సైకిల్ డీలా
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎదురీదుతున్నారు. కొన్నిచోట్ల పార్టీ అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏలూరు, దెందులూరు అభ్యర్థులంటేనే ప్రజలు హడలిపోతున్నారు. వారి రౌడీ నైజంపై ఓటర్లు గుర్రుగా ఉన్నారు. ఆఖరి నిమిషంలో టికెట్ సంపాదించిన ఆచంట అభ్యర్థికి భంగపాటు తప్పేట్లు లేదు. పాలకొల్లులో రెబల్ అభ్యర్థి పక్కలో బల్లెంలో మారి గుబులు పుట్టిస్తున్నారు.
సాక్షి, ఏలూరు : ‘కోడి పందాలు, సెటిల్‌మెంట్లు, జూదం, మద్యం, దౌర్జన్యం.. ఇలాంటి లక్షణాలున్న వ్యక్తికి అధికారం తోడైతే అతని అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. తెలిసో తెలియకో ఓసారి అతనికి ఓటేసి పెద్ద తప్పుచేశాం. రెండోసారి ఆ తప్పు చేస్తే మనల్ని ఆ దేవుడు కూడా క్షమించడు.’ ఇది దెందులూరు నియోజకవర్గ ప్రజల మనోగతం. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ను ఓడించే బాధ్యతను ఓటర్లే భుజాన వేసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరావుకు పట్టం గట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన చింతమనేనికి ఓటమి భయం వెంటాడుతోంది.
చరమగీతం తప్పదు చింతమనేని ప్రభాకర్ అనే రౌడీ కబందహస్తాల్లో చిక్కుకున్న తమ నియోజకవర్గానికి విముక్తి కలిగించే దేవుడి కోసం ప్రజలు మనసులోనే పూజలు చేస్తున్నారు. వారిని అంతగా వేధించిన చింతమనేనిని చిత్తుగా ఓడించి నియోజకవర్గానికి పట్టిన పీడను వదిలించే శక్తి ఒక్క కారుమూరి నాగేశ్వరావుకే ఉందని విశ్వసిస్తున్నారు. ఓటు అనే ఆయుధంతో ఇన్నాళ్లూ తాము పడుతున్న నరకానికి చరమగీతం పాడేందుకు కదం తొక్కుతూ ైవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంట నడిచారు.
అధికారులపై దౌర్జన్యం.. జూదం నిత్యకృత్యం
ఐదేళ్లు తన కాలికింద నలిగిన వాళ్లు ఇప్పుడు తననే ఎదిరిస్తుంటే చింతమనేని తట్టుకోలేకపోతున్నారు. విచక్షణ కోల్పోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తనకు ఓటేయ్యకపోయినా, ప్రత్యర్థికి సహకరించినా అంతు చూస్తానని బెదిరిస్తున్నారు. మ రోవైపు చెప్పుకోవడానికి చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో రాత్రికి రాత్రే గ్రామాల్లో రోడ్లు వేయిస్తున్నారు. నిజానికి ఆ మట్టి కూడా అక్రమంగా తరలించిందే కావడం విశేషం. తమ్మిలేరు నుంచి ఇసుక అక్రమ రవాణా ద్వారా భారీగా డబ్బులు సంపాదించారని, పోలవరం ప్రాజెక్టు మట్టిని కొల్లగొట్టించారనే ఆరోపణలు చింతమనేనిపై ఉన్నాయి. కోడి పందాలు వేయడం, జూదం ఆడటం, నిలువరించడానికి ప్రయత్నిస్తే అధికారులపై దౌర్జన్యానికి పాల్పడటం అతనికి నిత్యకృత్యమై పోయిందట. ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు వదిలించుకుందామా అని అటు ప్రజలు, ఇటు అధికారులు ఎదురుచూస్తున్న తరుణంలో నేనున్నానంటూ వారి కష్టాలు తీర్చేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు.