సాక్షి, ఏలూరు: ‘పరిషత్’ పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ హోరాహోరీగా తలపడ్డాయి. జిల్లాలోని 46 జెడ్పీటీసీ, 903 ఎంపీటీసీ స్థానాలకుగాను మంగళవారం అర్ధరాత్రి సమయానికి 42 జెడ్పీటీసీ, 889 ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. రాత్రి 12.30 గంటల సమయూనికి 586 ఎంపీటీసీ స్థానాలను టీడీపీ, 234 స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 63 స్థానాలను స్వతంత్రులు గెలుచుకున్నారు. జాతీయ పార్టీలైన బీజేపీకి 3, కాంగ్రెస్‌కు 2, సీపీఎంకు ఒక స్థానం దక్కాయి.
జెడ్పీ కౌంటింగ్ ఆలస్యం
జిల్లా పరిషత్‌కు రెండు విడతలుగా ఏప్రిల్ 6, 11 తేదీల్లో పోలింగ్ నిర్వహించారు. మంగళవారం ఉద యం జిల్లా వ్యాప్తంగా పది ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆచంట, నిడదవోలు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. పెనుగొండ మండలానికి చెందిన మూడు బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పేపర్లు వర్షం నీటితో తడిసి ముద్దయయ్యాయి. నిడదవోలు, కోరుమామిడి, తాడిమళ్ల గ్రామాలకు చెందిన బ్యాలెట్ బాక్సుల్లోకి వర్షం నీరు చేరడంతో బ్యాలెట్ పత్రాలు తడిసిపోయాయి. అధికారుల ఆదేశాల మేరకు పోలింగ్ సిబ్బంది వాటిని బయటకు తీసి ఆరబెట్టిన అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మధ్యాహ్నం నుంచి నెమ్మదిగా ఫలితాలు వెలువడటం ప్రారంభమైంది. ఆదినుంచీ వైసీపీ, టీడీపీలు నువ్వా నేనా అనే విధంగా ఎంపీటీసీ స్థానాలు కైవసం చేసుకోగా చివరకు టీడీపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
జెడ్పీటీసీల్లో టీడీపీ పైచేయి
జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఫలితాలు ఆలస్యంగా వస్తుండటంతో రెండు పార్టీల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రకటించిన 42 జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ 40 స్థానాలు, వైసీపీ 2 స్థానాల్లో విజయం సాధించాయి. వీరవాసరం, బుట్టాయగూడెం జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏలూరు, దెందులూరు, లింగపాలెం, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, గణపవరం, పెంటపాడు, ఉండి, పాలకోడేరు, పోలవరం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, టి.నర్సాపురం, దేవరపల్లి, నిడమర్రు, ఆకివీడు, గోపాలపురం, నల్లజర్ల, పాలకొల్లు, ద్వారకాతిరుమల, కొవ్వూరు, చాగల్లు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తాళ్లపూడి, తణుకు, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర తదితర 42 స్థానాలు జెడ్పీ స్థానాలు టీడీపీ దక్కించుకుంది. మిగిలినచోట్ల ముందంజలో ఉంది. నరసాపురం, చింతలపూడి నియోజకవర్గాల్లో అర్ధరాత్రి తర్వాత కూడా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జిల్లా పరిషత్ టీడీపీ కైవసమైంది. పూర్తి ఫలితాలు బుధవారం ఉదయానికి గానీ వెల్లడి కావు.
హోరాహోరీ
Published Wed, May 14 2014 2:03 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM
Advertisement
Advertisement