ముందే సర్దేశారు
- నోట్ల రద్దు చంద్రబాబుకు ముందే తెలుసు: పీఏసీ చైర్మన్ బుగ్గన
- హెరిటేజ్‌లోని తన షేర్లను ముందుగానే అమ్ముకున్నారు
- రెండున్నరేళ్లలో హెరిటేజ్‌షేర్ ధర నాలుగున్నర రెట్లు ఎలా పెరిగిందని సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు గురించి సీఎం చంద్రబాబు నాయుడుకు ముందే తెలుసని, అందుకే తన వ్యవహారాలన్నింటినీ ముందుగానే సర్దుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దుపై ముందుగానే సంప్రదించిన కొద్దిమందిలో చంద్రబాబు ఒకరని, అందుకే రద్దుకు రెండు రోజుల ముందే హెరిటేజ్‌లో తన షేర్లను అమ్మేశారన్నారు. కానీ పైకి మాత్రం తానే పెద్ద నోట్ల రద్దు సూచన చేస్తూ లేఖ రాసినట్లుగా ప్రజల్ని మభ్యపెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు మార్చి, 2014లో హెరిటేజ్ సంస్థ షేర్ ధర రూ.199గా ఉంటే ఆయన అధికారానికి వచ్చిన రెండున్నరేళ్లలో రూ.909(నాలుగున్నర రెట్లు)కి పెరిగిందన్నారు. ఇంత తక్కువ కాలంలో ప్రపంచంలోనే ఇన్ని రెట్లు పెరిగిన షేర్లు ఇంతవరకు ఏవీ లేవని బుగ్గన పేర్కొన్నారు.
ప్రజల కష్టాలు పట్టవా?
పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను సీఎం చంద్రబాబు పట్టించుకోవట్లేదని బుగ్గన మండిపడ్డారు. ప్రతిసారి.. ఆర్‌బీఐ, సోషియో ఎకనమిక్ సర్వేలు చెప్పే చంద్రబాబు వాస్తవాలు గుర్తెరగాలన్నారు. అసలు డబ్బులు ఎందుకని, ఆన్‌లైన్, డెబిట్/క్రెడిట్ కార్డులే వాడాలంటూ ఉచిత సలహాలిస్తున్న చంద్రబాబుకు ప్రజలెలా జీవిస్తారో, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలియదని స్పష్టమైందన్నారు. నిరక్షరాస్యత, పేదరికం ఉన్న రాష్ట్రంలో 64 శాతం ప్రజలు గ్రామాల్లోనే ఉన్నారని, అసలు బ్యాంకు ఖాతాలు లేనివారు కార్డులను ఎలా ఉపయోగిస్తారని నిలదీశారు. దేశంలో 50 శాతానికిపైగా వ్యవసాయరంగం మీదనే ఆధారపడ్డారని, 92 శాతం గ్రామాలకు బ్యాంకుల్లేవని, 53 శాతానికిపైగా ప్రజలకు బ్యాంకు ఖాతాల్లేవని చెప్పారు. ఈ పరిస్థితుల్లో విదేశాల్లోలాగా కార్డులు వాడమని సలహాలివ్వటం చంద్రబాబు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు.
పైగా నాకేం అవసరముందండి... ఇంట్లో కూరగాయలున్నారుు.. ప్రభుత్వం పెట్రోలు కొట్టిస్తుందనటం నిర్లక్ష్య సమాధానాలకు తార్కాణమన్నారు. ఒక్కరోజైనా సొంతగ్రామంలో గడిపి, సన్నిహితులను పిలిచి తన పాలన ఎలా ఉందో తెల్సుకోవాలని ఆయన హితవు పలికారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నేపథ్యంలో అనకాపల్లిలో బెల్లం మార్కెట్ నుంచి బేగంబజార్‌లో మార్కెట్ వరకూ మూతపడ్డాయన్నారు. రాష్ట్రమంతా అల్లాడిపోతుంటే టీడీపీ నేతలు ‘జనచైతన్య యాత్రల’పేర్లతో చేయనివి కూడా చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని బుగ్గన దుయ్యబట్టారు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు, వ్యాపారులు, రైతులు ఇబ్బందులు పడుతుంటే.. బ్యాంకుల్లో క్యూలలో నించున్నవారికి మజ్జిగ పంచండనటం బాబు హోదాకు తగదన్నారు.
సలహా ఇస్తే విమర్శలా కనిపిస్తోంది..
నోట్ల రద్దు తమ వల్ల జరిగిందని చెప్పుకునేందుకు ఆరాటపడుతున్న టీడీపీ నేతలు ప్రజలు పడుతున్న సమస్యలను పరిష్కరించాలని రాజేంద్రనాథ్‌రెడ్డి సూచించారు. అధికారంలో ఉండి చేయటం చేతగాక విపక్షంపై విమర్శలు చేయటం హాస్యాస్పదమన్నారు. ప్రతిపక్షం అభ్యంతరాలు చెప్పినంత మాత్రాన ప్రభుత్వం ఏమీ ఆపలేదని, వారికి నచ్చింది చేసుకుంటూ పోయారని ఆయన అన్నారు. సలహా ఇస్తే విమర్శలా వారికి కనిపిస్తోందని తప్పుపట్టారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వంద మందికిపైగా మరణించటం, భారీసంఖ్యలో గాయపడటంపై బుగ్గన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సానుభూతి తెలుపుతోందన్నారు.
‘ఓటుకు కోట్లు’ దర్యాప్తు నిదానంగా సాగడానికి బాబు పరపతే కారణం
ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ దర్యాప్తు నిదానంగా జరుగుతోందని, పొరుగు రాష్ట్రాల్లో చంద్రబాబు పరపతి సాగుతుందనేందుకు ఇది నిదర్శనమని బుగ్గన అన్నారు. 32 సార్లు తెలంగాణ ఏసీబీ చార్జిషీటులో బాస్ అంటే ఎవరని నమోదైనా కేసు నిదానించడానికి చంద్రబాబు పరపతే కారణమన్నారు. అదే పరపతితోనే పెద్ద నోట్ల రద్దుపై చంద్రబాబు ముందుగానే తెలుసుకుని తన హెరిటేజ్ షేర్లను అమ్ముకున్నారని ఆయన అన్నారు. ‘‘ఓటుకు కోట్లు కేసులో అసలు ఫోన్ ట్యాప్ చేసే అధికారం మీకేవరిచ్చారని ప్రశ్నించిన చంద్రబాబు.. అదే సమయంలో బ్రీఫ్డ్‌మీ అన్న గొంతు తనది కాదని అనరు. రేవంత్‌రెడ్డిని తాను పంపించానని చెప్పరు. ఆ డబ్బు తమవి కాదని కూడా అనరు. తద్వారా అన్నింటికీ తప్పు ఒప్పుకుంటూనే వితండ వాదన చేస్తారు’’అని బుగ్గన ధ్వజమెత్తారు.