సాక్షి, ఏలూరు : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక పార్టీనుంచి ఎన్నికై వేరే పార్టీవైపు చూస్తున్నారా...? తస్మాత్ జాగ్రత్త.. ఎన్నికైన పార్టీ ఆదేశాలను, విప్‌లను ధిక్కరించే వారిపై తక్షణమే అనర్హత వేటు పడుతుంది. పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు 2003లో పంచాయతీరాజ్ చట్టంలో చేసిన సవరణల వల్ల స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎన్నికైన పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే మరుక్షణమే వారిపై అనర్హత వేటు ఖాయమని చట్టాలు చెబుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, మునిసిపల్ కౌన్సిలర్లను ప్రలోభాలు పెట్టే చర్యలు తెరవెనుక సాగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఫిరాయింపు నిరోధక చట్టాలను నిపుణులు ఉటంకిస్తున్నారు. పార్టీ మారే వారికి చట్టంలోని పగడ్బందీ నిబంధనలు షాక్ కొట్టించక మానవని స్పష్టం చేస్తున్నారు.
అనర్హత వేటు వల్ల అప్రతిష్ఠ పాలవ్వడంతో పాటు ప్రజలనుంచి వచ్చే వ్యతిరేకతతో అక్కడితోనే రాజకీయ భవిష్యత్తును కోల్పోయే ప్రమాదమూ తప్పదంటున్నారు. గతంలో ఇలా పార్టీలు మారిన వారు రాజకీయంగా తెరమరుగైన సందర్భాలు అనేకమున్నాయని గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో పార్టీల సిద్ధాంతాలను అనుసరించి ప్రజాభిప్రాయం మేరకు నడుచుకున్న వారే ఆ తరువాత కూడా రాజకీయంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నత స్థానాల్లోకి వెళ్లగలిగారు. స్వల్ప కాలిక ప్రయోజనాల కోసం పార్టీలు మారితే ఆ తరువాత దీర్ఘకాలంపాటు రాజకీయంగా చాలా నష్టపోక తప్పదు. ఇలాం టి తరుణంలో జెడ్పీ స్థానాలను కైవసం చే సుకోవటానికి అధికార పార్టీ నేతలు స్థానిక సంస్థల ప్రతినిధులను అనేక రకాల ప్రలోభాలకు గురిచేస్తున్నా నేతలు మాత్రం పునరాలోచనలో పడుతున్నారు.
ప్రజల తీర్పును, పార్టీ నిర్ణయాన్ని భవిష్యత్తును పణంగా పెట్టడం పలువురు నేతలకు రుచించడం లేదు. పార్టీని ధిక్కరిస్తే వెంటనే వేటు పడటం, ఆపై ప్రజలు నిరాదరించడం ఇవన్నీ ఎందుకు? బంగారు భవిష్యత్తును వదులుకోవడమెందుకు? అన్న ఆలోచనలో పడుతున్నారు. అయినా కొన్ని చోట్ల కొంతమంది ఆమాయకులను ఆసరా చేసుకొని అధికార పక్షం వారు చట్టాన్ని వక్రీకరిస్తున్నారు. వారెన్ని చెప్పినా చట్టం పగడ్బందీగా ఉన్నందున అనర్హత వేటు తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆ పార్టీ జారీ చేసే విప్‌కు అనుకూలంగా ఓటు వేయాలే తప్ప, ధిక్కరిస్తే అనర్హత వేటుకు గురవుతారని తెలియజేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గత శుక్రవారం ప్రత్యేకంగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఏముందంటే...
రాజీవ్‌గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో అంటే 1985 కాలంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చి, దానిని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో చేర్చారు. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. అటు తరువాత 2003లో అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ చట్టానికి కొన్ని సవరణలు జరిగాయి. చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు ఎవరైనా కూడా తన పార్టీ స్వభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నప్పుడు అతనికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. తను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీ సభ్వత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడానికి, ఆ పార్టీకి రాజీనామా సమర్పించడానికి తేడా ఉందని, ఈ రెండూ పదాలు కూడా సమనార్ధాకాలు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి తన పార్టీకి రాజీనామా చేయనప్పటికీ, స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకోవచ్చునని తెలిపింది. అదే విధంగా పార్టీ ఆదేశాలకు భిన్నంగా ఏదైనా అంశంపై ఓటింగ్ జరిగినప్పుడు అందులో పాల్గొని ఓటు వేయడం, లేదా ఓటింగ్‌కు గైర్హాజరు కావడం చేసినప్పుడు కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది.
ఒకవేళ సదరు రాజకీయ పార్టీ తమ సభ్యుడి ధిక్కారాన్ని 15 రోజుల్లోపు ఖండించని పక్షంలో అతనికి ఫిరాయింపుల చట్టం వర్తించదు. అంతేకాక ఏ పార్టీ టికెట్ మీద అయితే ఓ సభ్యుడు గెలిచారో, ఆ వ్యక్తి ప్రతిపక్ష నేతను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను రాతపూర్వకంగా కోరే, ఆ వ్యక్తి తన పార్టీ సభ్వత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 2003లో తీసుకువచ్చిన చట్ట సవరణ ప్రకారం పార్టీలోని మూడింట రెండు వంతుల మంది సభ్యులు వేరే పార్టీకి వెళ్లిన సందర్భాన్ని ఫిరాయింపుగా పరిగణించడానికి వీల్లేదు. చట్ట సభలకు ఎన్నికైన వెంటనే ఎవరైనా స్వతంత్ర అభ్యర్థి ఇతర రాజకీయ పార్టీలో చేరితే అతనికీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది.
ఫిరాయిస్తే అనర్హత వేటే
Published Mon, Jun 30 2014 12:49 AM | Last Updated on Tue, Oct 16 2018 6:40 PM
Advertisement