సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు తన పుట్టిన రోజు సందర్భంగా దీక్ష కాదు, పాపాలు పోవడానికి ఉపవాసం చేశారని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు దీక్ష పండుగలాగా చేశారని విమర్శించారు. బుగ్గన శనివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దీక్ష వద్ద జనం కంటే ఏసీలు, దిండ్లే ఎక్కువగా కనిపించాయని ఎద్దేవా చేశారు. అసలు ఆ దీక్ష సారాంశం ఏమిటో అర్థం కాలేదన్నారు. రాష్ట్రంలో బాబు పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రచార ఆర్భాటంతో కాలం వెళ్లబుచ్చుతున్నారని మండిపడ్డారు.
టీడీపీ ఆఫీసుల్లో సెటిల్‌మెంట్లు
‘‘40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించడం కూడా రాకపోవడం బాధాకరం. చంద్రబాబు దీక్ష వద్ద మజ్జిగ, నీళ్లు, చిత్రాన్నాలు, పులిహోర సరఫరాతో పండుగ వాతావరణం సృష్టించారు. అసలు ఏం సాధించారని పండుగ చేసుకున్నారు? ఒక్కరోజు దీక్షకే చంద్రబాబు తన బీపీని పదేపదే పరీక్షించుకున్నారు, బహుశా బాలకృష్ణ ఉపన్యాసం చూసి అలా చేయించుకున్నారేమో! చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యం. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారు, రుణమాఫీ హామీని గాలికొదిలేశారు. ఇదేనా 40 ఏళ్ల రాజకీయ అనుభవం? కందుల కొనుగోలులో భారీగా అవినీతి చోటు చేసుకుంది. నీరు–చెట్టు కార్యక్రమంలో అవినీతి జరిగినట్లు ‘కాగ్’ బయటపెట్టింది. పంచాయతీరాజ్ వ్యవస్థను సైతం భ్రష్టు పట్టించారు. భూమి పట్టాల ఆన్‌లైన్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నారు. రైతులు ఏ పంట పండించినా మద్దతు ధర లభించక అలమటిస్తున్నారు. జన్మభూమి కమిటీలను టీడీపీ కార్యకర్తలతో నింపేశారు. వారు అన్ని స్థాయిల్లోనూ డబ్బులు దండుకుంటున్నారు. కిందిస్థాయిలో పోలీసు స్టేషన్లు మొదలు ఎమ్మార్వో, ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట టీడీపీ కార్యాలయాలున్నాయి. అక్కడే అన్ని సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయి. గృహ నిర్మాణ పథకాల్లో లబ్ధిదారుల నుంచి రూ.25 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు’’ అని బుగ్గన ఆరోపించారు.
ఎక్కడ చూసినా అవినీతే...
‘‘పంచాయతీరాజ్ వ్యవస్థను మంత్రి నారా లోకేశ్ సర్వనాశనం చేశారు. టీడీపీ అవినీతిని చూసి చంద్రన్నా ఎంత పని చేస్తివి... ఇదేమి అవినీతి అన్నా అంటూ ప్రజలు వాపోతున్నారు. అధికార పార్టీ నేతలు పింఛన్లలో కూడా దోపిడీకి పాల్పడుతున్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో థర్డ్ పార్టీ పేరిట దోపిడీ జరుగుతోంది. ఇసుకను సైతం మింగేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా మారింది. ప్రతి పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేతలే అజమాయిషీ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం సాగిస్తున్న అవినీతిపై వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తాం. మా పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అసెంబ్లీలో ఎన్నో మాటలు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఆయన అవన్నీ భరించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఇప్పటికే ఎన్నో మాటలు మార్చారు. చంద్రబాబు ఏం చెప్పినా మనం వినాలి. నరేంద్ర మోదీ దేవుడన్నా వినాలి... కాదన్నా వినాలి’’ అని రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యంగ్యంగా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment