కోదాడటౌన్
కోదాడ మున్సిపల్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కమిషనర్, చైర్‌పర్సన్ మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం పతాకస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే కమిషనర్‌ను బదిలీ చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ముగ్గురు మంత్రులను కలిసి స్వయంగా ఫిర్యాదు చేసిందా..? బదిలీ చేస్తామని వారు ఆమెకు మాట ఇచ్చారా? కమిషనర్ బదిలీ వద్దని మున్సిపల్ కౌన్సిలర్ల సంతకాలను కమిషనర్ అనుచరులు సేకరిస్తున్నారా? ఈ విషయమై 11 మంది అధికార, కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లు సంతకాలు చేశారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. రెండు రోజులుగా కొందరు కమిషనర్ బదిలీ వద్దని, ఆయన ఎన్నో మంచి పనులు చేశారని పేర్కొంటూ గుట్టుగా కౌన్సిలర్ల సంతకాలు సేకరిస్తున్నారు. శనివారం విపక్షాలకు చెందిన కౌన్సిలర్ల వద్దకు సంతకాల కోసం వెల్లడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో ఎక్కడ చూసినా ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది.
అసలు విషయం ఏమిటంటే..
నాలుగు నెలల క్రితం బాళోజినాయక్ కోదాడ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీపై వచ్చారు. మున్సిపాలిటీకి చెందిన ఓ కౌన్సిలర్, మాజీ ఎమ్మెల్యే చొరవతో ఆయనకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారనే పుకార్లు నాడు వచ్చాయి. ఆయన సదరు నేత మాట వింటూ తనను ఇబ్బంది పెడుతున్నారని చైర్‌పర్సన్ తన అనుచరులవద్ద వాపోతున్నది. ఈ క్రమంలో ఒకటి రెండు సార్లు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఇది తీవ్రం కావడంతో ప్రతి సమావేశం గందరగోళంగా తయారైంది. ఇక లాభం లేదనుకున్న చైర్‌పర్సన్ ఇటీవల ముగ్గురు మంత్రులను స్వయంగా కలిశారు. మహిళనైన తనను కమిషనర్ ఇబ్బంది పెడుతున్నాడని, అతడిని బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం. అంతే కాకుండా ఆరోపణల చిట్టాను కూడా మంత్రులకు ఇవ్వడంతో ఆయనను బదిలీ చేస్తామని వారు హమీ ఇచ్చినట్లు తెలసింది. దీంతో పాటు గత కమిషనర్ ఎన్‌ఓసీ రద్దు చేసిన ఓ భవనానికి తాజాగా ఎన్‌ఓసీ జారీ కావడంతో కొందరు సీడీఎంఏకు నేరుగా కమిషనర్‌పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారుల నుంచి తాకీదు రావడంతో ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లిన కమిషనర్‌కు అక్కడి అధికారులు ఈ విషయాల ను చెవిన వేయడంతో బదిలీని ఆపుకునేందుకు కౌన్సిలర్ల సంతకాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
15మంది సంతకాలు
కోదాడ మున్సిపల్ కమిషనర్ చాలా మంచి వాడని, మున్సిపల్ నిధులను సక్రమంగా వినియోగిస్తున్నాడని, ఆక్రమణలకు గురైన గాంధీపార్కును ఖాళీ చేయించిన ఘనత ఆయనదేనని, రోడ్డు వెంట ఉన్న దుకాణాలను తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుం డా చేశాడంటూ...ఒక వినతి పత్రాన్ని తయారు చేసి దాని మీద కౌన్సిలర్ల సంతకాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 11మంది అధికారపార్టీ కౌన్సిలర్లు, నలుగురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కమిషనర్‌కు మద్దతుగా సంతకాలు చేశారు. ఈ విషయాన్ని కొందరు కౌన్సిలర్లు ధ్రువీకరించారు కూడా. మిగిలిన వారు కొందరు తరువాత చేస్తామంటే.. మరికొందరు తిరష్కరించినట్లు సమచారం. చివరకు ఇది ఎటుదారి తీస్తుందోనని పలువురు ఆసక్తిగా గమనిస్తున్నారు.
మా కమిషనర్ బంగారం
Published Sun, Jul 12 2015 2:48 AM | Last Updated on Tue, Oct 16 2018 6:40 PM
Advertisement
Advertisement