చౌదరి గారు వైఎస్సార్ సీపీనా !
► అయితే నీళ్లు కూడా ఇవ్వొద్దు
► వీధిలైటూ వెలగనివ్వొద్దు
► గాలాయగూడెంలో టీడీపీ నేతల అరాచకం
►వైఎస్సార్ సీపీ శ్రేణులే లక్ష్యంగా వేధింపులు
► అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు
► అయినా పరిష్కారం కాని వైనం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సానుభూతిపరులే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నేతల వేధింపుల పర్వంలో మరో దారుణమైన ఘటన ఇది. దెందులూరు నియోజకవర్గం పరిధిలోని గాలాయగూడెంకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు ఈడ్పుగంటి వీర్‌నాథ్‌చౌదరి లక్ష్యంగా టీడీపీ నాయకులు వేధింపులకు పాల్పడుతున్నారు.
కొన్నాళ్లుగా ఆయన ఇంటికి మంచినీరు రాకుండా పైప్‌లైన్‌కు అడ్డకట్ట వేశారు. చివరకు ఇంటివద్ద వీధి లైట్‌ను కూడా వెలగకుండా చేశారు. ఈ విషయమై చౌదరి గ్రామ సర్పంచ్ వేగుంట రాణి, ఆమె భర్త టీడీపీ నేత వేగుంట కిషోర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్దేశపూర్వకంగానే చౌదరి ఇంటి సముదాయానికి మంచినీటి సరఫరాను నిలిపివేసిన వేగుంట కిషోర్ ఆ విషయాన్ని ఎన్నిసార్లు ప్రస్తావించినా పట్టించుకోలేదు.
దీంతో చౌదరి ప్రజావాణి ద్వారా రెండుసార్లు, వ్యక్తిగతంగా జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ దృష్టికి ఒకసారి తీసుకువెళ్లారు. స్పందించిన కలెక్టర్ ‘ఇంత అన్యాయమా. వెంటనే సమస్యను పరిష్కరించండి’ అంటూ జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు. డివిజనల్ పంచాయతీ అధికారి (డీఎల్‌పీవో) స్వరాజ్యలక్ష్మి ఇటీవల చౌదరి ఇంటిని సందర్శించి మంచినీటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ మేరకు క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ఆమె వెళ్లిన తర్వాత టీడీపీ నేతల ఒత్తిళ్ల మేరకు సిబ్బంది ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఈ విషయమై డీఎల్‌పీవో స్వరాజ్యలక్ష్మిని ‘సాక్షి’ వివరణ కోరగా, చౌదరి నివాస సముదాయానికి నీటి సరఫరా నిలిపేసిన మాట వాస్తవమేనని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తక్షణమే నీటి సరఫరా పునరుద్ధరించాల్సిందిగా ఈవోపీఆర్‌డీకి, పంచాయతీ కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని, వెంటనే నీటి సరఫరా పునరుద్ధరణ చర్యలు చేపడతామని చెప్పారు.