పోరు.. హోరు | Big fight between TDP & YSRCP | Sakshi
Sakshi News home page

పోరు.. హోరు

Published Wed, May 7 2014 1:02 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

Big fight between TDP & YSRCP

 సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పోటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం మధ్యే నెలకొంది. బరిలో కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర, తదితర పార్టీలున్నా వాటి ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 13 చోట్ల వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యే పోటీ నెలకొంది. పాలకొల్లు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో టీడీపీ రెబల్స్ కొంత ప్రభావం చూపుతున్నారు. రెండు లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యే పోటీ నెలకొంది. పోటీ ఆ రెండు పార్టీల మధ్యే ఉన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులదే పైచేయిగా కనబడుతోంది.
 
 నియోజకవర్గాల్లో ఇదీ పరిస్థితి
 ఏలూరు లోక్‌సభా స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్, టీడీపీ అభ్యర్థి మాగంటి బాబు పోటీ పడుతున్నారు. ఆదినుంచీ చంద్రశేఖర్ దూసుకుపోతుండగా.. మాగంటి బాబు పూర్తిగా వెనుకబడ్డారు. టీడీపీ శ్రేణులే ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ముసునూరు నాగేశ్వరరావు ప్రభావం దాదాపు లేనట్లే. నరసారం లోక్‌సభా స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి వంక రవీంద్ర, బీజేపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు తలపడుతున్నారు. గంగరాజు డబ్బును నమ్ముకుని ముందుకెళ్లగా, రవీంద్ర జనంలోకి వెళ్లి ప్రచారం చేశారు.
 
 రవీంద్రకు మంచి ఆదరణ లభించగా, గంగరాజును జనం గుర్తించే పరిస్థితి చాలాచోట్ల లేకుండాపోయింది. కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కనుమూరి బాపిరాజు బరిలో ఉన్నా కాడివదిలేసి తన సొంత బావమరిది అయిన గంగరాజుకు తెరవెనుక నుంచి మద్దతు ఇస్తున్నారు.     తాడేపల్లిగూడెం, పాలకొల్లు సెగ్మెంట్లలో టీడీపీ రెబల్స్ ప్రభావం చూపుతున్నారు. తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ నుంచి తోట గోపి, బీజేపీ నుంచి మాణిక్యాలరావు పోటీలో ఉండగా, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ టీడీపీ రెబల్‌గా హడావుడి చేస్తున్నారు. తోట గోపి ఇంటింటికీ తిరిగి అందరినీ ఆకట్టుకోగా, బీజేపీ అభ్యర్థి ఎవరో కూడా జనానికి సరిగా తెలియని పరిస్థితి ఉంది. దీనికితోడు కొట్టు సత్యనారాయణ వల్ల బీజేపీ అభ్యర్థికి ఇబ్బంది ఏర్పడింది. పాలకొల్లులో టీడీపీ తరఫున నిమ్మల రామానాయుడు బరిలో ఉండగా, ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి బాబ్జి పోటీలో ఉన్నారు. దీంతో టీడీపీలో గందరగోళం నెలకొంది.
 
 టీడీపీలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఉండగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకా శేషుబాబు ముందునుంచీ జనంలో ఉండటంతో ఆయనకు ఆదరణ లభిస్తోంది. ఆయన వ్యూహాత్మకంగా పనిచేస్తూ పైచేయి సాధించారు. నరసాపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడుతో టీడీపీ అభ్యర్థి బండారు మాధవనాయుడు పోటీపడే పరిస్థితి కనిపించడం లేదు. పైకి హడావుడి చేస్తున్నా టీడీపీ అభ్యర్థి చేతులెత్తేశారు. భీమవరంలో వైఎస్సార్ సీపీ తరఫున గ్రంధి శ్రీనివాస్ దూకుడు ముందు టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నిలబడలేకపోతున్నారు. డబ్బుపైనే ఆధారపడి ఆయన పనిచేస్తున్నారు. అయినా గ్రంధి ముందంజలో దూసుకెళుతున్నారు. ఉండి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కలవపూడి శివ రకరకాల గాలి ప్రచారాలు, కుయుక్తులతో గారడీలు చేస్తుండటంతో జనంలో ఆయనపై వ్యతిరేకత కనిపిస్తోంది.
 
 ఆచంటలో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నమాజీ మంత్రి పితాని సత్యనారాయణకు వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చెమటలు పట్టిస్తున్నారు. ప్రసాదరాజును ఎదుర్కోలేక ఆయన పడతాయనుకున్న ఓట్లను చీల్చి లబ్ధి పొందేందుకు పితాని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తణుకులో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా చీర్ల రాధయ్య, టీడీపీ అభ్యర్థిగా ఆరిమిల్లి రాధాకృష్ణ తలపడుతున్నారు. మంచి వ్యక్తిగా పేరున్న రాధయ్యకు జనం మద్దతు లభిస్తుండగా, రాధాకృష్ణ సామాజిక వర్గం ధనబలంతో రాధయ్యను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోంది. జిల్లా కేంద్రమైన ఏలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల నాని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జిని ఇప్పటికే వెనక్కు నెట్టారు. దెందులూరులో తన గెలుపు ఖాయమని మొన్నటివరకూ హడావుడి చేసిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు వైఎస్సార్ సీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు షాక్ ఇస్తున్నారు. కారుమూరిని ఎదుర్కొనేందుకు చింతమనేని తొలిసారిగా భారీ ఎత్తున డబ్బులు పంచుతున్నారు.
 
 చింతలపూడిలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి బూర్ల దేవీప్రియ స్పీడును టీడీపీ అభ్యర్థి పీతల సుజాత అందుకోలేకపోతున్నారు. పోలవరం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాల రాజు రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతుండగా, టీడీపీ అభ్యర్థి మొడియం శ్రీనివాస్ పూర్తిగా వెనుకబడ్డారు. గోపాలపురంలో టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు మధ్య పోటీ నెలకొంది. కొవ్వూరులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి తానేటి వనిత ముందంజలో ఉండగా, టీడీపీ అభ్యర్థి జవహర్ ఎదురీదుతున్నారు. నిడదవోలులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి రాజీవ్‌కృష్ణ టీడీపీ తరఫున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును పరుగులు పెట్టిస్తున్నారు. ఉంగుటూరులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబుదే పైచేయిగా కనిపిస్తోంది. అక్కడ టీడీపీ అభ్యర్థి గన్ని వీరాంజనేయులు ఎన్నికలకు ముందే చేతులెత్తేసే స్థితిలో ఉన్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ నాటికి వైఎస్సార్ సీపీకి అనుకూల పరిస్థితి నెలకొనగా టీడీపీ ఎదురీదుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement