సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు ప్రజాధనంతో రాజకీయాలు చేయడం దారుణమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే, ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తప్పుబట్టారు. ఖజానా సొమ్ముతో దొంగ దీక్షలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నవనిర్మాణ దీక్ష పేరుతో ఖజానాను ఖాళీ చేస్తూ చెప్పినవే చెబుతూ విసుగు పుట్టిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ కార్యకర్తలతోపాటు విధిలేని పరిస్థితుల్లో అధికారులు మాత్రమే పాల్గొంటున్నారని తెలిపారు. ప్రజలెవరూ వీటికి రాకపోవటంతో దీక్షలు బోసిపోతున్నాయన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన మీడియాతో మాట్లాడారు.
బాహుబలి తరహాలో సీఎం బోర్డులా?
సీఎం చంద్రబాబు ఉపయోగం లేని కార్యక్రమాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బుగ్గన ధ్వజమెత్తారు. ‘కర్నూలులో దోమలపై దండయాత్ర పేరుతో పెద్ద బోర్డు ఏర్పాటు చేశారు. బాహుబలి తరహాలో సీఎం పెద్ద టోపీ పెట్టుకొని ఉన్న ఫోటో ఒకవైపు మరోవైపు పెద్ద దోమ బొమ్మ ఉన్నాయి. దీన్ని చూసి జనం నవ్వుకోవడంతో హడావుడిగా ఆ బోర్డును తొలగించారు. అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విడగొట్టారంటూ నాలుగేళ్లుగా ప్రతి కార్యక్రమంలో చంద్రబాబు చెప్పిందే చెబుతున్నారు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌కు సహకరిస్తే తీరని ద్రోహమని గత ఏడాది నవనిర్మాణ దీక్షలో చెప్పిన చంద్రబాబు తాజాగా కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడమే కాకుండా సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరై రాహుల్‌గాంధీతో ఫోటోలకు ఫోజులిచ్చారు. చంద్రబాబు ఊసరవెళ్లి రాయకీయాలకు ఇదీ ప్రత్యక్ష నిదర్శనం’ అని బుగ్గన పేర్కొన్నారు.
బలవంతంగా డ్వాక్రా మహిళల తరలింపు
‘చంద్రబాబు ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రజలు రావడం లేదని డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలిస్తున్నారు. వారు కూడా మొండికేయడంతో పింఛన్లు ఇస్తామంటూ సభకు రప్పించారు. హ్యాపీ సండే అంటూ అధికారులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. నవనిర్మాణ దీక్ష 7 రోజులు, జన్మభూమి 7 రోజులు, పల్లె నిద్ర .. ప్రతి బుధవారం పల్లె పిలుపు అంటూ ఏడాదిలో వంద రోజులు అధికారులు, ఉద్యోగులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ప్రజలకు పనులు దొరకటం లేదు. ఉద్యోగులకు సొంత పనులూ కావడం లేదు. ఉద్యోగుల వేతన అలవెన్సుల కింద రోజువారీ వెచ్చిస్తున్న రూ. 160 కోట్లను ప్రజల సంక్షేమం కోసం వినియోగించకుండా ఇలా సీఎం కార్యక్రమాల కోసం వృథా చేయడం ఏమిటి? నవనిర్మాణ దీక్షకు రూ.13 కోట్లు విడుదల చేసి ప్రచారానికి రూ.4 కోట్లు ఇచ్చారు. చంద్రబాబు ప్రచార యావతో చేసే కార్యక్రమాలకు రూ.12 వేల కోట్లు వృథా చేస్తున్నారు. ప్రతిజ్ఞ అంటూ అవినీతి, అశాస్త్రీయ విభజన అంటున్నారు. అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉంది’ అని దుయ్యబట్టారు.
చంద్రన్న మజ్జిగ ఎటుపోతున్నాయో?
‘చంద్రన్న మజ్జిగ అంటూ ఒక్కొక్క ఊర్లో ఒక కేంద్రం ఏర్పాటు చేశారట. ఎక్కడైనా మజ్జిగ పోస్తున్నారా? 50 గ్లాసుల మజ్జిగను ఊరంతా పోస్తారా? నాలుగేళ్ల పాలనలో ఏమి చేయలేని చంద్రబాబు బీజేపీని బ్రహ్మండంగా పొగిడారు. ఇన్నాళ్లూ ప్రత్యేక హోదా వద్దని ఇప్పుడు యూటర్న్ తీసుకొని హోదా కావాలనడం చంద్రబాబు ద్వంద్వ నీతికి నిదర్శనం. హోదా ఉన్న రాష్ట్రాలకు, లేని రాష్ట్రాలకు తేడా ఏమీ లేదని 2017లో టీడీపీ మహానాడు సందర్భంగా 19వ తీర్మానంలో పేర్కొన్నారు. నా కష్టానికి ఫలితం ప్రత్యేక ప్యాకేజీ అని బాబు ప్రకటించుకున్నారు. అలాంటి వారు ఇప్పుడు హోదా గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారు?’ అని బుగ్గన ప్రశ్నించారు. ‘ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు రాజకీయాలు మాట్లాడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై దిగజారి మాట్లాడుతున్నారు. పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటు. పులివెందుల ఏపీలోనే ఉందని చంద్రబాబుకు తెలియదా?’ అని బుగ్గన ఎండగట్టారు.
జనం డబ్బుతో.. దొంగ దీక్షలు
Published Tue, Jun 5 2018 3:22 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment