మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వీరంగం
సమావేశ మందిరం వైపు దూసుకు వెళ్లిన తెలుగు తమ్ముళ్లు
కౌన్సిలర్ హడావుడితో సమావేశం వాయిదా
తాడేపల్లి రూరల్ : ప్రజాభివృద్ధిపై చర్చ జరిగి ఒకరినొకరు సమన్వయపరచుకుంటూ నిర్వహించాల్సిన మునిసిపల్ సమావేశం తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ నిర్వాకంతో ఆరంభం కాకుండానే వాయిదా పడింది. ప్రజా సమస్యలపై చర్చించే సమయాన్ని జన్మభూమి కమిటీల చర్చతో సదరు కౌన్సిలర్ పక్కదోవ పట్టించారు. తాడేపల్లి మునిసిపల్ సంఘం ప్రత్యేక, సాధారణ సమావేశాలను బుధవారం నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. ఈ క్రమంలో చైర్‌పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి అధ్యక్షతన సమావేశం ప్రారంభించారు.
అయితే ఆరంభంలోనే కమిషనర్ శివారెడ్డి జన్మభూమి కమిటీలను నూతనంగా ఏర్పాటు చేయాల్సి ఉందని, ఆ విషయంపై చర్చ ప్రారంభించారు. ఈ క్రమంలో నూతన కమిటీలను ఎన్నుకోవాల్సిన అవసరం ఏముందంటూ వైస్ చైర్మన్ దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్‌లు బుర్రముక్కు వేణుగోపాలరెడ్డి, గోరేబాబు, ఈదులమూడి డేవిడ్, ఓలేటి రాము, మాచర్ల అబ్బు తదితరులు ప్రశ్నించారు. మరో రెండు రోజుల్లో జన్మభూమి జరగబోతుంటే ఇప్పుడు కమిటీలు ఎలా వేస్తారంటూ వ్యాఖ్యానించారు. దీనికి సమాధానంగా కమిషనర్ మాట్లాడుతూ మంత్రి జీవో జారీ చేశారని, దాన్ని అనుసరించే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. జీవో నెంబర్ 20ను అమలు చేసి తీరాలని, పాత కమిటీలను ఎలా రద్దు చేస్తారని కౌన్సిలర్లు ప్రశ్నించారు.
దీంతో టీడీపీ ఫ్లోర్ లీడర్ ఇట్టా భాస్కర్ స్పందిస్తూ అధికార పార్టీ మాది, మేం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని, మీరెవరు ప్రశ్నించడానికి అంటూ కౌన్సిలర్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. దీంతో మిగతా కౌన్సిలర్లు ‘మీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కమిటీలు వేసుకుని, మీకు నచ్చిన విధంగా చేసుకోవాల’ని సూచించారు. దాంతో భాస్కర్ మా పార్టీని, మా నాయకుడిని అవమానిస్తారా? అంటూ వీరంగం వేస్తూ చైర్‌పర్సర్ చాంబర్ ముందు బైఠాయించి, అజెండా పత్రాలను చించివేశాడు. ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తున్నాడంటూ మిగతా కౌన్సిలర్లు వ్యాఖ్యానించడంతో, నన్ను సస్పెండ్ చేయండి, బయటకు పంపేయండి అంటూ సమావేశాన్ని అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు జన్మభూమి కొత్త కమిటీలను ఎన్నుకోవడానికి మేము వ్యతిరేకం అంటూ సమావేశ మందిరం నుండి బయటకు వెళ్లిపోయారు.
ఆ సమయంలో తాడేపల్లి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇట్టా పెంచలయ్య.. ‘ఎవర్రా మా పార్టీ గురించి మాట్లాడింది, మీ సంగతి తేలుస్తా’నంటూ వేలు చూపిస్తూ కౌన్సిలర్లకు వార్నింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. దీంతో కౌన్సిలర్లు జరిగిన విషయాన్ని తెలియజేసేసరికి అక్కడ నుండి జారుకున్నారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ చాంబర్‌లో చైర్‌పర్సన్ మహాలక్ష్మి, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ అయిన వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధంగా టీడీపీ కౌన్సిలర్లు సమావేశ మందిరాల్లో లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వారి నియోజకవర్గ ఇన్‌చార్జి ఇచ్చిన లేఖ మేరకు జన్మభూమి కమిటీలను ఎలా ఎంచుకుంటారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కేళి వెంకటేశ్వరరావు, దాసరి ప్రమీలారాణి, మేకా పావని, వేముల లక్ష్మీరోజా, చింతపల్లి సుమలత, దర్శి విజయశ్రీ, చిట్టిమళ్ల స్నేహసంధ్య, కాటాబత్తుల నిర్మల, జమ్మలమడుగు విజయలక్ష్మి, సింకా గంగాధర్‌రావు, తమ్మా ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆధిపత్యం కోసం టీడీపీ కౌన్సిలర్ యత్నం
Published Thu, Dec 31 2015 12:16 AM | Last Updated on Tue, Oct 16 2018 6:40 PM
Advertisement