చంద్రబాబుకు ఝలక్‌ | west godavari peoples Discontent with TDP Govt | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఝలక్‌

Published Sun, Apr 30 2017 5:37 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

చంద్రబాబుకు ఝలక్‌ - Sakshi

చంద్రబాబుకు ఝలక్‌

పాలన లంచాలమయంగా మారిందన్న జనం
సొమ్ములివ్వకపోతే పనులు జరగడం లేదని ఆవేదన
కంగుతిన్న ముఖ్యమంత్రి
అవినీతికి పాల్పడితే క్షమించేది లేదని హెచ్చరిక


‘మీ గ్రామానికి కావాల్సినవన్నీ చేశాం.
అందరూ సంతోషంగా ఉన్నారా’
నల్లజర్ల మండలం పోతవరం గ్రామస్తులను
ఉద్దేశించి సీఎం చంద్రబాబు అడిగిన ప్రశ్న ఇది.


‘లేదు.. లేదు.. ఎవరికీ సంతోషం లేదు’
గ్రామస్తులిచ్చిన సమాధానం


అదిరిపడిన సీఎం ‘ఎంతమంది సంతృప్తికరంగా లేరో చేతులెత్తుండి’ అనగానే.. సభా ప్రాంగణంలో ఉన్న వారిలో 70 శాతం మంది చేతులెత్తారు.

సర్దుకున్న చంద్రబాబు కారణం ఏమిటో చెప్పండని అడగ్గా..‘ఎక్కడికక్కడ అవినీతి పెరిగిపోయింది. పాలన లంచాలమయంగా మారింది’ అంటూ ఘాటుగానే జవాబిచ్చారు. నల్లజర్ల మండలం పోతవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నల్లజర్ల మండలం పోతవరం గ్రామస్తులు ఝలక్‌ ఇచ్చారు. ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన చంద్రబాబు అక్కడి పాఠశాలలో డిజిటల్‌ అక్షరాస్యత భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా పశ్చిమ గోదావరిని ప్రకటిస్తున్నానని ఘనంగా చెప్పారు. ‘ఈ గ్రామానికి అన్నీ చేశాం. అందరూ సంతోషంగా ఉన్నారా’ అని వేదికపై నుంచి ప్రజలను సీఎం ప్రశ్నించారు. దీనికి జనం నుంచి ‘లేదు.. లేదు’ అనే సమాధానం రావడంతో ముఖ్యమంత్రి కంగుతిన్నారు. ఎంతమంది అసంతృప్తితో ఉన్నారని ప్రశ్నించగా.. సభలోని 70 శాతం మంది చేతులు పైకెత్తారు. వారిలో కొందరిని మీ సమస్యలేమిటని చంద్రబాబు ఆరా తీశారు.

లంచం ఇస్తేనే పని చేస్తారట
గ్రామానికి చెందిన అబ్బూరి లక్ష్మి మాట్లాడుతూ తన మామగారు చనిపోయారని, తమకున్న పొలానికి పట్టాదార్‌ పాస్‌బుక్‌ మంజూరు చేసి.. 70 సెంట్ల పొలాన్ని  తన భర్త పేరుపై మార్చేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను అడుగుతుంటే... రూ.30 వేలు లంచమిస్తేనే పని చేస్తామని చెబుతున్నారని వాపోయింది. ఎవరు అడిగారని ముఖ్యమంత్రి ప్రశ్నించగా.. వీఆర్‌ఓ ఫణిబాబు అని సమాధానం చెప్పింది. దీంతో ముఖ్యమంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ రెవెన్యూ అధికారిపై విచారణ జరిపి 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ను ఆదేశించారు.

మూడేళ్లుగా పెన్షన్‌ రావడం లేదు
మరో వృద్ధురాలు శ్యామలను సంతృప్తిగా ఉన్నావా అని ముఖ్యమంత్రి ప్రశ్నించగా.. తనకు మూడేళ్లుగా పెన్షన్‌ రావడం లేదని, సంతృప్తి ఎలా ఉంటుందని బదులిచ్చింది. రేషన్‌ కార్డు ఉందా అన్ని అడగ్గా.. ‘కార్డు లేదు. రేషన్‌ లేదు. పింఛన్‌ కూడా రావడం లేదు’ అని బదులిచ్చింది. కంగుతిన్న ముఖ్యమంత్రి నీ కుటుం బంలో ఎవరికైనా పింఛను వస్తుందేమో.. అందుకే తొలగించి ఉంటారన్నారు. తన కుటుంబంలో ఎవరికీ పెన్షన్‌ లేదని, తనకూ రావడం లేదని వాపోయింది. అధికారులు నీ సమస్యను పరిష్కరిస్తారని చెప్పిన ముఖ్యమంత్రి వేరే వ్యకితో మాట్లాడారు.

ఇల్లు మంజూరు కాలేదు
గ్రామానికి చెందిన మరో వ్యక్తిని ‘నీవు సంతృప్తిగా ఉన్నావా’ అని సీఎం అడగ్గా.. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకంలో ఇంటి కోసం మూడేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని చెప్పాడు. సీఎం బదులిస్తూ.. ‘ఇప్పుడే శంకుస్థాపన చేశాను. త్వరలో నీకు ఇల్లు వస్తుందిలే. అప్పుడు సంతృప్తిగా ఉందువు’ అని ముఖ్యమంత్రి సర్ధి చెప్పారు. అవినీతి ఎక్కడ జరిగినా వెంటాడతానని సీఎం హెచ్చరించారు.

 అవినీతిపరులపై దాడులు చేయిస్తామని.. పట్టుబడిన సొమ్మును స్వాధీనం చేసుకుని పేదల సంక్షేమానికి ఖర్చు పెడతామని అన్నారు. దాడుల్లో పట్టుబడిన అధికారులు రెండు నెలల అనంతరం తమ ఉద్యోగం తిరిగొస్తుందనే భావనలో ఉన్నారని.. ఇకనుంచి అలాంటి పరిస్థితి ఉండదన్నారు. ఇదిలావుండగా నల్లజర్లలో జెడ్పీ ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సభకు జనం రాలేదు. ఉపాధి కూలీలు, డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలను తీసుకొచ్చినా.. సభావేదిక ముందు కుర్చీలు ఖాళీగా కనిపించాయి.

రైతులు భూములివ్వాల్సిందే
ఏలూరు (మెట్రో) : రైతులు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి భూములు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నల్లజర్లలో బహిరంగ సభలో మాట్లాడుతూ రోడ్లు అభివృద్ధి చేయాలంటే భూమి అవసరమన్నారు. అందువల్ల రైతులు ఉదా రంగా భూములు ఇవ్వాలని కోరారు. చేపల, రొయ్యల పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవస రం ఉందని, అటువంటి పరిశ్రమలకు అడ్డుపడకూడదని పరోక్షంగా ఆక్వాపార్క్‌ అంశాన్ని ప్రస్తావించారు. నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు.

అంతకుముందు పోతవరం విచ్చేసిన చంద్రబాబుకు  స్వాగతం లభించింది. మంత్రులు దేవినేని ఉమ, పైడికొం డల మాణిక్యాలరావు, పితాని సత్యనారాయణ, కేఎస్‌ జవహర్, జెడ్పీ చైర్మన్‌ ఎం.బాపిరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఎంపీలు తోట సీతారామలక్ష్మి, మురళీమోహన్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ముప్పిడి వెంకటేశ్వరరావు, గన్ని వీరాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ, పులవర్తి రామాం జనేయులు, ఎం.శ్రీనివాసరావు, కలెక్టర్‌ కె.భాస్కర్, డీసీసీబీ చైర్మన్‌ ముత్యాల వెంకటేశ్వరరావు, పోతవరం సర్పంచ్‌ పసుమర్తి సతీష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement