందే ప్రకటించిన టీడీపీ డిప్యూటీ మేయర్‌గా ఆ పార్టీ నగరాధ్యక్షుడు, 10వ డివిజన్ కార్పొరేటర్ వాసిరెడ్డి రాంబాబు ఎన్నికయ్యే అవకాశం ఉంది.

మండపేటలో రెడ్డి,బీసీల మధ్య పోటీ
మండపేటలోని 29 వార్డుల్లో టీడీపీకి 18 మంది, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 11 మంది సభ్యుల బలం ఉంది. చైర్మన్‌గా చుండ్రు శ్రీ వరప్రకాష్ పేరును ఖరారు చేయగా వైస్ చైర్మన్ కోసం టీడీపీలోని రెడ్డి, బీసీ సామాజిక వర్గాల మధ్య పోటీ గట్టిగా ఉంది. దీంతో ఇప్పటికీ ఎవరి పేరునూ తెరపైకి తేలేదు.   

అమలాపురం వైస్ చైర్మన్‌గా విజయలక్ష్మి!
అమలాపురంలోని మొత్తం 30 వార్డుల్లో టీడీపీ 22 గెలుచుకోగా వైఎస్సార్ సీపీ ఏడు స్థానాల్లో, ఒకచోట ఇండిపెండెంట్ విజయం సాధించారు. చైర్మన్‌గా యాళ్ల మల్లేశ్వరరావు పేరును ముందే నిర్ణయించారు. వైస్ చైర్మన్ పదవిని పి.విజయలక్ష్మికి ఇవ్వనున్నారు.

 రామచంద్రపురంలో ఎంపిక ‘తోట’దే..
ఇక్కడ 27 వార్డులకు టీడీపీ 17, వైఎస్సార్ సీపీ 9 చోట్ల విజయం సాధించాయి. ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్.ఆర్.కె గోపాల్‌బాబు ఓటమి పాలవడంతో 19వ వార్డు నుంచి గెలిచిన సీతామహాలక్ష్మి, 20వ వార్డు నుంచి గెలిచిన సూర్యప్రకాశరావు, 21వ వార్డు నుంచి విజయం సాధించిన మాడా ఎల్లయ్య శంకర్‌లు ఆ పదవికి పోటీ పడుతున్నారు. ఎంపికను ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు పార్టీ నేతలు వదిలి పెట్టారు. వైస్ చైర్మన్ పదవి బీసీ వర్గానికి చెందిన ఆరో వార్డు కౌన్సిలర్ మేడిశెట్టి సూర్యనారాయణకు దక్కే అవకాశాలు ఉన్నాయి.

 సామర్లకోట వైస్ చైర్మన్‌పైబడుగు ఆశ
 ఇక్కడి 30 వార్డుల్లో టీడీపీ 24 గెలుచుకోగా వైఎస్సార్ సీపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. చైర్మన్‌గా మన్నెం చంద్రరావు పేరు ఇప్పటికే ఖరారవగా వైస్ చైర్మన్ పదవిని30వ వార్డు నుంచి గెలిచిన బీసీ వర్గానికి చెందిన బడుగు శ్రీకాంత్ ఆశిస్తున్నారు.

 పెద్దాపురంలో ముగ్గురుఆశావహులు
ఇక్కడి 28 వార్డుల్లో టీడీపీకి 21, వైఎస్సార్ సీపీకి 4, సీపీఎంకు ఒకటి దక్కగా ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు.  చైర్మన్‌గా రాజా సూరిబాబురాజును ఎన్నికల ముందే ఖరారు చేశారు. వైస్ చైర్మన్ కోసం వెలమ సామాజిక వర్గం నుంచి రాయవరపు వరలక్ష్మి, కురుపూరి రాజా, దేవాంగ వర్గం నుంచి యర్రా లక్ష్మి,  కమ్మ సామాజిక వర్గానికి చెందిన కె.సత్యభాస్కర్ పోటీ పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే వర్మ వీరిలో ఎవరికి అవకాశం ఇచ్చేదీ నిర్ణయిస్తారంటున్నారు.

 పిఠాపురంలో వర్మదే నిర్ణయం
ఇక్కడి 30 వార్డుల్లో 23 టీడీపీకి, ఆరు వైఎస్సార్ సీపీకి దక్కగా ఒకరు ఇండిపెండెంట్‌గా గెలిచారు. చైర్మన్ అభ్యర్థిగా కరణం చిన్నారావు పేరు పార్టీ ఖరారు చేసింది.   వైస్ చైర్మన్ గిరీకి  ఇద్దరు పోటీ పడుతుండగా ఎవరికి ఇవ్వాలనే దానిపై నేతలు కసరత్తు చేస్తున్నారు. గురువారం ఉదయానికల్లా ఒకరిని ఎమ్మెల్యే వర్మ  ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement