Kodada Town
-
‘బండి సంజయ్ కాన్వాయ్‌పై దాడి జరగలేదు’
సూర్యాపేటక్రైం : కోదాడలో ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్‌పై ఎలాంటి దాడి జరగలేదని కేవలం కొందరు ఎమ్మార్పీఎస్, స్వేరోస్ కార్యకర్తలు కాన్వాయ్‌ను అడ్డుకున్నారని ఎస్పీ ఆర్.భాస్కరన్ స్పష్టం చేశారు. బుధవారం రాత్రి సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూర్‌నగర్‌లో పార్టీ కార్యక్రమానికి బండి సంజయ్ హాజరవుతున్నారనే సమాచారం పోలీసులకు ముందుగానే ఉందన్నారు. అందుకోసం ముందస్తుగా హుజూర్‌నగర్‌లో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. హుజూర్‌నగర్‌లో కార్యక్రమం ముగిసిన అనంతరం కోదాడకు వచ్చి అక్కడ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లే సమయంలో కొందరు ఎమ్మార్పీఎస్, స్వేరోస్ కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారన్నారు. ఆ సమయంలో పోలీసులు వెంటనే స్పందించి కాన్వాయ్‌ను అడ్డుకున్న వారిని అదుపులోకి తీసుకుని కాన్వాయ్‌ను పోలీసు రక్షణ మధ్య హుజూర్నగర్, మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్‌కు పంపించామన్నారు. ఈ సంఘటనలో ఆందోళనకారులు ఇనుప రాడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని సోషల్ మీడియాలో వస్తున్నదంతా అబద్ధమన్నారు. ఈ సంఘటనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి వాహనం ధ్వంసం కాలేదని అది గతంలో జరిగిన సంఘటనలో ధ్వంసమైందన్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. దీనిపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేయగా చిలుకూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. సంఘటనలో ఎవరు పాల్గొన్నారో వీడియో ఫుటేజి ఆధారంగా పరిశీలించి వారిపై కేసు నమోదు చేస్తామన్నారు. సంజయ్ పర్యటనలో ఎక్కడా పోలీసుల నిర్లక్ష్యం లేదన్నారు. సమావేశంలో డీఎస్పీ రఘు, ఇన్స్పెక్టర్లు ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. చదవండి: బండి సంజయ్ మూల్యం చెల్లించక తప్పదు.. -
మా కమిషనర్ బంగారం
కోదాడటౌన్ కోదాడ మున్సిపల్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కమిషనర్, చైర్పర్సన్ మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం పతాకస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే కమిషనర్‌ను బదిలీ చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ ముగ్గురు మంత్రులను కలిసి స్వయంగా ఫిర్యాదు చేసిందా..? బదిలీ చేస్తామని వారు ఆమెకు మాట ఇచ్చారా? కమిషనర్ బదిలీ వద్దని మున్సిపల్ కౌన్సిలర్ల సంతకాలను కమిషనర్ అనుచరులు సేకరిస్తున్నారా? ఈ విషయమై 11 మంది అధికార, కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లు సంతకాలు చేశారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. రెండు రోజులుగా కొందరు కమిషనర్ బదిలీ వద్దని, ఆయన ఎన్నో మంచి పనులు చేశారని పేర్కొంటూ గుట్టుగా కౌన్సిలర్ల సంతకాలు సేకరిస్తున్నారు. శనివారం విపక్షాలకు చెందిన కౌన్సిలర్ల వద్దకు సంతకాల కోసం వెల్లడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో ఎక్కడ చూసినా ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. అసలు విషయం ఏమిటంటే.. నాలుగు నెలల క్రితం బాళోజినాయక్ కోదాడ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీపై వచ్చారు. మున్సిపాలిటీకి చెందిన ఓ కౌన్సిలర్, మాజీ ఎమ్మెల్యే చొరవతో ఆయనకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారనే పుకార్లు నాడు వచ్చాయి. ఆయన సదరు నేత మాట వింటూ తనను ఇబ్బంది పెడుతున్నారని చైర్పర్సన్ తన అనుచరులవద్ద వాపోతున్నది. ఈ క్రమంలో ఒకటి రెండు సార్లు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఇది తీవ్రం కావడంతో ప్రతి సమావేశం గందరగోళంగా తయారైంది. ఇక లాభం లేదనుకున్న చైర్పర్సన్ ఇటీవల ముగ్గురు మంత్రులను స్వయంగా కలిశారు. మహిళనైన తనను కమిషనర్ ఇబ్బంది పెడుతున్నాడని, అతడిని బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం. అంతే కాకుండా ఆరోపణల చిట్టాను కూడా మంత్రులకు ఇవ్వడంతో ఆయనను బదిలీ చేస్తామని వారు హమీ ఇచ్చినట్లు తెలసింది. దీంతో పాటు గత కమిషనర్ ఎన్ఓసీ రద్దు చేసిన ఓ భవనానికి తాజాగా ఎన్ఓసీ జారీ కావడంతో కొందరు సీడీఎంఏకు నేరుగా కమిషనర్‌పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారుల నుంచి తాకీదు రావడంతో ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లిన కమిషనర్‌కు అక్కడి అధికారులు ఈ విషయాల ను చెవిన వేయడంతో బదిలీని ఆపుకునేందుకు కౌన్సిలర్ల సంతకాలు సేకరిస్తున్నట్లు సమాచారం. 15మంది సంతకాలు కోదాడ మున్సిపల్ కమిషనర్ చాలా మంచి వాడని, మున్సిపల్ నిధులను సక్రమంగా వినియోగిస్తున్నాడని, ఆక్రమణలకు గురైన గాంధీపార్కును ఖాళీ చేయించిన ఘనత ఆయనదేనని, రోడ్డు వెంట ఉన్న దుకాణాలను తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుం డా చేశాడంటూ...ఒక వినతి పత్రాన్ని తయారు చేసి దాని మీద కౌన్సిలర్ల సంతకాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 11మంది అధికారపార్టీ కౌన్సిలర్లు, నలుగురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కమిషనర్‌కు మద్దతుగా సంతకాలు చేశారు. ఈ విషయాన్ని కొందరు కౌన్సిలర్లు ధ్రువీకరించారు కూడా. మిగిలిన వారు కొందరు తరువాత చేస్తామంటే.. మరికొందరు తిరష్కరించినట్లు సమచారం. చివరకు ఇది ఎటుదారి తీస్తుందోనని పలువురు ఆసక్తిగా గమనిస్తున్నారు. -
ప్రతి ఎకరాకు సాగునీరందిస్తాం
కోదాడటౌన్ : సాగర్ ఆయకట్టులో చివరి ఎకరా వరకు సాగునీటిని అందిస్తామని ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం కోదాడలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్ ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు చేరుతున్నందున స్థిరీకరించిన ఆయకట్టు మొత్తానికి నీటిని అందించేందుకు తగిన ప్రణాళికను తయారు చేశామన్నారు. ఇకనుంచి ఆంధ్రప్రాంత జలదోపిడీ ఉండదన్నారు. కాలువ ల డిజైన్ మేరకు నీటిని విడుదల చేస్తామని, నీటిని తక్కువ విడుదల చేసి పంటలు ఎండిపోవడానికి అధికారులు కారణమైతే కఠిన చర్యలు తీసుకుంటామని, వ్యవసాయ రంగానికి తగినంత విద్యుత్‌ను సరఫరా చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి, కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, సాముల శివారెడ్డి, వల్లూరి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.