సాక్షి, అమరావతి: ఏపీని శ్రీలంకతో పోలుస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అసంబద్ధమైనవని, ఇది కేవలం రాజకీయ అక్కసుతో చేస్తున్న రాద్ధాంతమేనని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కొట్టిపారేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించలేదని, వారికి మేలు చేసిందేమీలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలుచేస్తూ ప్రజల ఆదరణను పొందుతుంటే.. దానిని ఓర్వలేక శ్రీలంక.. శ్రీలంక.. అంటూ గావుకేకలు పెడుతున్నారని మండిపడ్డారు. అసలు శ్రీలంక పరిణామాలకు, మనకు పోలికేంటని ప్రతిపక్ష నేతలను బుగ్గన ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ఆయన ఏం చెప్పారంటే..
కోవిడ్‌లో పేదలకు అండగా..
కోవిడ్ కష్టకాలంలో సామాన్య ప్రజానీకాన్ని పథకాల సాయంతో ఆదుకున్న ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శించడం విడ్డూరం. లాక్‌డౌన్లతో ఆదాయం పడిపోవడం వాస్తవం కాదా. టీడీపీ మాజీ ఆర్థిక మంత్రి, మేధావిగా చెలామణి అయ్యే యనమల కోవిడ్ కాలాన్ని సాధారణ సంవత్సరాలతో పోల్చడం సరికాదని చెప్పినా కూడా పదే పదే పోల్చడం ప్రజలని తప్పుదోవపట్టించేందుకే.
ఖజానాను గాడిలో పెడుతున్నాం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ క్రమంగా గాడిలో పెడుతున్నాం. రైతులకు, బలహీనవర్గాలకు, మహిళలకు మేలు చేయడమేకాక, ప్రభుత్వోద్యోగుల ప్రయోజనాలనూ కాపాడుతున్నాం. విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నామన్న ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవంలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కంటే టీడీపీ హయాంలోనే అప్పుల్లో వృద్ధిరేటు ఎక్కువగా ఉంది.
బ్యాంకుల్లో రూ.వేలకోట్ల అప్పులు ఎగ్గొట్టి ప్రజల సొమ్మును కాజేసి జేబులు నింపుకున్న టీడీపీ నాయకులవల్లే దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోంది. టీడీపీ అస్తవ్యస్త ఆర్థిక విధానాలు, క్రమశిక్షణారాహిత్యంవల్లే రాష్ట్రం అప్పుల్లోకి వెళ్లింది. వాటిని సరిదిద్దే క్రమంలో ఇబ్బందులు వస్తున్నాయి. 2019లో టీడీపీ రూ.40వేల కోట్ల పనుల బిల్లులను పెండింగ్‌లో పెడితే అవి ఇప్పుడు పెనుభారమయ్యాయి. విద్యుత్ రంగాన్ని కోలుకోలేని రీతిలో దెబ్బతీశారు.
1.46 లక్షల కోట్లు నేరుగా జమ
ఇక 25 సంక్షేమ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద, మధ్య తరగతి ప్రజలకు నేరుగా రూ.1.46లక్షల కోట్లను వారి ఖాతాల్లో జమచేశాం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, ఇళ్లపట్టాలు వంటి వాటి ద్వారా రూ.43,682.65 కోట్లను మంజూరు చేశాం. ఇలా కనీవినీ ఎరుగని విధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే ప్రతిపక్షాలు కడుపుమంటతో వివర్శలు చేయడం శోచనీయం.
చంద్రబాబు రైతుల నడ్డి విరిచారు
వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని చెప్పి టీడీపీ రైతులను నిలువునా మోసం చేసింది. మొత్తం రూ. 87,612 కోట్ల రైతు రుణాలుంటే కేవలం రూ.15,279.42 కోట్లు మాత్రమే మాఫీచేసి రైతుల నడ్డివిరిచింది. అదే వైఎస్సార్‌సీపీ సర్కారు రైతుల కోసం చెప్పింది చెప్పినట్లుగా చేస్తూ ముందుకెళ్తోంది. ఇప్పటివరకు రైతుభరోసా కింద 52.38 లక్షల మందికి రూ.23,920.5 కోట్లు అందించింది.
సున్నావడ్డీ పంట రుణాలు, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్.. మత్స్యకార భరోసా వంటివి అదనం. టీడీపీ పాలనలో కంటే ఈ ప్రభుత్వ హయాంలోనే ధాన్యం సేకరణ ఎక్కువ జరిగింది. టీడీపీ ఐదేళ్లలో రూ.40,437.66 కోట్లు ఖర్చుచేస్తే, వైఎస్ జగన్ సర్కార్ మూడేళ్లలో రూ.47,686.64 కోట్లు వెచ్చించింది.
► 2014లో ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రాష్ట్రంలో ఉన్న అన్ని రేషన్ కార్డులను తీసుకురావడంలో టీడీపీ విఫలమైంది. దీనివల్ల అప్పట్లో ఉన్న 1కోటి 46లక్షల కార్డులకుగాను 86 లక్షల కార్డులకే సబ్సిడీ వస్తోంది. మిగిలిన వాటన్నింటికీ ప్రస్తుత సర్కారే భరిస్తోంది. వాస్తవాలిలా ఉంటే అసలు ధాన్య సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేయడం లేదనడం శుద్ధఅబద్ధం. మాపై విమర్శలు చేయడానికి చంద్రబాబుకు సిగ్గుండాలి.
► విద్యుత్ సంస్థల అప్పులను టీడీపీ రెండింతలు పెంచింది. వైఎస్సార్‌సీపీ సర్కారు గత మూడేళ్లలో రూ. 40,110 కోట్ల బకాయిలను చెల్లించింది.
► ప్రభుత్వోద్యోగుల జీతాలు చెల్లించడంలేదనేది పూర్తిగా అవాస్తవం. 2018–19 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలి 10 రోజుల్లోనే ప్రభుత్వోద్యోగులకు కేవలం 88% మేర మాత్రమే జీతాల చెల్లింపులు జరిగాయి. 2018–19లో పెన్షన్ల చెల్లింపు అనేది తొలి 10 రోజుల్లో 93% మాత్రమే జరిగాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో పరిస్థితి పూర్తి భిన్నం. ఏరకంగా చూసినా టీడీపీ ప్రభుత్వం కన్నా మేమే మెరుగ్గా జీతాలు, పింఛన్లు చెల్లిస్తున్నాం. టీడీపీది రాజకీయ అక్కసుతో కూడుకున్న దుష్ప్రచారమే.
చంద్రబాబుది రాజకీయ అక్కసు!
Published Wed, May 25 2022 4:18 AM | Last Updated on Wed, May 25 2022 4:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment