గన్ని ‘తోట’ రహస్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అధికార మదంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా చేస్తున్న ఆగడాలకు మరో సాక్ష్యమిది. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి అడ్డగోలుగా సాగుతున్న అక్రమ తవ్వకాలపై పోలీసు అధికారులు కన్నెర్ర చేసినా పట్టించుకోని పచ్చచొక్కాలు బరితెగించి సాగిస్తున్న వ్యవహారమిది. ఇక్కడి బాధితులు సామాన్యుడు కాదు.. మాజీ మంత్రి, 30 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాదమూర్తిరాజు వారసుడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధి కూడా. అయినాసరే.. అధికారం అండతో తెలుగు తమ్ముళ్లు పేట్రేగిపోతున్నారు.
వరప్రసాదమూర్తి రాజు మనుమడు,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ చింతలపాటి వెంకట పెద్దిరాజు (పృధ్వీరాజు)కు చెందిన స్థలంలో ఉంగుటూ రు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అనుచరులు అడ్డూఅదుపూ లేకుండా సాగిస్తున్న అక్రమ తవ్వకాల వ్యవహా రం పూర్వాపరాలిలా ఉన్నాయి. నిడమర్రు మండలం చిననిండ్రకొలను ఎంపీటీసీ సభ్యుడు చింతలపాటి వెంకటపెద్దిరాజు (పృధ్వీరాజు)కు ఉంగుటూరు మండలం చేబ్రోలులో ఆర్‌సీ నంబర్ 78/20లో 38 సెంట్ల స్థలం ఉంది. తాత ముత్తాల నుంచి ఆయనకు వారసత్వంగా సంక్రమించిన స్థలమది. ఆ స్థలంలోకి ఈనెల 1న ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అనుచరులు, అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం కార్యకర్తలు పొన్నం బుజ్జి, బొమ్మిడి అప్పారావు తదితరులు అక్రమంగా ప్రవేశిం చి తవ్వకాలు ప్రారంభించారు.
తాము గన్ని అనుచరులమని బాహాటంగానే చెబుతూ జేసీబీలు, ప్రొక్లెయిన్లు, ట్రాక్టర్ల సాయంతో నిర్విరామంగా పది అడుగుల లోతున మట్టి తవ్వేశారు. పృధ్వీరాజు దీనిపై చేబ్రోలు ఎస్సై చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేసి, ఈ విషయూన్ని తహసిల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో తక్షణం తాడేపల్లిగూడెంలో కోర్టును ఆశ్రయించి 2వ తేదీన ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నారు. ఈ ఆర్డర్‌ను కూడా చేబ్రోలు ఎస్సైకు, తహసిల్దార్‌కు రిజిస్టర్ పోస్టు ద్వారా పంపారు. దీనిపై కూడా తహసిల్దార్ స్పందించలేదు సరికదా ఇంకా రికార్డులు పరిశీలించ లేదనీ, పరిశీలన తర్వాత అది ఎవరి స్థలమో తేలుస్తానని బదులిచ్చినట్టు పృధ్వీరాజు చెబుతున్నారు.
ఈ విషయమై ఎస్పీ రఘురామిరెడ్డిని కలవగా ఆయన వెంటనే స్పందించి అక్రమ తవ్వకాలు నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని చేబ్రోలు ఎస్సైని ఆదేశించినా ఫలితం లేదని అంటున్నారు. బుధవారం కూడా నిర్భీతిగా తవ్వకాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. దీనిపై ఎస్సైని ‘సాక్షి ప్రతినిధి’ వివరణ కోరగా, తాము ఈ విషయంలో తహసిల్దార్‌ను సంప్రదించామని, తానింకా రికార్డులు పరిశీలించలేదు కాబట్టి అప్పుడే మీ జోక్యం అవసరం లేదని బదులిచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే విషయమై తహసిల్దార్ ఆకుల కృష్ణజ్యోతిని విరణ కోరగా, స్థలం ఆయనదా కాదా అన్న విషయం తేలాల్సి ఉందని చెప్పారు. దీనికి సంబంధించి డాక్యుమెంట్లన్నీ పరిశీలించి, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రాజకీయ దురుద్దేశంతోనే తవ్వకాలు
ఎన్నికల్లో తన తరపున ప్రచారం చేయాలని గన్ని వీరాంజనేయులు నన్ను కోరారు. నేను అలా చేయలేనని చెప్పాను. పోనీ.. ఎవరికీ మద్దతు ప్రకటించకుండా తటస్థంగానైనా ఉండాలని ఆయన సూచించారు. దానికీ నేను సమ్మతించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి ఆ పార్టీ అభ్యర్థి తరపునే ప్రచారం చేశాను. దీనిని మనసులో పెట్టుకుని గన్ని వీరాంజనేయులు ఎమ్మెల్యే కాగానే నాపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. నా స్థలంలో అక్రమ తవ్వకాలు చేరుుస్తున్నారు. రెవెన్యూ అధికారుల అండదండల తో అన్యాయంగా పది అడుగుల మేర తవ్వేశారు. దీనిపై చేబ్రోలు తహసిల్దార్‌కు ఫిర్యాదు చేసినా ఆమె సరిగా పట్టించుకోలేదు. చేస్తాను.. చూస్తాను.. అంటూ అక్రమార్కులకు ఆమె పూర్తి అండదండలు అందిస్తున్నారు. - సీహెచ్.పృధ్వీరాజు, ఎంపీటీసీ
గ్రామ అవసరాల కోసం ఉద్దేశించిన స్థలమది
పృధ్వీరాజు తనదిగా చెబుతున్న 38 సెంట్ల స్థలంతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. అది గ్రామ అవసరాల కోసం పూర్వమెప్పుడో అందరూ కలసి కేటాయించుకున్న ఉమ్మడి స్థలం. అక్కడ ఉన్న సుమారు ఎకరంన్నర స్థలంలో సదరు 38 సెంట్లతోపాటు చాలామంది స్థానికులకు చెందిన స్థలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గ్రామంలోని మురుగునీరు బయటకు పోయేందుకు వీలుగా గ్రామస్తులు అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. దీనిని వివాదం చేస్తున్నారు. ఈ తవ్వకాలకు నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా నన్ను కూడా వివాదంలోకి లాగుతున్నారు.
- గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే, ఉంగుటూరు