అవినీతి బైటపెడితే చాలెంజ్‌లా? | YS Jagan question to CM Chandrababu | Sakshi
Sakshi News home page

అవినీతి బైటపెడితే చాలెంజ్‌లా?

Published Sat, Mar 25 2017 2:57 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

అవినీతి బైటపెడితే చాలెంజ్‌లా? - Sakshi

అవినీతి బైటపెడితే చాలెంజ్‌లా?

ఏపీ సీఎం బాబుకు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ ప్రశ్న

మరి మేం చేసిన చాలెంజ్‌ల మాటేమిటి?
‘ఓటుకు కోట్లు’లో వాయిస్‌పై చాలెంజ్‌ను ఒప్పుకోగలవా?
21మందిని డిస్‌క్వాలిఫై చేసి ప్రజల్లోకి వెళదామన్న చాలెంజ్‌కు సిద్ధమా?
‘లక్ష కోట్లు’ నిరూపిస్తే 10% ఆస్తులు రాసిస్తా అనే చాలెంజ్‌కు ఓకేనా?
నా దగ్గరున్న ఆధారాలన్నీ అగ్రిగోల్డ్‌ బాధితులు ఇచ్చినవే
సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌


సాక్షి, అమరావతి: ‘అగ్రిగోల్డ్‌ బాధితుల తరపున మేం అసెంబ్లీలో మాట్లాడితే రాజకీయాలకు ముడిపెడుతూ చాలెంజ్‌లు విసురుతారా? మరి మా చాలెంజ్‌ల మాటే మిటి? వాటిని ఎందుకు ఒప్పుకోవడం లేదు?’అని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. గతంలో మేము మూడు విషయాలపై చాలెంజ్‌.. చాలెంజ్‌ అని సభలోనే చెప్పాం, వాటిపై ఎందుకు వెనక్కు పోతు న్నారని ఆయన నిలదీశారు. లక్షలాది మంది అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలను పక్కకు తప్పించేం దుకు, ప్రత్తిపాటి పుల్లారావును ఎలాగైనా ఈ సమస్యనుంచి బయటపడేసేందుకు కొత్త కథలను తెరమీదకు తెస్తున్నారని జగన్‌ విమర్శించారు. పుల్లారావు ఒక్కరే ఇందులో దోషి కాదని,   చాలామంది పెద్దలు ఉన్నారన్నారు. శుక్రవారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత తన చాంబర్‌లోనూ, సాయంత్రం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలోనూ జగన్‌ మీడియాతో మాట్లాడారు. ముఖ్యాం శాలు ఆయన మాటల్లోనే...

ఆ మూడు చాలెంజ్‌లకు ఒప్పుకుంటారా?
‘‘ఓటుకు నోట్ల కేసులో ఆ వాయిస్‌ నీది కాదు అని ప్రూవ్‌ చేయగలవా? చాలెంజ్‌ అని చెప్పాం. దానికి చంద్రబాబు ఎందుకు రావడం లేదు. ఎందుకంటే ఫోరెన్సిక్‌ రిపోర్టులో వాయిస్‌ ఆయనదే అని తేలింది. అడ్డగోలుగా ఆడియో వీడియో టేపుల్లో దొరికిపోయి, నల్లధనాన్ని సూట్‌కేసుల్లో తీసుకుని పోయి అది పంపిణీ చేసి దొరికిపోయిన కథ. ఇదే సభలో చాలెంజ్‌ చేశాం.  ఏమాత్రం సిగ్గున్నా, ప్రజాస్వా మ్యంపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలను డిస్‌క్వా లిఫై చెయ్యి. వాళ్లు మా పార్టీ గుర్తుమీద గెలిచిన ఎమ్మెల్యేలు. ఎన్నికలకు వెళ్దాం. అదే రెఫరెండంగా తీసుకుందాం. మాకు మెజార్టీ వస్తే మీ పదవి నుంచి నువ్వు తప్పుకుంటావా అని ఛాలెంజ్‌  చేసా. దానికి ఒప్పుకోడు. ఎమ్మెల్యేలతో వ్యక్తిగత దూషణలు చేయిం చారు.

టీడీపీ, కాంగ్రెస్‌ వాళ్లే పిటిషనర్లుగా నాపై కేసు వేశారు. కాంగ్రెస్‌లో ఉన్నన్నాళ్లు, రాజశేఖర్‌రెడ్డి బతికినన్నా న్నాళ్లు నాపైన కేసులు లేవు. వైఎస్‌ చనిపోయిన తర్వాత,  నేను కాంగ్రెస్‌ విడిచిపెట్టాక..చంద్రబాబు, కాంగ్రెస్‌ కుమ్మక్కై కేసులు వేశారు. ఆరోపణల ఆధారంగా (నిజాలు కావు) సీబీఐ రూ.1200 కోట్లు అని చెబితే... ఒకరేమో లక్ష కోట్లు, ఒకరేమో 43 వేల కోట్లు అంటారు..... ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ అదే గోబెల్స్‌ ప్రచారం. చివరకు నాకు 10 పర్సెంట్‌ ఇవ్వండయ్యా ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతా అని చెప్పా. చాలెంజ్‌ కూడా చేశాను. రూ. 4300 కోట్లకు డీడీ ఇవ్వచ్చుగా. లేదంటే  10వేల కోట్లకు డీడీ ఇవ్వచ్చుగా. ఏదైనా వాళ్లు చాలెంజ్‌ చేస్తే... మేము చేసిన చాలెంజ్‌లను కూడా ఒప్పుకోవాలి కదా. కానీ వాళ్లు ఒప్పుకోరు.

ఆ ఆధారాలన్నీ బాధితులు ఇచ్చినవే..
ఇవన్నీ కూడా నాకు అగ్రిగోల్డ్‌ బాధితులు ఇచ్చిన సాక్ష్యా ధారాలే...(రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లను చూపిస్తూ...) వారే నా వద్దకు వచ్చి వీటిని అసెంబ్లీలో ప్రస్తావించాల్సిందిగా కోరారు. ప్రతిపక్షనేతగా అది నా బాధ్యత కనుక వాటిని ప్రస్తావించాలని ప్రయత్నించాను. 20 లక్షల మంది బాధిత కుటుంబాల తరపున మాట్లాడ్డానికి నాకు 20 నిమిషాలు సమయం ఇవ్వలేదు కాని, మాకు చాలెంజ్‌ విసురుతూ మాట్లాడ్డానికి రెండు రోజులు సమయం వృథా చేశారు. వాస్తవానికి జాతీయ స్థాయిలో బోఫోర్స్‌ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణం ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు బయట పెడితే వచ్చినవే... మరి అప్పటి కేంద్ర ప్రభుత్వాలు ప్రతిపక్షాలకు రాజకీయ చాలెంజ్‌లు చేయలేదే.... అగ్రిగోల్డ్‌లో ఉన్న డైరెక్టర్లు, బంధువులు, చాలా భూములు వాళ్ల వ్యక్తిగత పేర్లతో కంపెనీలో ఉంటూ వాళ్ల ఆస్తులు ఇష్టానుసారంగా పెంచుకుంటున్నారు... తిరుపతిలో 1.03 ఎకరాల వెంకటాద్రి హోటల్‌ రూ.14 కోట్లకు అమ్ముకున్నారు.

ఆ ఆస్తి ఇందులోకి వస్తే మాకు మేలు జరుగుతుంది కదా అంటూ డిపాజిటర్లు ఆధారాలు ఇస్తున్నారు. లావాదేవీలకు సంబంధించి ఆధారాలు కూడా ఇచ్చారు. ఈ ఆధారాలు చూస్తే  ప్రత్తిపాటి పుల్లారావుకు సంబంధముందని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అటువంటి ఆరోపణలపై విచారణ వేసి నివృత్తి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైన ఉంది. అది చేయకపోగా ప్రత్తిపాటి పేరు బయటికి వస్తే డొంకంతా ఎక్కడ కదులుతుందోనన్న భయంతో సమస్యను తప్పుదారి పట్టించారు.   

సభలో నేనైనా... పుల్లారావైనా ఉండాలట!
పుల్లారావైనా.. నేనైనా ఒకరే సభలో ఉండాలని తీర్మానం చేయడం ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్ష నేత చేసిన ఆరోప ణలు నిజమైతే పుల్లారావు శాసనసభ నుంచి వైదొలుగు తారట. రుజువుకాని పక్షంలో జగన్‌ శాసనసభ నుంచి వైదొలగాలట. నిజంగా చంద్రబాబుకు మెదడు ఉండే ఇలాంటి తీర్మానాలు చేస్తున్నారా అనిపిస్తుంది. చంద్ర బాబుకు పూర్తిగా అనుకూలంగా ఉండే పత్రికకు చెందిన విలేకర్లకు ఎప్పుడూ గౌరవం ఇవ్వకుండా పోలేదే. వాళ్లను కూడా అందరు రిపోర్టర్ల లాగే చూస్తా. అంతేగానీ నచ్చలేదు కదా అని తొక్కడం ఏంది? న్యాయం అనేది జరగాలంటే  మేము చెప్పిన వాటికి కూడా వాళ్లు ఒప్పుకోవాలి కదా? ప్రాథమిక సాక్ష్యాధారాలకు సంబంధించిన వివరాలు నేను చూపిస్తున్నా. వాటిని చూసి జ్యుడిషియల్‌ విచారణ చేయాలి. సీబీఐ సహకారం కూడా తీసుకుని చెయ్యాలి.

ఆ తర్వాత ప్రభుత్వం ఒక నిర్ధారణకు రావాలి. అంతేగానీ నేనెక్కడ ఆధారాలూ చూపిస్తానో అన్న భయంతో నాకు అవకాశం ఇవ్వకుండా...  నిరూపించలేకపోతే పక్కకు తప్పుకోవాలన్న ఏకపక్ష నిర్ణయం ఏంది?  ఇంతకన్నా మెరుగైన ఆధారాలు ఉంటే చూపించండి. సభ జరగాలి గానీ, కుళాయిల దగ్గర కొట్టుకున్నట్లు కాదు. అక్కడన్నా కొద్దిగా హుందాగా ఉంటారు. కుళాయిల దగ్గర మగాళ్లు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సభ. సమస్యలుండి మాట్లాడలేని వారి గొంతును ప్రతిపక్షం వినిపిం చాలి. అగ్రిగోల్డ్‌ బా«ధితులు ఇచ్చిన ఆధారాలను సభలో చూపించాల్సిన ధర్మం, బాధ్యత ప్రతిపక్షానిది. వాళ్లే (బాధితులే) వీటిని సభలో చెప్పాల్సిందిగా నాకు విజ్ఞప్తి చేశారు.  ఇందులో పుల్లారావు ఒక్కరిదే టాపిక్‌ కాదు. ఇందులో ఆయన పాత్ర చీమంత మాత్రమే.

హైకోర్టు సిటింగ్‌ జడ్జి పర్యవేక్షణలో  సీబీఐ విచారణ జరపాలి
అగ్రిగోల్డ్‌ ఛైర్మన్‌తో సహా వారు 8 మంది సోదరులైతే ఇద్దరినే అరెస్టు చేశారు. అగ్రిగోల్డ్‌ వెనుక చాలా మంది పెద్దలున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈ లావాదేవీలు, ఆ సంస్థ ఆస్తుల వ్యవహారాలపై హైకోర్టు సిటింగ్‌ న్యాయమూర్తి పర్యవేక్షణలో సీబీఐ ఆధ్వర్యంలో విచారణ జరిపించాలి.  సిట్టింగ్‌జడ్జితో విచారణ ఆధ్వ ర్యంలో చేస్తూ, ఓ వైపు వేలం కొనసాగుతూ, మరోవైపు విచారణ జరుగుతూంటే అగ్రిగోల్డ్‌ ఆస్తులన్నీ బయటకు వస్తాయి. దీంతో బాధితులకు ఎక్కువ సొమ్ము  ఇవ్వచ్చు. అగ్రిగోల్డ్‌ బాధితులు కష్టపడి ఇన్ని ఆధారాలు సేకరించి నాకు ఎందుకు ఇచ్చారు? ఇక్కడికొస్తే న్యాయం జరుగుతుం దన్న ఆశ.  తిరుపతిలో వెంకటాద్రి హోటల్‌ అమ్మకం గురించి చెప్పాను...అది పుల్లారావుది కాదు కదా. బ్రహ్మం గారి మఠంలో కొన్ని ఆస్తులు అమ్ముకున్న డైరెక్టర్‌ సీతారాం గురించి చెప్పాను కదా... అది పుల్లారావుకు ఏం సంబంధం? ఎక్కడ జరిగినా  ఆస్తులు బయటకు రావాలి.

సాక్ష్యాధారాలివిగో...
రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్యకు భూములు అమ్మిన ఉదయ్‌ దినకరన్‌ అగ్రిగోల్డ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. హ్యాయ్‌ ల్యాండ్‌ను నిర్వహిస్తున్న ఆర్కా లీజర్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీలో కూడా ఆయన డైరెక్టర్‌గా ఉన్నారు. 2010 నుంచీ ఆయన ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. రామ్‌ నివాస్‌ కంపెనీలో కూడా ఆయన కొనసాగుతు న్నారు. అగ్రిగోల్డ్‌ ప్రజలకు టోపీ పెడుతోం దన్న సమయంలోనే...  2014 జూలై 31న వెంకటకృష్ణ ఆంజనేయ ప్రసాద్‌ అనే వ్యక్తి వద్ద నుంచి దినకరన్‌ భూములు కొనుగోలు చేశారు. ఆ తరువాత 2014 డిసెంబర్‌ 24న నెల్లూరులో అగ్రిగోల్డ్‌ సంస్థపై కేసు పెట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో 2015 జనవరి రెండోతేదీన కేసు నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన డీఎస్పీ 2015 జనవరి నాలుగో తేదీన అగ్రిగోల్డ్‌ సంస్థ ఛైర్మన్‌ ఇంటిపై దాడులు నిర్వహించారు.

ఆ వెంటనే హాయ్‌ల్యాండ్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ దినకరన్‌ జనవరి 19వ తేదీన పుల్లారావుకు తక్కువ రేటుకు భూములు అమ్మారు. లంచం ఇస్తామన్నట్లుగా... తీసుకుంటామన్నట్లుగా ఈ లావాదేవీ జరిగింది. పుల్లారావు భార్య వెంకాయమ్మ పేరిట ఈ భూములు కొన్నారు. ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదు. ఇక్కడ నేనడిగేది ఒక్కటే.... సీఐడీ విచారణ వద్దు. సీబీఐ విచారణ సిటిం గ్‌ హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో జరగాలి. ఒక్క పుల్లారావే కాదు, దీని వెనుక ఉన్న పెద్ద గద్దలు అందరి మీద విచారణ జరిపి వారి వద్ద ఉన్న ఆస్తులను వేలం పరిధిలోకి తెచ్చి అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలి. నేనిచ్చే ఆధారాలు ఏ మేరకు సరిపోతాయో నేను చెప్పలేను కానీ... ఇది పక్కాగా ప్రాథమిక సాక్ష్యాధా రాలు ఉన్న కేసు అని చెప్పగలను.

ఆ ఆస్తులు ఎందుకు వేలంలోకి రావడం లేదు?
అగ్రిగోల్డ్‌కు సంబంధించిన హాయ్‌ల్యాండ్‌ ప్రాపర్టీ వేలంలోకి ఎందుకు రాలేదు? విశాఖపట్నం జిల్లా యారాడ వద్ద ఉన్న ఆస్తులు ఎందుకు వేలంలోకి రావడం లేదు? ఖరీదైన అతిహయ షాపింగ్‌ మాల్‌ వేలంలోకి రాలేదే? ఎందుకు వీటిని వేలంలోకి తేవడం లేదంటే దీని వెనక మంత్రుల నుంచి అందరూ ఉన్నారు కాబట్టి. ఇలా విలువైన ఆస్తులు ఒకటిన్నర సంవత్సరం నుంచి వేలం ప్రక్రియ జరుగుతున్నా డిపాటిజ్‌ దారులకు ఇచ్చింది కేవలం రూ.16 కోట్లే. వీటికి వడ్డీలెంత అవుతాయి వాళ్ల గురించి ఎవరైనా పట్టించుకున్నారా? అసలు వాళ్లకు రూ.1182 కోట్లు  ఇస్తే 14 లక్షల మందికి మేలు జరుగుతుంది.

గవర్నమెంటు దగ్గరే ఆస్తులు ఉన్నాయి. ఆ ఉపశమనం చేయచ్చు కదా. ముఖ్యమంత్రి నుంచి ఏదైనా మంచి మాట వస్తుందేమోనని బాధితులు ఆశించారు. కానీ రాలేదు.  టాపిక్‌ డైవర్ట్‌ చేసేందుకు కొత్తగా చాలెంజ్‌ అంట. అంటే రేపు పొద్దున ఎవరైనా ఆరోపణ తీసుకుని వస్తే అది వినకుండా దాన్ని సైడ్‌లైన్‌ చేసేదానికి నువ్వు ప్రూవ్‌ చెయ్యలేకపోతే రాజీనామా చేస్తావా అని సమస్యను పక్కదారి పట్టిస్తారు. మేము చాలెంజ్‌ చేస్తే వాళ్లు తీసుకోరు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement