పసుపెక్కిన ‘పశ్చిమ’ | tdp 14 stes win in Eluru | Sakshi
Sakshi News home page

పసుపెక్కిన ‘పశ్చిమ’

Published Sat, May 17 2014 1:35 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

పసుపెక్కిన ‘పశ్చిమ’ - Sakshi

పసుపెక్కిన ‘పశ్చిమ’

 సాక్షి, ఏలూరు:సార్వత్రిక సమరంలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం గట్టారు. శుక్రవారం నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ, టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేశాయి. టీడీపీ అభ్యర్థులు ఒక లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగా.. ఒక లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. ఏలూరు, భీమవరంలో మూడు కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్లు లెక్కింపు ప్రారంభించారు. సాయంత్రం 11 గంటల వరకూ లెక్కింపు కొనసాగింది. తొలి నుంచీ టీడీపీ, వైఎస్సార్ సీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నడిచింది.
 
 అంచనాలు తల్లకిందులు
 ఏలూరు లోక్‌సభ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట చంద్రశేఖర్, టీడీపీ అభ్యర్థి మాగంటి వెంకటేశ్వరావు (బాబు) తలపడ్డారు. చంద్రశేఖర్ గెలుపు ఖాయమనే ప్రచారం జరి గింది. బాబు సైతం తాను ఓడిపోతున్నానని భావించారు. కానీ ఓటరు తీర్పు ఊహలకు అందకుండా వచ్చింది. మాగంటి బాబు ఏలూరు లోక్‌సభ స్ధానాన్ని కైవసం చేసుకున్నారు. నరసాపురం లోక్‌సభ స్థానం టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించగా, ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గోకరాజు గంగరాజు తన సమీప ప్రత్యర్థి అరుున వైసీపీ అభ్యర్థి వంక రవీంద్రపై గెలుపొందారు. చివరి నిమిషంలో బరిలో దిగిన వంక రవీంద్రకు ఓట్లు ఆశాజనకంగానే లభించాయి. అయితే అవి విజయం చేకూర్చేందుకు సరిపోలేదు.
 
 అసెంబ్లీ స్థానాల్లోనూ క్లీన్ స్వీప్
 ఏలూరు అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని)పై టీడీపీ అభ్యర్థి బడేటి కోటరామారావు (బుజ్జి) విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి బలాన్నిచ్చే పంచాయతీలను దక్కించుకోవడంలో బుజ్జి సఫలమయ్యారు. ఆ కోవలోనే నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ సత్తా చాటారు. అదే సార్వత్రిక ఎన్నికలకు పనికొచ్చింది. మరోవైపు నాని సైతం నగరంలో విశేషంగా పర్యటించారు. పాదయాత్ర చేసి జనం కష్టాలు తెలుసుకున్నారు. అయినా ప్రజలు బుజ్జివైపే మొగ్గు చూపారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు చేజిక్కించుకున్నారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి తోట గోపి, రెబెల్ అభ్యర్థి కొట్టు సత్యనారాయణను వెనక్కునెట్టి మాణిక్యాలరావు విజయం సాధించారు.
 
 దెందులూరు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు మినీ యుద్ధాన్నే తలపించాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌కు వైసీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరావు గట్టి పోటీ ఇచ్చారు. ప్రతి రౌండ్‌లోనూ నువ్వా నేనా అన్నట్లుగానే సాగింది. తీవ్ర ఉత్కంఠ నడుమ విజయం ప్రభాకర్‌ను వరించింది. ఉంగుటూరులో టీడీపీ అభ్యర్థి గన్ని ఆంజనేయులు వైఎస్సార్ సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబుపై ఆదినుంచీ ఆధిక్యం ప్రదర్శించారు. నిడదవోలులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎస్.రాజీవ్‌కృష్ణ, టీడీపీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావుకు మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఒకానొక సందర్భంలో రాజీవ్‌కృష్ణపై ఆశలు చిగురించాయి. కొన్ని రౌండ్లలో ఆయన మెజారీటీ ఓట్లు సాధించారు. అయితే టీడీపీకి కంచుకోటగా ఉండే ప్రాంతంలో ఆ పార్టీ అభ్యర్థికి అత్యధిక ఓట్లు పోలవడంతో రాజీవ్‌కృష్ణ ఓటమిపాలై శేషారావు గెలిచారు. కొవ్వూరులో పోటీకి దిగిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి తానేటి వనిత గెలుపు సునాయాసమే అనుకున్నారు.
 
 కానీ.. అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి కేఎస్ జవహర్ గెలుపొందారు. గోపాలపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుపై టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరావు విజయం సాధించారు. చింతలపూడిలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి బి.దేవిప్రియ, టీడీపీ అభ్యర్థి పీతల సుజాత పోటీపడ్డారు. ఈ స్థానంలో కూడా పోటీ ఆసక్తిగానే సాగింది. చివరకు సుజాత గెలిచారు. పోలవరం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి తెల్లం బాలరాజుపై టీడీపీ అభ్యర్థి మొడియం శ్రీనివాస్ విజయం సాధించారు. తణుకులో టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ వైఎస్సార్ సీపీ అభ్యర్థి చీర్ల రాధయ్యను ఓడించారు. ఈ స్థానంలో రాధయ్య చివరి వరకూ పోరాడారు. పలు రౌండ్స్‌లో ఆశాజనకంగా ఓట్లు సంపాధించారు.
 
 పాలకొల్లులో టీడీపీ నుంచి బరిలో దిగిన నిమ్మల రామానాయుడు సమీప ప్రత్యర్థులైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకాశేషుబాబు, టీడీపీ రెబెల్ అభ్యర్థి సీహెచ్ బాబ్జిలను వెనక్కు నెట్టి విజయం సాధించారు. ఒకానొక దశలో ఇక్కడ టీడీపీ ఓటమి చెందుతుందనే పరిస్థితి వచ్చింది. చివరి నిమిషంలో ఫలితం టీడీపీకే అనుకూలంగా వచ్చింది. నరసాపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆదినుంచీ వెనుకబడ్డారు. ఆయనపై టీడీపీ అభ్యర్థి బండారు మాధవనాయుడు విజయం సాధించారు. ఆచంటలో మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణకు వైఎస్సార్ సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు ముచ్చెమటలు పట్టించారు. ఆఖరి క్షణం వరకూ వెంటాడారు.
 
 చివరి రౌండ్స్‌లో పితానికి ఎక్కువ ఓట్లు లభించడంతో ప్రసాదరాజు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. పితాని గెలుపొందారు.  ఉండిలో వైసీపీ అభ్యర్థి పాతపాటి సర్రాజుపై టీడీపీ అభ్యర్థి కలువపూడి శివ గెలుపొందారు. భీమవరంలో టీడీపీ అభ్యర్థి పులపర్తి అంజిబాబు వైఎస్సార్ సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ను ఓడించారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని జిల్లాకు తీసుకువచ్చి చివరి నిమిషంలో బహిరంగ సభపెట్టి ప్రచారం చేయించడం ద్వారా టీడీపీ ఆ వర్గం మద్దతును కూడగట్టుకుంది. జనసేన పార్టీని స్థాపించి వార్తల్లో నిలిచిన సినీనటుడు పవన్‌కల్యాణ్‌ను ప్రచారంలో ఉపయోగించడం ద్వారా యువత ఓట్లకు గాలం వేసింది. అన్నిటినీ మించి చంద్రబాబుతో పాటు ఆ పార్టీ అభ్యర్థులు ఇచ్చిన భారీ హామీలు ప్రజల్లో ప్రభావం చూపించాయి. వాటిని ఓటర్లలోకి తీసుకువెళ్లడంలో ఆ పార్టీ క్యాడర్ శాయశక్తులా పనిచేయడం టీడీపీ విజయానికి కారణమైంది.
 
 ఐదుగురు సిట్టింగ్‌లకు అవకాశం
 జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలుపొందగా.. నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పరాజయం పాలయ్యూరు. టీడీపీ తరఫున పోటీచేసిన భీమవరం సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), నిడదవోలు సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, దెందులూరు సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే కలవపూడి శివ, ఆచంట సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మరోసారి విజయం సాధించారు. ఇదే సందర్భంలో పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, నరసాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, తణుకు సిట్టింగ్ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావు ఓటమిని చవిచూశారు. వీరిలో కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రామారావుకు డిపాజిట్లు కూడా దక్కలేదు.
 
 అసెంబ్లీకి కొత్త మొహాలు
 ఈసారి ఎన్నికల్లో మరో విశేషం చోటుచేసుకుంది. కనీవినీ ఎరుగని రీతిలో 9మంది కొత్త వ్యక్తులు అసెంబ్లీ మెట్లు ఎక్కబోతున్నారు. నరసాపురం నుంచి బండారు మాధవనాయుడు, పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు, తణుకు నుంచి ఆరిమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం నుంచి పైడికొండల మాణిక్యాలరావు, పోలవరం నుంచి మొడియం శ్రీనివాసరావు, కొవ్వూరు నుంచి కేఎస్ జవహర్, గోపాలపురం నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు, ఉంగుటూరు నుంచి గన్ని వీరాంజనేయులు, ఏలూరు నుంచి బడేటి బుజ్జి కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యూరు. నరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందిన గోకరాజు గంగరాజు సైతం ప్రత్యక్ష రాజకీయూలకు కొత్తవారే. ఆయన కూడా తొలిసారి పార్లమెంట్ గడప తొక్కనున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement