కౌలురైతుపైకరుణేదీ! | farmers waiting for Loan waiver | Sakshi
Sakshi News home page

కౌలురైతుపైకరుణేదీ!

Published Mon, Oct 30 2017 8:45 AM | Last Updated on Fri, Aug 10 2018 8:31 PM

  farmers waiting for Loan waiver - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: కౌలు రైతులకు రుణమాఫీ అందని ద్రాక్షగా మారింది. జిల్లాలో వేలాది మంది రుణమాఫీ కోaసం రైతు సాధికార సంస్థ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. ఫలితం శూన్యం. అసలు రుణమాఫీకి సంబంధించిన వివరాలు చెప్పేందుకు ఏ శాఖా బాధ్యత తీసుకోకపోవడంతో వారి కష్టాలు తీరడం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం రైతుసాధికార సంస్థను ముట్టడించడానికి కౌలు రైతులు సన్నద్ధమవుతున్నారు.

3లక్షల మంది కౌలురైతులు
జిల్లాలో మూడు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. 2013 డిసెంబర్‌ 31 నాటికి 53 వేల మంది కౌలు రైతులు రుణ అర్హత కలిగి ఉన్నారు.  ఐదు వేలకుపైగా రైతు మిత్ర గ్రూపులు, మూడు వేల జీఎల్‌జీ గ్రూపులు ఉన్నాయి. వీరి పేరుమీద సుమారు రూ.165 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి.  ఇప్పటి వరకూ జిల్లాలో కౌలు రైతులకు కేవలం రూ.40 కోట్లకు మించి రుణమాఫీ వర్తించలేదు. అసలు కౌలు రైతులకు ఎంత రుణమాఫీ వస్తుందన్న లెక్కలూ అధికారుల వద్ద లేవు. 2014 ఆగస్టు 14న  రుణమాఫీ కోసం ప్రభుత్వం జీఓ నంబర్‌ 174 విడుదల చేసింది. నిబంధన ప్రకారం జిల్లాలో రైతుమిత్ర, జాయింట్‌ లైబులిటీ గ్రూప్‌ (జేఎల్‌జీ),  రుణ అర్హత గుర్తింపు కార్డులు ఉన్న కౌలు రైతులకు రుణమాఫీ చేసేందుకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇది జరిగి మూడేళ్లయినా  కౌలు రైతులకు మాఫీ వర్తించలేదు. భూ యజమానులకే మాఫీ అవుతున్నట్టు స్పష్టమవుతోంది.

పెండింగ్‌ పెట్టిన బ్యాంకులు
బ్యాంకులు రుణ మాఫీ వివరాలు అప్‌లోడ్‌ చేసేటప్పుడు కౌలు రైతుల వివరాలు ఆన్‌లైన్‌ చేయకుండా పెండింగ్‌ పెట్టాయి.  దీంతో కౌలు రైతులకు రుణమాఫీ జరగలేదు. ఇప్పటికి మూడు విడతల్లో ఆరు దఫాలుగా రుణమాఫీ ప్రక్రియ జరిగింది. ప్రతిసారీ రైతు సాధికార సంస్థకు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు వేల సంఖ్యలో కౌలు రైతులు దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. కానీ అవి పరిష్కారం కావడంలేదు. ఈ రోజుకీ రైతు సాధికార సంస్థ చుట్టూ రైతులు తిరుగుతూనే ఉన్నారు.  దీనికి సంబంధించి ఆయా శాఖల నుంచి సరైన సమాచారం రావడం లేదు. అసలు రుణమాఫీ తమ బాధ్యత కాదని ఎవరికి వారు చేతులు దులుపుకునే యత్నం చేస్తున్నారు.

రూ.50వేల లోపే ఉన్నా..
రూ.50 వేలలోపు రుణం ఉన్నవారికి  ఒకే దఫాలో మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. 90 శాతం మంది కౌలు రైతులకు రూ.50 వేల లోపే రుణం ఉంటుంది. అంటే కౌలు రైతులందరికీ ఒకేసారి  రుణమాఫీ జరిగి ఉంటే రూ.150 కోట్ల వరకూ ఇవ్వాల్సి ఉంది. అయితే దీనికి భిన్నంగా రూ.40 కోట్లు మాత్రమే ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

అప్పుల ఊబిలో..
రుణమాఫీ కాకపోవడం వల్ల కౌలు రైతులు ప్రైవేటు అప్పులపై ఆధార పడాల్సి వస్తోంది. రుణమాఫీ కాకపోవడంతో  బ్యాంకులు కొత్తగా వారికి అప్పులు ఇవ్వడం లేదు. పాత బాకీకి వడ్డీ భారం పెరిగిపోతోంది. దీంతో కొన్ని బ్యాంకులు రైతుల ధాన్యం, ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చిన డబ్బులు, వ్యక్తిగతంగా బ్యాంకులో దాచుకున్న డబ్బునూ వడ్డీ కింద మినహాయించుకుంటున్నాయి. రైతు మిత్ర గ్రూపులు ప్రతినెలా కొంత సొమ్ము పొదుపు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఒక్కో గ్రూపు కింద రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ పొదుపు డబ్బులు ఉంటాయి.  ఈ మూడేళ్ల కాలంలో వడ్డీల రూపంలో ఈ పొదుపు డబ్బులు కరిగిపోయాయి. మరోవైపు గ్రూపులో అందరికీ రుణమాఫీ వర్తించకుండా, కొంతమందికి రావడం వల్ల ఆయా గ్రూపుల్లో అనైక్యత, విభేదాలు పుట్టుకొస్తున్నాయి. దీనివల్ల చాలామంది రైతులు బ్యాంకుల ముఖం చూడడం లేదు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

రేపు రైతు సాధికార సంస్థ ముట్టడి
రాష్ట్రంలో కౌలు రైతులకు రూ.594 కోట్ల మేర అప్పులు ఉంటే ఇప్పటి వరకూ రూ.144 కోట్లు మాత్రమే మాఫీ అయింది.  మిగిలిన రూ.450 కోట్లు ఒకే దఫాలో మాఫీ చేయాలి. సర్వే నంబర్లు, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఇతర నిబంధనలు సడలించి రుణమాఫీ అమలు చేయాలి. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం. ఈ నెల 31న రైతు సాధికార సంస్థను ముట్టడిస్తాం.
 కె.శ్రీనివాస్,  కౌలురైతు సంఘం ప్రధాన కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement